వాతావరణ మార్పులు: భారత్ లైట్‌గా తీసుకోవడానికి వీలులేని వార్నింగ్.. పారిస్ ఒప్పంద లక్ష్యాలను భారత్ పట్టించుకోవట్లేదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నవీన్ సింగ్ ఖడ్కా
- హోదా, బీబీసీ పర్యావరణ ప్రతినిధి
కర్బన ఉద్గారాలను తగ్గించుకునే అంశంపై భారత్ కృషి చేయాల్సి అవసరముందని 'ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజెస్'(ఐపీసీసీ) తాజాగా ఇచ్చిన నివేదికలో నొక్కి చెప్పింది.
చైనా, అమెరికాల తరువాత ప్రపంచంలోనే అత్యధికంగా కర్బన ఉద్గారాలకు కారణమవుతున్న భారత్.. పారిస్ ఒప్పందం ప్రకారం 2030 నాటికి తమ కర్బన ఉద్గారాలను తగ్గించుకునే పనిలో ఉన్నట్లు చెబుతోంది.
పారిస్ ఒప్పందం నాటి వాతావరణ లక్ష్యాల ప్రకారం ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువకు పరిమితం చేయాల్సిన బాధ్యత దేశాలపై ఉంది.
కానీ, ఈ లక్ష్యం గతి తప్పుతోందని.. దేశాలు తమ కర్బన ఉద్గారాల నియంత్రణ వేగవంతం చేయకపోవడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఐపీసీసీ నివేదిక చెబుతోంది.
2050 నాటికి కార్బన్ న్యూట్రల్ దేశాలుగా మారుతామని వివిధ దేశాలు ప్రకటించాయి, చైనా 2060 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పింది. కానీ, భారత్ మాత్రం ఎలాంటి గడువు ప్రకటించలేదు.
ఐపీసీసీ నివేదిక ప్రకారం వాతావరణ మార్పుల ప్రమాద సూచీలో భారత్ 7వ స్థానంలో ఉంది.
గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూవాతావరణ వ్యవస్థలో ఇప్పటికే కొన్ని చక్కదిద్దలేనటువంటి మార్పులు చోటుచేసుకున్నాయని ఐరాసకు చెందిన క్లైమేట్ సైన్స్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన ఓ నివేదిక గుర్తించింది.

ఫొటో సోర్స్, ANKIT SRINIVAS
''మునుపెన్నడూ లేనట్లుగా వాతావరణ వ్యవస్థల వ్యాప్తంగా ఇటీవల కాలంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయ''ని ఆ నివేదిక చెప్పింది.
వాతావరణ వ్యవస్థలు దెబ్బతినడంతో ఏర్పడిన విపరీత పరిస్థితుల ఫలితమే మహా సముద్రాలు, వాతావరణంలో వస్తున్న పెను మార్పులని క్లైమేట్ సైంటిస్ట్స్ చెబుతున్నారు.
''మానవ కారక భూతాపం వల్ల కొన్ని వాతావరణ వ్యవస్థలు స్తంభించిపోయాయి'' అని ఐపీసీసీ నివేదిక రూపకర్తలలో ఒకరైన ప్రొఫెసర్ జొనాథన్ బాంబర్ అన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌లో జొనాథన్ గ్లేసియాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు.
''ఇప్పటికిప్పుడు మొత్తం కర్బన ఉద్గారాలన్నిటినీ నిలిపివేయగలిగినా కూడా ఇంకా కొంత నష్టం జరుగుతుంది'' అన్నారు జొనాథన్.
దక్షిణాసియాపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
21వ శతాబ్దంలో దక్షిణాసియాలో వడగాల్పులు, తేమతో కూడిన వేడిగాలులు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని ఐపీసీసీ నివేదిక పేర్కొంది.
వార్షిక వర్షపాతం, రుతుపవనాల కారణంగా కురిసే వర్షాలు కూడా 21వ శతాబ్దంలో అధికమవుతాయనీ ఈ నివేదిక అంచనా వేసింది.
టిబెట్ పీఠభూమి ప్రాంతమంతటా, హిమాలయ ప్రాంతంలో తేమ పెరగడంతో పాటు, 21 శతాబ్దంలో అవపాత పరిస్థితులు ఎక్కువవుతాయని ఈ నివేదిక అంచనా వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
వరదలు వంటి వాతావరణ ప్రభావాలను పట్టణీకరణ మరింతగా తీవ్రం చేస్తుందనీ ఈ నివేదిక ప్రస్తావించింది.
''అతివృష్ఠి కారణంగా పట్టణ ప్రాంతాలలో వరదలు వచ్చే అవకాశాలు పెరగుతాయ''ని, అవపాతం వంటి తీవ్ర వాతావరణ పరిస్థితులు వరదలు, కొండచరియలు విరిగిపడడానికి కారణమవుతాయని.. వడగాల్పుల వల్ల కార్చిచ్చులు చెలరేగుతాయని.. భూవాతావరణ వ్యవస్థలలో మార్పుల కారణంగా సముద్రాలలో తుపానులు ఏర్పడతాయని నివేదిక హెచ్చరించింది.
వాతావరణ వ్యవస్థలు వేడెక్కడం ఇలాగే కొనసాగితే ఇలాంటి విపరీత పరిస్థితులు తరచుగా చోటుచేసుకుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత పది దశాబ్దాలలో వాతావరణ సంబంధిత విపత్తుల కారణంగా ఏటా 2 కోట్ల మంది నిరాశ్రయులవుతున్నట్లు 'ఆక్స్‌ఫాం' సంస్థ వెల్లడించింది. గత 30 ఏళ్లలో ఇలాంటి విపత్తులు మూడింతలయ్యాయని ఆ సంస్థ పేర్కొంది.
ఐరాస అంచనా ప్రకారం 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వరదలు, కరవు, కార్చిచ్చుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 400 కోట్ల మందిపై ఈ విపత్తుల ప్రభావం ఏదో రకంగా పడిందని ఐరాస అంచనా వేసింది.
భారత ప్రభుత్వం గత ఏడాది వాతావరణ మార్పుల ప్రభావ అంచనా నివేదికను ప్రచురించింది. 1951-2016 మధ్య దేశంలో కరవు తీవ్రత, తరచుదనం రెండూ గణనీయంగా పెరిగినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ శతాబ్దం చివరి నాటికి వడగాల్పులు నాలుగు రెట్లు పెరుగుతాయని ఆ నివేదిక అంచనా వేసింది.
వరల్డ్ రీసోర్స్ ఇన్‌స్టిట్యూట్ లెక్కల ప్రకారం ప్రపంచంలో నీటి కటకట తీవ్రంగా ఉన్న దేశాలలో భారత్ 17వ స్థానంలో ఉంది.
భూగర్భ జలాలతో పాటు ఉపరితల జల వనరులు కూడా తగ్గిపోతున్నాయని పేర్కొంటూ మధ్య ప్రాచ్య దేశాలు, ఉత్తర ఆఫ్రికా దేశాల సరసన భారత్‌నూ నీటి కరవు దేశంగా పేర్కొంది ఆ నివేదిక.
మహమ్మారి కొట్టిన దెబ్బ
కరోనా మహమ్మారి దెబ్బతో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు తంటాలు పడుతోంది.
కార్బన్ న్యూట్రల్‌గా అవతరించేందుకు భారత్ గడువు ప్రకటించకపోవడానికి అది కూడా ఒక కారణం కావొచ్చు.
అయితే, మహమ్మారి కారణంగా నష్టం జరిగిందని వాతావరణ మార్పుల దుష్ప్రభావం ఆగడం కానీ తగ్గడం కానీ జరగదు.
కోవిడ్‌తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలను నిలదొక్కుకునేలా చేసే క్రమంలో శిలాజ ఇంధనాలపై ఆధారపడడం కొనసాగిస్తే మరిన్ని విపత్తులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- వొడాఫోన్- ఐడియా భారత టెలీకాం మార్కెట్‌కు టాటా చెప్పబోతోందా?
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కశ్మీర్‌పై చైనా ఎందుకు మాట మార్చింది? పాకిస్తాన్ గురించి ఏమంటోంది?
- జియో వినియోగదారుల మీద ఎందుకీ ఐయూసీ చార్జీల భారం?
- యువకుడిలో రొమ్ముల పెరుగుదల.. జాన్సన్ అండ్ జాన్సన్‌కు రూ.57 వేల కోట్ల భారీ జరిమానా
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- 'ర్యాంకుల కోసం సెక్స్' అంటూ వేధిస్తున్న అధ్యాపకుడిని సస్పెండ్ చేసిన లాగోస్ యూనివర్సిటీ
- బిన్ లాడెన్ ఆచూకీ కనుగొనటంలో సిఐఏకు సాయపడ్డ డాక్టర్ షకీల్ అఫ్రిది... అమెరికాలో హీరో, పాకిస్తాన్లో ద్రోహి
- భారత తొలి రఫేల్ విమానాన్ని ఫ్రాన్స్‌లో అందుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








