కాంగ్రెస్ ఖజానా ఖాళీ అయిందా? డబ్బులు లేకుండానే పార్టీని నడిపిస్తోందా?

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లోని అత్యంత పురాతన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్య్రం వచ్చాక ఈ 71 ఏళ్లలో 49 ఏళ్ల పాటు ఆ పార్టీనే దేశాన్ని పాలించింది.
ఇప్పుడా పురాతన పార్టీ తమకు విరాళాలు ఇవ్వాలని ట్విటర్‌లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.
దేశంలోని ప్రధాన ప్రతిపక్షం ఇలా ప్రజలను విరాళాలు కోరడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
బ్రిటీష్ వలసరాజ్య పాలన నుంచి విముక్తి కోసం ధనవంతులైన కొందరు మేధావులు 1885లో కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.
దేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీ ఎన్నో రాజకీయ పోరాటాలు చేసింది. పూర్తిస్థాయిలో ప్రజలకు చేరువైంది. ఊహించని స్థాయిలో పార్టీకి విరాళాలు వెల్లువెత్తాయి.
కానీ, ఇప్పుడు అదే పార్టీ 'మీకు వీలైనంత చిన్న మొత్తమైనా విరాళంగా ఇవ్వండి' అంటూ తన అధికారిక ట్విటర్‌లో గురువారం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ ట్వీట్‌కు ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
చాలా మంది పార్టీ పరిస్థితిని అంగీకరిస్తూనే రిట్వీట్ చేస్తున్నారు. మరికొంత మంది ఈ ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు ఈ ట్వీట్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
అయితే, దేశంలోని పురాతన పార్టీ ఇలా నిధుల లేమితో ఉందనే విషయం నమ్మశక్యంగా లేదని చాలామంది భావిస్తున్నారు.
మద్దతుదారులు ఇచ్చిన డబ్బులతోనే పార్టీని నడిపిస్తున్నామని, తమ పార్టీ పారదర్శకంగా ఉందని చెప్పే ప్రయత్నంలో ఇది భాగమా? నిజంగానే పార్టీ నిధుల కొరతతో ఉందా ?
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అసలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎంత డబ్బుంది?
''మా దగ్గర నిధులు లేవు'' అని కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ దివ్యా స్పందన( కన్నడ సినీ నటి రమ్య) తెలిపినట్లు బ్లూంబర్గ్ మీడియా పేర్కొంది.
అయితే, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం 2017లో కాంగ్రెస్ పార్టీ దగ్గర సుమారు రూ.223 కోట్ల నిధులు ఉన్నాయి.
ఇదేమీ తక్కువ మొత్తం కాదు. అధికారంలో ఉన్న బీజేపీ కంటే కాస్త తక్కువ మాత్రమే. రూ.1,026 కోట్లతో దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా బీజేపీ నిలిచింది.
ఇప్పటికీ దేశంలోని రెండో ధనిక పార్టీ కాంగ్రెస్సే. అయితే, ఈ పార్టీకి 2017లో సుమారు రూ.35.89 కోట్ల మేర ఆదాయం తగ్గింది.
విరాళాలు, పార్టీ సభ్యులు చెల్లించే చందాలు, డిపాజిట్లపై వడ్డీలు తదితర మార్గాల్లో వచ్చిన డబ్బును పార్టీలు తమ వద్ద ఉన్న నిధులుగా ప్రకటిస్తుంటాయి. అయితే, ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే.. పార్టీల దగ్గర పోగుబడే సంపదకు ఇంకేమైనా మార్గం ఉందా అని?
దేశంలోని పార్టీలన్నీ తమ దగ్గరున్న నిధులను ప్రకటిస్తుంటాయి. కానీ, వారి లెక్కాపత్రంలో పారదర్శకత ఉండదు.
దేశంలోని వివిధ పార్టీలను పరిశీలిస్తే వారికి వచ్చిన నిధుల్లో 69 శాతం తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చినవేనని ఏడీఆర్ 2017లో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఏ పార్టీయైనా నిధుల కొరత ఎలా ఎదుర్కొంటుంది?
దేశంలో ఎన్నికల్లో పోటీ చేయడం చాలా ఖరీదైన వ్యవహారం. 2014 ఎన్నికల్లో దేశంలోని అన్ని పార్టీలు కలిపి రూ.33 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాయని ఒక అంచనా.
అధికారంలోకి రాకుండా సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉండే పార్టీకి నిధుల భయం సహజంగానే ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఆర్థిక పరిస్థితి దాని రాజకీయ స్థితిని ప్రతిబింబిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 20 శాతం ఓట్లే పొందింది. 543 పార్లమెంటరీ స్థానాల్లో కేవలం 44 సీట్లనే గెలుచుకుంది. ఇంత తక్కువ సీట్లు సాధించడం కాంగ్రెస్‌కు ఇదే మొదటిసారి.
ప్రస్తుతం రెండు పెద్ద రాష్ట్రాలు కర్ణాటక, పంజాబ్‌లతో పాటు మరో రెండు చిన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ దాని మిత్రపక్షాలు దేశంలోని 29 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పై ప్రభావం పడుతుందా?
''విరాళాల కోసం కాంగ్రెస్ ప్రజలను కోరడం మంచి ప్రచార ఎత్తుగడ'' అని ఏడీఆర్ ట్రస్టీ విపుల్ ముద్గల్ అభివర్ణించారు.
''కార్పొరేట్ కంపెనీలు, ధనవంతుల నుంచి అనుకున్న స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి నిధులు అందడం లేదు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ సరైన దిశలో కదిలింది. ఇలా ప్రజలను విరాళాలు కోరడం ద్వారా తమ పార్టీ పారదర్శకంగా ఉందని అది చెప్పుకోవచ్చు. '' అని ఆయన విశ్లేషించారు.
ఏ పార్టీ దగ్గర ఎంత డబ్బుందని తెలుసుకునే మార్గమేదీ లేదని, ఇదే పెద్ద సమస్య అని ముద్గల్ పేర్కొన్నారు.
ఇప్పుడు ఎవరైనా ఎలక్ట్రోరల్ బాండ్లను కొనొచ్చు. అయితే, వారి పేర్లు బయట పెట్టాల్సిన అవసరం లేదు. అయితే, కొన్న బాండ్లను 15 రోజుల్లో ఏదో ఒక పార్టీ బ్యాంకు ఖాతాలోకి మళ్లించాలి.
ఈ బాండ్లు కూడా విరాళం వంటివే. అయితే, పార్టీలు తమకు బాండ్ల రూపంలో వచ్చిన నిధులు, వాటిని అందించిన వారి వివరాలను బయటపెట్టాల్సిన అవసరం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల వేళ నల్లధనం భారీగా ప్రవహిస్తుందని ముద్గల్ అభివర్ణించారు. రాష్టాల్లో జరిగే ఎన్నికల్లో ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి సగటున రూ.9.5 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆయన అంచనా వేశారు. అయితే, పార్టీలు వెల్లడిస్తున్న లెక్కలు దీని కంటే తక్కువగా ఉండటం గమనార్హమని తెలిపారు.
ర్యాలీలు, ఎన్నికల ప్రచారం దేశంలో అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారాయి. ప్రచారం వేళ చార్టర్డ్ ఫ్లయిట్స్ వినియోగం, సోషల్ మీడియా వ్యూహాలు పెరిగిపోయాయి. 2019లో దేశంలోని 545 స్థానాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడమంటే అన్ని పార్టీలు తమ ఖజానాను ఖాళీ చేయాల్సిందే. దేశంలోని అతిపురాత పార్టీ ఇలా ఖర్చు చేసి మనగలదా అనేదే పెద్ద ప్రశ్న.
ఇవి కూడా చదవండి:
- హిట్లర్ మరణించాడని ప్రపంచానికి బీబీసీ ఎలా చెప్పింది?
- బాలీవుడ్ సినిమాల్లో నడివయస్సు ప్రేమకు చోటేది?
- ఒక పక్షి తెలుగు గంగ ప్రాజెక్టు ఆపింది.. ఒక సాలీడు 'తెలంగాణ' పేరు పెట్టుకుంది
- అత్యాచారానికి గురైన ఓ అబ్బాయి కథ ఇది!
- పేదలకూ, సంపన్నులకూ మధ్య తేడా తెలియాలంటే ఈ ఫొటోల్ని చూడాల్సిందే!
- ‘గూగుల్ నా వీడియోలను కొట్టేసింది’
- మైకేల్ జాక్సన్: అసలా స్టెప్పులు ఎలా వెయ్యగలిగాడు? పరిశోధనలో ఏం తేలింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








