బ్యాంకు ఖాతాల అటాచ్‌మెంట్‌పై స్పందించిన మహేశ్ బాబు

ఫొటో సోర్స్, urstrulyMahesh/twitter
టాలీవుడ్ ప్రముఖ హీరో మహేశ్ బాబు బ్యాంకు ఖాతాను అటాచ్ చేశామని జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) హైదరాబాద్ కమిషనరేట్ గురువారం సాయంత్రం (27.12.2018) ఒక ప్రకటనలో తెలిపింది.
ఆ ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం...
2007-08 ఆర్థిక సంవత్సరానికి గాను మహేశ్ బాబు ప్రభుత్వానికి సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదు. ఆ ఏడాది వివిధ ఉత్పత్తుల ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ / అప్పియరెన్స్ మనీ / అడ్వర్టైజింగ్ మొదలైన వాటి ద్వారా ఆయన అందించిన సేవలకు (లభించిన మొత్తంపై) చెల్లించాల్సిన పన్నులు చెల్లించలేదు.
అప్పట్లో ఆ మొత్తం 18.5 లక్షల రూపాయలు.
గురువారం జీఎస్టీ డిపార్ట్‌మెంట్ యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల్లోని మహేశ్ బాబు ఖాతాలను అటాచ్ చేసింది. పన్ను, వడ్డీ, పెనాల్టీల రూపంలో 73.5 లక్షల రూపాయలు రికవరీ చేసేందుకు ఈ అటాచ్‌మెంట్ జరిపినట్లు జీఎస్టీ కమిషనరేట్ పేర్కొంది.

వివాదం ఏంటి?
టాలీవుడ్‌లో అగ్ర హీరో అయిన మహేశ్ బాబు 18.5 లక్షల రూపాయలను దాదాపు పదేళ్లుగా చెల్లించకపోవటం, దాని రికవరీకి జీఎస్టీ కమిషనరేట్ ఆయన బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయటం వెనుక కారణాలను కనుగొనేందుకు బీబీసీ తెలుగు ప్రయత్నించింది.
పేరు వెల్లడించకూడదనే షరతు కింద జీఎస్టీ విభాగం ఉన్నతాధికారి ఒకరు కొంత సమాచారం ఇచ్చారు.
మహేశ్ బాబు కొన్ని ఉత్పత్తుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఆయా ఉత్పత్తుల (కొనుగోళ్లను) ప్రోత్సహిస్తోంది కాబట్టి, ఆ మేరకు సదరు ఉత్పత్తుల తయారీ సంస్థ నుంచి తీసుకునే పారితోషకంపై సర్వీస్ ట్యాక్స్ కట్టాలని అధికారులు కోరారు.
అయితే, ఒక ప్రజాకర్షణ కలిగిన నటుడిగా తాను ఆయా ఉత్పత్తుల తయారీ సంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతున్నానని, అందుకు అవసరమైన ఏర్పాట్లు, ఖర్చులు వాళ్లే చూసుకుంటున్నారని, ఇందులో తాను సేవల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని మహేశ్ బాబు తరపు ప్రతినిధులు తెలిపారు.
జీఎస్టీ ఉన్నతాధికారి ఇచ్చిన సమాచారం మేరకు ఈ అంశంపై మహేశ్ బాబు ఛార్టర్డ్ అకౌంటెంట్ ఒకరు పన్ను వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై మహేశ్ బాబు ప్రతినిధి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ క్రమంలో కట్టాల్సిన పన్ను... దానిపై వడ్డీ, పెనాల్టీ మొత్తం కలిపి 73.5 లక్షల రూపాయలు అయ్యిందని అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
బ్యాంకు ఖాతాల అటాచ్‌మెంట్ అంటే ఏంటి?
ఒక వ్యక్తి ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉన్నప్పుడు, అతనికి చెందే సొమ్ము నుంచి (అది వ్యవస్థల వద్ద ఉన్నా, వ్యక్తుల వద్ద ఉన్నా) తమకు చెందాల్సిన మొత్తాన్ని తీసుకునేందుకు పన్నుల విభాగానికి అధికారాలు ఉన్నాయి.
ఆ అధికారాలను వినియోగించి.. సెక్షన్ 87 ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ 1994 ప్రకారం జీఎస్టీ కమిషనరేట్ బ్యాంకు ఖాతాలను అటాచ్ చేసింది. ఆయా ఖాతాల్లో ఉన్న సొమ్ము నుంచి తమకు రావల్సిన మొత్తాన్ని తీసుకునే వెలుసుబాటు పన్నుల విభాగానికి ఉంది.
మహేశ్ బాబు స్పందన ఏంటి?
కేంద్ర ప్రభుత్వం పరిధిలో విధులు నిర్వర్తించే జీఎస్టీ కమిషనరేట్ జారీ చేసిన పత్రికా ప్రకటనపై మహేశ్ బాబు లేదా ఆయన ప్రతినిధుల స్పందన తెలుసుకునేందుకు బీబీసీ తెలుగు ప్రయత్నించింది. కానీ, గురువారం వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
శుక్రవారం మహేశ్ బాబు లీగల్ టీం పేరిట ఒక పత్రికా ప్రకటన వెలువడింది.
‘‘జీఎస్టీ కమిషనరేట్, హైదరాబాద్ వారు, కోర్టు పరిధిలో ఉన్న 18 లక్షల 50 వేల రూపాయల పన్నుని వడ్డీతో కలిపి 73 లక్షల 50 వేల రూపాయలుగా నిర్ణయించి బ్యాంకు అకౌంట్ల నిలుపుదలకు ఆదేశించారు. 2007 - 08 ఆర్ధిక సంవత్సరానికి గాను అంబాసిడర్ సర్వీసెస్‌కి ఈ పన్ను చెల్లించాలని వారు నిర్ణయించారు. వాస్తవానికి ఆ కాలంలో అంబాసిడర్ సర్వీసెస్ ఎటువంటి టాక్స్ పరిధిలోకి రాదు. అంబాసిడర్ సర్వీసెస్‌ని టాక్స్ పరిధిలోకి సెక్షన్ 65 (105) (zzzzq ) ద్వారా 01 -07 -2010 నుండి చేర్చడం జరిగింది. టాక్స్ పేయర్ చట్టపరమైన అన్ని నియమాలకు లోబడే ఉన్నా, ఎటువంటి నోటీసు లేకుండా, పైగా ఈ విషయం ఇంకా కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ జీఎస్టీ కమిషనరేట్ బ్యాంకు అకౌంట్ల నిలుపుదలకు ఆదేశించడం జరిగింది. మహేష్ బాబు చట్టానికి కట్టుబడే పౌరునిగా తన పన్నులన్నిటినీ సక్రమంగా చెల్లించారు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- జీఎస్టీ రేట్ల తగ్గింపు జాబితా: దేనిపై ఎంత తగ్గిందంటే..
- రామ్ గోపాల్ వర్మ 'జీఎస్టీ'పై ఎందుకు అభ్యంతరం?
- పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి వస్తే ధర పెరుగుతుందా? తగ్గుతుందా?
- సొనాలీ బింద్రేకు క్యాన్సర్ ఎలా వచ్చింది
- ట్విటర్ ఫేక్ ఖాతాల ప్రక్షాళన: తెలుగు ప్రముఖుల ఫాలోవర్లలో అసలెందరో, నకిలీలెందరో తెలుసుకోండి
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- లబ్‌డబ్బు: జీఎస్టీకి ఏడాది.. ఇదీ దాని చరిత్ర
- చైనా బాహుబలి: వారం రోజులు కూడా ఆడని భారీ బడ్జెట్ సినిమా ‘అసుర’
- ‘లేడీస్ హాస్టల్ తలుపులు 24 గంటలు తెరుచుకుంటే...’
- ట్రిపుల్ తలాక్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన 4 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








