పవన్ కల్యాణ్: మేం ఓడిపోలేదు.. గెలిచాం - ప్రెస్ రివ్యూ

పవన్

ఫొటో సోర్స్, Janasena

సార్వత్రిక ఎన్నికల ఫలితాన్ని ఓటమిగా కాకుండా, ఒక అనుభవంగా తీసుకుంటున్నానని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించినట్లు ఈనాడు దినపత్రిక ఓ వార్తా కథనం రాసింది.

నాలుగేళ్ల పార్టీకి ఇన్ని లక్షల ఓట్లు రావడాన్ని విజయంగా భావిస్తున్నామని, తమ పార్టీని ఎదగనివ్వకూడదని కొన్ని బలీయమైన శక్తులు పని చేయడంతో ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు చూడాల్సి వచ్చిందని పవన్ అన్నారు.

తుది శ్వాస వరకు పార్టీని ముందుకు నడిపిస్తానని చెప్పారు.

ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు చోట్లా సమయాభావం వల్ల పూర్తి స్థాయిలో ఓటర్లను కలుసుకోలేకపోయినట్లు చెప్పారు.

పార్టీ భావజాలం, నిర్ణయాలను కార్యకర్తలకు చేరవేసేందుకు జనసేన పార్టీ పక్ష పత్రికను తీసుకు వస్తున్నట్లు పవన్‌ వెల్లడించారు. సెప్టెంబరులో దీని తొలి సంచిక విడుదలవుతుందని పేర్కొన్నారు.

ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన.. ప్రస్తుత రాజకీయ వ్యవహారాల కమిటీ గడువు ముగిసిందని, త్వరలోనే నూతన కమిటీని ఏర్పాటు చేస్తామని వివరించారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణ అసెంబ్లీ, మండలికి కొత్త భవనాలు..

తెలంగాణ శాసనసభ, శాసన మండలిలకు సమీకృత భవన సముదాయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ సాక్షి దినపత్రిక ఓ కథనం రాసింది.

ప్రస్తుత అసెంబ్లీ భవన సముదాయం చూడటానికి ఘనంగా కనిపించినా, చట్టసభలకు సరైన వసతులు లేవని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు.

పాత అసెంబ్లీ భవనం సరిగా లేకపోవడంతో ఎన్టీఆర్ హయాంలో ఈ సముదాయంలో ఓ భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఇందులోనే తెలంగాణ అసెంబ్లీ కొనసాగుతోంది. శాసన మండలికి ప్రత్యేక భవనం లేకపోవడంతో జూబ్లీహాల్‌ను మండలి భవనంగా మార్చారు.

సచివాలయానికి పెద్ద స్థాయిలో కొత్త భవనాన్ని నిర్మించబోతున్నందున, చట్టసభలకు కూడా అదే స్థాయిలో భవనాలు నిర్మించాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు. అనువైన స్థలాలు గుర్తించి నివేదిక ఇవ్వాల్సిందిగా రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు.

పబ్లిక్‌ గార్డెన్, ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ వ్యాధుల ఆసుపత్రి ప్రాంగణం, ఇర్రమ్‌ మంజిల్‌ ప్యాలెస్‌ తదితర ప్రదేశాలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నగరు శివార్లలో నిర్మించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు.

జగన్

ఫొటో సోర్స్, ysrcp

ఏపీలో రబీ నుంచే రైతు భరోసా.. అక్టోబర్ 15 నుంచి ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది రబీ నుంచే 'రైతు భరోసా' కార్యక్రమాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ వార్తలో పేర్కొంది.

ఎన్నికల హామీ ప్రకారం ఏటా రైతులకు రూ.12,500 ఇచ్చే ఈ పథకాన్ని అక్టోబరు 15 నుంచి పెద్ద ఎత్తున ప్రారంభిస్తామని వైఎస్ జగన్ చెప్పారు.

వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన 'అన్నదాతా-సుఖీభవ' పథకాన్ని రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు.

వైసీపీ మేనిఫెస్టో ప్రకారం వచ్చే ఏడాది ఖరీఫ్‌ నుంచి 'రైతు భరోసా' అమలు చేయాల్సి ఉంది. అయితే, ఈ ఏడాది అక్టోబరులో రబీ సీజన్‌ నుంచే అమలు చేస్తామని సీఎం తెలిపారు.

కర్నూలు జిల్లా తంగడంచలో చేపట్టిన మెగా సీడ్‌ పార్కు కార్యకలాపాలు ప్రస్తుతానికి నిలిపివేసి, ఇంకా మేలైన ఆలోచనలు చేయాలని అధికారులకు ఆయన సూచించారు.

వ్యవసాయ అనుబంధ శాఖల్లో గతంలో అమలు చేసిన అనేక పథకాలను పునఃసమీక్షించాలని, నిధుల మళ్లింపులపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లంను జగన్‌ ఆదేశించారు.

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు అవసరమైతే 'విత్తన చట్టం' తెస్తామని, పంటలకు కనీస మద్దతు ధర సంపూర్ణంగా అందేలా, రూ.3వేల కోట్లతో మార్కెట్‌ స్థిరీకరణ నిధిని బడ్జెట్‌లో ప్రవేశపెడతామని తెలిపారు.

ప్రమాదవశాత్తు చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.7లక్షల బీమా ఉచితంగా ఇస్తామని, కౌలు రైతులకు ప్రయోజనాలన్నీ అందిస్తామని చెప్పారు.

డెయిరీలకు పాలు సరఫరా చేసే రైతులకు లీటరుకు రూ.4బోన్‌సగా ఇవ్వాలని ఆదేశించారు.

అన్నదాతా-సుఖీభవ పథకాన్ని రద్దు చేయడంతో.. ఈ పథకం కింద ఇంకా నగదు జమ కావల్సి ఉన్న సుమారు 5లక్షల మంది రైతులకు ఇక ఆ ప్రయోజనం అందదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

జైలు

ఫొటో సోర్స్, Getty Images

జైల్లో ఖైదీల విందు.. సోషల్‌మీడియాలో ఫొటోలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ జైల్లో ఖైదీలు విందు చేసుకుని, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టారని పేర్కొంటూ నవతెలంగాణ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

ప్రయాగ్‌రాజ్‌లోని ఓ జైల్లో నేరస్థులు మాంసాహారం, మద్యంతో పార్టీ చేసుకున్నారు. జూదం ఆడారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు జైలు ఉన్నతాధికారి చంద్రప్రకాశ్ తెలిపారు.

ఖైదీలకు సెల్‌ఫోన్, మాంసం, మద్యం ఎలా వచ్చాయన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, వారికి సహకరించిన సిబ్బందిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)