ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు: కాంగ్రెస్ నిజంగా నక్సలైట్లను సమర్థిస్తోందా?

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''ఈ అర్బన్ నక్సలైట్లు నగరాల్లోని ఏసీ గదుల్లో నివసిస్తారు. వాళ్లు చాలా పరిశుభ్రంగా ఉంటారు. వాళ్ల పిల్లలు విదేశాలలో చదువుకుంటారు. మంచి మంచి వాహనాలలో తిరుగుతారు. అక్కడ కూర్చుని రిమోట్ ద్వారా మన గిరిజనుల పిల్లల జీవితాలను నాశనం చేస్తారు.''

భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో చేసిన ఎన్నికల ప్రసంగంలోని ఒక భాగం ఇది. తన ప్రసంగంలో మోదీ కాంగ్రెస్ మావోయిస్టులకు మద్దతునిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి, అర్బన్ నక్సలైట్ల నెట్‌వర్క్‌కి సంబంధాలు ఉన్నాయన్నారు.

మోదీ ఈ మాటలు అన్న మరుసటి రోజే ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా రాయ్‌పూర్‌లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తూ అవే వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరిగింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా, ''నక్సల్స్ 'మనవాళ్లు' అన్న మీ మాటలకు కట్టుబడతారా?'' అని ప్రశ్నించారు. ''బీజేపీ పాలనలో కాంగ్రెస్ 25 మంది నేతలను కోల్పోయింది'' అంటూ ట్వీట్ చేశారు.

మోదీ 2010, మే 20న గుజరాత్‌లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రకటన చేశారని సూర్జేవాలా అన్నారు.

అదే విధంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ 2015లో 'నక్సలైట్లను మా పిల్లల్లాగే ఆహ్వానిస్తాం' అన్న మాటలను కూడా సూర్జేవాలా గుర్తు చేశారు.

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులతో జరుగుతున్న పోరాటం కారణంగా ఎక్కువ నష్టపోయింది తమ పార్టీనే అనేది కాంగ్రెస్ వాదన.

మావోయిస్టులు

ఫొటో సోర్స్, CG KHABAR/BBC

కాంగ్రెస్‌పై నక్సలైట్ల దాడులు

  • 2013లో సుక్మా జిల్లాలోని దర్భాఘాటీ వద్ద కాంగ్రెస్ కాన్వాయ్‌పై నక్సలైట్లు దాడి చేశారు. ఆ దాడిలో కాంగ్రెస్ సీనియర్ నేత, సల్వా జుడం సృష్టికర్తగా పేర్కొనే మహేంద్ర కర్మతో సహా కాంగ్రెస్‌కు చెందిన 25 మంది నేతలు మరణించారు.
  • మావోయిస్టులు విడుదల చేసే ప్రకటనల్లో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరంలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
  • పి.చిదంబరం హోమ్ మంత్రిగా ఉన్నపుడు నక్సల్స్‌కు వ్యతిరేకంగా ఆపరేషన్ గ్రీన్‌హంట్ ప్రారంభమైనందున మావోయిస్టులు బీజేపీకన్నా కాంగ్రెస్‌నే తమ ప్రధాన శత్రువుగా భావిస్తారు.
  • మావోయిస్టులు భారతదేశ అంతర్గత భద్రతకు అతి పెద్ద చేటు అన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలపై కూడా మావోయిస్టులు ఆగ్రహంగా ఉన్నారని చెబుతారు.
  • కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో పెద్ద ఎత్తున పారా మిలటరీ బలగాలను మోహరించారు. దీని వల్ల రెండు వర్గాల మధ్య భీకరపోరు జరిగింది. దీని ఫలితంగా చిదంబరం, సోనియా గాంధీ, మన్మోహన్‌సింగ్‌లు మావోయిస్టుల హిట్ లిస్టులో చేరారు.
  • గిరిజన ప్రాంతాలలోని ఖనిజ సంపదను దోచి పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బూర్జువా వర్గాలతో చేతులు కలిసిందని మావోయిస్టులు ఎన్నోసార్లు ప్రకటనలు చేశారు.
  • 2013 దర్భాఘాటీ సంఘటనకు ముందు కూడా నక్సలైట్లు బస్తర్‌లో కాంగ్రెస్ నేతలపై దాడి చేసి, అనేక మందిని హత్య చేశారు.
నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Reuters

బస్తర్ జిల్లాలో బీజేపీ అన్ని సీట్లను ఎలా గెలుచుకోగలుగుతోంది?

ప్రస్తుతం దంతెవాడ ఎమ్మెల్యే, మహేంద్ర కర్మ భార్య అయిన దేవి కర్మ, గత పదిహేనేళ్లుగా బీజేపీనే చత్తీస్‌గఢ్‌ను పాలిస్తోందని తెలిపారు.

''బస్తర్ జిల్లాలో వాళ్లు అన్ని సీట్లు ఎలా గెలవగలుగుతున్నారు? 2013కు ముందు, ఇక్కడున్న 12 అసెంబ్లీ సీట్లలో 11 సీట్లలో వాళ్లే గెలిచారు. 2013లో నా భర్త హత్య తర్వాత ప్రజలు జాలితో కాంగ్రెస్‌ను గెలిపించారు'' అని ఆమె తెలిపారు.

అయితే బీజేపీ మాత్రం ప్రధాని కేవలం.. మావోయిస్టులు విప్లవకారులంటూ కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారని సమర్థించుకున్నారు.

సుధా భరద్వాజ్, అర్బన్ నక్సల్స్

ఫొటో సోర్స్, Alok Putul/BBC Hindi

ఫొటో క్యాప్షన్, సుధా భరద్వాజ్

ఎవరీ అర్బన్ నక్సల్స్?

దీనికి సల్వా జుడుంలాంటి మరో సంస్థ అగ్ని (యాక్షన్ గ్రూప్ ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీ) నిర్వాహకులు సమాధానం ఇచ్చారు.

బేలా భాటియా, సోని సూరి, కమల్ శుక్లా, సంజయ్ యాదవ్ లాంటి సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులు.. పోలీసులు, భద్రతా బలగాల మనోధైర్యాన్ని దెబ్బ తీస్తున్నారని వీరు చెబుతున్నారు.

అగ్నికి చెందిన ఫరూక్ ఆలీ, నక్సలైట్లకు సహాయం చేసే ప్రతి ఒక్కరినీ తమ సంస్థ వ్యతిరేకిస్తుందని తెలిపారు.

అర్బన్ నక్సల్స్, అగ్ని, ఫరూక్ అలీ

ఫొటో సోర్స్, Salman Ravi/BBC

ఫొటో క్యాప్షన్, ‘అగ్ని’ సభ్యుడు ఫరూక్ అలీ

'నక్సలైట్లకు సహాయం చేసేవారూ నక్సలైట్లే'

''నక్సలైట్లు అన్న ఆరోపణలతో పట్టుబడ్డ వారే కాదు, వారికి న్యాయసహాయం చేసేవారు కూడా నక్సలైట్లే. భద్రతా బలగాల మనో ధైర్యాన్ని దెబ్బ తీస్తున్న బేలా భాటియా, నందినీ సుందర్ లాంటి వాళ్లను మేం బహిరంగంగానే వ్యతిరేకిస్తాం'' అని ఆలీ అన్నారు.

బస్తర్‌లోని పట్టణప్రాంతాన్ని వదిలేస్తే, మిగతా ప్రాంతాలలో మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.

ఇక్కడ కొన్ని ప్రాంతాలకు మిగతా ప్రపంచంతో సంబంధం ఉండదు. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న పోరాటంలో ఇక్కడ ఆదివాసీలు నలిగిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)