చంద్రబాబు నాయుడు మరో హరికిషన్ సింగ్ సూర్జిత్ అవుతారా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ప్రియాంకా దూబే
- హోదా, బీబీసీ ప్రతినిధి
మే 19న ఏడో దశ పోలింగ్ ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం చూస్తే.. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ సగటున 300 స్థానాల్లో మెజారిటీతో విజయం దిశగా వెళ్తున్నట్లుంది.
దీంతో విపక్ష దళాలన్నీ ఏకమయ్యేందుకు ఒక్కసారిగా రాజకీయ ఆతృత కూడా పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిల్లీలో కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీల నేతలను, లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ నేతలను, కోల్‌కతాలో మమతా బెనర్జీని కలుస్తున్న వార్తలు పదే పదే వినిపిస్తున్నాయి.
కానీ 17వ లోక్‌సభ చివరి స్వరూపాన్ని నిర్ణయించడంలో విపక్షాలు ఎంత కీలక పాత్ర పోషించగలవు అనేదే ఇక్కడ ప్రశ్న.
సీనియర్ జర్నలిస్ట్ స్మితా గుప్త మాత్రం ఫలితాలకు ముందు ఈ ఆతృతను.. చెదిరిపోయిన విపక్షాలన్నీ ఒక్కటయ్యేందుకు చేస్తున్న ప్రయత్నంగా చూస్తున్నారు.
బీబీసీతో మాట్లాడిన స్మిత "ఎన్డీయే వైపు చూస్తే బీజేపీ మిత్రపక్షాలన్నిటిలో ఒక ధీమా వచ్చింది. కానీ విపక్షాలన్నీ చెల్లాచెదురై ఉన్నాయి. ఫలితాలకు ముందు ఒక్కటయ్యేందుకు ఇవి ఎందుకు ప్రయత్నిస్తున్నాయంటే, గణాంకాలు బీజేపీకి అనుకూలంగా రాకుంటే విపక్షాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. దానికి సహచర పార్టీలన్నీ మొదట్నుంచే సిద్ధంగా ఉంటే, ఫలితాల తర్వాత ఏ రీజనల్ పార్టీకి ఎంత ప్రాధాన్యం ఉంది అనేది చూడాల్సిన అవసరం ఉండదు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హరికిషన్ సింగ్ సుర్జీత్‌తో పోలిక
మరోవైపు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్రాన్ ఖురేషీ విపక్షాలన్నింటినీ ఒక్కటి చేసేందుకు నేతృత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును హరికిషన్ సింగ్ సూర్జిత్‌తో పోల్చారు.
"చంద్రబాబు నాయుడు, ఒక విధంగా 1996లో సీపీఎం దివంగత నేత హరికిషన్ సింగ్ సూర్జిత్ నిర్వహించిన పాత్ర పోషిస్తున్నారు. సూర్జిత్ వల్లే అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. దానికి కాంగ్రెస్ మద్దతిచ్చింది. చంద్రబాబు నాయుడుకు కూడా 2019లో జరిగిన ఈ ఎన్నికలు 1996లాగే అనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆయన తన ఫెడరల్ ఫ్రంట్ కోసం విడిగా ప్రయత్నిస్తున్నారు. దీనిని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ స్థాయిలో తమ ముద్ర వేయాలనే ప్రయత్నంగా కూడా చూస్తున్నారు" అన్నారు.
ఇటు, రాజకీయ విశ్లేషకులు సంగీత్ రాగీ మాత్రం "బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్ అగ్ర నేతల్లోని వ్యక్తిగత ఆకాంక్షలు, వారి వ్యక్తిగత రాజకీయ అభద్రతాభావం వల్ల ఆ పార్టీలన్నీ ఒకే విపక్ష కూటమిలా ముందుకు రావడం కష్టం" అన్నారు.

ఫొటో సోర్స్, Pti
వ్యక్తిగత ఆకాంక్షలు
బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన "మూడో ఫ్రంట్‌లో మాయావతి ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ ఎప్పటికైనా కోరుకుంటుందని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే దేశంలో అధికారం చేజిక్కించుకోవడానికి ఉత్తర ప్రదేశ్ ఒక మార్గంగా ఉంది. ఉత్తర ప్రదేశ్‌లో ఏ అగ్రనేతైనా జాతీయ స్థాయి నేతగా ఆవిర్భవించడాన్ని కాంగ్రెస్ ఎప్పటికీ అంగీకరించదు. ఎందుకంటే మాయావతి జాతీయ స్థాయి నేత అయితే, కాంగ్రెస్ పార్టీ దళిత, ముస్లిం ఓటు బ్యాంకు ప్రమాదంలో పడుతుంది" అన్నారు.
"కాంగ్రెస్ ఒకవేళ మమతా బెనర్జీని విపక్ష కూటమి ముఖంగా ముందుకు తీసుకొస్తే మాయావతి దానికి ఎప్పటికీ అంగీకరించదు. విపక్ష కూటమి ముఖంగా ఒక నేత ఆవిర్భవిస్తే, వారు ఉత్తరప్రదేశ్ నుంచే ఉంటారు అనేది కచ్చితం. ఎందుకంటే అక్కడ అన్నిటికంటే ఎక్కువ స్థానాలు ఉన్నాయి. ఇంకొక లోపలి విషయం ఏంటంటే సమాజ్‌వాదీ పార్టీ స్వయంగా మాయావతి జాతీయస్థాయి నేతగా ఆవిర్భవించాలని కోరుకోదు. ఎందుకంటే మాయావతి ఒక్కసారి జాతీయ రాజకీయాల్లో అడుగుపెడితే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఎస్పీ పతనం అంచులకు చేరుకుంటుంది. ఉత్తర ప్రదేశ్‌లో కొత్తగా ఆవిర్భవించే ధ్రువాలు బీజేపీ, బీఎస్పీనే అవుతాయి".
కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత అక్కడ కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వం గురించి ప్రస్తావించిన స్మిత విపక్షాలన్నీ ఒక్కటై ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా అసాధ్యం కాదని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES/EPA/AFP
విపక్షాలకు ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమే
"విపక్షాల బలం అంతా మే 23న వారికి లభించే సీట్లపై ఆధారపడి ఉంటుంది. బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల ముఖ్య నేతలకు వారి వారి వ్యక్తిగత ఆకాంక్షల గురించి ప్రశ్నలు ఉంటాయి. కానీ దానితోపాటు చాలా ప్రశ్నల జవాబులు అతిపెద్ద పార్టీగా ఏది అవతరిస్తుందనేదానిపైనే ఆధారపడి ఉంటాయనేది కూడా మనం మర్చిపోకూడదు.
"మనం ఒకవేళ కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికలనే చూస్తే అక్కడ వేరే చిత్రం కనిపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ స్వయంగా పెద్ద పార్టీ అయినప్పటికీ బీజేపీయేతర సర్కారు కోసం అది జనతా దళ్ సెక్యులర్(జేడీఎస్)కు ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇచ్చింది. అప్పుడు కూడా కర్ణాటక ఫలితాలు రావడానికి ఒక్క రోజు ముందే కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ ఇద్దరూ సిద్ధంగా ఉన్నారు. బెంగళూరు చేరుకున్నారు. జేడీఎస్‌తో చర్చలు జరిపారు. అందుకే ఫలితాల తర్వాత బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినా జేడీఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగాయి. ఒకవేళ కాంగ్రెస్ కేంద్రంలో కూడా కర్ణాటక కథను పునరావృతం చేస్తే విపక్ష పార్టీలు కూడా ప్రభుత్వం తాము ఏర్పాటు చేయగలమని చెప్పవచ్చు".
ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనేది మే 23న స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ ప్రస్తుతానికి బీజేపీ, ఎన్డీయే పార్టీలు ఎగ్జిట్ పోల్‌లో ఆధిక్యం లభించడంతో మానసికంగా ధీమాగా కనిపిస్తున్నాయి. కానీ, విపక్షాలు కూడా ఇప్పుడప్పుడే ఓటమిని అంగీకరించేలా కనిపించడం లేదు.
ఇవి కూడా చదవండి:
- గాంధీ హత్యకు పది రోజుల ముందు గాడ్సే, ఆప్టే ఏం చేశారు...
- వివేక్ ఓబెరాయ్: ఐశ్వర్యారాయ్‌పై ట్వీట్ వివాదం, క్షమాపణలు కోరిన బాలీవుడ్ నటుడు
- చైనాలో వ్యభిచార వ్యాపారం.. సెక్స్ బానిసత్వంలో మగ్గిపోతున్న ఉత్తర కొరియా బాలికలు
- రాహుల్ గాంధీకి ఈ ఎన్నికలే అంతిమ పోరాటమా...
- ప్రధాని రేసులో చంద్రబాబు, కేసీఆర్: చరిత్ర పునరావృతం అవుతుందా?
- మోదీ, అమిత్ షాల తెగింపుకు అడ్డుకట్ట వేసి, వెనక్కు తగ్గేలా చేసిన నాథూరామ్ గాడ్సే
- హువావే: ఈ చైనా ఫోన్ల తయారీ సంస్థ ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద కంపెనీ ఎలా అయింది?
- అభిప్రాయం: చంద్రబాబు అంటేనే కూటమి రాజకీయాలు
- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం
- నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








