ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణ కేసు: సుప్రీం తీర్పుపై పునర్విచారణకు పిటిషన్ - BBC Newsreel

ఫొటో సోర్స్, @ PBHUSHAN1
కోర్టు ధిక్కరణ కేసులో తనను సుప్రీం కోర్టు దోషిగా నిర్ధరించడంపై లాయర్ ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.
తాను చేసిన వ్యాఖ్యలు వాస్తవాల ఆధారంగా, సదుద్దేశంతో చేసినవని ఆయన తన పిటిషన్లో వివరించారు. గతంలో కూడా సుప్రీం కోర్టు సమక్షంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు. జస్టిస్ మదన్ భీమ్‌రావు లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ అజిత్ ప్రకాశ్ షా వంటి రిటైర్డ్ న్యాయమూర్తులతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ శౌరీ వంటి వారు పత్రికల్లో లేదంటే టీవీ చానళ్లలో ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారని ప్రశాంత్ భూషణ్ తన పిటిషన్లో వివరించారు. అలాంటి వ్యాఖ్యలను పునరుద్ఘాటించినా, వాటికి మద్దతు తెలిపినా కూడా అది ప్రచురణ కిందకే వస్తుంది కాబట్టి, వారు కూడా కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడినట్లేనా అని ప్రశాంత్ భూషణ్ తన రివ్యూ పిటిషన్లో ప్రశ్నించారు.
తాను కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు ఇచ్చిన తీర్పును స్వచ్ఛందంగా వెనక్కి తీసుకోవాలని, ఇలాంటి వ్యాఖ్యలపై ఎలాంటి శిక్షలు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.
సుప్రీం కోర్టులో అవినీతి గురించి గతంలోనూ చాలా మంది చాలా వ్యాఖ్యలు చేశారని, వారిలో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బరూచా కూడా ఉన్నారని అన్నారు. ఇంకా, తన పిటిషన్ మీద బహిరంగ విచారణ జరిపించాలని, సూమోటో కేసును సుప్రీం కోర్టు న్యాయమూర్తి (ఇటీవల రిటైర్ అయ్యారు) జస్టిస్ అరుణ్ మిశ్రా విచారించి ఉండాల్సింది కాదని ప్రశాంత్ భూషణ్ తన పిటిషన్లో అభిప్రాయపడ్డారు.
దిల్లీ అల్లర్ల కేసులో విద్యార్థి సంఘం మాజీ నాయకుడు ఉమర్ ఖలీద్ అరెస్ట్

ఫొటో సోర్స్, FACEBOOK/UMAR KHALID
దిల్లీ అల్లర్ల కేసులో జేఎన్‌యూ విద్యార్ధి సంఘం మాజీ నాయకుడు, యునైటెడ్ అగైనెస్ట్ హేట్ సహ వ్యవస్థాపకుడు ఉమర్ ఖలీద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 11గంటలపాటు ప్రశ్నించిన తర్వాత ఆయన్ను అరెస్టు చేశారని యునైటెడ్ అగైనెస్ట్ హేట్ వెల్లడించింది. ఢిల్లీ అల్లర్లకు ఒమర్ ఖలీద్ సూత్రధారి అని పోలీసులు చెబుతున్నారు.
యునైటెడ్ అగైనెస్ట్ హేట్ న్యాయవాది పంకజ్ ఉమర్ ఖలీద్ అరెస్టును బీబీసీకి ధ్రువీకరించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఏపీఏ)లోని సెక్షన్ల కింద ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు.
తన కుమారుడు ఉమర్‌ను అరెస్టు చేసినట్లు తండ్రి సయ్యద్ ఖాసీం తెలిపారు.“ స్పెషల్ సెల్ పోలీసులు మధ్యాహ్నం 1 నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు. రాత్రి 11 గంటల సమయంలో అరెస్టు చేశారు’’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అల్లర్లపై దర్యాప్తు ముసుగులో ఢిల్లీ పోలీసులు నిరసనలను నేరంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని యునైటెడ్ అగైనెస్ట్ హేట్ ఆరోపించింది. సీఏఏ, యూఏపీఏ చట్టాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఆ సంస్థ స్పష్టం చేసింది.
అవి అసత్య ఆరోపణలు, అబద్ధపు కేసు: ఖలీద్ అరెస్టుకు హెచ్ఆర్ఎఫ్ ఖండన
జేఎన్‌యూ పూర్వ విద్యార్ధి, యునైటెడ్ అగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖలీద్‌ను దిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అరెస్ట్ చేయడాన్ని మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్ఎఫ్) తీవ్రంగా ఖండించింది.
ఉమర్ ఖలీద్ తన ప్రసంగాలు, రచనలు, అహింసాయుత కార్యకలాపాల ద్వారా రాజ్యాంగ విలువలను, నిరసించే హక్కును, నిర్భయంగా బ్రతకాలనే సందేశాన్ని శాంతియుతంగా చాటుతున్నారని పేర్కొంది.
''ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈశాన్య దిల్లీలో జరిగిన హింసాకాండలో పాల్గొన్నాడనే అసత్య ఆరోపణలతో ఆయనపై అత్యంత కిరాతకమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేశారు. లేని సాక్ష్యాధారాలను సృష్టించి ఉమర్ ఖలీద్ మీద ఈ అన్యాయమైన అబద్ధపు కేసు బనాయించారని హెచ్ఆర్ఎఫ్ భావిస్తోంది'' అని ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వి.ఎస్.కృష్ణ, ఎస్.జీవన్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లకు వ్యూహం రచించిన కుట్రదారులు, వాటిని రెచ్చగొట్టిన వారు, అల్లర్లకు పాల్పడ్డ కిరాతక మూకలు ఈనాటికీ దిల్లీ వీధులలో, అధికార కారిడార్లలో నిర్భయంగా తిరుగుతున్నారని హెచ్ఆర్ఎఫ్ పేర్కొంది. దిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకోకుండా మతసామరస్యం కోసం కృషి చేసిన సంస్థలపై, కార్యకర్తలపై విషపూరిత దుష్ప్రచారం చేసుకుంటూ, అబద్ధపు కేసులు బనాయిస్తున్నారని.. రాజ్యం, బీజేపీ, దాని అనుబంధ సంస్థల అండదండలున్నాయి కాబట్టే వారు ఈ ఆకృత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది.
దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఉమర్ ఖలీద్, ఇతర సి.ఏ.ఏ. వ్యతిరేక కార్యకర్తలు అందరినీ వెంటనే విడిచిపెట్టాలని, వారిపై బనాయించిన అబద్ధపు కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. యూఏపీఏ చట్టాన్ని, రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయాలంటూ ఉద్యమించాలని ప్రజాస్వామికవాదులను కోరింది.
జపాన్ కొత్త ప్రధాని యొషిహిడే సుగా

ఫొటో సోర్స్, Reuters
ఆరోగ్య సమస్యలతో జపాన్ ప్రధాన మంత్రి పదవి నుంచి షింజో అబే తప్పుకోనుండటంతో అధికార లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ యొషిహిడే సుగాను తదుపరి నేతగా ప్రకటించింది. ప్రస్తుతం క్యాబినెట్ సెక్రటరీగా పని చేస్తున్న 71 సంవత్సరాల సుగా అతి త్వరలోనే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది.
ప్రధాని షింజో అబేకు సుగాను అత్యంత సన్నిహితుడిగా చెబుతారు. ఆయన విధానాలను సుగా కొనసాగిస్తారని జపాన్ రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.
534మంది సభ్యులున్న లిబరల్ పార్టీ ప్రజాప్రతినిధులలో 377 మంది ఆయనకు మద్దతు ప్రకటించారు. బుధవారంనాడు పార్లమెంటులో జరగబోయే మరో ఎన్నికలో ఆయన విజయం సాధిస్తే ప్రధానమంత్రి అవుతారు.
పార్లమెంటులో లిబరల్ డెమెక్రాటిక్ పార్టీకి బలం ఉండటంతో ఆయన ప్రధాని కావడం ఖాయమని చెబుతున్నారు. మధ్యంతర ప్రధానిగా వస్తున్న సుగా వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఎన్నికల వరకు ఈ పదవిలో కొనసాగుతారు
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ను ‘హెర్డ్ ఇమ్యూనిటీ’తో అదుపు చేయడం సాధ్యమేనా?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- దిల్లీ హింసను 2002 నాటి గుజరాత్ అల్లర్లతో ఎందుకు పోలుస్తున్నారంటే...
- దిల్లీ హింస: సీఏఏ అనుకూల, వ్యతిరేక నిరసనలతో రాత్రంతా భయం గుప్పిట్లో...
- దిల్లీలో అలర్లు చేయించేందుకు ముస్లింలకు డబ్బులు పంచారా? : Fact Check
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








