ఆర్టికల్ 370 సవరణ: ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారా?

అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చుతూ, కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం జమ్ము, కశ్మీర్‌కు వర్తించే ఆర్టికల్ 370ను సవరించింది.

అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానం ముందు సవాలు చేయవచ్చా? అన్న ప్రశ్నపై న్యాయ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఈ అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం ముందు సవాల్ చేయడం కుదరకపోవచ్చునని మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ (ఎఎస్‌జీ), సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాది, వికాస్ సింగ్ అన్నారు.

"ఆర్టికల్ 370, ఆర్టికల్ 35Aలను సవరించాలన్న ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోకి వస్తుంది. ఈ నిర్ణయాన్ని సవాలు చేయవచ్చని నేను అనుకోను. దీనిపై సవాలు చేసే అవకాశం లేదు. అది న్యాయబద్ధం కాదు" అని లీగల్ రిపోర్టర్ సుచిత్రా మొహంతీతో వికాస్ సింగ్ చెప్పారు.

కశ్మీర్ వివాదం, స్వీట్లు పంచుకుంటున్న అమ్మాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పలువురు సంబరాలు చేసుకున్నారు

అదొక తాత్కాలిక వెసులుబాటు మాత్రమేనని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆ తాత్కాలిక వెసులుబాటును ప్రభుత్వం తొలగించింది. దీంతో జమ్ము, కశ్మీర్ ప్రజలు తమ ప్రాథమిక హక్కులకు సంబంధించిన ప్రయోజనాలన్నింటినీ, భారత రాజ్యాంగంలో పొందుపరచిన ఇతర ప్రయోజనాలను పొందుతారని ఆయన వివరించారు.

"ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇక నుంచి దేశంలో అందరికీ సమాన సౌకర్యాలు లభిస్తాయి" అని వికాస్ సింగ్ బీబీసీతో అన్నారు.

అయితే, వికాస్‌ అభిప్రాయంతో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ (ఎఎస్‌జీ) కేసీ కౌశిక్ ఏకీభవించడంలేదు. ఆర్టికల్‌ 370 సవరణను అత్యున్నత న్యాయస్థానం ముందు సవాల్ చేయొచ్చని ఆయన అంటున్నారు.

"తప్పకుండా ఎవరో ఒకరు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తారు. ప్రస్తుత సమయంలో ఏ పార్టీ, ఏ వ్యక్తి దానిని సవాల్ చేస్తారన్నది నేను చెప్పలేను. కానీ, కొంత కాలం తర్వాత తప్పకుండా సవాల్ చేస్తారు" అని కౌశిక్ బీబీసీతో చెప్పారు.

ప్రభుత్వ ఆదేశం లేదా, నోటిఫికేషన్ పట్ల అసంతృప్తి ఉంటే దేశంలోని ఏ పౌరుడైనా, సంస్థ అయినా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అని రాజ్యాంగంలో స్పష్టంగా రాతపూర్వకంగా ఉందని ఆయన అన్నారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Bjp

కౌశిక్ బీబీసీతో మాట్లాడుతూ... "నా దృష్టిలో బీజేపీ ప్రభుత్వం వేసింది చాలా మంచి అడుగు. అయితే, ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు వాటిని ఎప్పుడు, ఎలా అమలు చేస్తామన్నదాని విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది" అని చెప్పారు.

"ఈ సోమవారం చరిత్రాత్మకమైన రోజు అని, 1950 నుంచి ఇన్నేళ్లుగా జరగని పని ఇప్పుడు సాధ్యమైంది" అని అంతర్జాతీయ న్యాయవాది, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు జూనియర్ అయిన డాక్టర్. సూరత్ సింగ్ బీబీసీతో అన్నారు.

ఈ నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం ఉంటుందా? అన్నదానిపై ఆయన తన అభిప్రాయాన్ని చెప్పలేదు. ఈ నిర్ణయం పట్ల సానుకూలంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

"దేశ ఏకీకరణ కోసం ఇలాంటి అడుగు చాలా ముఖ్యం. ఇలాంటి పనులు చేయాలంటే రాజకీయ సంకల్పం అవసరం. అది ఇప్పుడు జరిగింది. దీనికి ఎలాంటి రాజ్యాంగపరమైన అడ్డంకీ లేదు" డాక్టర్ సింగ్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)