'కశ్మీర్‌లో భూములు కొనలేం' :ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35ఎ సవరించాక జమ్మూ కశ్మీరులో యాపిల్స్ కొన్నట్లు ఆస్తులు కొనెయ్యొచ్చని సామాజిక మాధ్యమాల్లో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. దాంతో, నిజంగా భూతల స్వర్గమైన కశ్మీరులో రియల్ ఎస్టేట్ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే ఆసక్తి సర్వత్రా సామాన్య ప్రజల్లో నెలకొంది. నిజానికి జమ్మూ కశ్మీరులో భూముల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు అని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.
అసలక్కడ వ్యవసాయ, నివాసయోగ్య భూమి చాలా తక్కువ. మొత్తం కొండలే ఉంటాయి. మధ్యలో అక్కడక్కడా ఉన్న కొద్ది మైదాన భూములకు నీటి కొరత లేదు. శీతాకాలం మూడు నెలలు మినహాయిస్తే ఏడాది మొత్తం నదులు జోరుగా పారుతుంటాయి.
వాటి నీటిని కాలువల ద్వారా ప్రతీ ఎకరాకు పారే విధంగా వందల ఏళ్ల క్రితమే ఏర్పాట్లు చేశారు. దాంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో లాగే కశ్మీరులో వ్యవసాయ భూముల ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది.
కుంకుమ పండే భూములనైతే సామాన్యులు కొనలేరు. వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్‌గా మార్చడం ఇక్కడ ఖరీదైన వ్యవహారం. రియల్ ఎస్టేట్ పోర్టళ్లలో చూస్తే శ్రీనగర్‌లో ఇండిపెండెంట్ విల్లా ఖరీదు రూ.1.6 కోట్ల నుంచి మొదలవుతోంది. నగరం మధ్యలో ట్రిపుల్ బెడ్రూం అపార్ట్‌మెంట్ ఫ్లాట్ ఖరీదు 65-85 లక్షల మధ్య ఉంటోంది.
నిజానికి శ్రీనగర్ కన్నా చాలా పెద్దవైన హైదరాబాద్, బెంగళూరుల్లోనూ ఈ ధరలకు విల్లాలు, ఫ్లాట్లు దొరుకుతున్నాయి.
35ఎ ఎత్తేసిన తర్వాత వచ్చే కొనుగోలుదారులు కూడా మెట్రో నగరాల ధరలతో శ్రీనగర్ ఆస్తుల ధరలను పోల్చుకుంటారు. ఈ నేపథ్యంలో శ్రీనగర్ రియాల్టీలో ఇప్పటికిప్పుడు కొత్తగా వచ్చే బూమ్ ఏమీ ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం శ్రీనగర్‌లో అమ్మకందారులదే పైచేయిగా ఉంది. కొందామనుకొనే వారికి అందుబాటులో తగినన్ని ఇళ్లు లేవు. భూముల రికార్డులు సరిగా లేవు. కాబట్టి స్థానికు ల సాయం లేకుండా ఆస్తులు కొనడం కూడా కష్టమే.
జమ్మూలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ ప్రజల డిమాండ్‌ను బట్టి రూ.40-45 లక్షల్లో చిన్న చిన్న ఇళ్ల నిర్మాణం ఇప్పుడిప్పుడే ఉపందుకుంటోంది. జమ్మూ కశ్మీరులో భూముల ధరలు పేదలు కొనే పరిస్థితిలో లేకపోవడంతో వారు ఎక్కువగా కొండవాలుల్లో ఇళ్లు నిర్మించుకుంటున్నారు.
ఇప్పుడు సంపన్నులు కూడా కొండవాలుల్లో ఇళ్లు నిర్మించుకోవడానికి ఇష్టపడుతున్నారు. శ్రీనగర్, జమ్మూ శివార్లలో ఇతర రాష్ట్రాల్లోని టూ టైర్ నగరాల ధరల్లో ఫ్లాట్లు దొరుకుతున్నాయి. ఇవే భవిష్యత్తు పెట్టుబడిదారులకు ఆశలు కల్పిస్తున్నాయని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, kcr/fb
దర్శకత్వం మీది.. నిర్మాణ బాధ్యత నాది
ఉన్నత విలువలతో కూడిన ఎన్నో గొప్ప చిత్రాలు తీసిన దర్శకుడు విశ్వనాథ్ ఆధ్వర్యంలో సమాజానికి మంచి సందేశం అందించే మరోచిత్రం రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారని నమస్తే తెలంగాణ పేర్కొంది.
విశ్వనాథ్ దర్శకుడైతే, నిర్మాణపరమైన విషయాలు తాను చూసుకుంటానని కేసీఆర్ మాటిచ్చారు. ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని కే విశ్వనాథ్ నివాసానికి కేసీఆర్ మర్యాదపూర్వకంగా వెళ్లారు. ఆయన ఆరోగ్యపరిస్థితి గురించి వాకబు చేశారు.
విశ్వనాథ్, ఆయన భార్య జయలక్ష్మి, కొడుకు రవీంద్రనాథ్, కోడలు గౌరి, దర్శకుడు ఎన్ శంకర్ తదితరులు సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ దంపతులను సీఎం సన్మానించారు. విశ్వనాథ్ కుటుంబసభ్యులు కూడా ముఖ్యమంత్రిని సన్మానించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, విశ్వనాథ్ మధ్య సినిమాలు, భాష, సాహిత్యం తదితర అంశాలపై గంటకుపైగా ఆసక్తికరమైన చర్చ జరిగింది.
‘నేను మీ అభిమానిని. చిన్నప్పటి నుంచి మీ సినిమాలంటే చాలా ఇష్టం. మీరు తీసిన ప్రతి సినిమా చూశా. శంకరాభరణం అయితే 25 సార్లకు పైగా చూసి ఉంటా. దాదాపు అన్ని సినిమాలు అలాగే చూశా. సినిమా చూసిన ప్రతీసారి మిమ్మల్ని ఓసారి కలవాలనిపించేది. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరింది. మీరు తీసే ప్రతి సినిమా ఓ కావ్యంలాగా ఉంటుంది. మీరు సినిమాలను తపస్సుతో తీస్తారు. అందులో వాడే భాషగానీ, పాటలుగానీ, కళాకారుల ఎంపికగానీ, సన్నివేశాల చిత్రీకరణగానీ, సంభాషణలు గానీ ప్రతిదీ గొప్పగా ఉంటుంది.
కుటుంబమంతా కూర్చుని చూసేలా ఉంటాయి. అందుకే ఇప్పటికీ వీలు దొరికితే మీ సినిమాలు చూస్తాను. మీపై ఉన్న అభిమానమే నన్ను మీ దగ్గరకి తీసుకొచ్చింది. మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని సీఎం అన్నారు. మీ సినిమాలు రాక పదేండ్లయింది. సందేశాత్మక, గొప్ప సినిమాలు ఈ మధ్య రావటంలేదు. మీరు మళ్ళీ సినిమా తీయాలి. సహాయకుల ద్వారా మీ మార్గదర్శకత్వంలో సినిమా తీద్దామంటే నిర్మాణ బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్ధం. దయచేసి దీనికోసం ప్రణాళిక సిద్ధం చేయండి’ అని కేసీఆర్ కోరారు.
తన అజ్ఞాత అభిమానిగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇంటికి వచ్చివెళ్లారని అనంతరం విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మర్యాదపూర్వకంగానే కలిశారని చెప్తూ.. సీఎం కేసీఆర్ తన ఇంటికి రావడం అంటే కుచేలుడి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చినట్లుగా ఉన్నదని చెప్పారని నమస్తే తెలంగాణ వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
కరెంటు దండి.. ఫీడర్లే మొండి
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్తు వ్యవస్థలో వింత పరిస్థితులు వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. ఓ పక్క రాష్ట్రంలో తగినంత విద్యుత్తు ఉత్పత్తి ఉంది.. ఎక్కడా కరెంటు కోతల్లేవని డిస్కంలు పేర్కొంటున్నాయని ఈనాడు తెలిపింది.
రోజుకు 148 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే.. అందుకు అనుగుణంగా సరఫరా ఉందంటున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు, ఫీడర్ల నిర్వహణ లోపాలతో కోతలు తప్పటం లేదు. దీంతో కొన్నిసార్లు గ్రామాలకు గ్రామాలు రాత్రి వేళల్లో చీకట్లో గడపాల్సి వస్తోంది. గ్రామాల్లో సమస్య తీవ్రంగా ఉందని డిస్కంల నివేదికలే సూచిస్తున్నాయి.
డిస్కంల పరిధిలో కనీసం రోజూ 300 నుంచి 400 ఫీడర్ల పరిధిలో విద్యుత్తు సరఫరాకు ఇబ్బంది ఏర్పడుతోంది. బుధవారం దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) పరిధిలో 200 ఫీడర్ల పరిధిలోని గ్రామాలకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం తలెత్తింది.
తూర్పు విద్యుత్తు పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) పరిధిలో 112 ఫీడర్ల పరిధిలో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం పరిధిలోని యనమలదొడ్డి సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు నిత్యం పగటి వేళల్లో గంటసేపు విద్యుత్తు సరఫరా ఉండటం లేదు. రాత్రి వేళల్లోనూ అంతరాయాలు తలెత్తుతున్నాయి.
సరఫరాకు అంతరాయం తలెత్తితే సమస్యను పరిష్కరించాల్సిన జూనియర్ లైన్‌మెన్ పోస్టులు ఎస్పీడీసీఎల్ పరిధిలో 5 వేలు, ఈపీడీసీఎల్ పరిధిలో 3 వేలు ఖాళీగా ఉన్నాయి.
జేఎల్‌ఎం పనులనూ సహాయ లైన్‌మెన్, లైన్‌మెన్‌లు పర్యవేక్షిస్తుండటంతో ఒక్కొక్క లైన్‌మెన్ సుమారు 10-15 గ్రామాల పరిధిలో సమస్యలను పరిష్కరించాల్సి వస్తోంది. పరిధి ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కడైనా విద్యుత్తు సమస్య తలెత్తితే సరఫరా పునరుద్ధరణకు గంటల కొద్దీ ఎదురుచూడాల్సి వస్తోందని ఈనాడు వెల్లడించింది.

ఫొటో సోర్స్, UTTAM KUMAR REDDY/FACEBOOK
'తెలంగాణ' ఆమోదయోగ్యం కాదా?
తెలంగాణ ఏర్పాటు మీకు ఆమోద యోగ్యం కాదా..? అంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర హోంమంత్రిని ప్రశ్నించారని సాక్షి తెలిపింది.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై హోంమంత్రి అమిత్ షా పదే పదే విమర్శిస్తూ వ్యాఖ్యానించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆదివారం మధ్యాహ్నం ఇక్కడి ఏఐసీసీ కార్యాలయంలో ఆయన పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు బోస్ రాజు, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, పార్టీ నేత మహేశ్ గౌడ్ తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు.
'రాహుల్ గాంధీ అత్యంత క్లిష్ట సమయంలో నాయకత్వం వహించి కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచారు.
రాజీనామా చేసిన నేపథ్యంలో వారి సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా రావడాన్ని స్వాగతిస్తున్నాం. తెలంగాణ ప్రజల హృదయాల్లో సోనియాగాందీకి ప్రత్యేక స్థానం ఉంది.
మొన్న జరిగిన లోక్‌సభ సమావేశాల్లో హోంమంత్రి మాట్లాడిన తీరు నిర్ఘాంతపరిచింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను విమర్శించడం ఆశ్చర్యపరిచింది. రాష్ట్ర ఏర్పాటులో హోం శాఖ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వ్యక్తిగా చెబుతున్నా.. కాశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ సందర్భం లో తెలంగాణ ప్రక్రియను విమర్శించారు.
తెలంగాణ ఏర్పాటుపై 2009 డిసెంబర్‌లోనే హోం మంత్రి ప్రకటించారు. అఖిలపక్ష సమావేశాలు జరిపారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేసి సంప్రదింపులు జరిపారు. అందరితో చర్చించిన తర్వాతే తెలంగాణ ఏర్పాటు చేసిన సంగతి హోంమంత్రికి తెలియాలి. దర్వాజాలు బంద్ చేసి తెలంగాణ ఇచ్చారని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఏ బిల్లు పెట్టినా ఓటింగ్ జరిపే సమయంలో తలుపులు మూసేస్తారు..'అని చెప్పారని సాక్షి పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- చెన్నై వాటర్‌మ్యాన్: ఆయన నల్లా తీసుకోరు... నీళ్ళు కొనుక్కోరు
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా శ్రీనగర్‌లో నిరసనలు.. అలాంటిదేమీ లేదన్న ప్రభుత్వం
- కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ
- టార్డిగ్రేడ్స్: చందమామపై చిక్కుకుపోయిన వేలాది 'మొండి' జీవులు.. ముప్పై ఏళ్ల తర్వాత నీటి తడి తాకినా బతికేస్తాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








