అమెరికాలో తెలుగు విద్యార్థులు మోసపోతున్నారా, మోసం చేస్తున్నారా...

ఫర్మింగ్టన్

ఫొటో సోర్స్, universityoffarmington.edu

ఫొటో క్యాప్షన్, యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్ పేరుతో ఏర్పాటు చేసిన నకిలీ సంస్థ వెబ్‌సైట్ హోమ్ పేజి
    • రచయిత, బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి
    • హోదా, సహకారం: రజిత జనగామ (అమెరికా)

అమెరికాలో కొందరు తెలుగు విద్యార్థులు సమస్యల్లో చిక్కుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్ నుంచి చదువుతున్నట్టు పత్రాలు చూపించి ఆ దేశంలోని వేర్వేరు చోట్ల ఉంటున్న, పనిచేస్తున్న వందల మంది విద్యార్థులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీనికి మధ్యవర్తిత్వం చేసిన 8 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. అరెస్టయిన 8 మందీ తెలుగువారే.

అసలేం జరిగింది...

చదువుకోవడానికి అమెరికా వెళ్లాక, మాస్టర్స్ చదువు అయిపోయాక, అక్కడ కొంత కాలం ఉద్యోగం చేయవచ్చు. దానికి తగిన వీసా వచ్చినవాళ్లు ఉండాలి. రాని వాళ్లు వెనక్కు తమ దేశం వెళ్లిపోవాలి. ఇదీ అమెరికాలో రూల్. కానీ చాలా మంది అమెరికాలో ఉండిపోవడం కోసం ఏదో ఒక చోట చదువుతున్నట్టు తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారు.

అలాంటి వారిని పట్టుకోవడానికి ఈసారి అమెరికా పోలీసులే, ఒక నకిలీ యూనివర్సిటీ పేరు చెప్పి వల వేశారు. దానికి చాలా మంది తెలుగు విద్యార్థులు దొరికిపోయారు. ఉద్యోగం కోసం తాము నిజంగా చదవకపోయినా, చదువుతున్నట్టుగా పత్రాలు పొందడానికి డబ్బులు ఇచ్చారు.

2015 నుంచీ ఆ రహస్య ఆపరేషన్ నిర్వహిస్తున్న అమెరికా పోలీసులు ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. ఈ కేసులో 8 మంది తెలుగు వారిని అరెస్టు చేశారు. పదుల సంఖ్యలో తెలుగు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.

ఫర్మింగ్టన్
ఫొటో క్యాప్షన్, ఇమ్మిగ్రేషన్ జడ్జి ముందు హాజరు కావాలంటూ ఒక విద్యార్థికి అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం జనవరి 30న పంపిన ఆదేశం

ఈ నకిలీ యూనివర్సిటీ పేరుతో విద్యార్థులను గుర్తించే కార్యక్రమం రెండేళ్ల నుంచి రహస్యంగా చేస్తున్నారు అక్కడి పోలీసులు. దీంట్లో దాదాపు 600 మంది విద్యార్థులు చిక్కారు. ది యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్‌ పేరుతో ఈ నకిలీ సంస్థను ఏర్పాటు చేశారు. అందులో ఉపాధ్యాయులు, సిబ్బందిగా కనిపించిన అందరూ పోలీసులే. వీరంతా స్టూడెంట్ వీసాతో ఉద్యోగాలు పొందడానికి ఈ నకిలీ యూనివర్సిటీలో చేరారని తూర్పు మిచిగాన్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది మాథ్యూ స్నైడర్ విడుదల చేసిన ప్రకటనలో ఉంది.

ది డెట్రాయిట్ న్యూస్ వెబ్ సైట్ కథనం ప్రకారం ఈ కింది వారిని పోలీసులు అరెస్టు చేశారు:

భరత్ రెడ్డి కాకిరెడ్డి, 29, లేక్ మ్యారీ ఫ్లోరిడా

సురేశ్ కందల, 31, వర్జీనియా

ఫణిదీప్ కర్నాటి, 35, కెంటకీ

ప్రేమ్ రాంపీస, 26, ఉత్తర కరొలీనా

సంతోష్ సామ, 26, కాలిఫోర్నియా

అవినాశ్ తక్కళ్లపల్లి, 28, పెన్సిల్వేనియా

అశ్వంత్ నూనె, 26, అట్లాంటా

నవీన్ ప్రత్తిపాటి, 26 డల్లాస్

లాయర్లు, తెలుగు సంఘాలను సంప్రదిస్తున్న విద్యార్థులు

తానా మాజీ అధ్యక్షులు, టీమ్ ఎయిడ్ సంస్థ వ్యవస్థాపకులు నన్నపనేని మోహన్‌తో ఈ విషయమై బీబీసీ మాట్లాడింది. ఇప్పటికే ఈ కేసులో నోటీసులు అందినవారు, ఈ యూనివర్సిటీ పత్రాలతో చదువుతూ నోటీసులు అందుతాయని భయపడుతున్న వాళ్లు, పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి రూమ్మేట్లు తమను, లాయర్లనూ సంప్రదిస్తున్నారని ఆయన చెప్పారు.

అయితే, విద్యార్థులకు మధ్యవర్తులుగా వ్యవహరించిన వారికి శిక్ష ఉంటుంది తప్ప, విద్యార్థులుగా చెప్పుకుని ఉద్యోగాలు చేస్తున్న వారికి శిక్ష ఉండే అవకాశం లేదని ఆయన అన్నారు. వారిని దేశం నుంచి వెనక్కు పంపే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. 2016లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ న్యూజెర్సీ విషయంలో కూడా ఇలానే జరిగిందని ఆయన గుర్తు చేశారు.

మోహన్ నన్నపనేని

ఫొటో సోర్స్, Mohan Nannapaneni/FACEBOOK

ఫొటో క్యాప్షన్, మోహన్ నన్నపనేని

భారతీయ విద్యార్థులు అమెరికా వీసా పొందేప్పుడు చాలా విషయాలు చెబుతారు. మేం వెనక్కి వచ్చేస్తాం, అమెరికా కేవలం చదువుకోవడానికే వెళుతున్నాం అంటారు. కానీ, అమెరికాకు వచ్చాక మాత్రం ఏదో ఒక దారిలో ఇక్కడ ఉండిపోదాం అని చూస్తారు. దొరకనంత కాలం వేరు. దొరికాక చిక్కులు తప్పవు. పోలీసులే ఇలా ట్రాప్ చేయవచ్చా అని కొందరు అడుగుతున్నారు. ఇక్కడి చట్టాల ప్రకారం అది తప్పుకాదు.

ఆ విద్యార్థులు మోసపోయారు అనుకోవడానికి లేదు. ఏది సరైన యూనివర్సిటీయో, ఏది కాదో చెప్పే 70 పేజీల డాక్యుమెంట్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి. మీరు జస్ట్ పేరు ఎంటర్ చేయగానే సరైన యూనివర్సిటీయో కాదో వచ్చేస్తుంది. అమెరికా వచ్చిన విద్యార్థి, విద్యార్థిలానే ఉండాలి. చదువు, అది కూడా మాస్టర్స్ పూర్తయ్యాక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అవకాశం ఉంటుంది. వీసా నిబంధనల ప్రకారమే ఇవన్నీ చేయాలి అని ఆయన అన్నారు. హెచ్ 1 బీ వీసాలు 60 వేలు ఉంటే, అప్లికేషన్లు నాలుగు లక్షల వరకూ వస్తున్నాయి. దాని అర్థం ఆ వీసా రాని వాళ్లు వెనక్కు వెళ్లిపోవాలని. కానీ ఎవరూ వెళ్లడం లేదు. తప్పెవరిది? అని ఆయన ప్రశ్నించారు.

ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వారిని ఇంకా పోలీసులు వదల్లేదు. అమెరికా వచ్చేవారు నిబంధనలు స్పష్టంగా చూసుకుని రావాలని వీరు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో దొరికేవారిలో ఎక్కువ శాతం తెలుగువారే ఉంటున్నారని అక్కడి తెలుగు సంఘాల వారు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)