కోవిడ్-19: 'ఆక్సిజన్ కావాల్సింది ఎంత... మీరు ఇస్తున్నది ఎంత?' - కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరోనా వైద్య సదుపాయాలపై సుప్రీంకోర్టు సుమోటో కేసు విచారణ చేపట్టింది.

దేశంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న తరుణంలో ప్రజలకు అందుతున్న వైద్య సదుపాయాలు, ఆక్సిజన్, ఔషధాలు, కోవిడ్ వైరస్‌కు సంబంధించి అనేక విధానపరమైన అంశాలపై సుమోటో కేసు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు , అనేక అంశాలకు సంబంధించి కేంద్రానికి పలు ప్రశ్నలు వేసింది.

ఈ సాయంత్రం ఉత్తర్వులను సిద్ధం చేస్తామని, రేపు ఉదయం అప్‌‌లోడ్‌ చేస్తామని ఈ కేసు విచారణ అనంతరం సుప్రీం కోర్టు వెల్లడించింది.

తమ ఆర్డర్‌లో పేర్కొన్న సమస్యలన్నింటినీ కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

తాము తాత్కాలిక ఆదేశాలను జారీ చేస్తున్నామని, రాబోయే పది రోజుల కోసం కేంద్రం అనుసరించాల్సిన విధాన పరమైన అంశాలు ఇందులో ఉంటాయని సుప్రీం కోర్టు తెలిపింది.

ఈ కేసును మే 10న మళ్లీ విచారిస్తామని కోర్టు వెల్లడించింది.

విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు పలు కీలక అంశాలపై కేంద్రం నుంచి వివరణ కోరింది.

ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో శ్వాస పీల్చుకుంటున్న కరోనా రోగి

ఫొటో సోర్స్, Getty Images

ఆక్సిజన్ ఎలా అందిస్తున్నారు?

కోవిడ్ వైరస్ బాధితులకు ఆక్సిజన్ సరఫరా కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఆక్సిజన్ సిలిండర్లు, ట్యాంకర్లు అవసరమైన చోటికి చేరుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించిన ఆయన, ఆక్సిజన్ సరఫరా ఎంత, అవసరం ఎంతో చెప్పాలని కోరారు.

ఆక్సిజన్ అందక ప్రజలు అల్లాడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, దిల్లీ,గుజరాత్, మహారాష్ట్రల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, రేపు మళ్లీ విచారణ కొనసాగే సమయానికి ఏం మార్పు తీసుకురాగలిగారు అన్నది తనకు చెప్పగలరా అని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.

అయితే దిల్లీ సమస్య గురించి హైకోర్టులో కూడా చర్చకు వచ్చిందని, ఆక్సిజన్‌ను సేకరించడానికి కేంద్రం తాను చేయగలిగినంతా చేస్తోందని, వాటి రవాణా బాధ్యత రాష్ట్రాల స్థాయిలో నిర్వహించాల్సి ఉందని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్ సుప్రీం కోర్టుకు తెలిపారు.

దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచామని, ఆగస్టు 2020లో రోజుకు 6,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి కాగా, ప్రస్తుతం అది 9,000 మెట్రిక్ టన్నులకు చేరిందని, ప్రస్తుతం మెడికల్ ఆక్సిజన్‌కు కొరత లేదని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది.

మరోవైపు, ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయాలని, మనిషి సంక్షోభంలో పడినప్పుడు వాటిని పక్కనబెట్టాలని సుప్రీంకోర్టు దిల్లీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

సదుపాయాల విషయంలో ఏవైనా సమస్యలుంటే కేంద్రంతో మాట్లాడి పరిష్కరించుకోవాలని దిల్లీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వైద్య సహాయంలో రాజకీయాలకు తావు ఇవ్వవద్దని దిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.

వ్యాక్సినేషన్ ఎలా నిర్వహిస్తున్నారు ?

నేషనల్ ఇమ్యునైజేషన్ పాలసీని పాటించక పోవడం వల్ల షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి వ్యాక్సీన్ అందకుండా పోయే ప్రమాదం ఉందని, అందువల్ల కేంద్రం ఈ పాలసీని తప్పకుండా పాటించాలని సుప్రీం కోర్టు సూచించింది.

కోవిడ్ వ్యాక్సీన్‌ను నూటికి నూరు శాతం మీరే ఎందుకు కొనకూడదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనివల్ల తారతమ్యాలు లేకుండా వ్యాక్సీన్ అందరికీ అందుతుందని సుప్రీం వ్యాఖ్యానించింది.

వ్యాక్సీన్‌ను రాష్ట్రాలకు పంచడంలో తారతమ్యాలు ఏమైనా ఉన్నాయా అని కూడా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఉత్పత్తి అయ్యే వ్యాక్సీన్‌లో 50 శాతం వ్యాక్సీన్‌ను రాష్ట్రాలకు అందిస్తున్నామని కేంద్రం తెలిపింది.

అయితే వ్యాక్సీన్ నాణ్యత ఎవరు పరిశీలిస్తున్నారని ప్రశ్నించిన సుప్రీంకోర్టు, 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఎంత జనాభా ఉందో తమకు వివరాలు అందించాలని కేంద్రాన్ని కోరింది.

వ్యాక్సీన్ తయారు చేసే పనిని ప్రైవేటు కంపెనీలు చేస్తుండటం వల్ల, దీని కోసం ఎన్ని నిధులు కేటాయిస్తున్నది కేంద్రం ప్రకటించాల్సిన అవసరం ఉందని, దీనివల్ల వ్యాక్సీన్ తయారీ వేగవంతమవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది.

అయితే ఏ రాష్ట్రానికి ఎంత వ్యాక్సీన్ ఇవ్వాలన్న నిర్ణయం ప్రైవేటు వ్యాక్సీన్ ఉత్పత్తిదారుల చేతిలో ఉండరాదని కూడా సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.

దేశంలోని నిరక్షరాస్యులకు, ఇంటర్నెట్ సదుపాయం లేనివారికి వ్యాక్సీన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్రం, రాష్ట్రాలు ఎలా నిర్వహిస్తున్నాయో చెప్పాలని సుప్రీం కోర్టు కోరింది.

ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారని, అందులో సౌకర్యాల లేమిని చెప్పుకోవడం తప్పుకాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ఇలాంటి సమాచారాన్ని తప్పుడు సమాచారంగా భావించి అణచివేయడాన్ని తాము సమర్ధించబోమని సుప్రీం స్పష్టం చేసింది. అలాంటి చర్యలు ఎవరైనా తీసుకుంటే, దాన్ని కోర్టు ధిక్కారంగా భావిస్తామని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)