ప్రెస్‌రివ్యూ: ‘బెట్టింగ్, జూదాన్ని చట్టబద్ధం చేయాలి.. ఆధార్‌తో అనుసంధానించాలి’

పేకాట

ఫొటో సోర్స్, Getty Images

క్రికెట్‌తో సహా అన్ని రకాల క్రీడల్లో జరిగే బెట్టింగ్‌ను, జూదాన్ని చట్టబద్ధ కార్యకలాపంగా క్రమబద్ధీకరించాలని లా కమిషన్ సిఫార్సుచేసిందంటూ 'నమస్తే తెలంగాణ' ఓ కథనం రాసింది.

ప్రత్యక్ష, పరోక్ష పన్నుల పరిధిలోకి వీటిని తీసుకువచ్చి పన్నులు విధించాలని లా కమిషన్ సూచించింది. తద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని(ఎఫ్‌డీఐ) ఆకర్షించాలని పేర్కొంది.

‘ఫ్రేమ్‌వర్క్‌: గ్యాంబ్లింగ్ అండ్ స్పోర్ట్స్ బెట్టింగ్ ఇన్‌క్లూడింగ్ క్రికెట్ ఇన్ ఇండియా’ పేరుతో లా కమిషన్ ఒక నివేదికను రూపొందించింది.

ఈ నివేదికలో పలు సూచనలు చేసింది. జూదాన్ని క్రమబద్ధీకరిస్తూ పార్లమెంటు ఒక నమూనా చట్టాన్ని తీసుకురావాలి. దానిని రాష్ర్టాలు అనుసరించే అవకాశం ఉంటుంది.

లేదంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 249, 252 ప్రకారం పార్లమెంటు తన అధికారాల్ని ఉపయోగించి చట్టం తీసుకురావచ్చు.

అలాగే జూదం, బెట్టింగ్‌లలో పాల్గొనే వ్యక్తుల ఆధార్ లేదా పాన్ నెంబరును సదరు కార్యకలాపాలతో అనుసంధానించాలి.

క్యాసినోలను (జూదశాలలను) అనుమతించడం ద్వారా పర్యాటకం, ఆతిథ్యరంగాల్లోకి విదేశీ పెట్టుబడులు తరలివస్తాయి. భారీ ఎత్తున ఆదాయం సమకూరడంతోపాటు, పెద్దసంఖ్యలో ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయి అని లా కమిషన్ పేర్కొంది.

పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, facebook.com/janasenaparty

దేవుడి దయ ఉంటే సీఎం అవుతా - పవన్ కల్యాణ్

భగవంతుడి దయ.. అభిమానుల ఆశీస్సులు ఉంటే ముఖ్యమంత్రిని అవుతానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారని 'ఈనాడు' ఓ కథనం ప్రచురించింది.

విశాఖపట్నం గాజువాక కూడలిలో గురువారం సాయంత్రం బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. డబ్బుతో రాజకీయం చేయలేమని, అలా అయితే జగన్‌ ఎపుడో సీఎం అయ్యేవారన్నారు.

అమరావతి, విశాఖలో భూములను నచ్చినవారికి ఇచ్చుకుంటున్నారని, యువత కోసం ఆలోచించట్లేదని పవన్‌ అన్నారు.

ప్రత్యేక హోదాపై చంద్రబాబు అప్పుడు ఒక విధంగా ఇప్పుడు ఒక విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని అవసరమైతే సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తానన్నారు.

మేం పార్టీ పెడితే కులం పిచ్చి అంటగడతారా? తనకు కులం పిచ్చి ఉంటే గత ఎన్నికల్లో తెదేపాకు ఎందుకు మద్దతు పలుకుతానని ప్రశ్నించారు.

ఉత్తరాంధ్రలో అడ్డూ అదుపూ లేకుండా భూ కబ్జాలు, ఇసుక మాఫియాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఎవరైనా తప్పు చేస్తే చొక్కా పట్టుకొని లాక్కొస్తానని పవన్ అన్నట్టు ఈనాడు రాసింది.

సైబర్ దాడి

ఫొటో సోర్స్, Getty Images

విజయవాడలో 110 శాతం పెరిగిన సైబర్ నేరాలు

ఆంధ్రప్రదేశ్‌లో సైబర్‌ నేరాలు భారీగా పెరుగుతున్నాయంటూ 'ఆంధ్రజ్యోతి' ఓ కథనం రాసింది.

బ్యాంకు ఖాతాదారులు, కార్డుదారుల వివరాలు సేకరిస్తున్న సైబర్‌ నేరగాళ్లు తెలివిగా పంజా విసురుతున్నారు. వారినుంచి ఓటీపీ(వన్‌ టైం పాస్‌వర్డ్‌) తెలుసుకుంటూ అందినకాడికి అకౌంట్ల నుంచి డబ్బులు లాగేస్తున్నారు.

రాష్ట్ర పోలీసు శాఖ విడుదల చేసిన నేర గణాంకాల ప్రకారం గతేడాదితో పోల్చితే రాష్ట్రంలో సైబర్‌ నేరాలు 41 శాతం పెరిగాయి. వీటిలో ఓటీపీ కేసులే 81 శాతానికి పైగా ఉన్నాయి.

విజయవాడలో ఓటీపీ మోసాలు 200 శాతం పెరిగాయి. విశాఖ, గుంటూరు, తిరుపతి, అనంతపురం, నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు, కర్నూలులో సైతం బాధితులు ఉన్నారు.

బాధితులకు తెలిసినవాళ్లు చేస్తున్న మోసాలే ఎక్కువగా ఉంటున్నాయి.

అందరూ తమ సెల్‌ఫోన్‌కు రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని, చార్జింగ్‌ అయిపోయిందనో, సిగ్నల్‌ కలవలేదనో ఒక కాల్‌ చేసుకుంటామని ఎవరైనా ఫోన్‌ అడిగితే ఇవ్వొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

విజయవాడలో అన్నిరకాల సైబర్‌ నేరాలు 110% పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

విశాఖలోనూ ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువయ్యాయి. ఉద్యోగాల పేరుతో చేసిన మోసాలు కూడా అధికంగా ఉన్నాయి. మహిళలు, యువతులకు అసభ్యకర సందేశాలు పంపిన కేసులు 85% పెరిగాయి.

ఏటీఎంల ద్వారా జరిగే మోసాలు, హ్యాకింగ్‌ కేసులు మాత్రం తగ్గుముఖం పట్టాయని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఇస్రో రాకెట్

ఫొటో సోర్స్, Facebook/Isro

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఇస్రో మరో అడుగు

భవిష్యత్‌లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నిర్వహించిన ట్రయల్ రన్ ప్రయోగం విజయవంతమైందని 'ఆంధ్రభూమి' ఓ కథనం రాసింది.

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి గురువారం ప్యాడ్ అబార్ట్ పరీక్ష ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది.

షార్‌లోని సౌండ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఆధ్వర్యంలో శాస్తవ్రేత్తలు ఈ ప్రయోగాన్ని విజయతంగా చేపట్టారు.

ఈ పరీక్షలో క్రూ ఎస్కేప్‌ వ్యవస్థతోపాటు వ్యోమగాములు ఉండే 'క్రూ మాడ్యూల్‌'ను ఉపయోగించారు. ఇందులో మనిషి నమూనాను ఉంచారు.

సుమారు 266 సెంకడ్ల పాటు ఈ ప్రయోగం జరిగింది. ఇస్రో తొలి ప్రయత్నంలోనే ప్యాడ్ అబార్ట్ పరీక్ష విజయవంతం కావడంతో శాస్తవ్రేత్తల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

భవిష్యత్‌లో మానవసహిత ప్రయోగాల ద్వారా వ్యోమగములను అంతరిక్షంలోకి పంపేందుకు ఈ ట్రయిల్ ప్రయోగం ఉపకరిస్తుందని ఆంధ్రభూమి వివరించింది.

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, TDP.Official/facebook

ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదు: చంద్రబాబు

రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారని 'ఈనాడు' ఓ కథనం ప్రచురించింది.

కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోందని, జమిలి ఎన్నికలకు వెళ్లే యోచనా చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

లోక్‌సభకు కేంద్రం ముందస్తు ఎన్నికలు నిర్వహించినా, రాష్ట్ర శాసనసభకు మాత్రం షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు.

ఒకవేళ కేంద్రం రాజ్యాంగ సవరణ చేసి శాసనసభకు కూడా ముందుగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తే న్యాయపోరాటం చేస్తామన్నారు.

గుంటూరు జిల్లా తెదేపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్య నేతలతో చంద్రబాబు గురువారం సమావేశమయ్యారని ఈనాడు రాసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)