పీఎన్‌బీ కుంభకోణం: మేం కలిసినప్పుడు నీరవ్ మోదీ దిగ్భ్రాంతి చెందారు- బీబీసీతో జర్నలిస్టు బ్రౌన్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శశాంక్ చౌహాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన రూ.వేల కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వ్యాపారవేత్త నీరవ్ మోదీని లండన్ వీధుల్లో ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నించిన బ్రిటన్ పత్రిక 'ద టెలిగ్రాఫ్' సీనియర్ రిపోర్టర్ మైక్ బ్రౌన్‌తో బీబీసీ ఈమెయిల్ ఇంటర్వ్యూ చేసింది.
తాను ప్రశ్నలను పదే పదే అడిగినా నీరవ్ మోదీ 'నో కామెంట్' అనే మాట తప్ప ఏమీ మాట్లాడలేదని బ్రౌన్ తెలిపారు.
''మేం దగ్గరకు వెళ్లడంపై ఆయన దిగ్భ్రాంతి చెందినట్లు కనిపించారు. మనం ప్రశ్నిస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడానికి నిరాకరిస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ మనం చేయగలిగిందేమీ ఉండదు'' అని బ్రౌన్ చెప్పారు.
భారత్‌కు అప్పగింత గురించి, లండన్‌లో ఇంకెంత కాలం ఉండాలనుకొంటున్నారనేదాని గురించి, వ్యాపార భాగస్వాముల గురించి బ్రౌన్ మళ్లీ మళ్లీ అడిగినా, ''సారీ, నో కామెంట్'' అని మాత్రమే నీరవ్ మోదీ బదులిచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
లండన్ వీధుల్లో నడుస్తూ వెళ్తున్న నీరవ్ మోదీని ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్‌లో బ్రౌన్, ఆయన సహోద్యోగి ఒకరు వీడియో తీశారు. దీనిని ద టెలిగ్రాఫ్ పత్రిక ట్విటర్‌లో పెట్టింది.
రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ వీడియో మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నాయకులు దీనిని రీట్వీట్ చేశారు.
వీడియోలో నీరవ్ మోదీ ట్యాక్సీ కోసం ప్రయత్నిస్తూ కనిపించారు.
మధ్యాహ్న భోజన సమయంలో ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్‌లో ట్యాక్సీ దొరకడం చాలా కష్టమని బ్రౌన్ బీబీసీతో అన్నారు.
''ఈ వీడియోపై వస్తున్న స్పందన, ముఖ్యంగా భారత్‌లో వస్తున్న స్పందన చూసి నేను ఆశ్చర్యపోయా. నాకు సంతృప్తిగా కూడా అనిపించింది. భారత్‌లో నీరవ్ మోదీ విషయం ముఖ్యమైనదని తెలుసు. కానీ ఆయన వీడియోకు ఈస్థాయిలో స్పందన వస్తుందని అనుకోలేదు'' అని బ్రౌన్ వివరించారు.
ఈ వీడియోతోపాటు, లండన్‌లో నీరవ్ మోదీ ఏం చేస్తున్నారనే సవివర పరిశోధనాత్మక కథనాన్ని కూడా ద టెలిగ్రాఫ్ వెలువరించింది.

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/AFP/GETTY IMAGES
అది అనుకోకుండా జరగలేదు
నీరవ్ మోదీని బ్రౌన్ కలవడం అనుకోకుండా జరిగిందేమీ కాదు.
నీరవ్ మోదీపై తాను తొలిసారిగా నిరుడు డిసెంబరులో ద డైలీ టెలిగ్రాఫ్ మ్యాగజీన్‌లో కథనం రాశానని, అప్పట్నుంచి లండన్‌లో ఆయన ఆచూకీని కనుక్కొనేందుకు ఆసక్తితో ప్రయత్నిస్తూ వచ్చానని బ్రౌన్ చెప్పారు. ఆయన లండన్‌లో ఉంటున్నారనే వార్తలు గతంలోనే వచ్చినప్పటికీ, ఆయన జాడ అంత తేలిగ్గా తెలియలేదని వెల్లడించారు.
నీరవ్ మోదీ రోజూ ఆయన ఉండే అపార్టుమెంటు నుంచి ఒక కార్యాలయానికి వెళ్లి వస్తారని తెలిపారు. ఆ కార్యాలయం ఆయన వ్యాపారానికి సంబంధించినదని భావిస్తున్నామని పేర్కొన్నారు.
నీరవ్ మోదీ లండన్‌లోని వెస్ట్ ఎండ్ ప్రాంతంలో సుమారు రూ.72.9 కోట్ల ఖరీదైన మూడు పడకగదుల అపార్టుమెంట్లో ఉంటున్నారని, మళ్లీ కొత్తగా వజ్రాల వ్యాపారం చేస్తున్నారని బ్రౌన్, రాబర్ట్ మెండిక్ ద టెలిగ్రాఫ్‌లో రాసిన కథనంలో వెల్లడించారు.
ఆయన నివసించే ప్రాంతంలో నెలకు అద్దె 17 వేల పౌండ్ల (దాదాపు రూ.15.49 లక్షల) వరకు ఉంటుందని ద టెలిగ్రాఫ్ పేర్కొంది.
నీరవ్ మోదీ నుంచిగాని, ఆయన ప్రతినిధుల గురించిగాని ఎలాంటి స్పందనా రాలేదని బ్రౌన్ చెప్పారు.
విదేశీ వ్యవహారాలశాఖ స్పందన ఇదీ
ద టెలిగ్రాఫ్ వీడియోపై భారత విదేశీ వ్యవహారాలశాఖ స్పందిస్తూ- నీరవ్ మోదీని దేశానికి రప్పించేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడుతున్నామని చెప్పింది.
నీరవ్ మోదీ లండన్‌లో ఉన్నారనే విషయం భారత ప్రభుత్వానికి తెలుసని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ దిల్లీలో మీడియాతో చెప్పారు. ''ఆయన్ను భారత్‌కు అప్పగించాలని బ్రిటన్‌ను కోరామంటే దాని అర్థం ఆయన అక్కడ నివసిస్తున్నారనే విషయం మాకు తెలుసనే'' అని వ్యాఖ్యానించారు.
తమ అభ్యర్థనపై, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డిమాండ్‌పై స్పందించాల్సింది బ్రిటన్ ప్రభుత్వమేనని రవీశ్ కుమార్ తెలిపారు.
నీరవ్ మోదీ అప్పగింతకు సీబీఐ, ఈడీ చేసిన అభ్యర్థనలను బ్రిటన్ ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నీరవ్ మోదీ కేసులో ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టడం లేదని ఎవరైనా అనుకుంటే అది తప్పుడు అభిప్రాయమని రవీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా కేసులో మాదిరే నీరవ్ మోదీ అప్పగింత కోసం కూడా అన్ని చర్యలూ తీసుకుంటామని తెలిపారు. నీరవ్ మోదీ ఎక్కడున్నారో గుర్తించినంత మాత్రాన ఆయన్ను తక్షణం భారత్‌కు రప్పించేయొచ్చని అనుకోరాదని చెప్పారు.
బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆశ్రయం కల్పించాలని నీరవ్ మోదీ కోరారా, లేదా అనేది స్పష్టం కాలేదు. ఆయన అప్పగింత కోసం భారత్ చేసిన అభ్యర్థనపై ప్రభుత్వం సత్వర చర్యలు చేపడుతోందా, లేదా అనే విషయం కూడా వెల్లడి కాలేదు. ఈ అంశానికి సంబంధించి ద టెలిగ్రాఫ్ అడిగిన ఒక ప్రశ్నకు నీరవ్ మోదీ సమాధానమివ్వలేదు.
నీరవ్ మోదీని ఒకవేళ భారత్‌కు అప్పగించాలంటే, ఆ ప్రక్రియ మొదలయ్యేలోపు ఆయన్ను అరెస్టు చేయాల్సి ఉంటుందని, ఇంతవరకు అరెస్టు చెయ్యలేదని బ్రౌన్ బీబీసీతో చెప్పారు. బ్రిటన్ అధికారులు ఆయన ఆచూకీని గుర్తించలేకపోతున్నారని తాను భావిస్తున్నానని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- 'నీరవ్ మోదీ మమ్మల్ని మోసగించి మా భూములు లాక్కున్నాడు'
- "పీఎన్‌బీ కుంభకోణం మోదీ పాలనలో మొదటిదేమీ కాదు!"
- లాల్ బహదూర్ శాస్త్రి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని కారు కొన్నప్పుడు ఏం జరిగిందంటే..
- ‘ఏపీ ప్రత్యేక హోదాను ఏ శక్తి అడ్డుకోలేదు’ -రాహుల్‌గాంధీ
- అన్నదాత సుఖీభవ పథకం: ఎవరు అర్హులు? కౌలు రైతుల్ని ఎలా గుర్తిస్తారు?
- ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం సాధ్యమేనా.. కేసీఆర్ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది?
- కనీస ఆదాయ పథకం మంచిదేనా, కాదా?
- రాజీవ్ గాంధీ 1971 యుద్ధంలో దేశం వదిలి పారిపోయారా
- పద్మాలక్ష్మి యూఎన్డీపీ 'గుడ్ విల్ అంబాసిడర్'గా ఏం చేస్తారంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








