పశ్చిమ బెంగాల్: నాలుగు రోజుల్లో ఇద్దరు బీజేపీ కార్యకర్తల హత్య

ఫొటో సోర్స్, SANJAY DAS
- రచయిత, ప్రభాకర్ ఎం.
- హోదా, బీబీసీ కోసం, కోల్‌కతా నుంచి
పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలో శనివారం ఉదయం మరో వ్యక్తి శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతం ఝార్ఖండ్ సరిహద్దును ఆనుకొని ఉంటుంది.
మృతుడిని 32 ఏళ్ల వయసున్న దులాల్ దాస్‌గా గుర్తించారు. ఆయన బీజేపీలో చురుకైన కార్యకర్త అని చెబుతున్నారు.
దులాల్ శవం బల్‌రామ్‌పూర్ ప్రాంతంలో ఒక హైటెన్షన్ విద్యుత్ టవర్‌కు వేలాడి ఉండగా స్థానికులు గమనించారు.
అంతకు ముందు, బుధవారం నాడు ఇదే బల్‌రామ్‌పూర్ ప్రాంతంలో మరో బీజేపీ కార్యకర్తను హత్య చేశారు. మృతుడిని త్రిలోచన్ మహతో (20)గా గుర్తించారు.
ఈ ఇద్దరు కార్యకర్తల హత్యకు బాధ్యత అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీదేనని బీజేపీ ఆరోపించింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు హత్య కేసులపై సీఐడీ విచారణకు ఆదేశించింది.


ఫొటో సోర్స్, SANJAYA DAS
రెండు హత్యలూ ఒకే విధంగా..
ఈ సమాచారం తెలియగానే బీజేపీ నేత ముకుల్ రాయ్ ఘటనా స్థలానికి బయలుదేరారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ, "పురులియా జిల్లాలో మా పార్టీకి చెందిన మరో కార్యకర్త హత్య జరిగింది. నేను ఘటనా స్థలానికి వెళ్తున్నాను. ఇది చాలా సీరియస్ విషయం" అని తెలిపారు.
"మూడు రోజుల క్రితం జరిగిన త్రిలోచన్ మహతో హత్య కూడా సరిగ్గా ఇలాగే జరిగింది" అని బీజేపీ జాతీయ కార్యదర్శి రాహుల్ సిన్హా తెలిపారు.
పంచాయతీ ఎన్నికల్లో బల్‌రామ్‌పూర్ ప్రాంతంలో తమ కాళ్ల కింది నేల కదిలినట్టు కాగానే తృణమూల్ కాంగ్రెస్ ఈ ప్రాంతంలో భయోత్పాతం సృష్టిస్తోందని రాహుల్ సిన్హా ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్‌లో గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బలరామ్‌పూర్ ప్రాంతంలోని మొత్తం ఏడు గ్రామ పంచాయతీలనూ బీజేపీ కైవసం చేసుకుంది.

ఫొటో సోర్స్, SANJAY DAS
'పోలీసులు ఏమీ చేయడం లేదు'
ఈ హత్యల వెనుక తృణమూల్ కాంగ్రెస్ హస్తం ఉందని బీజేపీ పశ్చిమ బెంగాల్ ఇన్‌చార్జి కైలాశ్ విజయవర్గీయ్ ఆరోపించారు. గత రాత్రి దులాల్‌ను అపహరించారన్న సమాచారం తెలియగానే తాను ఏడీజీ (శాంతిభద్రతలు) అనుజ్ శర్మతో మాట్లాడి అతని ఆచూకీ కనుగొనాలని కోరినట్టు విజయవర్గీయ్ తెలిపారు. కానీ పోలీసులు ఏమీ చేయలేదు. ఉదయం దులాల్ శవంగా తేలాడు.
ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో దులాల్ తమ పార్టీ తరఫున బాగా పని చేశాడని స్థానిక బీజేపీ నేత విద్యాసాగర్ చక్రవర్తి అన్నారు. దులాల్ బీజేపీలో చురుకైన కార్యకర్త అని ఆయన చెప్పారు.
బీజేపీ కార్యకర్త త్రిలోచన్ మహతో హత్యకు నిరసనగా శుక్రవారం నాడు పోలీస్ స్టేషన్ ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమానికి దులాల్ నేతృత్వం వహించాడని చక్రవర్తి చెబుతున్నారు.
స్థానికులు, విద్యాసాగర్ చక్రవర్తి చెబుతున్న ప్రకారం, పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా కార్యక్రమం తర్వాత దులాల్ సాయంత్రం ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన తన మోటర్ సైకిల్‌పై బయటకు వెళ్లారు.

ఫొటో సోర్స్, SANJAY DAS
హత్యలపై సీఐడీ విచారణ
దులాల్ కుటుంబ సభ్యులు ఆయన మొబైల్‌కు కాల్ చేయగా ఎవరో దాన్ని కట్ చేశారని వారంటున్నారు. రాత్రి బాగా పొద్దుపోయాక దులాల్ మోటర్ సైకిల్ ఒక చెరువు పక్కన లభ్యమైంది. కానీ దులాల్ ఆచూకీ తెలియలేదు. మరుసటి రోజు ఉదయం ఆయన శవం కరెంటు టవర్‌కు వేలాడుతూ కనిపించింది.
ఈ రెండు హత్యలపై సీఐడీ విచారణ జరుగుతుందని రాష్ట్ర శాంతిభద్రతల ఏడీజీ అనుజ్ శర్మ చెప్పారు.
మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డెరెక్ బ్రయన్ దీనిపై స్పందిస్తూ ఈ హత్యలకు సంబంధించి వేర్వేరు కోణాల్లో విచారణ జరపాలని అన్నారు. ఇందులో బీజేపీ, బజరంగ్ దళ్‌లతో పాటు సరిహద్దుకు అవతల, అంటే ఝార్ఖండ్‌లో ఉన్న మావోయిస్టుల పాత్రపై కూడా విచారణ జరగాలని అన్నారు.
అంతకు ముందు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, పార్లమెంటు సభ్యుడు అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ, "బీజేపీ, బజరంగ్ దళ్‌ల మధ్య జరిగిన అంతర్గత ఘర్షణల ఫలితమే మూడు రోజుల క్రితం జరిగిన త్రిలోచన్ మహతో హత్య" అన్నారు.

ఫొటో సోర్స్, SANJAY DAS
రాజకీయ హింస మరింత తీవ్రమవుతుందా?
బీజేపీలో అంతర్గత కొట్లాటల ఫలితమే ఈ హత్య అని బల్‌రామ్‌పూర్ ప్రాంతం తృణమూల్ నేత సృష్టిధర్ మహతో అన్నారు.
త్రిలోచన్ మహతో హత్య జరిగినప్పుడు హంతకులు ఆయన టీషర్టుపై ఒక లేఖను అంటించి వెళ్లారు.
"18 ఏళ్ల వయసులోనే బీజేపీలో పని చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. ఈరోజు నీ ప్రాణాలే పొయాయి" అని ఆ లేఖలో రాసి ఉంది.
రాజకీయ విశ్లేషకుడు విశ్వనాథ్ చక్రవర్తి ఈ పరిణామాలపై మాట్లాడుతూ, "వచ్చే సంవత్సరం జరుగనున్న లోక్‌సభ ఎన్నికలు, ఆ మరుసటి సంవత్సరం జరిగే విధానసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ రాజకీయ ఘర్షణలు, హింస మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది" అన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








