స్మగ్లర్ల 'పుష్ప' మూవీ ఐడియా... ఆయిల్ ట్యాంకర్‌లో గంజాయి రవాణా: ప్రెస్ రివ్యూ

గంజాయి స్మగ్లింగ్

ఫొటో సోర్స్, ugc

పుష్ప సినిమాలో పాల ట్యాంకర్‌లో ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్‌ చేసిన ఐడియాను గంజాయి స్మగ్లర్లు అనుసరించారని సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

ఆయిల్‌ ట్యాంకర్‌లో గంజాయి రవాణా చేస్తూ కొందరు విజయనగరం జిల్లా ఎస్‌.కోట పోలీసులకు దొరికిపోయారు.

అరకు నుంచి ఎస్‌.కోట వైపు వస్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం ఆదివారం ఎస్‌.కోట ఎస్‌ఐ తారకేశ్వరరావుకు అందింది.

దీంతో తన సిబ్బందితో కలిసి బొడ్డవర చెక్‌పోస్టు వద్ద కాపుకాశారు. ఉదయం 7.30 గంటల సమయంలో ఆయిల్‌ ట్యాంకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

తొలుత తమ లారీలో ఎలాంటి గంజాయి లేదని డ్రైవర్, క్లీనర్లు బుకాయించారు. పోలీసులు ట్యాంకర్‌ పైకి ఎక్కి నాలుగు కంపార్ట్‌మెంట్లపై క్యాప్‌లకు ఉన్న నట్లు తీసేందుకు ప్రయత్నించగా వారు అక్కడ నుంచి ఉడాయించారని పత్రిక రాసింది.

ట్యాంకర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి నాలుగు కంపార్ట్‌మెంట్ల క్యాప్‌లు తెరచి చూడగా.. ముందున్న కంపార్ట్‌మెంట్, వెనుక ఉన్న రెండు కంపార్ట్‌మెంట్లను ఖాళీగా వదిలేశారు.

మధ్యలోని రెండో కంపార్ట్‌మెంట్లో లోడ్‌ చేసిన 780 కిలోల 149 గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.30 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారని సాక్షి వివరించింది.

కృష్ణానది

కాలుష్యం కోరల్లో కృష్ణా నది

తెలంగాణలో మూడు ప్రాంతాల్లో కృష్ణా నది కాలుష్యానికి గురవుతున్నట్లు ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

తెలంగాణలో తంగడి వద్ద ప్రవేశించి వాడపల్లి వరకూ పరుగులు పెట్టే కృష్ణా నది నీటి నాణ్యత ప్రమాదంలో పడింది. మూడు ప్రాంతాల్లోని పది పాయింట్లతో తనిఖీ చేస్తే కాలుష్యం బారిన పడినట్లు తేలిందని పత్రిక రాసింది.

కాపర్, జింక్, కాడ్మియం, నికెల్, క్రోమియం వంటి భార లోహాలు కూడా నీళ్లలో ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి(పీసీపీ) సేకరించిన నీటి నమూనాల విశ్లేషణలో వెల్లడైంది.

మూసీ, కృష్ణా నదిలో కలిసేచోట కాలుష్య తీవ్రత అధికంగా ఉన్నట్లు పీసీబీ తేల్చింది. ఆ నివేదికను పీసీబీ చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)కి ఇటీవల సమర్పించింది.

సీఎం జగన్

ఫొటో సోర్స్, FB/Andhra Pradesh CM

అనుకున్నంత పీఆర్సీ ఇవ్వలేకపోయాం-జగన్

పరిస్థితుల వల్లే పీఆర్సీ అనుకున్నంత స్థాయిలో ఇవ్వలేకపోయామని ఏపీ సీఎం చెప్పినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

కరోనా ప్రభావం, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆశించినంత, అనుకున్నంత స్థాయిలో పీఆర్సీ ఇవ్వలేకపోయామని సీఎం జగన్మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.

తన ఆమోదంతోనే పీఆర్సీలో మార్పులూ, చేర్పులూ జరిగాయని చెప్పారు. ఉద్యోగులకు ఏదైనా సమస్య ఉంటే అనామలీస్‌ కమిటీ ఉందని, మంత్రుల కమిటీ కూడా కొనసాగుతుందని చెప్పారని పత్రిక రాసింది.

రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం, ఉద్యోగులంతా కలసి పనిచేద్దామన్నారు. సీపీఎస్‌పై మెరుగైన విధానం కోసం ఆలోచిస్తున్నామని, త్వరలోనే ఉద్యోగులకు వివరించి సలహాలూ, సూచనలూ స్వీకరిస్తామని వెల్లడించారు.

పీఆర్సీలో మార్పులు, చేర్పులు చేసినందుకు ఉద్యోగ సంఘాల నేతలు ఆదివారం తాడేపల్లి క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రిని కలసి కృతజ్ఞతలు తెలిపారని ఆంధ్రజ్యోతి వివరించింది.

ప్రతీకాత్మక చిత్రం

అనంతపురంలో రోడ్డు ప్రమాదం, 8 మంది మృతి

అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు ప్రజాశక్తి పత్రిక వార్త ప్రచురించింది.

అనంతపురం జిల్లాలోని ఉరవకొండ రూరల్ పరిధిలోని కొట్టాలపల్లి సమీపంలో లారీ - ఇన్నోవా ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పెళ్లికి వెళ్లి బళ్లారి నుంచి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మృతులంతా ఉరవకొండ మండలానికి చెందిన వారు. వీరిలో నిమ్మగల్లు గ్రామానికి చెందిన ముగ్గురు, లత్తవరం గ్రామానికి చెందిన వారు ఐదుగురు ఉన్నట్లు గుర్తించారు.

మృత్యుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు మగవాళ్లు, ఓ చిన్న పిల్లవాడు ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)