ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు: ‘న్యూటన్’ సినిమాలోని మంగల్ కుంజామ్ ఎందుకు ఓటు వేయలేకపోయారు?

ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

న్యూటన్'లో మల్కో పాత్ర ఆ సినిమా చూసిన వారందరికీ గుర్తుండే ఉంటుంది. మారుమూల బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ నేపథ్యంలో కథానాయకుడు న్యూటన్ కుమార్ (రాజ్ కుమార్ రావ్)తో కలిసి మల్కో ఎన్నికల నిర్వహణలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుంది. ప్రజలు ఓటు వేసేలా చూసేందుకు ఎంతో శ్రమిస్తుంది.

ఆ మల్కో పాత్రకు నిజజీవిత ప్రేరణ... మంగల్ కుంజామ్. కుంజామ్ బస్తర్ ప్రాంతంలో గిరిజన జర్నలిస్టు.

మంగల్ కుంజామ్ గతంలో మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపిచ్చినా తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. కానీ ఈసారి మాత్రం కుంజామ్ ఓటు వేయలేకపోయారు.

కుంజామ్ గుమియాపాల్ వాస్తవ్యులు. ఈసారి అతని గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని ఇరోలికి మార్చారు. అది అతని గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.

దీంతో కుంజామే కాదు, అతని గ్రామస్తులు ఎవరూ కూడా 12న జరిగిన ఛత్తీస్‌గఢ్ మొదటి విడత ఎన్నికల్లో ఓటు వేయలేకపోయారు.

మంగల్ కుంజామ్

ఫొటో సోర్స్, Salman Ravi/BBC

ఫొటో క్యాప్షన్, మంగల్ కుంజామ్

జర్నలిస్టు కాబట్టి హెచ్చరికలతో వదిలిపెట్టారు..

పోలింగ్ రోజు నేను అతణ్ని వెదుకుతూ అతని గ్రామానికి వెళ్లినపుడు అక్కడంతా నిశబ్దంగా ఉంది. అక్కడి చెట్లకు ఎన్నికలను బహిష్కరించాలన్న మావోయిస్టుల కరపత్రాలు వేలాడుతున్నాయి.

కుంజామ్ ఎందుకు ఓటు వేయలేదని అతణ్ని ప్రశ్నించినపుడు, ''ఇది నక్సల్ ప్రభావిత ప్రాంతం. ఇక్కడున్న మారుమూల ప్రాంతాలకు వెళ్లాలంటే కాలినడకనే వెళ్లాలి. నేను గత ఎన్నికల్లో కూడా ఓటు వేశాను. అయితే దాని వెంటనే నాకు మావోయిస్టుల నుంచి ఆదేశాల రావడంతో నేను వారి ముందు హాజరు కావాల్సి వచ్చింది'' అని తెలిపారు.

మావోయుస్టులు తనను ఓటు వేయవద్దని బెదిరించినట్లు కుంజామ్ తెలిపారు. తను జర్నలిస్టు కాబట్టి కేవలం హెచ్చరికలతో వదిలిపెడుతున్నామని, మరోసారి అలాంటి తప్పు చేయవద్దని మావోయిస్టులు హెచ్చరించారని కుంజామ్ తెలిపారు.

రాజ్‌కుమార్ రావ్, అంజలీ పాటిల్

ఫొటో సోర్స్, NewtonTheFilm/Facebook

ఫొటో క్యాప్షన్, ‘న్యూటన్’లో మల్కోగా అంజలీ పాటిల్ (కుడి)

చాలా చోట్ల జరగని ఓటింగ్

కేవలం కుంజామ్ గ్రామానికి చెందిన వారు మాత్రమే కాదు, అతని గ్రామానికి చుట్టుపక్కల ఉన్న హిరోలి, సమల్వార్, లావాగావ్ మొదలైన గ్రామస్తులు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేయలేదు.

ఈసారి మావోయిస్టుల హింస తగ్గిందని, భద్రతా బలగాలను మరింత భారీగా మోహరించారని ప్రకటించినా గత మూడు ఎన్నికలతో పోలిస్తే తక్కువ ఓటింగ్ శాతం తగ్గడం ఎన్నికల కమిషన్‌ను కలవరపరుస్తోంది.

బస్తర్‌లో పేరు వెల్లడించడానికి ఇష్టపడని సీనియర్ అధికారి ఒకరు.. మారుమూల ప్రాంతాలలో ఓటింగ్ అంటే యుద్ధం చేసినంత పని అన్నారు.

''ఐదేళ్లకోసారి ఆ ప్రాంతాలను సందర్శిస్తే వాళ్లకెలా నమ్మకం కుదురుతుంది? కేవలం పోలింగ్ రోజు మాత్రమే ఎన్నికల అధికారులు, భద్రతా సిబ్బంది ఆయా గ్రామాలకు వెళతారు. మిగతా ఐదేళ్లపాటు అటు పక్కకు కూడా చూడరు'' అని తెలిపారు.

ఛత్తీస్‌గఢ్

ఫొటో సోర్స్, Getty Images

15 ఏళ్ల పాత కథే

ఈసారి మొదటి విడతలో 18 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో సుమారు 69 శాతం వరకు ఓటింగ్ జరిగిందని అధికారుల అంచనా.

నగరాలు, పట్టణాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాలలో ఎప్పటిలాగే ఓటింగ్ శాతం బాగానే ఉంది. కానీ మారుమూల ప్రాంతాల విషయానికి వస్తే.. 15 ఏళ్ల నుంచి సాగుతున్న కథే కొనసాగింది.

సుక్మా, దంతెవాడ, బిజాపూర్‌లోని కొన్ని పోలింగ్ బూత్‌లలో ఒక్క ఓటు కూడా నమోదు కాలేదంటే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు.

బిజాపూర్ జిల్లాలో అతి తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. అక్కడ కేవలం 33 శాతం మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. నారాయణ్ పూర్‌లో 39 శాతం పోలింగ్ నమోదైంది.

అయితే గతంలో ఓటింగ్ జరగని పలు ప్రాంతాలలో ఈసారి ఓటింగ్ జరిగిందని అధికారులు చెబుతున్నారు.

ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు

ఫొటో సోర్స్, Salman Ravi/BBC

గుమోడిలో ఇద్దరు ఓటర్లు, మిన్పాలో 8 మంది

సుక్మాలో 2010లో మావోయిస్టులు జరిపిన దాడిలో 78 మంది భద్రతా బలగాలు మరణించారు. ల్యాండ్ మైన్లు ఎక్కువగా ఉండే ఆ మారుమూల ఆ ప్రాంతానికి చేరుకోవడం చాలా కష్టం.

ఇక్కడ మావోయిస్టులు దాదాపు సమాంతర ప్రభుత్వాన్ని నడుతుపున్నారు.

ఈసారి అక్కడ చితాల్నార్‌లో 77 మంది, గుమోడిలో ఇద్దరు, మిన్పాలో 8 మంది, బుర్కాపాల్‌లో 105మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల ప్రాంతాలలో చాలా ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితే ఇప్పుడూ కొనసాగుతోంది.

''ప్రభుత్వం భద్రత కల్పిస్తున్నామని చెబుతోంది. కానీ అది కేవలం ఎన్నికల రోజు మాత్రమే. ఎన్నికలు కాగానే ఏ భద్రతా ఉండదు. కానీ ఇక్కడ జీవించాల్సింది మేము. ఓటు వేసాక మమ్మల్ని కాపాడేది ఎవరు? అందుకే నేను కానీ, మా గ్రామస్తులు ఎవరూ కాని ఓటు వేయడానికి వెళ్లలేదు'' అని కుంజామ్ వివరించారు.

''గతంలో మేం తాజా గాలిని పీల్చుకునేవాళ్లం. ఇప్పుడు మందుగుండు వాసన వేసే గాలిని పీలుస్తున్నాం.''

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)