మహేశ్‌బాబు: ‘నాన్న, నేను, మా అబ్బాయి.. ఘట్టమనేని మూడు తరాలతో సినిమాకు దర్శకత్వం ఆయనే చేయగలరు’ - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, facebook/urstrulyMahesh
అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. ఈ సినిమాలో రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా అభిమానులు వేసిన కొన్ని ప్రశ్నలను అనిల్ రావిపూడి అడగ్గా.. మహేశ్‌బాబు వాటికి ఇచ్చిన సమాధానాలు ఇచ్చారని 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. అభిమానులు వేసిన కొన్ని ప్రశ్నలు, వాటికి మహేశ్‌బాబు సమాధానాలు ఇవీ...
బ్లాక్ బస్టర్ కాఫీ ఎక్కడ తాగారు?
మహేశ్‌బాబు: ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు సెంటిమెంట్‌గా మా అమ్మగారు కలిపి ఇచ్చే కాఫీ తాగుతాను. బ్లాక్ బస్టర్ కాఫీ అంటే ఆవిడ కలిపి ఇచ్చేదే.
'సరిలేరు నీకెవ్వరులో' సీతరామరాజుగా కృష్ణగారు కనిపించడం మీకు ఎలా అనిపించింది?
మహేశ్‌బాబు: ఈ సీన్ చెప్పగానే నా ఒళ్లు గగుర్పొడిచింది. తెరపై చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. నేనే హీరో కావడం, నా సినిమాలోనే ఆ సీన్ ఉండటం అదృష్టం.
రెండేళ్లకొకసారైనా మాకు ఇలాంటి మాస్ సినిమాలు కావాలి...
మహేశ్‌బాబు: 'దూకుడు' తర్వాత ఒక మాస్ జోనర్‌లో సినిమా చేయలేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. 'శ్రీమంతుడు' నుంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చా. భరత్ అనే నేను, మహర్షి.. అవన్నీ స్క్రిప్ట్‌కు లోబడి చేయాల్సి వచ్చింది. దర్శకుడు చెప్పింది నాకు నచ్చాలి. లేకపోతే చేయలేను. నాకు కూడా మాస్ సినిమా చేయాలని ఉంది. అదే సమయంలో మీరు (అనిల్ రావిపూడి) వచ్చి కథ చెప్పారు. ఫ్యాన్స్ ఏది కోరుకుంటున్నారో అది మీ దగ్గర ఉందని అర్థమైంది. అందుకే సినిమా చేయాలన్న నిర్ణయం తీసుకున్నా. నా నిర్ణయం సరైనదేనని అనిపించింది. అయితే, ఇంత పెద్ద హిట్టవుతుందని మాత్రం నేను ఊహించలేదు. ఇలాగే మరిన్ని సినిమాలు చేస్తా.
ఒక పాన్-ఇండియా సినిమా ఎప్పుడు తీస్తారు?
మహేశ్‌బాబు: ప్రస్తుతం ఒక హిట్‌తో చాలా సంతోషంగా ఉన్నా. భవిష్యత్‌లో అదృష్టం బాగుంటే చేయబోయే సినిమా పాన్-ఇండియా మూవీ అవుతుంది. దాన్ని మనం ప్లాన్ చేయలేం.
కొండారెడ్డి బురుజు సెంటర్‌తో అటాచ్‌మెంట్ గురించి చెప్పండి.
మహేశ్‌బాబు: 'ఒక్కడు' కారణంగా కొండారెడ్డి బురుజు నాకు చాలా స్పెషల్. ఆ సినిమా కోసం మూడు రోజులు మాత్రమే చేశాం. చాలా పేరు వచ్చింది. ఈ సినిమాలో కొండారెడ్డి బురుజు సెట్ వేశారు. ప్రతి సన్నివేశంపై దర్శకుడికి పట్టు ఉంది.
'సరిలేరు నీకెవ్వరు' చూసి సితార ఏమైనా ఇమిటేట్ చేసిందా?
మహేశ్‌బాబు: రష్మిక డైలాగ్ 'నీకర్థమవుతోందా'ను ఇమిటేట్ చేసింది. పాటలకు కూడా డ్యాన్స్ చేసింది. త్వరలోనే వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తాం.
మహేశ్ మిమ్మల్ని హారర్ థ్రిల్లర్ తరహా మూవీలో చూడాలనుకుంటున్నాం. మీకు ఆసక్తి ఉందా?
మహేశ్‌బాబు: ఎందుకమ్మా..! శుభ్రంగా, హాయిగా ఉన్నాం కదా అందరం. పండగ సమయంలో హారర్ మూవీ ఎందుకు? (నవ్వులు)
ఆర్మీ వాళ్లను 'సరిలేరు నీకెవ్వరు' చిత్ర బృందం ఎప్పుడు కలుస్తుంది?
మహేశ్‌బాబు: కశ్మీర్‌లో ఆర్మీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. వాళ్లు కూడా మాకు చాలా అనుమతులు ఇచ్చారు. (మధ్యలో అనిల్ రావిపూడి అందుకుని: త్వరలోనే ఆర్మీ వాళ్లతో సమావేశం అవుతాం.)
తొలిసారి ఆర్మీ దుస్తులు వేసుకోవడం మీకు ఎలా అనిపించింది? మీరు నిజంగా ఆర్మీ మేజర్‌లాగానే ఉన్నారు.
మహేశ్‌బాబు: థ్యాంక్యూ. ఆర్మీ దుస్తులు వేసి టెస్ట్ షూట్ చేయడం ఇప్పటికీ నాకు గుర్తుంది. చాలా గర్వంగా ఉంది.
మ్యావ్.. మ్యావ్ పిల్లి.. అనిల్ రావిపూడితో సినిమా ఎప్పుడు మళ్లీ..?
మహేశ్‌బాబు: అనిల్ రావిపూడి ఒక సినిమా చేస్తారు. అది అయిన వెంటనే ఆయనతో నా సినిమా ఉంటుంది.
ఏ సీన్ చేస్తుండగా మీ ఒళ్లు గగుర్పొడిచింది?
మహేశ్‌బాబు: ఇంటర్వెల్ ఎపిసోడ్. ఆ సీన్‌లో పాత్రలు, సన్నివేశాలు, భావోద్వేగాలు ఉచ్ఛస్థితిలో ఉంటాయి.
మీ బలం ఏంటి?
మహేశ్‌బాబు: పరిశీలించడం(అబ్జర్వేషన్). ప్రతి విషయాన్ని శ్రద్ధగా పరిశీలిస్తా. తోటి నటుల నుంచే కాదు, నా సహాయకుల నుంచి కూడా నటన నేర్చుకుంటా. అదే నా బలం.
మీ గత చిత్రాలతో పోలిస్తే, 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి మీరెంత రేటింగ్ ఇస్తారు?
మహేశ్‌బాబు: నా గత చిత్రాలన్నీ నాకు ఎంతో స్పెషల్. అయితే, ఈ సినిమా నాకు మరింత ప్రత్యేకం. ఇందులో నా నటనకు ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. కామెడీ టైమింగ్, ఎమోషన్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి. ఇందులో కొత్త మహేశ్‌ను చూశారు.
ఇండియన్ ఆర్మీ గురించి ఒక్క మాటలో చెప్పండి?
మహేశ్‌బాబు: హ్యాట్సాఫ్. వాళ్లు లేకపోతే మనం ఇక్కడ హాయిగా కూర్చోలేం.
ఘట్టమనేని మూడు తరాలను ఒక సినిమాలో చూడవచ్చా?
మహేశ్‌బాబు: నాకు కూడా చేయడం ఇష్టమే. అయితే, అలాంటి సినిమాను మీరు (అనిల్ రావిపూడి) మాత్రమే చేయగలరు. (వెంటనే అనిల్ రావిపూడి అందుకుని: మీతో సినిమా అంటే ఈసారి సరికొత్తగా ఉంటుంది.)

ఫొటో సోర్స్, Pooja Hegde/Facebook
తెలుగులో లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ వచ్చింది.. కానీ ఒప్పుకోలేదు: పూజా హెగ్డే
''నాలుగు సినిమాలు ఒకేసారి చేయగల సత్తా నాకుంది. ఇప్పుడు తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నా కాబట్టి ఇంకో రెండు సినిమాలు హిందీలో చేయగలను. ఇండియన్ స్టార్ కావడం నా లక్ష్యం. ఏదో ఒక భాషకే పరిమితం కావాలను కోవట్లేదు. నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తే, అక్కడ సినిమాలు చేయాలనుకుంటున్నా'' అని సినీ నటి పూజాహెగ్డే చెప్పినట్లు 'సాక్షి' ఒక కథనంలో పేర్కొంది.
అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం 'అల.. వైకుంఠపురములో..' ఆదివారం విడుదలైంది. ఈ సందర్భంగా పూజాహెగ్డే విలేకరులతో పంచుకున్న విశేషాలను 'సాక్షి' కథనంలో తెలిపింది...
- బన్ని, నేను ఇప్పటికి రెండు సినిమాలు చేశాం. దాంతో మా మధ్య సెట్స్‌లో కంఫర్ట్ లెవల్ పెరిగింది. అది తెరపై కెమిస్ట్రీ రూపంలో కనిపించింది. అందుకే మామధ్య కెమిస్ట్రీ బాగుందని అందరూ అంటున్నారు. అందువల్లేనేమో నాతో మూడోసారి నటించాలని ఉందని అల్లు అర్జున్ అన్నారు.
- ఈ చిత్రంలోని అమూల్య పాత్రతో నేను మరింతగా తెలుగమ్మాయిని అయిపోయాను. బాలీవుడ్ జనాలు నన్ను హైదరాబాద్ అమ్మాయిననే అనుకుంటున్నారు. నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల నా నటన మరింత ఎలివేట్ కావడానికి ఉపయోగపడుతోంది. తెలుగు నేర్చుకోవడానికి ట్యూటర్‌ని పెట్టుకోలేదు. నా మేనేజర్‌తో, నా స్టాఫ్‌తో తెలుగులోనే మాట్లాడుతాను. ఇంటర్వ్యూల్లో తెలుగులో మాట్లాడాలంటేనే కొంచెం భయంగా ఉంటుంది.
- ఏదైనా మనం చేసే దృష్టిలో ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ కాళ్లను హీరో పదే పదే చూస్తుంటాడు. అలా చూడ్డం వల్గర్‌గా ఏమీ లేదు. అలా ఎందుకు చూస్తాడో.. సినిమా చూస్తే అర్థమౌతుంది. ఈ సన్నివేశాలను జస్టిఫై చేశాం.
- 'అరవింద సమేత' చిత్రానికి కూడా నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. మన పాత్రకి డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పడం వల్ల ఒక్కోసారి మనం ఓవర్ యాక్టింగ్ చేసినట్లు అనిపిస్తుంది.. అలాంటి నటన నాకిష్టం ఉండదు. కొంతమంది మన నటనను తమ డబ్బింగ్‌తో మరింత ఎలివేట్ చేస్తారు. వాళ్లను నేను గౌరవిస్తాను.
- 'అల.. వైకుంఠపురములో..' సినిమాలో 'బుట్టబొమ్మ..' సాంగ్ లీడ్ సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే బోర్డ్ రూమ్ సన్నివేశం కూడా ఇష్టం. ఆ రెండూ చాలా సరదాగా ఉంటాయి.
- హిందీ 'హౌస్ ఫుల్ 4' చిత్రంలో నేను చేసింది సెకండ్ హీరోయిన్ రోల్ కాదు. సగం అక్షయ్ కుమార్‌తో, సగం రితేశ్ దేశ్‌ముఖ్‌తో చేశాను. నేను అప్పటి దాకా స్లాప్ స్టిక్ కామెడీ చెయ్యలేదు.. ఆ సినిమా చెయ్యడం గొప్ప అనుభవం. ఆ అనుభవం 'అల.. వైకుంఠపురములో..' చిత్రానికి ఉపయోగపడింది. సీన్లో పది మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు మన పాత్రను ఎలా రక్తి కట్టించాలనేది ఆ సినిమాతో నేర్చుకున్నా.
- హిందీలో నేను చేస్తున్నవేవీ సెకండ్ హీరోయిన్ రోల్స్ కావు. 2019లో నేను చేసిన పాత్రల్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. అవన్నీ ఒకదానికొకటి భిన్నమైన పాత్రలు. 'గద్దలకొండ గణేశ్'లో నన్ను శ్రీదేవిలాగా అంగీకరించారు. 'మహర్షి'లో కాలేజ్ స్టూడెంట్‌గా, కార్పొరేట్ గాళ్‌గా ఆదరించారు. ఇప్పుడు 'అల.. వైకుంఠపురములో..' సినిమాలో బన్నీ బాస్ రోల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకులు నన్ను ఒప్పుకోవడం సంతోషం.. అందుకు నా పర్సనాలిటీ నా బలమని నమ్ముతాను.
- తెలుగులో లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ వచ్చింది కానీ, ఒప్పుకోలేదు. కథ నాకు నచ్చి, చేయగలననిపిస్తే చేస్తా. అలాంటి సినిమాలు ఒక నటిగా నన్ను మరో కోణంలో చూపిస్తాయి.

ఫొటో సోర్స్, Akkineni Naga Chaitanya/Facebook
నాగ చైతన్య కొత్త సినిమా.. లవ్ స్టోరీ
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి 'లవ్‌స్టోరీ' అనే టైటిల్‌ని ఖరారు చేశారని.. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని చిత్ర బృందం మంగళవారం విడుదల చేసిందని ‘నవ తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. 'మ్యూజికల్ లవ్‌స్టోరీకి 'లవ్ స్టోరీ' అనే టైటిల్‌ని దర్శక, నిర్మాతలు ఖరారు చేశారు. ఇంటెన్సిటీతో ఉన్న హీరో, హీరోయిన్ల పోస్టర్‌కి చాలా మంచి రెస్సాన్స్ వస్తుంది. ప్రేమలో కనిపించే భావోద్వేగాలను పోస్టర్‌లో పలికించాడు శేఖర్ కమ్ముల.
ఆయన ఎలాంటి కథని చెప్పబోతున్నాడో ఆ ఫీల్‌ని పోస్టర్‌తో కలిగించారు. నాగచైతన్య , సాయిపల్లవి, శేఖర్ కమ్ముల క్రేజీ కాంబో రేంజ్‌లోనే ఫస్ట్‌లుక్ ఉండటంతో సర్వత్రా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.
రెహామాన్ స్కూల్ నుండి పరిచయం అవుతున్న పవన్ అందించిన స్వరాలు ఈ లవ్ స్టోరీని మరింత అందంగా మార్చబోతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన లాస్ట్ షెడ్యూల్ సంక్రాంతి పండుగ తర్వాత ప్రారంభం కానుంది.
సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ ప్రేమకథ నాగచైతన్య ఇమేజ్‌ని కొత్తగా ప్రొజెక్ట్ చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 'ఫిదా' తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో మరింత క్రేజ్‌ని పెంచింది.
ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.

ఫొటో సోర్స్, @twitter
వెంకటేశ్ హీరోగా ‘అసురన్’ రీమేక్.. రాయలసీమలో చిత్రీకరణ
‘ఎఫ్ 2’లో నవ్వించి, ‘వెంకీమామ’గా సెంటిమెంట్ పండించిన వెంకటేశ్ మరో వైవిధ్యమైన చిత్రంలో నటిస్తున్నారని ‘ఆంధ్రప్రభ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. తమిళంలో విజయం సాధించిన ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో వెంకటేశ్ నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. డి.సురేశ్‌బాబు, కలైపులి థాను కలిసి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియమణి నటించనుందని తెలిసింది. ఇదే నెలలో షూటింగ్ చేస్తారట. ముఖ్యంగా అనంతరపురం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుందని తెలిసింది.
ఇవి కూడా చదవండి:
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- ఆస్ట్రేలియాలో వేల సంఖ్యలో ఒంటెలను చంపేస్తున్నారు... ఎందుకు?
- ఆర్మీ కూలీ తల నరికి తీసుకెళ్లిన పాకిస్తాన్?
- #SatyaNadella: 'విచారకరం - బాధాకరం' - CAAపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందన
- బ్రిటన్ రాజవంశం: ప్రిన్స్ హ్యారీ, మేగన్‌ల ఆస్తుల విలువ ఎంత? వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- ఆస్ట్రేలియా కార్చిచ్చు: 'నేల తల్లి బాగుండాలంటే పొదలు కాలిపోవాల్సిందే' అంటున్న ఆదివాసీలు
- ‘47 ఏళ్ల ఈ వ్యక్తి జేఎన్‌యూ విద్యార్థి.. 32 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు’ నిజమేనా? - BBC Fact Check
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








