జస్టిస్ ఎన్‌వీ రమణపై ఏపీ సీఎం జగన్ చేసిన ఫిర్యాదును కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGAN
ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయవ్యవస్థను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో సమాచారం అందుబాటులో ఉంచారు.
''2020 అక్టోబరు 6న ఏపీ సీఎం సుప్రీంకోర్టుకు రాసిన లేఖపై సుప్రీంకోర్టు ఇన్‌హౌస్ ప్రొసీజర్ ప్రకారం విచారించి, తగిన పరిశీలన జరిపిన అనంతరం దాన్ని తోసిపుచ్చడమైంది.
ఇన్‌హౌస్ ప్రొసీజర్‌కు సంబంధించిన విషయాలేవీ బయటకు వెల్లడించతగినవి కావు'' అని ఆ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, SupremecourtofIndia
ఏపీ సీఎం జగన్ 2020 అక్టోబరు 6న సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో ఏం ఉంది?
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ 2020 అక్టోబరు 6న రాసిన 8 పేజీల లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు.
అందులో రాజ్యాంగం పరిధులు, న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సంబంధం, అమరావతి భూములపై సబ్ కమిటీ ఏర్పాటు, జస్టిస్ ఎన్‌వీ రమణ గురించి రాశారు. దాదాపు నాలుగు పేజీల్లో జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రస్తావన ఉంది. ఈ లేఖతో పాటూ 7 ఫైళ్లను జత చేశారు.
''చంద్రబాబు, జస్టిస్ రమణల మధ్య దగ్గరితనం అందరికీ తెలిసిందే. నేను ఎంతో బాధ్యతాయుతంగా ఈ మాట చెబుతున్నాను. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చలమేశ్వర్ ఈ విషయాలను సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో బాబు, జస్టిస్ రమణలు ఇచ్చిన అభిప్రాయాలను మీముందు ఉంచుతున్నాను.'' అని సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు జగన్.
''తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన విషయాలు వచ్చినప్పుడు హైకోర్టు జడ్జీల డ్యూటీ రొటేషన్‌ను(జడ్జీల రోస్టర్) జస్టిస్ రమణ ప్రభావితం చేస్తున్నారు. హైకోర్టు సిట్టింగులను ప్రభావితం చేస్తున్నారు. ఇది స్పష్టంగా కొందరు జడ్జీలు, జస్టిస్ రమణ, తెలుగుదేశం పార్టీల మధ్య సంబంధాన్ని తెలుపుతోంది.'' అని లేఖలో జగన్ ఆరోపించారు.
అంతేకాదు మీడియా కవర్ చేయవద్దని హైకోర్టు చెప్పిన ఎఫ్ఐఆర్ వివరాలను కూడా ఆ లేఖలో ఆయన ప్రస్తావించారు.
''ఈ అంశాలు పరిశీలించి, న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉంటడానికి మీరు తగిన చర్యలు తీసుకోవాలి'' అని భారత ప్రధాన న్యాయమూర్తిని కోరారు జగన్.



ఆ ఫైళ్లలో ఏముంది?
ఆ జత చేసిన 7 ఫైళ్లూ మొత్తం 29 పేజీలు.
అందులో పలువురు న్యాయవాదులను హైకోర్టు న్యాయమూర్తులుగా ఎలివేట్ చేయడానికి జస్టిస్ ఎన్‌వీ రమణ, చంద్రబాబునాయుడు ఇచ్చిన అభిప్రాయాలూ, 2013-16 మధ్య జస్టిస్ రమణ ఆస్తుల డిక్లరేషన్, హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఉన్న ఎఫ్ఐఆర్ వివరాలూ, ఆ ఎఫ్ఐఆర్ కాపీ, కేబినెట్ సబ్ కమిటీపై హైకోర్టు ఇచ్చిన రిట్ పిటీషన్లో ఇచ్చిన ఆదేశాలు, ఏపీ హైకోర్టు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇచ్చిన తీర్పు అని ఆరోపిస్తున్న ఆదేశాలు వీటిల్లో జత చేశారు. (మీడియాకు ఇచ్చిన ప్రతిలో గ్యాగ్ ఆర్డర్ ఉన్న ఎఫ్ఐఆర్ వివరాలు తీసేసి మిగతావి ఇచ్చారు.)
మీడియాకు ఇచ్చిన వివరాలేంటి?
మీడియా అనుబంధం అంటూ 11 పేజీల ఇంగ్లిష్ కాపీని విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.
అందులో ఐదుగురు ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తుల పేర్లు, వారు ఇచ్చిన కొన్ని తీర్పుల వివరాలు ఉన్నాయి. ''తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పులు, వాస్తవాలు'' అన్న పేరుతో ఆ ప్రకటన ఉంది.
అమరావతి భూ కుంభకోణం ఎఫ్ఐఆర్‌లపై స్టే, ఇళ్లు ఖాళీ చేయాలంటూ సీఆర్డీయే ఆదేశాలపై స్టే, రమేశ్ ఆసుపత్రులు కేసులో స్టే, రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు కార్యదర్శిపై విచారణపై స్టే, ఇళ్ల పట్టాల పంపిణీపై స్టే, ప్రైవేటు ఇంటర్ కాలేజీలు ఫీజుల వ్యవహారంలో తీర్పు రిజర్వు చేయడం, పోలవరం-నవయుగ కేసు వంటివి ప్రస్తావించారు.
ఒక పేజీలో అయితే ''నాపై, నా ప్రభుత్వంపై హైకోర్టు ద్వేషం'' అనే హెడింగ్ కింద కొన్ని విషయాలు పొందుపర్చారు.
విశాఖలో బాబు అరెస్టు, హైకోర్టు జడ్జీల ఫోన్ ట్యాపింగ్ కేసు, వైయస్సార్సీప ఎమ్మెల్యేలు కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘన కేసుల గురించి ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: మిగతా దేశాలు వ్యాక్సీన్ తయారు చేసుకోకుండా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయా?వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- తైవాన్: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- తెలంగాణ బడ్జెట్ 2021: రూ.2,30,826 కోట్లతో బడ్జెట్.. వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








