శబరిమల : ‘సానిటరీ న్యాప్‌కిన్లను స్నేహితుల ఇంటికి తీసుకెళ్లరు కదా’ - స్మృతి ఇరానీ :ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడాన్ని కేంద మంత్రి స్మృతి ఇరానీ తప్పుబట్టినట్లు మన తెలంగాణ కథనం తెలిపింది.
ఆలయ ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రశ్నించే ఉద్దేశం తనకు లేదన్న స్మృతి ఇరానీ.. 'ఇది కేవలం వ్యక్తుల ఇంగిత జ్ఞానానికి సంబంధించిన విషయం. రుతుస్రావం సమయంలో వాడిన సానిటరీ న్యాప్‌కిన్లను ఎవరైనా స్నేహితుల ఇంటికి తీసుకెళ్లాలనుకోరు కదా. అలాంటిది దేవుడుండే చోటుకు అలా వెళ్లడం ఎందుకు?' అంటూ ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రతి ఒక్కరికీ దేవుడ్ని ప్రార్థ్థించే హక్కు ఉంటుంది.. కానీ హక్కుల పేరిట అసభ్యంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదని స్మృతి ఇరానీ అన్నారు.
స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆమె ఇలా మాట్లాడడం సరికాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే, తాను ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్మృతి ఇరానీ ఒక ట్వీట్ చేశారు. తాను మాట్లాడిన వీడియోను త్వరలోనే ట్విటర్‌లో పోస్ట్ చేస్తానని తెలిపినట్లు మన తెలంగాణ పేర్కొంది.

ఫొటో సోర్స్, hc.tap.nic.in
పంచాయతీ ఎన్నికల విషయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఉమ్మడి హైకోర్టు తప్పుబట్టినట్లు ఈనాడు కథనం పేర్కొంది.
పంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల తీరును హైకోర్టు ఆక్షేపించింది. మూడు నెలల్లోగా పంచాయతీ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 90ను కొట్టివేసింది. వీరి నియామకం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పాలకవర్గాల గడువు ముగిసేలోగా ఎన్నికలను నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది.
ఎన్నికల నిర్వహణలో ఉదాసీనంగా వ్యవహరించిన ఎన్నికల సంఘంతో పాటు సర్కారు తీరును హైకోర్టు తప్పుబట్టింది. ప్రత్యేక అధికారుల నియామకం చెల్లదని, మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు అదే ఆదేశాలు జారీ చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా పాలకవర్గాల గడువు ఈ ఏడాది ఆగస్టు 1తో ముగిసింది. అయితే గడువులోగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో పంచాయతీల నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వాలు జీవోలు జారీ చేశాయి.
ప్రత్యేక అధికారుల నియామకం నిమిత్తం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 90ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మంగళవారం ఈ తీర్పు వెలువరించారని ఈనాడు పేర్కొంది.

ఫొటో సోర్స్, VV.Lakshmi Narayana IPS/Facebook
రెండు పార్టీలలో చేరాలని తనకు ఆఫర్ వచ్చినట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారని సూర్య కథనం పేర్కొంది.
హైదరాబాద్ లోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలలో చేరాలని ఆహ్వానం అందినట్లు వెల్లడించారు. అయితే ఉన్న పార్టీలలో చేరాలా లేక కొత్త పార్టీని స్థాపించాలా అనేదానిపై ఇంకా ఆలోచిస్తున్నానని వెల్లడించారు. ప్రస్తుతానికి తాను ఏపీకే పరిమితం అవుతానని ఆయన స్పష్టం చేశారు.
కాగా, లక్ష్మీనారాయణ ఇతర ఏ పార్టీలో చేరకుండా, కొత్త పార్టీని స్థాపిస్థారనే ఊహాగానాలు వినవస్తున్నాయి. ఆయనను అభిమానించే యువత సైతం అదే అభిప్రాయంతో ఉందని సూర్య పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో)కు మరిన్ని బాధ్యతలు అప్పగించాలని కేంద్రం భావిస్తున్నట్లు సాక్షి కథనం పేర్కొంది.
ప్రైవేటు రంగంలోని 6 కోట్ల మంది సభ్యుల భవిష్యనిధి పెట్టుబడులను నిర్వహిస్తున్న ఈపీఎఫ్‌వోకు... మిగిలిన సామాజిక భద్రతా పథకాల నిధుల నిర్వహణను కూడా అప్పగించాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఇందుకోసం ఈపీఎఫ్‌వోను ఫండ్ మేనేజర్‌గా మార్చాలనుకుంటోంది. తద్వారా దేశంలో 50 కోట్ల మందికి సామాజిక భద్రతను అందించే గురుతర బాధ్యతను దానిపై మోపాలన్నది కేంద్రం యోచన.
ఇదే జరిగితే... ఈపీఎఫ్‌వో నిర్వహణ (ఎగ్జిక్యూటివ్ అధికారం) రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే సామాజిక భద్రతా బోర్డుల పరిధిలోకి వెళుతుంది.
మొదట ప్రయోగాత్మకంగా కొన్ని రాష్ట్రాల్లో నూతన విధానాన్ని అమలు చేసి, ఎదురయ్యే సమస్యలపై అవగాహన వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సాక్షి పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- దిల్లీ కాలుష్యం: దేశ రాజధానిని మళ్లీ వణికిస్తున్న ‘పొగ మంచు’
- జర్నలిస్టు ఖషోగ్జీ హత్య పక్కా పథకం ప్రకారమే జరిగింది: టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్
- తిత్లీ తుపాను: ‘శ్రీకాకుళం జిల్లాను 20 ఏళ్లు వెనక్కి నెట్టింది’
- నాసా: అంటార్కిటికాలో దీర్ఘచతురస్రం ఆకారంలో ఐస్‌బర్గ్
- స్వలింగ సంపర్కానికి, వేళ్ల పొడవుకు సంబంధం ఉందా?
- 'పంజరంలో చిలక' సీబీఐలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








