పారిస్ మెట్రో: రాంగ్‌సైడ్‌లో నడిచినందుకు గర్భవతికి జరిమానా

ఫొటో సోర్స్, AFP
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఒక మెట్రో స్టేషన్‌లో నిబంధనలకు విరుద్ధమైన దిశలో నడిచినందుకు ఒక గర్భవతికి స్టేషన్ నిర్వాహకులు దాదాపు రూ. 4,800 (60 యూరోలు) జరిమానా విధించారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమైంది.
లూవ్రే ఆర్ట్ గ్యాలరీకి సమీపంలోని కాంకోర్డే మెట్రో స్టేషన్‌లోని ఒక కారిడార్‌లో ఫిబ్రవరి 27న ఈ ఘటన జరిగింది. కాస్త దూరం తగ్గుతుందని సదరు మహిళ అలా నడిచారు.
జరిమానా రసీదు ఫొటోను ఆ మహిళ సహచరుడు 'ట్విటర్'లో పెట్టారు. నోటీసు లేకుండా జరిమానా వేశారని ఆక్షేపించారు. ఆయన పోస్టుపై చాలా మంది నెటిజన్లు స్పందించారు. ఫిబ్రవరి 27న తమ విషయంలోనూ ఆర్‌ఏపీటీ ఇలాగే చేసిందంటూ ఎంతో మంది మెట్రో ప్రయాణికులు నిరసన వ్యక్తంచేశారు.
తప్పు దిశలో నడుస్తున్నావంటూ స్టేషన్‌లోని ఒక కారిడార్‌లో సిబ్బంది తనను అడ్డుకొన్నారని, వాస్తవానికి అప్పుడు అక్కడ ఏ మాత్రం రద్దీ లేదని, తానొక్కదాన్నే ఉన్నానని ఒక ప్రయాణికురాలు పేర్కొన్నారు.
ప్రయాణికుల గ్రూపు 'ఎఫ్ఎన్ఏయూటీ'కి చెందిన మైకేల్ బబుత్ స్పందిస్తూ- జరిమానా విధింపు అసమంజసమని తప్పుబట్టారు. నిబంధనలను మార్చాల్సి ఉందని చెప్పారు.
టికెట్ లేకుంటే వసూలు చేసే జరిమానా కన్నా ఎక్కువగా జరిమానా వేశారని 'ట్విటర్'లో ఒక యూజర్ వ్యాఖ్యానించారు.
ప్రయాణికుల రద్దీ వల్ల అనుకోని ఘటనలేవీ జరగకూడదనే ఉద్దేశంతో వన్-వేగా నిర్ణయించిన మార్గంలో సదరు మహిళ వ్యతిరేక దిశలో నడిచారని, అది నిబంధనలను ఉల్లంఘించడమేనని, అందుకే జరిమానా వేశామని మెట్రో నిర్వాహక సంస్థ ఆర్‌ఏటీపీ తెలిపింది. జరిమానా చాలా అరుదుగానే వేస్తుంటామని, విధుల్లో ఉన్న సిబ్బంది విచక్షణ మేరకు జరిమానా విధించడం, విధించకపోవడం ఉంటుందని చెప్పింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








