బడ్జెట్ 2019: ‘కార్మికుల కంటే గోవుల సంక్షేమానికే అధిక ప్రాధాన్యం’ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
మధ్యంతర బడ్జెట్‌లో బీజేపీ ప్రభుత్వం.. గోవుల సంక్షేమానికి రూ.750కోట్లను ప్రకటించింది. కానీ అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులకు అందించే పింఛనుకు కేవలం రూ.500 కోట్లను మాత్రమే కేటాయించింది.
గోవుల సంరక్షణ కోసం 'రాష్ట్రీయ కామధేను ఆయోగ్'ను ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. గోమాతను రక్షించుకోవడంలో ప్రభుత్వం వెనకాడబోదని తెలిపారు.
ఈ నిధిని దేశీయ ఆవుల సంతతిని పెంపొందించడానికి ఉపయోగిస్తామని చెప్పారు. కానీ దేశవ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అసంఘటిత కార్మికుల పట్ల కేంద్రం చిన్నచూపు చూసింది.
‘ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్’ పేరిట ప్రకటించిన ఈ పథకం అసంఘటిత రంగంలో పని చేస్తున్న 10 కోట్ల మందికి వర్తింపజేస్తామని కేంద్రం ప్రకటించింది.
ఈ పథకంలో చేరేవారు(29 ఏండ్ల లోపు) నెలకు రూ.100లు ప్రీమియం చెల్లించాలి. 60ఏండ్లు నిండిన తర్వాత వారికి రూ.3వేలు చెల్లించనున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ తాజాగా ప్రకటించిన ఈ కొత్త పథకంలోనూ కార్మికలోకానికి సరైన ప్రాధాన్యం కల్పించకపోవడం ప్రస్తావనార్హం అని నవతెలంగాణ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
‘నా రక్తం మరుగుతోంది..’
బీజేపీ నేతలు కేంద్రానికి ఊడిగం చేస్తున్నరని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శివాలెత్తిపోయారంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..
బీజేపీ నేతలు ఏమాత్రం సిగ్గులేకుండా రాష్ట్రంలో మాట్లాడుతున్నారని, తన రక్తం పొంగిపోతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సామాన్య ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయంపై రోడ్డుమీదకొచ్చి పోరాడుతుంటే.. ఈ గడ్డపై పుట్టిన బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభలో కేంద్రాన్ని వెనకేసుకురావడం సిగ్గుచేటన్నారు.
శుక్రవారం శాసనసభలో విభజన చట్టం అమలుపై స్వల్పవ్యవధి చర్చ జరిగింది. టీడీపీ సభ్యులతోపాటు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చర్చలో పాల్గొన్నారు.
ప్రత్యేక హోదా సాధ్యం కాదంటే ముఖ్యమంత్రి అంగీకరించి ప్యాకేజీ కోరారని, ఇప్పుడేమో యూటర్న్ తీసుకున్నారని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. రాజు వ్యాఖ్యలపై సీఎం మండిపడ్డారు. ఘాటు పదజాలంతో బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు.
'అవి ఎవరికోసం ఇస్తారయ్యా? కొత్త రాష్ట్రానికి అన్నీ ఇవ్వాలి. హైదరాబాద్, చెన్నై, బెంగళూర్, దిల్లీల్లో ఎన్ని సంస్థలున్నాయి. మనకెన్ని ఇచ్చారు? ఎవడబ్బ సొమ్మిది? సామాన్యుడికి ఉన్న ఆలోచన కూడా మీకు లేదా? ప్రజాప్రతినిధిగా ఉండడానికే మీకు అర్హత లేదు. నా రక్తం పొంగిపోతోంది. ఈ రాష్ట్రంలో ఉంటూ ఎవరికి ఊడిగం చేస్తారు? ఏం చేస్తారయ్యా మమ్మల్ని? జైల్లోపెడతారా? వ్యతిరేకంగా ఉంటే ఫినిష్ చేస్తారా. ఇష్టప్రకారం తమాషాలాడుతున్నారు' అని సీఎం ఆవేశంగా స్పందించారు' అని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, facebook/Mammootty
‘నేను జగన్‌ను కలవలేదు’
'వైఎస్సార్ బాడీ లాంగ్వేజ్‌ని ఇమిటేట్ చేయలేదు ఆయనది డిఫరెంట్ పర్సనాలిటీ..' అని యాత్ర సినిమా హీరో మమ్ముట్టి అన్నారంటూ సాక్షి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. అందులో..
వైఎస్ జగన్‌ను నేను కలవలేదు. వైఎస్సార్‌సీపీ అభిమానులు ఎవరూ ఈ సినిమా గురించి నాతో మాట్లాడలేదు. వైఎస్సార్‌సీపీ అభిమానుల నుంచి మా సినిమాకు మద్దతు లభిస్తుందేమో నాకు తెలీదు.
సినిమాలో సోల్ ఆఫ్ ది క్యారెక్టర్‌ను మాత్రమే తీసుకుని నటించాను. స్క్రిప్ట్ ప్రకారం చేశానంతే. ఒక గొప్ప వ్యక్తి లైఫ్‌ని రెండుగంటల్లో చెప్పడం కష్టం. ఇది పూర్తి బయోపిక్ కాదు.
వైఎస్సార్ పాదయాత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘యాత్ర’. పాదయాత్రలో భాగంగా వైఎస్సార్ ప్రజలను కలవడం, వారితో మాట్లాడటం, వారి భావోద్వేగాలను పంచుకోవడం, వారి సమస్యలను విని పరిష్కార మార్గాల గురించి చర్చించడం వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది.
ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా అనిపించింది. యాత్రలో నాకు యంగ్ ఏజ్ ఫాదర్‌గా నటించారు జగపతిబాబు' అంటూ.. మమ్ముట్టి ఇంటర్వ్యూను సాక్షి దినపత్రిక ప్రచురించింది.

ఫొటో సోర్స్, facebook/Arjuna Ranatunga
‘వరల్డ్ కప్‌లో శ్రీలంకకు పరాభవం!’
శ్రీలంక క్రికెట్ సంక్షోభం దిశగా పయనిస్తోందంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..
మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాలు, అనుమానాలతో ఐసీసీ వరుసగా దర్యాప్తులు నిర్వహిస్తోంది. క్రికెటర్లు బాహాటంగానే ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వన్డే ప్రపంచకప్ కోసం మేలో ఇంగ్లండ్ వెళ్తున్న లంక ఘోర పరాభవాన్ని ఎదుర్కోనుందని మాజీ సారథి అర్జున రణతుంగ హెచ్చరించారు.
‘బోర్డులో అవినీతి జరుగుతోంది. ఆటగాళ్లలో స్ఫూర్తి కొరవడింది. ఒకరినొకరు బాహాటంగా తిట్టుకుంటున్నారు' అని రణతుంగ అన్నారు.
ప్రస్తుతం జట్టు ఘోర ప్రదర్శనలకు జాతీయ క్రికెట్ బోర్డు, కొంతమంది ఆటగాళ్లే కారణమని ఆయన తెలిపారు. ఆటగాళ్లలో క్రమశిక్షణ పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవన్నీ చూస్తుంటే ప్రపంచకప్ లీగ్‌దశలోనే శ్రీలంక వెనుదిరిగి వచ్చే అవకాశం ఉందని అన్నారు.
జట్టులో ప్రేరణ పెంపొందించి మానసికంగా బలవంతులుగా మార్చేందుకు శిక్షణ ఇవ్వాలని రణతుంగ సూచించారు. కొంతమంది ఆటగాళ్లు దేశం కోసం కాకుండా వ్యక్తిగత లాభం కోసం ఆడుతున్నారని విమర్శించారు.
శ్రీలంక టీ20 సారథి లసిత్ మలింగ, తాత్కాలిక సారథి తిసారీ పెరీరా సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. లంక బోర్డు వీరిని హెచ్చరించినా పరిస్థితి మారకపోవడం గమనార్హం.
ప్రస్తుతం శ్రీలంక రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న రణతుంగ క్రికెట్ బోర్డులో పగ్గాలు చేపట్టాలన్న పట్టుదలతో ఉన్నారంటూ ఈనాడు కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి
- గర్భనిరోధక పిల్ రోజూ వేసుకోవచ్చా.. ఇది అందరికీ ఎందుకు పని చేయదు
- బడ్డెట్ 2019: ఎన్నికల ఏడాదిలో మోదీ ఆశల మంత్రం ఫలిస్తుందా?
- 1948 జనవరి 30: మహాత్మా గాంధీ చివరి రోజు ఎలా గడిచిందంటే...
- జార్జి ఫెర్నాండెజ్: ఖాదీ సోషలిస్ట్ పార్లమెంటరీ రెబల్
- "మా ఊళ్లో పక్కా ఇళ్లు కట్టుకోవద్దని దేవుడు చెప్పాడు.. మట్టి ఇళ్లలోనే ఉంటాం’’
- #MyVoteCounts: ఉద్యోగాలు ఇచ్చే పార్టీకే ఓటేస్తా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








