తెలంగాణలో 17 జైళ్ల మూసివేత.. సత్ఫలితాలిస్తున్న సంస్కరణలు - ప్రెస్‌ రివ్యూ

తెలంగాణ జైలు

ఫొటో సోర్స్, Telangana prisons/fb

తెలంగాణలో జైళ్లశాఖ చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. దీంతో జైళ్లలో ఖైదీల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని ఈనాడు ఒక కథనంలో పేర్కొంది.

ఓవైపు కొత్త జైళ్లు నిర్మించేందుకు నిధులు కావాలంటూ దేశంలోని మిగతా రాష్ట్రాలు కేంద్రాన్ని అడుగుతుంటే తెలంగాణలో మాత్రం ఉన్నవే ఖైదీలు లేక మూతపడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 17 జైళ్లు మూసివేశారు. ఈ సిబ్బందిని మిగతా జైళ్లకు మళ్లించడంతో ఖైదీలపై మరింత శ్రద్ధపెట్టే అవకాశం ఏర్పడింది.

తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 66,933 మంది రిమాండ్ ఖైదీలు, 13,364 మంది శిక్షపడ్డ ఖైదీలు అంటే మొత్తం 80,297 మంది ఉండేవారు. 2018 నాటికి 43,823 మంది రిమాండ్, 11,463 శిక్షపడ్డ ఖైదీలు కలిపి వీరి సంఖ్య 55,286కు తగ్గింది. అంటే నాలుగేళ్ల కాలంలో 25,011 మంది ఖైదీలు తగ్గారు.

జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌‌సీఆర్‌‌బీ) వద్ద అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2014లో అన్ని జైళ్లలో 4,14,396 మంది ఖైదీలు ఉంటే, 2016 నాటికి 4,28,741కు పెరిగారు. అంటే దేశవ్యాప్తంగా ఖైదీల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.

తెలంగాణ జైళ్లశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు విద్యాదానం పథకం చేపట్టారు. జైలుకు వచ్చిన ఖైదీ కనీసం సంతకం పెట్టగలిగేలా చేయాలన్నది దీని లక్ష్యం. ఒక్క 2018లోనే 18,675 మంది దీని ద్వారా శిక్షణ పొందారు. ఇప్పటి వరకు 1.25 లక్షల మందిని ఇలా అక్షరాస్యులుగా మార్చారు.

అక్షరాస్యత కారణంగా ఖైదీల్లో అవగాహన పెరిగి మళ్లీ నేరబాట పట్టకుండా ఏదోఒక ఉపాధి చూసుకునే అవకాశం ఏర్పడుతోంది. అలాగే ఖైదీల్లో మానసిక పరివర్తన తెచ్చేందుకు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో ఉన్నతి పథకం ప్రవేశపెట్టారు. చాలామంది ఖైదీలకు వారి కుటుంబ సభ్యులతో సరైన సంబంధాలు ఉండవు. విడుదలై బయటకు వెళ్లినా కుటుంబ సభ్యులు ఆదరించరు. దాంతో ఖైదీలు మళ్లీ నేరాల బాట పడుతుంటారు. విడుదలైన ఖైదీని కుటుంబ సభ్యులు ఆదరించగలిగితే మళ్లీ నేరం చేసేందుకు వెనకాడుతాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నతి పథకం కింద ఖైదీలు, కుటుంబ సభ్యులకు మానసిక నిపుణులు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు.

అంతేకాక జైలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఎవరికాళ్లపై వారు నిలబడేలా అనేక వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నారు. అన్నింటికీ మించి విడుదలైన ఖైదీలకు జైళ్లశాఖ సిబ్బంది ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఇప్పటికే 200 మంది పెట్రోల్‌ బంకుల్లో పనిచేస్తున్నారు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి రోజుకు రూ.100, విడుదలైన ఖైదీకి కనీసం నెలకు రూ.12 వేల వేతనం ఇస్తున్నారు అని ఈనాడు తెలిపింది.

కేసీఆర్, జగన్

ఫొటో సోర్స్, kcr/fb

ఏపీ భవనాలు తెలంగాణకు కేటాయింపు

రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయినా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయిన వివాదాలను ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో పరిష్కరించుకునే దిశగా చకచకా అడుగులు పడుతున్నాయని సాక్షి తెలిపింది.

గత నెల 30న వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పరస్పరం సహకరించుకుందామని, ఏపీ ప్రగతికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు.

రాజ్‌భవన్‌లో శనివారం జరిగిన ఇఫ్తార్‌ విందు సందర్భంగా కూడా అధికారుల స్థాయిలో చర్చలు నిర్వహించి ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాలు నిరుపయోగంగా ఉన్న నేపథ్యంలో వాటిని తమకు అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసు విభాగానికి కొత్తగా ఒక భవనం, ఇతర కార్యాలయాలు నిర్వహించుకోవడానికి మరొక భవనం కేటాయించాలని అభ్యర్థించింది.

దీంతో గవర్నర్‌ తక్షణమే స్పందించి భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏపీ పోలీసు విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలకు మరొక భవనం కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 8 కింద తనకు సంక్రమించిన అధికారులను ఉపయోగించుకొని గవర్నర్‌ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న భవనాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం బకాయిపడిన ఆస్తి పన్నులు, ఇతర చార్జీలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేయాలని గవర్నర్‌ సూచించారు. అయితే ఈ భవనాల విలువను పరిహారంగా చెల్లించాలని ఏపీ ప్రభుత్వం కోరనుందని ఆ రాష్ట్ర అధికార వర్గాల ద్వారా తెలిసిందని సాక్షి వెల్లడించింది.

కేసీఆర్

ఫొటో సోర్స్, kcr/fb

‘ఇది సఫల తెలంగాణ’

ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ సఫల రాష్ట్రంగా పురోగమిస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారని నమస్తే తెలంగాణ పేర్కొంది.

ఒక రాష్ట్ర చరిత్రలో ఐదేళ్లు చిన్నకాలమే అయినా ప్రభుత్వం సాధించిన అసమాన విజయాల రీత్యా ఎంతో విలువైన కాలమని కేసీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరంతోపాటు రాష్ట్రంలో తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయితే రాష్ట్రంలో కరవు అనే మాట వినిపించదు.. కనిపించదని సీఎం తెలిపారు.

వచ్చేనెల చివరి నుంచి మేడిగడ్డ బరాజ్ నుంచి ప్రతిరోజు రెండు టీఎంసీల నీళ్లను ఎత్తిపోయనున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అవినీతికి ఎంతమాత్రం చోటులేకుండా కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చి పారదర్శకమైన పాలనను అందిస్తామన్నారు.

కాలంచెల్లిన చట్టాలకు చరమగీతం పాడతామని స్పష్టంచేశారు. ఆసరా పింఛన్లను జులై ఒకటి నుంచి రెట్టింపుచేస్తున్నామని సీఎం ప్రకటించారు.

సమీప భవిష్యత్తులో తెలంగాణ ప్రపంచంలోనే ధనిక రైతులకు చిరునామా కాబోతోందని, రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తున్న రూ.8 వేలను ఈ ఏడాది నుంచి రూ.10 వేలకు పెంచుతున్నామని తెలిపారు.

హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో ఆదివారం ఉదయం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో సీఎం జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు గన్‌పార్క్‌వద్ద అమరవీరుల స్తూపానికి పూలమాలవేసి, తెలంగాణ ఉద్యమంలో అమరులైనవారికి నివాళులర్పించారు. తర్వాత పబ్లిక్‌గార్డెన్స్‌లో పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారని నమస్తే తెలంగాణ వెల్లడించింది.

ఉపాధి హామీ పథకం

బిల్లులందక విలవిల

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టిన మాజీ సర్పంచులు బిల్లులందక అల్లాడిపోతున్నారు. గత ఏడు నెలలుగా కేంద్రం మెటీరియల్‌ కాంపోనెంట్‌ విడుదల చేయలేదు. ఇటీవల రూ.367 కోట్లు విడుదల చేస్తే.. ఆ మొత్తాన్ని అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కోసం చేసిన ఖర్చుకు జమ వేసుకుంది. దీంతో అప్పులు చేసి పనులు చేసిన ప్రజాప్రతినిధులు నెలల తరబడి బిల్లులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

గ్రామాల అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అప్పట్లో సర్పంచులు ఉపాధి హామీ పనులు చేయించడానికి ముందుకొచ్చారు. వారి పదవీకాలం పూర్తయినా.. చేసిన పనులకు బిల్లులు పొందలేని దుస్థితిలో ఉన్నారు. చొరవతో గ్రామాభివృద్ధికి ముందుకొస్తే.. అప్పులపాలయ్యామని వాపోతున్నారు.

సిమెంటు రోడ్లతో పాటు పాఠశాలల్లో ఆటస్థలాల అభివృద్ధి, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు చేపట్టారు. కొన్ని గ్రామాల్లో స్మశానాలను అభివృద్ధి చేసుకున్నారు. మరి కొన్ని గ్రామాలకు అవెన్యూ ప్లాంటేషన్‌ పేరుతో రోడ్డుకిరువైపులా మొక్కల పెంపకానికి పనులు మంజూరుచేశారు. వాటికీ గత ఆర్నెల్లుగా నిర్వహణ నిధులందలేదు. రైతులు వ్యక్తిగతంగా ఉద్యానవన పంటలు సాగుచేసుకుంటే.. వాటి నిర్వహణ వ్యయం ఇవ్వలేదు.

కొన్ని గ్రామ పంచాయతీల్లో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం షెడ్ల నిర్మాణాలు చేపట్టారు. వాటికి నిధుల్లేక కొన్ని చోట్ల అసంపూర్తిగా ఆగిపోయాయి. పనులు పూర్తి చేసిన కొందరు మాజీ సర్పంచ్‌లకు ఇప్పటికీ చెల్లించలేదు.

రాష్ట్రంలో గత ఏడాది పంచాయతీల్లో 7 వేల కిలోమీటర్లకు పైగా సిమెంటు రోడ్లను నిర్మించారు. ఇందుకోసం పంచాయతీలకు అందుతున్న 14వ ఆర్థిక సంఘం నిధులతో జోడించి ఉపాధి నిధుల ద్వారా చేపట్టేందుకు కలెక్టర్లు పనులు మంజూరుచేశారు. మరో 24 వేల కి.మీ. సిమెంటు రోడ్లు పనులు మంజూరు చేసినా.. వాటిని ప్రారంభించే సాహసం చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.

ఉపాధి హామీ పథకంలో వేతనాల కోసం చేసిన ఖర్చుకు అనుగుణంగా నిర్మాణ పనులు(మెటీరియల్‌) చేపట్టేందుకు కేంద్రం నిధులిస్తోంది. వేతనాల కోసం ఖర్చు చేసిన ప్రతి రూ.60కి అదనంగా రూ.40 నిర్మాణ పనుల కోసం ఖర్చు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,908 కోట్ల మేర ఉపాధి కూలీలకు పనులు కల్పించి వేతనాలు అందించారు. దాని ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రానికి మెటీరియల్‌ కాంపోనెంట్‌ రూపంలో రూ.3,272 కోట్లు అందించాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 25 శాతం పోను రూ.2,454 కోట్లు కేంద్రం చెల్లించాలి.

గత నెలలో కేవలం రూ.367 కోట్లే చెల్లించింది. రాష్ట్రానికి మొదట్లో కేటాయించిన లేబర్‌ బడ్జెట్‌ 20 కోట్ల పనిదినాలకు సంబంధించి మాత్రమే మెటీరియల్‌ కాంపోనెంట్‌ ఇస్తామని, అదనంగా కేటాయించిన పనిదినాలకు సంబంధించి ఇవ్వబోమని తేల్చి చెప్పింది. అయినా మన రాష్ట్రానికి ఇంకా రూ.1800 కోట్ల మెటీరియల్‌ కాంపోనెంట్‌ కేంద్రం నుంచి రావలసి ఉందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)