ప్రెస్‌రివ్యూ: ‘చంద్రబాబు డూప్ దొరికారు’ - రామ్‌గోపాల్ వర్మ

ఫొటో సోర్స్, UGC
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో ఆయన అల్లుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు పాత్రధారి కోసం సరిగ్గా ఆయన్ను పోలిన వ్యక్తి ఆచూకీని కనుగొనేందుకు ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ ప్రారంభించిన వేట ఫలించిందని సాక్షి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఎక్కడో గుర్తు తెలియని ఓ ప్రాంతంలోని హోటల్‌లో సరిగ్గా చంద్రబాబును పోలిన ఓ వెయిటర్ హాఫ్ బనియన్, నిక్కర్ ధరించి వినియోగదారులకు ఆహారం వడ్డిస్తున్న వీడియో గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వ్యక్తి ముఖం, గడ్డం కూడా దాదాపు చంద్రబాబును పోలి ఉండటంతో సామాజిక మాధ్యమాల్లో వేల మంది సరదాగా షేర్ చేశారు. ఈ వీడియోను చూసి ఆకర్షితుడైన రాంగోపాల్ వర్మ సదరు వ్యక్తి ఆచూకీని కనుక్కోవడంలో సహకరించినవారికి రూ.లక్ష అందజేస్తానని శనివారం ఫేస్‌బుక్‌లో ప్రకటన చేశారు.
అతడే కాకపోయినా, అతడి(చంద్రబాబు)ని పోలిన మరో వ్యక్తి ఆచూకీ తెలిపినా ఈ బహుబమతి అందజేస్తానని వెల్లడించారు. ఆర్జీవీ ఇచ్చిన ఆఫర్ సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ న్యూస్ చానల్‌లో పనిచేసే ముత్యాల రోహిత్ చంద్రబాబును పోలిన వెయిటర్ ఆచూకీని ఆర్జీవీకి పంపారు. ఈ విషయాన్ని శనివారం రాత్రి 10 గంటల తర్వాత ఆర్జీవీ ఫేస్‌బుక్ ద్వారా ధ్రువీకరించారు. ''హే రోహిత్, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా యూనిట్‌కు సీబీఎన్(చంద్రబాబు)ను బహుకరించినందుకు కృతజ్ఞతలు. సినిమా ప్రారంభంలో తెరపైన నీ పేరు వేసి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నీ బ్యాంకు ఖాతా నంబర్ పంపించు లక్ష రూపాయల బహుమతి కోసం..''అని ఆర్జీవీ ఫేస్‌బుక్,ట్విటర్‌లో పోస్టు పెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇదిలా ఉండగా, చంద్ర బాబును పోలిన హోటల్ వెయిటర్ వివరాలను ఆర్జీవీ ఇంకా బహిర్గతం చేయలేదు. అయితే, ఈ వ్యక్తి పేరు ప్రభు అని, గతంలో అతడు త్రయంబకేశ్వర్‌లోని హోటల్‌లో పనిచేసేవారని, ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారని ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. ఈ వ్యక్తికి సంబంధించి ఇటీవల వైరల్ అయిన వీడియో ఏడాది క్రితం తీసిందని అతడు వెల్లడించారు. ఈ వివరాలను ధ్రువీకరించాల్సి ఉంది. వచ్చే జనవరి చివరి వారంలో విడుదల కావాల్సిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో నటించేందుకు చంద్రబాబును పోలిన వ్యక్తి అంగీకరిస్తాడా? లేదా ? అన్నది వేచిచూడాలి.. అని సాక్షి పత్రిక సాక్షి పత్రిక ఈ కథనంలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
తిత్లీ ధాటికి ఉద్దానంలో 90 శాతం కొబ్బరి తోటలు ధ్వంసం
ఉద్దానానికి అన్నం పెట్టేది కొబ్బరి చెట్లేనన్నది నానుడి. వేలాది రైతు కుటుంబాలకు అదే జీవనాధారం. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, పెళ్లిళ్లు అన్నింటికీ కొబ్బరి పంటే కొండంత అండ. అలాంటి కొబ్బరి తోటలన్నింటినీ తిత్లీ తుపాను ఒక్క దెబ్బతో తుడిచిపెట్టేసింది. దాదాపు 90 శాతం కొబ్బరి తోటలు కకావికలమైపోయాయి. ఇప్పటికే అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన రైతన్న తోటల్లో కూలిన చెట్లను ఖాళీ చేయించుకోవడానికీ కొత్తగా అప్పులు చేయాల్సిందే. మళ్లీ కొత్తగా మొక్కలు నాటుకున్నా ఆ పంట రావడానికి ఏళ్లు పడుతుంది.. అని ఈనాడు దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఉద్దానం, పరిసర మండలాల్లో దాదాపు 40,000 ఎకరాల్లో కొబ్బరి సాగు చేస్తున్నారు. ఇక్కడి కొబ్బరిని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. సాధారణంగా ఎకరానికి 80 నుంచి 90 చెట్లుంటాయి. అలాంటిది అత్యధిక తోటల్లో కనీసం ఒకటి రెండు చెట్లైనా మిగలని పరిస్థితి నెలకొంది. ఒక కొబ్బరి మొక్క నాటిన తరువాత కనీసం ఏడెనిమిదేళ్లకుగానీ కాపు మొదలు కాదు. అప్పటి నుంచి దాదాపు మూడు నాలుగు దశాబ్దాల వరకూ ఏడాదికి ఆరు విడతలుగా కాయలనిస్తుంది. ఎకరానికి ఏడాదికి దాదాపు రూ.72,000 వరకూ ఆదాయం వస్తుంది. అయితే ప్రస్తుతం తగిలిన దెబ్బతో రైతుకు ఆదాయం పోవడంతో పాటు అదనంగా అప్పులు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. ఇప్పటివరకూ ఉన్న అప్పుల్నే తీర్చలేని స్థితిలో ఉన్న రైతన్నకు కొత్త అప్పులు ఎలా పుడతాయన్నది ప్రశ్నార్థకమే. తోటల్లో కూలిపోయిన చెట్లను తొలగించడానికే ఎకరాకు కనీసం రూ.10,000కు తక్కువ కాకుండా ఖర్చు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఉద్దానంలో కొబ్బరి రైతుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. 1999లో వచ్చిన సూపర్‌సైక్లోన్ మొదలు, 2013లో ఫైలిన్, 2014లో హుద్‌హుద్ తుపాన్లు వణికించాయి. తాజాగా విలయతాండవం చేసిన తిత్లీ కొబ్బరి రైతును పదేళ్లు వెనక్కి నెట్టేసింది. ఏ పంటకైనా ప్రకృతి ప్రకోపిస్తే ఒకసారే నష్టపోతారు. కాని కొబ్బరి రైతు పరిస్థితి అలాంటిది కాదు. కొత్తగా మొక్కలేసి కాపు మొదలు కావడానికే ఏడెనిమిదేళ్లకుపైగా సమయం పడుతుంది. మరోవైపు తోటల్లో ఏ కాసిన్ని మొక్కలు మిగిలినా, అవీ మొవ్వులు మెలి తిప్పేయడంతో కుళ్లు తెగులు తదితర చీడపీడలు చుట్టుముట్టేస్తుంటాయి. వాటి ప్రభావం దిగుబడులపైనా పడుతుంది. అందుకే ప్రభుత్వం గట్టి సాయం చేయకపోతే ఉద్దానం కొబ్బరి రైతు వలసపోయే ప్రమాదమూ లేకపోలేదు.

ఫొటో సోర్స్, Getty Images
నిజాయితీగా పన్నులు చెల్లిస్తే సత్కారాలు!
‘ఏటా క్రమం తప్పకుండా నిజాయితీగా, సమయానికి ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా? ఐటి రిటర్న్‌లు ఫైల్ చేస్తున్నారా? అయితే త్వరలోనే మీరు అనేక మర్యాదలు, ప్రయోజనాలు అందుకోనున్నారు’ అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, టోల్ ప్లాజాల వద్ద ఇలాంటి వ్యక్తులు విఐపిలు కాబోతున్నారని తెలిపింది. నిజాయితీగా క్రమం తప్పకుండా పన్నులు చెల్లించే వారికి ఈ ప్రాంతాల్లో ప్రాధాన్యతా (ప్రియారిటీ) క్రమంలో సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు... బహిరంగంగా వీరిని ప్రభుత్వ ప్రముఖుల చేత సన్మానించాలనీ భావిస్తోంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), ఐటి అధికారులతో కూడిన ఒక కమిటీ ఇందుకోసం అనుసరించాల్సిన విధివిధానాలకు సిద్ధం చేస్తోంది. ఈ కమిటీ నుంచి నివేదిక అందిన వెంటనే ఆర్థిక మంత్రిత్వ శాఖ దాన్ని ఆమోదించి, ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ)కు పంపుతుంది. ఆ తర్వాత ఈ ప్రతిపాదను కేంద్ర కేబినెట్ ముందు ఉంచుతారు. అన్ని ఆమోదాలతో ఈ సంవత్సరం చివరికల్లా ఈ ప్రతిపాదన అమలు చేయాలని భావిస్తున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. దీంతోపాటు ఒకటే ఆదాయం ఉన్న వ్యక్తుల ఆదాయ పన్ను రిటర్న్‌ల పరిశీలన కొద్ది గంటల్లోనే పూర్తి చేసేందుకూ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇందుకు కొన్ని రోజుల సమయం పడుతోంది. ఇందుకోసం బెంగుళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ కేంద్రం (సీపీసీ) సామర్ధ్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు. ఈ విస్తరణ పూర్తయితే ఒకటే ఆదాయ వనరు ఉన్న వ్యక్తుల ఆదాయ పన్ను రిటర్న్‌లను కొద్ది గంటల్లోనే పరిశీలించి, వారికి అందాల్సిన టాక్స్ రిటర్న్‌లనూ వెంటనే వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు వీలవుతుది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను ఇప్పటికే సిద్ధం చేసి అనుమతుల కోసం ఎదురుచూస్తోంది.. అని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈ కథనంలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
రైలు ప్రయాణ సమయంలోనూ ఫిర్యాదు చేయొచ్చు!
రైలులో వెళుతున్న ప్రయాణికులు తమ సమస్యపై ఫిర్యాదు చేసేందుకు ఇక తదుపరి స్టేషన్ వచ్చే వరకు వేచి చూడనవసరం లేదు. తమ మొబైల్‌లోని యాప్ ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు అందుబాటులోకి రానున్నది. రైల్వేశాఖ వెంటనే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతోపాటు ఆర్పీఎఫ్ దర్యాప్తునకు ఆదేశిస్తుంది.. అని నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
రైలు కదులుతున్నప్పుడు మహిళలపై వేధింపులకు పాల్పడినా, దొంగతనం చేసినా, నేరం చేసినా వెంటనే మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే ప్రక్రియను ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు. త్వరలో అది దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నది. ఆర్పీఎఫ్ డీజీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఫిర్యాదు చేయడం కోసం ప్రయాణికుడు మరో రైల్వే స్టేషన్ వచ్చే వరకు వేచి ఉండనవసరం లేదు. మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. దాన్ని చూసిన వెంటనే ఆర్పీఎఫ్ జవాన్లు వారికి సాయం చేస్తారు అని చెప్పారు. ఈ మొబైల్ యాప్ కేవలం ఆర్పీఎఫ్ వద్దే కాక ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ), టిక్కెట్ తనిఖీ దారుల వద్ద కూడా ఉంటుంది.. అని నమస్తే తెలంగాణ దినపత్రిక ఈ కథనంలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- భూటాన్: 'ప్రపంచంలో అత్యంత కఠినమైన ఒక రోజు సైకిల్ రేస్'
- భారత్: పదేళ్లలో రెట్టింపైన సిజేరియన్ జననాల శాతం
- #MeToo: మహిళా జర్నలిస్టులు మౌనం వీడేదెప్పుడు?
- జికా వైరస్: ఎక్కడ పుట్టింది? ఎలా వ్యాపిస్తుంది? దాని నుంచి తప్పించుకోవడం ఎలా?
- పెర్ఫ్యూమ్తో పెద్దపులి వేట: మనిషి రక్తం రుచిమరిగిన పులిని పట్టుకునేందుకు చివరి అస్త్రం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









