#ICUDiary: 'డయాలసిస్ కోసం వచ్చిన పెద్ద మనిషికి కోవిడ్ ఉన్నట్లు తేలింది'

మీరు శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమా చూశారా? డిగ్రీతో సంబంధం లేకుండా, భావోద్వేగాలతో నిండిన గుండెతో చిరంజీవి ఆసుపత్రిలోకి అడుగుపెడతారు. అక్కడ కోమాలో ఉన్న ఓ బాలుడిని ‘‘రోగి’’ అని వైద్యులు సంబోధించడాన్ని ఆయన తట్టుకోలేకపోతారు. ఆ పిల్లాడికి ఎవరు ఎలా పిలుస్తున్నారో తెలియనప్పటికీ ఆయన్ను ఓ రోగిలా మాత్రం చూడకూడదని చిరంజీవి అంటారు.
ఇప్పుడు రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్‌కు వద్దాం. ఏడాదికిపైగా కరోనావైరస్‌తో వైద్యులు పోరాడుతున్నారు. తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారి కళ్లముందే ఎందరో రోగులు మరణిస్తున్నారు. ఆ మృతుల ఫోటోలు, వీడియోలను ఒకసారి చూసి మనం స్క్రోల్ చేసేస్తున్నాం. మరి వైద్యుల పరిస్థితి ఏమిటి?
ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేవరకు.. మరణాలను చూస్తున్న, మరణం అంచులవరకు వెళ్లినవారికి సేవలందిస్తున్న వైద్యుల్ని కేవలం ‘‘వారియర్లు’’ అంటే సరిపోతుందా?
ఐసీయూ వార్డుల్లో ప్రాణాలతో పోరాడుతున్న కోవిడ్ బాధితులకు నిత్యం చికిత్స అందించడం ఎంత కష్టం. దీన్ని అందరికీ తెలియజేసేలా చేసేందుకు ఐసీయూ డైరీ పేరుతో ఓ సిరీస్‌ను బీబీసీ తెలుగు మీకు అందిస్తోంది.
ఇలా ఐసీయూల్లో సేవలందిస్తున్న వారిలో ఒకరైన డాక్టర్ దీప్‌శిఖా ఘోష్ అనుభవాలతో ఈ సిరీస్ మొదలవుతోంది. కోవిడ్ బాధితుల్ని వైద్యులు కేవలం రోగులుగా మాత్రమే చూడటం లేదని వీటి ద్వారా మనకు అర్థమవుతుంది.
మరణించిన కోవిడ్ బాధితుల కుటుంబ సభ్యులకు ‘‘సారీ’’అని చెప్పాల్సి వచ్చినప్పుడు.. వైద్యులు తమ మనసుకు కూడా సారీ చెప్పుకొంటారు. ఎందుకంటే వారి మనసును పశ్చాత్తాపం వెంటాడుతుంది.
కొంచెం బాధ.. కొంచెం ఆనందం.. కొన్ని మధురానుభూతులు... ఇలాంటి అనుభవాలతో నిండినదే #ICUDiary.

#ICUDiary-5:'డయాలసిస్ కోసం వచ్చిన పెద్ద మనిషికి కోవిడ్ సోకింది'
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కీమోథెరపీ, డయాలసిస్ మొదలైన వాటి కోసం తరచూ ఆస్పత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటివారు అందరికన్నా ఎక్కువగా ఇబ్బంది పడ్డారని చెప్పవచ్చు.
వీరికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దాంతో, కోవిడ్ సోకే అవకాశాలు, సోకిన తరువాత వ్యాధి తీవ్రమయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంలో అలాంటి ఒక రోగిని నేను కలిశాను.
78 ఏళ్ల ఒక వ్యక్తి ఓ వారం క్రితం డయాలసిస్ చేయించుకోవడానికి ఆస్పత్రికి వచ్చారు. ఆయనకు కోవిడ్ సోకింది. చికిత్స కోసం ఐసీయూలో చేర్చారు.
ఆస్పత్రిలో చేరగానే సాధారణంగా పెద్దవాళ్లు చాలా కంగారు పడుతుంటారు. ఈయన కూడా అలాగే ఉంటారనుకుని, మాస్క్ ఎలా పెట్టుకోవాలో వివరిద్దామని ఆయన బెడ్ దగ్గరకు వెళ్లాను.
అయితే, నా అంచనాలను తారుమారు చేస్తూ దగ్గరకు వెళ్లగానే ఆయన నవ్వుతూ నన్ను పలకరించారు. ఆయనేమీ కంగారు పడుతున్నట్లు కనిపించలేదు.
తనను తాను పరిచయం చేసుకుని, తనకు డయాలసిస్ ఎప్పుడు మొదలుపెడతారని అడిగారు.
అంతేకాకుండా, చికిత్సకు తాను పూర్తిగా సహకరిస్తానని, టెన్షన్ ఏమీ లేదని నాకు హామీ ఇచ్చారు. సాధారణంగా ఎవరూ ఇలాంటి మాటలు చెప్పరు.
నర్సులందరికీ ఆయన బాగా నచ్చేశారు. ఆయనను చూసుకునే డ్యూటీ కోసం పోటీపడేవారు. మేము ఆయనకు బ్రీతింగ్ మిషన్ తగిలించాం.
ఆయనకు డయాలసిస్ మొదలైంది. చాలారోజుల తరువాత ఐసీయూ కూడా బావున్నట్టనిపించింది.
అయితే, డయాలసిస్ మధ్యలో అనుకోకుండా ఆయన వైటల్స్ అన్నీ పడిపోవడం ప్రారంభమయ్యాయి. మిషన్ల నుంచి అలారం శబ్దాలు వినిపించగానే అందరం ఆయన దగ్గరకి పరిగెత్తాం.
20 నిమిషాలు సీపీఆర్ చేశాక ఆయనను కాపాడగలిగాం. తరువాత మూడు రోజుల పాటు ఆయన మెల్లిగా కోలుకున్నారు. నాలుగోరోజు కళ్లు తెరిచి సైగలు చేస్తూ మాతో మాట్లాడడానికి ప్రయత్నించారు.
మళ్లీ ఐసీయూలో వాతావరణం తేటపడింది. ఆయన మళ్లీ నవ్వుతూ అందరినీ పలకరించడం ప్రారంభించారు. ఒక వారం తరువాత ఆయనను ఐసీయూ నుంచి వార్డుకు మార్చాం.
ఆ తరువాత నాలుగు రోజులకు ఆయన డిశ్చార్జి అయ్యారు. ఇలాంటి విజయాలే మాకు ఊపిరి పోస్తాయి. వీటి వల్లే మేము పని చేయగలుగుతున్నాం.

#ICUDiary-4: 'చనిపోతే... మా ఇంట్లోనే చనిపోతాను' అని అన్నారు
ఆస్పత్రిలో చేరాలంటే చాలామందికి భయంగానే ఉంటుంది. కారణాలు ఊహించదగ్గవే. కొంతమందికి కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరడమే మొదటి హాస్పిటల్ అనుభవం కావొచ్చు. అలాంటివారి భయాన్ని అర్థం చేసుకోగలం.
ఒకరోజు, అలా మొదటిసారి ఆస్పత్రిలో చేరిన 44 ఏళ్ల మహిళను ఐసీయూలో చూశాను. ఆవిడ చాలా కంగారుపడుతున్నారు. ఏ రకమైన చికిత్స చేయించుకోడానికీ ఇష్టపడలేదు. ఇంటికి వెళిపోవాలన్నది ఒక్కటే ఆమె కోరిక. తన కుటుంబ సభ్యులతో మాట్లాడించమని ఆమె అడుగుతూనే ఉన్నారు. వాళ్లొచ్చి ఆమెను అక్కడినుంచి తీసుకెళిపోతారని ఆమె ఆశ.
"నాకు బిడ్డ పుట్టేటప్పుడు కూడా ఆపరేషన్ వద్దనుకున్నాను. సాధారణ ప్రసవం అయింది. కాన్పు సమయంలో నొప్పులు మీరు ఊహించలేరు. కానీ, నేనదే కోరుకున్నాను. నన్ను ఇంటికి పంపించేయండి, నేను చనిపోయినా ఫరవాలేదు, ఇంటికి వెళిపోవాలి" అని అడిగారు.
ఆమెకు ఏం కాదని, భయపడొద్దని, మంచి చికిత్స అందిస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. కానీ, ఆమె నా మాట వినే పరిస్థితుల్లో లేరు.
వాళ్ల అబ్బాయికి ఫోన్ చేసి ఇచ్చాను. 'నువ్వు మంచివాడివి కాదు, వద్దని చెప్తున్నా నన్ను ఆస్పత్రిలో వదిలేశావని' ఫోన్‌లో కొడుకుతో అన్నారు.
వాళ్ల అబ్బాయి ఓపికగా సారీ చెబుతూ, డాక్టర్లు చెప్పిన మాట వినమని ఆమెను వేడుకున్నారు. రెండు మూడు రోజుల్లో ఆమెకు బాగవ్వగానే ఇంటికి తీసుకెళిపోతానని ప్రమాణం చేశారు.
ఆమెను సమాధానపరచడానికి దాదాపు అరగంట పట్టుంది. కానీ, ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణీస్తూ వచ్చింది. నూరు శాతం సపోర్ట్ అందించినప్పటికీ ఆక్సిజన్ స్థాయి పెరగలేదు.
ఆమె మానిటర్ వైపు చూశారు. అక్కడ 84% చూపిస్తోంది. నన్ను దగ్గరకు పిలిచి "రెండు మూడు రోజులు అయిపోయాయి, వెంటనే మా అబ్బాయికి ఫోన్ చెయ్యండి. నన్ను ఇంటికి తీసుకెళతానని చెప్పాడు. నేను చనిపోతే మా ఇంట్లోనే చనిపోతాను" అని చెప్పారు.
నాకేం చెప్పాలో తెలియక, వాళ్ల అబ్బాయికి ఫోన్ చేశాను. ఆమె ఆరోగ్య పరిస్థితి వివరించి, ఆమెకు వెంటిలేటర్ అవసరమని చెప్పాను.
ఆయన తన అంగీకారాన్ని తెలియజేస్తూ, ఫోన్ తన తల్లికి ఇవ్వొద్దని అభ్యర్థించారు. ఇంటికి తీసుకెళ్ళిపోమని ఆమె అడిగితే కాదనలేనని అన్నారు. ఆరోగ్యం ఇంకాస్త మెరుగవ్వగానే ఇంటికి పంపించేస్తామని ఆమెకు నచ్చజెప్పమని నన్ను అడిగారు.
ఆయన గొంతు వణుకుతూ ఉంది. తన తల్లి మాటలు పట్టించుకోవద్దని, ఆమెను కాపాడడానికి ఏం చెయ్యాలో అవన్నీ చేయమని అభ్యర్థించారు.
మేము అన్నీ చేశాం. ఆమెను ఎలాగైనా కాపాడాలనుకున్నాం. ఆమె ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారు. ఇప్పటికి చాలా "రెండు, మూడు రోజులు" గడిచిపోయాయి.
వాళ్లబ్బాయి రోజూ ఫోన్ చేస్తూనే ఉంటారు. కానీ, ఆయనతో మాట్లాడడానికి ఆమె స్పృహలో లేరు.

#ICUDiary-3: 'ఆయనకు సమయానికి టీ కావాలి... ఇచ్చారా?'
కొన్ని వారాల క్రితం ఒక వృద్ధుడు తీవ్ర జ్వరంతో, పడిపోయిన ఆక్సిజన్ స్థాయిలతో ఆసుపత్రిలో చేరారు. ఆ రోజు రాత్రి ఐసీయూలో చేరేసరికి ఆయన చాలా అలిసిపోయి ఉన్నారు.
ఆయనను నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది. కానీ, ఆయనకు మాస్క్ ఎందుకు పెట్టుకోవాలో అర్ధం కాలేదు. ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పటికీ అర్ధం చేసుకునే పరిస్థితిలో లేరని అర్ధమైంది.
దాంతో, ఆయన కుటుంబానికి ఫోన్ చేసి ఆయన మాస్క్ పెట్టుకోవడం లేదనే విషయాన్ని చెప్పాను. ఆయన భార్యకు కాల్ చేసి మొత్తం పరిస్థితిని వివరించాను. ఆయన మాస్క్ తొలగించకుండా ఉండేందుకు మేము బలవంతం చేయవలసి వస్తుందని ఆమెతో చెప్పాను.
ఆమె విషాదంతో ఆయన ఆక్సిజన్ స్థాయి మెరుగుపడేందుకు అవసరమైన చర్యలు తీసుకోమని చెప్పారు. ఆయన ఆక్సిజన్ స్థాయి సాధారణ స్థితికి చేరే వరకు ఆయన బెడ్ పక్కనే ఉంటానని చెప్పాను. నా మాటలు విన్న తర్వాత ఆమె ఫోన్ పెట్టేశారు.
కొన్ని నిమిషాల తర్వాత ఆమె తిరిగి ఫోన్ చేశారు. ఆమె మాటలు కూడదీసుకుని "ఆయన తనకు ఇష్టమైన టీ తాగే సమయానికి అది లేకపోతే చాలా చీకాకు పడతారు. ఆయనకు టీ అవసరమేమో" అని చెప్పారు. "అందుకే ఆయన చీకాకుగా ఉన్నారేమో! నేను టీ తెప్పించే ఏర్పాటు చేస్తాను" అని ఆమెతో చెప్పాను. మరింకేమీ మాట్లాడలేకపోయాను. హాస్పిటల్లో అందరూ ఆయనను జాగ్రత్తగా చూసుకునేటట్లు చూడమని ఆమె నాకు చెప్పారు. నేను అలాగే అని సమాధానమిచ్చాను.
మేము రెండు గంటలపాటు అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఆయన కాస్త నెమ్మదించారు. ఆ తర్వాత రెండు రోజులు నేను సెలవులో ఉన్నాను. నేను ఐసీయూకు తిరిగి వెళ్లేసరికి ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది.
ఆ రోజు నేను మరో విషాదకరమైన ఫోన్ కాల్ చేయవలసి వచ్చింది. నేను ఆయన భార్యకు కాల్ చేసి ఆయన పరిస్థితి విషమిస్తోందని, బ్రతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పాను.
"ఆయనకు వెంటిలేటర్ పెట్టే ముందు టీ ఇచ్చారా లేదా" అని ఆమె అడిగారు. నాకు లేదని చెప్పడానికి మనసు అంగీకరించలేదు. నేను టీ ఇచ్చామని చెప్పాను. ఆ ఒక్క మాటతో ఆమెకు మనశ్శాంతి లభించిందో లేదో నాకు తెలియదు. నేనామెకు మనశ్శాంతి చేకూర్చాననే ఆశిస్తున్నాను.
ఆయనను ఆసుపత్రి సిబ్బంది అంతా జాగ్రత్తగా చూసుకునేలా చేయమని ఆమె నెమ్మదిగా చెప్పారు. నేను చూసుకుంటానని మాటిచ్చాను.
ఆయన ఆ వారం చివర వరకూ కూడా ప్రాణాలతో లేరు.

#ICUDiary-2: ''నేను బతుకుతానా'' అని అడుగుతుంటే ఏం చెబుతా మంటే..
ఐసీయూలో పనిచేయడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించినవారిని నేను చూస్తుంటాను. రోజూ చాలా ముఖాలు నాకు కనిపిస్తుంటాయి. అయితే, చాలా మంది నిరాశ, నిస్పృహలతో నావైపు చూస్తుంటారు.
అడగకూడని ప్రశ్నలు అడిగేటప్పుడు చాలా మంది స్వరం వణుకుతూ వినిపిస్తుంటుంది.
చాలా విపత్కర పరిస్థితుల్ని నేడు చూస్తున్నాం. ప్రపంచం నలుమూలలా ఇదే జరుగుతోంది. అయితే కొన్ని దేశాలు మరింత ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి.
నాకు కనిపిస్తున్న ముఖాలు, వినిపిస్తున్న స్వరాలు.. కేవలం కేసులు మాత్రమే కాదు. వారికీ మనలానే ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయి.
అయితే, వారిలో కొందరి జీవిత కాలాన్ని కోవిడ్ కుదించేసింది. వారి ఆశలు, ఆకాంక్షలను ఆవిరిచేసింది. వారి లక్ష్యాలకు అడ్డుగోడలా నిలిచింది.
వారిలో కొందరి కథలు వినిపించకుండా మరుగున పడిపోయాయి. ఎందుకంటే అలాంటి కథలు మనకు అలవాటు అయిపోయాయి. మరికొందరి కథలు చెప్పడానికి ఎవరూ లేరు.
కోవిడ్‌తో డాక్టర్లంతా బిజీబిజీగా అయిపోయాం. మా శక్తి మొత్తం చికిత్స చేయడంపైనే ధార పోస్తున్నాం. మాట్లాడేందుకు మాకు సమయం, శక్తి.. రెండూ లేకుండా పోతున్నాయి.
మా దగ్గర రెండు రకాల సంభాషణలు వినిపిస్తుంటాయి. మాస్కులు పెట్టుకోవాలని, మందులు వేసుకోవాలని సూచించే సంభాషణలు వీటిలో మొదటివి.
ఆరోగ్యం ఎలా ఉంది? కుటుంబ సభ్యులతో మాట్లాడారా? మందులు సరిగ్గా వేసుకుంటున్నారా? అని అడిగే ప్రశ్నలు కూడా వీటి కిందకే వస్తాయి. వీరు ఆసుపత్రుల నుంచి త్వరగా కోలుకోవాలని మేం ప్రోత్సహిస్తుంటాం.
రెండో సంభాషణల విషయానికి వస్తే, ఇవి కొంచెం కటువుగా ఉంటాయి. రోగుల ప్రశ్నలతో ఈ సంభాషణలు మొదలవుతాయి. వారు మా కళ్లల్లోకి నేరుగా చూస్తూ ''డాక్టర్.. నేను బతుకుతానా?''అని అడుగుతుంటారు.
మేం వారికి అంతా సవ్యంగానే జరుగుతుందని చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాం. కానీ, కొన్నిసార్లు అది తప్పని మాకు తెలుస్తుంటుంది.

#ICUDiary 1: కనిపించని శత్రువుతో పోరాటం - డాక్టర్ దీప్‌శిఖా ఘోష్
మేం నిత్యం కరోనావైరస్‌తోపాటు కంటికి కనిపించని శత్రువులతోనూ పోరాడతాం.
మా ఆసుపత్రిలో కోవిడ్ ఇన్ఫెక్షన్‌తో ఓ మహిళ చేరారు. ఆమె కూడా వైద్యురాలే. అయితే, ఇప్పుడు ఆమె కరోనావైరస్‌తో నేరుగా పోరాడుతున్నారు.
ఆసుపత్రిలో చేరేసరికే ఆమె ఆక్సీజన్ స్థాయిలు పడిపోయాయి. శ్వాస తీసుకోవడానికి ఆమె చాలా ఇబ్బంది పడుతున్నారు. కృత్రిమ శ్వాస అందిస్తున్నప్పటికీ, ఆమెకు సరిగా ఊపిరి ఆడటం లేదు.
ఆమె సరిగా మాటలు కూడా ఆడలేకపోతున్నారు. ఒక పదం పలికేసరికే ఆయాసం వస్తోంది. వారాల పాటు ఆమె నా ముందు అలానే కష్టపడ్డారు.
ఒక సారి అయితే.. నా చేయి పట్టుకొని, ''మత్తుమందులు ఏమైనా ఇవ్వండి''అని అడిగారు.
''తుమీ తో అమర్ మా''అని ఆమె అనేవారు. అంటే ''నువ్వు మా అమ్మలా ఉన్నావు''అని అర్థం. వయసులో తమ కంటే చిన్నవారు తమకు సేవచేసేటప్పుడు, ప్రేమతో ఇలా అంటారు.
ఆమె భర్తకు కూడా కోవిడ్ సోకింది. అయితే, ఆయనకు కృత్రిమ శ్వాస అవసరం రాలేదు.
వెంటిలేషన్‌పై మారు మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండాలని భార్యకు ఆయన సూచించేవారు. బరువు కాస్త ఎక్కువగా ఉండటంతో ఆమెకు చాలా కష్టంగా ఉండేది. ఆయన తనను అర్థం చేసుకుంటారని ఆమెకు తెలుసు.
భర్తవైపు చూసి ఆమె చేయి పైకెత్తేవారు. తాను చేయగలిగినదంతా చేస్తున్నానని చెప్పేవారు. ఎలాగైనా చికిత్సకు సహకరించేలా ఆమెను ఒప్పించాలని ఆయన మమ్మల్ని వేడుకునేవారు. మీరేం భయపడొద్దని ఆయనకు భరోసా ఇచ్చాను. నాతో మాట్లాడిన తర్వాత, చేతులు కట్టుకొని పక్క యూనిట్‌లో ఉన్న తన బెడ్ దగ్గరకు ఆయన వెళ్లిపోయారు. అంతా మంచే జరగాలని ఆయన కోరుకునేవారు. ఎట్టకేలకు ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కానీ, ఒంటరిగానే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. భార్య ఆయన వెంట రాలేదు.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








