ఏపీలో రోజుకు పది మంది మహిళలు అదృశ్యమవుతున్నారు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్‌లో సగటున రోజుకు పది మంది మహిళలు కనిపించకుండా పోతున్నట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం..
ఈ ఏడాది ఇప్పటివరకూ 2169 మంది యువతులు, మహిళలు అదృశ్యమైనట్లు కేసులు నమోదయ్యాయి. వారిలో 40 శాతం మంది ఆచూకీ మాత్రమే దొరికింది. మిగతా వారి జాడ లేదు.
రాయలసీమ నుంచి ఈ ఏడాది 643 మంది మహిళలు గల్లంతయ్యారు. గత ఏడు నెలల్లో కనిపించకుండా పోయిన మహిళల్లో అత్యధికంగా 261 మంది అనంతపురం జిల్లాకు చెందిన వారే.
అనంతపురం జిల్లా తర్వాత గుంటూరులో అత్యధికంగా మహిళలు అదృశ్యమవుతున్నారు.
అయితే, కనిపించకుండా పోయిన వారంతా నేరాల బారిన పడినట్లేమీ కాదని పోలీసులు చెబుతున్నారు. ప్రేమలో పడి ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతులు కూడా వారిలో ఎక్కువగానే ఉంటున్నారని చెప్పారు.
వివాహేతర సంబంధాలతో, ఇంట్లో వాళ్లతో గొడవపడి వెళ్లే మహిళలూ ఉంటున్నారని.. వీరు ఇంటి నుంచి వెళ్లిపోగానే కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తారని, తిరిగి వచ్చిన సమాచారాన్ని మాత్రం చెప్పరని అంటున్నారు.

ఫొటో సోర్స్, KALVAKUNTLACHANDRASHEKARRAO/FB
దసరా తర్వాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణ !
దసరా పండుగ తర్వాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నట్లు సాక్షి దినపత్రిక ఓ వార్త రాసింది.
గవర్నర్ బదిలీ, బడ్జెట్ సమావేశాలు, బతుకమ్మ పండుగ వరుసగా వస్తుండటంతో పండుగ తర్వాతే విస్తరణ ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారని సాక్షి పత్రిక కథనం రాసింది.
ప్రస్తుతమున్న మంత్రివర్గంలో పెద్దగా మార్పుచేర్పులు లేకుండా మరో నలుగురు లేదా ఐదుగురికి అవకాశం లభించే సూచనలు ఉన్నాయి. దీనిపై కేసీఆర్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి హరీశ్‌రావును తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుంటారా, లేదా అన్న అంశం ఆసక్తికరంగా మారింది.
హరీశ్‌రావుకు చోటు కల్పించకుండా తాను ఒక్కడినే మంత్రివర్గంలో చేరితో విమర్శలు వస్తాయనే భావన కేటీఆర్‌లో ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ వద్ద కూడా కేటీఆర్ ప్రస్తావించినట్లు తెలిసింది.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌కు బెర్తులు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది.

ఫొటో సోర్స్, TWITTER/YSRCPARTY
'జనసేన కాదు.. టీడీపీ-2'
ఏపీ రాజధాని విషయంలో జనసేన పార్టీ టీడీపీ-2లా వ్యవహరిస్తోందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించినట్లు ఈనాడు దినపత్రిక ఓ కథనం రాసింది.
గత ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల అవినీతి జరిగినా నోరు మెదపని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఆ అవినీతిని తమ ప్రభుత్వం వెలికి తీస్తుంటే విమర్శలు చేస్తున్నారని బొత్స వ్యాఖ్యానించారు.
రాజధాని విషయంలో జరిగిన అవినీతిపై నిజానిజాలు తేలాకే మిగిలిన అంశాల గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు.
''దోపిడీలో ప్రధాన భాగస్వాములందరికీ ఆందోళన సహజంగానే ఉంటుంది. జనసేన వైఖరి చూస్తుంటే ఆ పార్టీ దోపిడీలో పాలుపంచుకుందా? అన్న సందేహం కలుగుతోంది. ఏ విషయంలోనూ తెదేపాను ఎన్నడూ ప్రశ్నించని జనసేన ఇప్పుడు ఎందుకు మాట్లాడుతోంది'' అని బొత్స అన్నారు.

ఫొటో సోర్స్, facebook/BhattiVikramarkaMallu
‘మిడ్ మానేరుకు చేరిన నీళ్లు కాళేశ్వరానివి కావు’
మిడ్ మానేరుకు చేరుకున్నవి కడెం ప్రాజెక్టు నుంచి వచ్చిన నీళ్లని, కాళేశ్వరం జలాలు కాదని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించినట్లు వెలుగు దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.
కాళేశ్వరం నీళ్లు చేరడం వల్ల మిడ్ మానేరు గేట్లు ఎత్తినట్లు జరుగుతున్న ప్రచారం అబద్ధమని భట్టి అన్నారు. ఈ విషయంపై ఎవరితోనైనా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు.
మేడిగడ్డ నుంచి పంపింగ్ చేసిన నీరులో ఒక్క చుక్క కూడా మిడ్ మానేరుకు చేరుకోలేదని భట్టి వ్యాఖ్యానించారు.
‘‘మేడిగడ్డ నుంచి అన్నారంలోకి 12 టీఎంసీలు, అక్కడి నుంచి సుందిళ్లలోకి 6 టీఎంసీలు పంపింగ్ చేశారు. ఎగువన వర్షాలు కురిసి గోదావరికి వరద రావడంతో పంపింగ్ చేసిన నీటి కంటే ఎక్కువగా కిందకు వదిలేశారు. పంపింగ్ చేసిన నీళ్లు సుందిళ్లలోనే లేనప్పుడు ఆపైనున్న శ్రీపాద ఎల్లంపల్లిలో ఎలా ఉంటాయి?’ అని ఆయన ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి.
- పాక్ అధీనంలోని కశ్మీర్లో 'స్వాతంత్ర్యం' ఎంత?
- ఆర్ఎఫ్ఐడీ: రోజువారీ జీవితాల్లో భాగమైపోయిన ప్రచ్ఛన్న యుద్ధ కాలపు స్పై టెక్నాలజీ
- కశ్మీర్‌పై ట్రంప్ ఎందుకంత శ్రద్ధ చూపిస్తున్నారు?
- బంగ్లాదేశ్ వివాహ పత్రాల్లో 'కన్య' అనే మాటను తొలగించిన కోర్టు
- ప్రభాస్ 'సాహో' సినిమా ఏం చెప్పాలనుకుంది?
- కశ్మీర్‌కు వెళ్లేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు
- ప్రభాస్ సాహో సినిమాపై లార్గో వించ్ డైరెక్టర్ ఏమన్నారు? అభిమానులు ఎలా స్పందించారు? మధ్యలో అజ్ఞాతవాసిని ఎందుకు తెచ్చారు?
- ‘మా నాన్న ఒక గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








