‘వరద వచ్చినప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు ఒక గేటు తెరుచుకోలేదు.. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది కాదా’ – రాజ్యసభలో కేంద్రమంత్రి షెకావత్

ఫొటో సోర్స్, Ani
"తాజా వరదలకు అన్నమయ్య డ్యాం స్పిల్‌వే సామర్థ్యం కన్నా ఒకటిన్నర రెట్లు నీరు వచ్చిపడింది. వెంటనే అయిదు గేట్లూ తెరవాలని నిర్ణయించుకున్నారు. గేట్లు, స్పిల్‌వే ద్వారా మొత్తం నీరు కిందకు వెళుతుందని ఆశించారు. కానీ అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే అయిదు గేట్లలో ఒక గేటు తెరుచుకోలేదు. అది పనిచేయడం లేదు. దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి దీని బాధ్యత లేదా? దాని ప్రభావం చాలా దూరం వరకు పడింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఆస్తి నష్టం జరిగింది" అంటూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రశ్నించారు.
ఆనకట్టల భద్రత బిల్లుపై గురువారం రాజ్యసభలో జరిగిన సుదీర్ఘ చర్చకు ఆయన సమాధానమిస్తూ అన్నమయ్య డ్యాం ప్రస్తావన తీసుకువచ్చారు.
"భారతదేశంలో మరో ఆనకట్ట తెగిపడిందని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటుంటే మనకు సిగ్గుచేటు కాదా? ప్రపంచంలో డ్యాం సేఫ్టీ మీద పనిచేసే ఇంజినీర్లంతా కలిసి దీన్నొక కేస్ స్టడీగా తీసుకుంటే అది మనకు అవమానకరం కాదా? ఇలాంటి పరిస్థితులకు బాధ్యత, జవాబుదారీతనం ఎవరు వహిస్తారనే అంశంపై ఒక చట్టం చేయాల్సిన అవసరం ఉందా లేదా?" అంటూ అన్నమయ్య డ్యాం ఘటనను షెకావత్ ఉదాహరణగా చెప్పారు.
ఆనకట్టల సురక్షిత నిర్వహణపై బిల్లు 40ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని ఆయన అన్నారు.
అయితే, ఆనకట్టలు, నదులు రాష్ట్రానికి సంబంధించినవని, వాటిపై జాతీయ స్థాయిలో బిల్లు తీసుకురావడం ఎంతవరకు సబబని విపక్షాలు ప్రశ్నించాయి.
ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ షెకావత్ కడపలో అన్నమయ్య డ్యాం కట్ట తెగిపోయిన విషయాన్ని ప్రస్తావించారు.
ఇటీవల వరదలకు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో కడప జిల్లాలో కొన్ని గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. చెయ్యేరు నదికి సహజంగా వచ్చిన వరద తీవ్రతకు అదనంగా డ్యాం కట్ట తెగిపోవడం పరిస్థితి మరింత దిగజారిపోయింది.

‘కేంద్ర మంత్రి వ్యాఖ్యలు అసంబద్ధం’
కేంద్ర మంత్రి షెకావత్ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి పి. అనిల్‌కుమార్ యాదవ్ ఖండించారు.
"అన్నమయ్య ప్రాజెక్ట్ సామర్థ్యానికి మించి వరద నీరు పొంగుకొచ్చింది. దాని మొత్తం సామర్థ్యం 2.17 లక్షల క్యూసెక్కులు. కానీ మూడు లక్షల క్యూసెక్కుల పైన వరద నీరు వచ్చి పడింది. పార్లమెంటులో షెకావత్ వ్యాఖ్యలకు ఆధారాలు లేవు. బీజేపీ ఎంపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు" అని అనిల్ కుమార్ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు.
మరోవైపు, నాలుగు గంటల సుదీర్ఘ చర్చ తరువాత డ్యామ్ సేఫ్టీ బిల్లు, 2019ను రాజ్యసభ ఆమోదించింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: పంచాయతీ నిధులను దారి మళ్లించారా, సర్పంచుల ఆందోళన ఎందుకు, ప్రభుత్వ వాదన ఏంటి?
- హెర్పెస్: ప్రసవం అయిన వెంటనే ఇద్దరు బాలింతల ప్రాణాలు తీసిన ఇన్ఫెక్షన్
- ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనమవుతోంది?
- మైక్ టైసన్: 'ద బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్'
- ఫోర్బ్స్ మ్యాగజైన్: అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఒడిశా ఆశావర్కర్ మతిల్దా..
- పాకిస్తాన్లో పెరుగుతున్న ధరలు... 'తక్కువ తినమని' ప్రజలకు మంత్రి సలహా
- MSP: కనీస మద్దతు ధర అంటే ఏమిటి, రైతులు దీనికోసం ఎందుకు పట్టుబడుతున్నారు?
- మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై ఎందుకు యూ-టర్న్ తీసుకుందంటే...
- సోషల్ మీడియాలో సిక్కుల పేర్లతో సిక్కులపైనే దుష్ప్రచారం... నకిలీ నెట్వర్క్ గుట్టు రట్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









