స్టెర్లైట్ కథ ముగిసిందా? ఇంకా ఉందా?

తూత్తుకుడి, స్టెరిలైట్, తమిళనాడు, వేదాంత
ఫొటో క్యాప్షన్, మే 22న తూత్తుకుడిలో పోలీసుల కాల్పుల్లో కనీసం 13 మంది మరణించారు

సోమవారం తమిళనాడు ప్రభుత్వం వివాదాస్పద స్టెర్లైట్ కాపర్ ప్లాంట్ మూసివేతకు ఆదేశించింది. ఈ ప్లాంట్ మూసివేత కోసం గత 20 ఏళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయి.

స్టెర్లై‌ట్‌కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించిన కొద్ది రోజుల అనంతరం ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

లక్షలాది మందిని కదిలించి, ఈ ఫ్యాక్టరీ మూతపడడానికి కారణమైన క్షేత్రస్థాయి ఉద్యమం నేపథ్యం ఏమిటో ఒకసారి చూద్దాం.

నిరసనకారులు ఎవరు?

తమిళనాడు నౌకాశ్రయ నగరం తూత్తుక్కుడి(ట్యూటికోరిన్)వాసులు ఈ కాపర్ ప్లాంట్ వల్ల పర్యావరణం దెబ్బ తింటోందని, వాయు కాలుష్యంతోపాటు, భూగర్భజలాలు కూడా కలుషితం అవుతున్నాయని ఎన్నో ఏళ్లుగా ఆందోళన చేస్తున్నారు.

ఈ కాపర్ ప్లాంట్ యజమాని అయిన వేదాంత సంస్థ ఈ ఆరోపణలను ఖండిస్తోంది.

22 ఏళ్లుగా నడుస్తున్న ఈ ప్లాంట్‌ను మూసివేయడాన్ని వేదాంత 'దురదృష్టకరమైన సంఘటన'గా అభివర్ణించింది.

4 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ 1995లో ప్రారంభమైనప్పటి నుంచి వివాదాలకు కేంద్రంగా ఉంది.

సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) కథనం ప్రకారం తమిళనాడులో అనుమతించడానికి ముందుగా, ఈ ప్లాంట్ 'భారీ కాలుష్య స్వభావం' కారణంగా మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌లు మొదట తమ రాష్ట్రాలలో నెలకొల్పడానికి నిరాకరించాయి.

ఆ ప్రాజెక్టు ప్రకటించిన నాటి నుంచే స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. స్థానికులు, పర్యావరణ సంస్థలతో కలిసి స్టెర్లైట్ వ్యతిరేక ఉద్యమంగా రూపుదిద్దుకుంది.

1996లో వేదాంత తూత్తుకుడిలో కాపర్ స్మెల్టర్‌ను నిర్మించింది. ఆ తర్వాత ప్రజా వ్యతిరేకతను లెక్క చేయకుండా తమిళనాడు కాలుష్యమండలి, పర్యావరణ మంత్రిత్వ శాఖలు దానికి అనుమతులు మంజూరు చేశాయి.

తూత్తుకుడి, స్టెరిలైట్, తమిళనాడు, వేదాంత

ఫొటో సోర్స్, AFP

ఉద్యమం అంత దీర్ఘకాలం ఎలా కొనసాగింది?

2003 నుంచి స్టెర్లైట్ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వామిగా ఉన్న నిత్యానంద్ జయరామ్, పర్యావరణానికి జరుగుతున్న నష్టం గురించి నిరంతరం అబద్దాలు చెబుతున్న కాపర్ ప్లాంట్‌పై ప్రజల్లో అంతర్గతంగా కోపం రగులుతూనే ఉందని బీబీసీకి తెలిపారు.

''ఆ కంపెనీ తమ గురించి పట్టించుకోవడం లేదని ప్రజల్లో ఆగ్రహం పెరుగుతూ వచ్చింది. అంతేకాకుండా స్టెర్లైట్ ప్రభుత్వ వ్యవస్థను తనకు అనుకూలంగా ఉపయోగించుకునేది. పర్యావరణానికి నష్టం జరుగుతోందన్న వాదనను తోసిపుచ్చేది'' అని జయరామ్ తెలిపారు.

గ్యాస్ లీకేజీలాంటి సంఘటనల వల్ల, నిరంతరం నిబంధనలను ఉల్లంఘించడం వల్ల, ప్రజల్లో ఆ కంపెనీపై క్రమంగా ఆగ్రహం పెరుగుతూ వచ్చింది.

కార్పొరేషన్లకు, ప్రభుత్వ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తమిళనాడులో దీర్ఘకాలం పాటు ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. విషపూరిత వ్యర్థాలను డంప్ చేయడానికి వ్యతిరేకంగా ఒక దశాబ్ద కాలం పోరాటం జరిగిన అనంతరం, 2016లో యూనిలీవర్ సంస్థ కొడైక్కానల్‌లోని తన ఫ్యాక్టరీని మూసేసింది. అలాగే కూడంకుళంలో అణు ప్లాంట్ నిర్మాణం, ఆపరేషన్‌కు వ్యతిరేకంగా అక్కడి స్థానికులు సుమారు 20 ఏళ్లపాటు నిరసనలు వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అక్షరాస్యత ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు ఎక్కువగా సమస్యలపై ప్రతిస్పందిస్తారని, స్టెరిలైట్ వ్యతిరేక ఉద్యమం విజయవంతం కావడానికి ఇదే కారణమని బీబీసీ ప్రతినిధి మురళీధరన్ కాశీ విశ్వనాథన్ తెలిపారు.

అంతే కాకుండా తమిళనాడులో పర్యావరణ ఉద్యమాలు చాలా బలంగా ఉన్నాయని, సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన ప్రజలు వాటిలో పాలు పంచుకుంటారని ఆయన తెలిపారు.

''స్టెర్లైట్ వ్యతిరేక ఉద్యమంలో చిన్న దుకాణాల యజమానులు, వ్యాపారులు, చివరికి మత్స్యకారులు కూడా పాలుపంచుకున్నారు. 1997లో ఆస్ట్రేలియాకు చెందిన 2 ఓడలు తూత్తుకుడి నౌకాశ్రయంలో లంగరు వేసి, స్టెరిలైట్ దింపడానికి ప్రయత్నించాయి. కానీ జాలరులు వాటిని తమ బోట్లతో చుట్టుముట్టి అడ్డుకున్నారు'' అని తెలిపారు.

తూత్తుకుడి, స్టెరిలైట్, తమిళనాడు, వేదాంత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్టెరిలైట్ వల్ల వాయుకాలుష్యం, భూగర్భజలాలు కలుషితం కావడం జరుగుతోందని నిరసనకారులు అంటున్నారు

మూసివేతకు దారి తీసిన పరిస్థితులేంటి?

మే 22న తూత్తుక్కుడి వాసులు స్టెర్లైట్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు 100 రోజులు పూర్తయిన సందర్భంగా, పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు.

శాంతియుతంగా కొనసాగుతున్న నిరసనలను పోలీసులు అడ్డుకోవడంతో అది హింసాత్మకంగా మారింది. నిరనసకారులు జిల్లా ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో తాము కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.

పోలీసుల కాల్పుల్లో 13 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

నిరసనకారులు అదుపుతప్పడం వల్లనే వారిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు, ప్రభుత్వాధికారులు సమర్థించుకున్నారు. అయితే పోలీసు కాల్పులపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో మూడు రోజుల తర్వాత ప్రభుత్వం ప్లాంట్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

తూత్తుకుడి, స్టెరిలైట్, తమిళనాడు, వేదాంత

స్టెర్లైట్ కాపర్ కథ ముగిసినట్టేనా?

ఇది చెప్పడం చాలా కష్టం. ఆ ప్లాంట్‌ను మూసేయడం ఇది మొదటిసారి కాదు. గ్యాస్ లీకేజీలు, వాయుకాలుష్యం, భూగర్భజలాలు కలుషితం కావడం తదితర కారణాలతో గతంలో ప్లాంట్ మూడుసార్లు మూతపడింది.

ప్లాంట్ మూసివేతపై తూత్తుక్కుడివాసులు హర్షం వ్యక్తం చేస్తుంటే, విమర్శకులు, కార్యకర్తలు మాత్రం ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఆదేశాలను ఆ సంస్థ కోర్టులో సవాలు చేసే అవకాశం లేకపోలేదని జయరామ్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాలలో ఆ ప్లాంట్‌లో గత కొన్నేళ్లుగా జరుగుతున్న నిబంధనల ఉల్లంఘన ప్రసక్తే లేదు. కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసే ఆదేశాలు చాలా బలహీనంగా ఉంటాయని, గతంలో అవి కోర్టులో నిలబడలేదని జయరామ్ గుర్తు చేస్తున్నారు.

వేదాంత భారత ప్రతినిధి పి.రామనాథ్ ఇప్పటికే ప్లాంట్ మూసివేతపై చట్టపరంగా పోరాడతామని అన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థపై ఈ మూసివేత ప్రభావం ఎలా ఉంటుంది?

తూత్తుక్కుడిలోని కాపర్ స్మెల్టర్ ప్రపంచంలోనే ఏడో అతి పెద్ద స్మెల్టర్. మొత్తం భారతదేశ కాపర్ అవసరాల్లో 36 శాతం ఈ కంపెనీనే తీరుస్తోంది.

దీనిని మూసేస్తే దేశంలో కాపర్‌కు డిమాండ్ పెరిగి, దాని ధర పెరిగే అవకాశం ఉంది. దీనిని పూరించడానికి కాపర్‌ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే దాని వల్ల భారతదేశంపై ఏడాదికి రూ.20 వేల కోట్లకు పైగా భారం పడే అవకాశం ఉంది.

దాంతోపాటు సుమారు 3,500 మంది స్టెరిలైట్ ఉద్యోగులు రోడ్డున పడతారు.

దేశంలోని ఇతర కాపర్ ప్లాంట్లలో తమకు ఉద్యోగాలు దొరికే అవకాశం చాలా తక్కువని స్టెరిలైట్ ఇంజనీర్ ఒకరు బీబీసీకి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)