నైరుతి రుతుపవనాలు ఏపీ, తెలంగాణల్లోకి ఎప్పుడొస్తాయి?

ఫొటో సోర్స్, Getty Images
నైరుతి రుతుపవనాలు దాదాపు వారం ఆలస్యంగా ఈ నెల 8న శనివారం కేరళ తీరాన్ని తాకాయి. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఎప్పుడు రావొచ్చు?
గత మూడునాలుగు రోజుల్లో కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌తోపాటు కేరళలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది.
సోమవారానికల్లా లక్షదీవులు, కేరళ అంతటా నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించే అవకాశాలున్నాయని వెల్లడించింది.
శనివారం పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, కోస్తాంధ్ర, యానాం, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక దక్షిణ ప్రాంతంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.
విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఇవి రుతుపవనాల ఆగమనానికి ముందు పడే వానలు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ నెల 11లోగా దక్షిణ కోస్తాంధ్రకు, 15లోగా ఉత్తర కోస్తాంధ్రకు రుతుపవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు దాదాపు సాధారణంగా ఉంటాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఆగస్టు, సెప్టెంబరులోనే ఎక్కువ వర్షపాతం'
ఈసారి కేరళకు వారం ఆలస్యంగా రుతుపవనాలు వచ్చాయని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కూడా ఆలస్యమవుతుందని విశాఖపట్నంకు చెందిన వాతావరణ నిపుణుడు భానుకుమార్ చెప్పారు. రుతుపవనాల ఆలస్యానికి వాతావరణ మార్పులే కారణమన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రుతుపవన వర్షపాతం జూన్, జులై మాసాల్లో కంటే ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఎక్కువగా ఉంటుందని ఆయన బీబీసీతో చెప్పారు.
వర్షపాతం సాధారణం: ఐఎండీ
నైరుతి రుతుపవన కాలం జూన్ నుంచి సెప్టెంబరు.
దేశంలో నైరుతి రుతుపవన వర్షపాతం ఈ సంవత్సరం దాదాపు సాధారణంగా ఉండే అవకాశముందని ఏప్రిల్ 15న విడుదల చేసిన అంచనాల్లో ఐఎండీ తెలిపింది.
లాంగ్ పీరియడ్ యావరేజ్(ఎల్‌పీజీ)లో 96 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముందని చెప్పింది. ఈ అంచనా ఐదు శాతం మేర అటూ ఇటూ కావొచ్చని పేర్కొంది.

ఫొటో సోర్స్, www.imd.gov.in
దేశంలో 1951 నుంచి 2000వ సంవత్సరాల మధ్య నైరుతి రుతుపవనాల సీజన్ వర్షపాతం ఎల్‌పీఏ 89 సెంటీమీటర్లుగా ఉందని ఐఎండీ తెలిపింది.
ఎల్‌పీఏలో 96 శాతం నుంచి 104 శాతం వరకు వర్షపాతాన్ని 'దాదాపు సాధారణ వర్షపాతం'గా ఐఎండీ పరిగణిస్తుంది. ఎల్‌పీఏలో 90 నుంచి 96 శాతం వరకు వర్షపాతాన్ని సాధారణం కంటే తక్కువ వర్షపాతంగాను, ఎల్‌పీఏలో 90 శాతం కంటే తక్కువ వర్షపాతాన్ని లోటు వర్షపాతంగాను పేర్కొంటుంది.
రానున్న 24 గంటల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్భ(మహారాష్ట్ర), ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడొచ్చని 'స్కైమెట్' సంస్థ ఆదివారం మధ్యాహ్నం తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- రంగుల జెర్సీలు ఎలా వచ్చాయి... వాటి నంబర్ల వెనుక కథేంటి... శ్రీలంక జెర్సీ ఎందుకంత ప్రత్యేకం
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- క్రికెట్ వరల్డ్ కప్ 2019: పోటీ ఈ మూడు జట్ల మధ్యే ఉంటుందా?
- ఫ్యాక్ట్ చెక్: బీరు దొరకట్లేదని కేసీఆర్కు బ్యాలెట్ బాక్సు ద్వారా లేఖ నిజమేనా?
- ఒంగోలు గిత్తల కథ: ఇక్కడ అరుదై పోయాయి.. బ్రెజిల్లో వెలిగిపోతున్నాయి
- షోరూంలో వస్తువులు కొని, క్యారీ బ్యాగ్ కోసం డబ్బులిస్తున్నారా, ఇకపై ఇవ్వొద్దు
- ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణ మందిరంలోకి భారత యుద్ధ ట్యాంకులు ప్రవేశించగానే ఏం జరిగింది
- ప్రతాప్ చంద్ర సారంగి: సాధారణంగా కనిపించే ఈయన గతం వివాదాస్పదమే
- ఆంధ్రప్రదేశ్ కొత్త మహిళా మంత్రులు వీరే
- మహిళలకు భావప్రాప్తి కలిగిందో లేదో పట్టించుకోనవసరం లేదా - అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










