#గమ్యం: ఎంత సేపు చదివామనేది కాదు, ఎంత ఫోకస్డ్‌గా ఉన్నామనేదే ముఖ్యం!

ఫొటో సోర్స్, iStock
- రచయిత, అనిల్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.
జేఈఈ మెయిన్స్ ఫలితాలు ఈ మధ్యే వచ్చాయి. 12.5 లక్షల మంది ఈ పరీక్షకు హాజరైతే దాదాపు 2.3 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్సుడుకు అర్హత సాధించారు.
దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న 9000 సీట్లకు మే 20న జేఈఈ అడ్వాన్సుడు పరీక్ష మొదటిసారిగా పూర్తిగా ఆన్‌లైన్‌లో జరగబోతోంది.
ఇప్పుడు మనకున్నది కేవలం వారం రోజులే. ఈపాటికే మీ అందరి ప్రిపరేషన్ ఓ కొలిక్కి వచ్చి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందేమీ లేదు.
కానీ ఈ వారం రోజుల్లో ఏ రకంగా పరీక్షకు సిద్ధం కావాలి, ఏయే తేదీలను గుర్తుంచుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై కొన్ని సలహాలు, సూచనలు ఈ వారం 'గమ్యం'లో వివరిస్తున్నారు Careers360.com డైరెక్టర్ రామలక్ష్మి పేరి.
మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి.
జేఈఈ 2018 - ముఖ్యమైన తేదీలు
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: మే 14
- జేఈఈ అడ్వాన్సుడు పరీక్ష: మే 20 (ఉదయం గం. 9-12 వరకు పేపర్-1, మధ్యాహ్నం గం. 2-5 వరకు పేపర్-2)
- ఆన్సర్ కీ విడుదల: మే 29న ఉదయం 10 గంటలకు
- అభ్యంతరాల స్వీకరణ: మే 29-30
- ఫలితాలు: జూన్ 10
- కామన్ కౌన్సెలింగ్: జూన్ 19 నుంచి జులై 15 వరకు
మీరు రాసిన సమాధాన పత్రాలు స్కాన్ చేసి అందుబాటులో ఉంచుతారు. వీటిని ఆన్సర్ కీతో సరిచూసుకుని, మీకేమైనా అభ్యంతరాలుంటే వెంటనే నిర్వాహకులకు తెలియచేయవచ్చు.
మొదటిసారి ఆన్‌లైన్ విధానంలో...
జేఈఈ అడ్వాన్సుడు పరీక్ష చాలా కఠినంగా ఉంటుంది. సాధారణ సన్నద్ధత ఏమాత్రం సరిపోదు. కచ్చితంగా చాలా లోతైన ప్రిపరేషన్ అవసరం. సబ్జెక్టుపై పూర్తి అవగాహనతో ఉండాలి.
గత సంవత్సరం వరకూ రాత పరీక్షగా ఉన్న జేఈఈ అడ్వాన్సుడు పరీక్ష ఈ సంవత్సరం నుంచి పూర్తిగా ఆన్‌లైన్‌లో జరగబోతోంది.
దీన్ని విద్యార్థులకు అలవాటు చేసే ఉద్దేశంతో నిర్వాహకులు గత డిసెంబరు నుంచి ఇప్పటివరకు 6 మాక్ ఆన్‌లైన్ పరీక్షలను అందుబాటులో ఉంచారు.
వీటిని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. దీంతో మీకు ఆన్‌లైన్ పరీక్ష విధానంపై అవగాహన కలుగుతుంది.

ఫొటో సోర్స్, iStock
పరీక్ష విధానం
మీ ప్లస్2లోని మ్యాథమాటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలోని అంశాలపై సాధారణంగా ప్రశ్నలు ఉంటాయి. కానీ విద్యార్థి లోతైన విశ్లేషణ, అవగాహన, అప్లికేషన్... ఇవన్నీ పరీక్షించేలా ఉంటాయి.
ఈ పరీక్షలో నాలుగు రకాల ప్రశ్నలుంటాయి...
- మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు: ఇచ్చిన సమాధానాల్లో ఏదో ఒకటే సరైన సమాధానం.
- మల్టిపుల్ ఆన్సర్ ప్రశ్నలు: ఇచ్చిన సమాధానాల్లో ఎన్నైనా సరైన సమాధానాలుండవచ్చు. అన్నీ కూడా కరెక్టే కావచ్చు. అందువల్ల వీటిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సమయం ఎక్కువ పడుతుంది. ఈ తరహా ప్రశ్నలకు సమాధానాలివ్వడాన్ని ముందుగానే బాగా ప్రాక్టీస్ చేయాలి.
- ఇంటీజర్ ప్రశ్నలు: ఈ ప్రశ్నలకు సమాధానం 0 నుంచి 9 మధ్యలో ఉన్న ఏదో ఒక సంఖ్యగా ఉంటుంది. దాన్ని గుర్తించాలి.
- కాంప్రెహెన్షన్
ఇప్పుడున్న వారం రోజుల్లో అన్నీ మొదటి నుంచి చదవడం కష్టం. చదివితే గుర్తుండని అంశాలు ఓసారి షార్ట్ నోట్స్ రూపంలో రాసుకుంటే గుర్తుండే అవకాశం ఉంది.
అందువల్ల ముందునుంచీ సిద్ధం చేసుకున్న షార్ట్ నోట్స్, ఫార్ములే వంటివి మరోసారి చూసుకోండి.
ఒక్కోసారి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. ఇది ప్రతి సంవత్సరం మారిపోతుంది. దీనికి తగ్గట్లుగానే మీ వ్యూహం కూడా ఉండాలి.
నెగెటివ్ మార్కింగ్ ఉంటే... సమాధానం తెలియదు అని కచ్చితంగా అనుకుంటే వాటిని ఆన్సర్ చేయకపోవడమే మంచిది.

ఫొటో సోర్స్, iStock
పాత పేపర్లు, మాక్ పేపర్లు/టెస్టులు
జేఈఈ అడ్వాన్సుడుకు బట్టీ పద్ధతి పనికిరాదు. అంశాలను అర్థం చేసుకోవాలి. వాటిని ఎలా అన్వయించుకోవాలో (అప్లికేషన్) తెలిసి ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇవన్నీ చేయాలంటే సమయపాలన సమర్థంగా ఉండాలి.
పాత ప్రశ్నపత్రాలు, మాక్ పేపర్లను ప్రాక్టీస్ చేయండి. ఎంత సేపు చదివామనేది ముఖ్యం కాదు, ఎంత ఫోకస్డ్‌గా, స్మార్ట్‌గా చదివారనేదే ఇప్పుడు అవసరం. మీకు ఏ అంశాలపై బాగా పట్టుందో వాటిని మరోసారి చదువుకోండి. మీకు అర్థంకాని అంశాల్లో ముఖ్యమనుకున్నవాటిని కూడా కొద్దిగా ఎక్కువ సమయం కేటాయించి మరొకసారి ప్రాక్టీస్ చేయండి.
గత సంవత్సరాల్లో విజయం సాధించిన విద్యార్థులు ఇచ్చిన సలహాలు, సూచనలను పాటించండి. వారి అనుభవాలన్నీ మీకు మంచి పాఠాలే.

ఫొటో సోర్స్, iStock
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో చేరాలనుకున్నవారు జూన్ 10న ఆప్టిట్యూడ్ టెస్ట్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. జూన్ 14న పరీక్ష జరుగుతుంది. దీని ఫలితం జూన్ 18న వస్తుంది. ఈ కోర్సు రెండు ఐఐటీల్లో అందుబాటులో ఉంది.
ఆ తర్వాత జూన్ 19 నుంచి జులై 15 వరకు జరిగే కామన్ కౌన్సెలింగ్‌కు సిద్ధమవ్వాల్సి ఉంటుంది. మీరనుకున్న బ్రాంచిలో సీటు దక్కించుకోవాలంటే మీ పూర్తి సామర్థ్యాలను ఉపయోగించాల్సి ఉంటుంది.
జేఈఈ అడ్వాన్సుడులో రెండు పేపర్లుంటాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటిది, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకూ రెండో పేపర్ జరుగుతుంది. ఈ మధ్యలో ఎక్కడికో బయటకు వెళ్లి భోజనం చేసి రావడం మంచిది కాదు. మీతోపాటు పరీక్ష కేంద్రానికి తోడుగా వచ్చేవారిని మీకు అవసరమైన ఆహారాన్ని సిద్ధంగా ఉంచాలని చెప్పండి.
ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే!
పరీక్షకు హాజరయ్యే అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే, నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. నిర్వాహకులు ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు.
డ్రెస్ కోడ్ చాలా కచ్చితంగా పాటించాలి. పొడుగు చేతులు ఉన్న బట్టలు (అమ్మాయిలు, అబ్బాయిలు) వేసుకోకూడదు. బట్టలకు పెద్ద పెద్ద బటన్స్ ఉండకూడదు. సాధారణ చెప్పులు వేసుకోవాలి, హీల్స్, బూట్లు, సాక్సులు ధరించకూడదు.
ఎలాంటి పేపర్లూ తీసుకెళ్లవద్దు. ఇక ఫోన్లు, ఐపాడ్లు వంటివి అసలే తీసుకురానివ్వరు.
సాధారణ వాచీని ధరించవచ్చు.
నగలు (ఉంగరాలు, ముక్కుపుడక, గాజులు, బ్రేస్లెట్ మొదలైనవి) ధరించకూడదు.
ఓ బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్లవచ్చు. పరీక్షకు సంబంధించిన నిబంధనలన్నీ మరోసారి క్షుణ్నంగా చదువుకోండి.
మరింత సమాచారం కోసం ఈ కిందనున్న లింకులను చూడండి.
ఇవి కూడా చదవండి:
- #గమ్యం: కామర్స్ + సర్టిఫికేషన్లు = ఉద్యోగం!
- #గమ్యం: బీటెక్ తర్వాత ఏం చేయాలి? ఎంబీఏ-ఎంటెక్-జాబ్!?
- #గమ్యం: సైన్స్ పరిశోధనలకు ప్రోత్సాహం... ఇన్స్పైర్ స్కాలర్షిప్
- #గమ్యం: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ - ఎంటెక్కు ఏది బెస్ట్?
- #గమ్యం : 2020 తర్వాత వైద్యరంగంలో ఈ కోర్సులదే హవా
- #గమ్యం: సెలవుల్లో ఇంటర్న్‌షిప్ - ఉద్యోగ వేటలో మెరుగైన అవకాశాలు
- #గమ్యం: డిగ్రీలు లేకుండా ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడం ఎలా?
- #గమ్యం: వైజ్ఞానిక పరిశోధకులకు అండ.. కేవీపీవై స్కాలర్షిప్
- #గమ్యం: ‘గేట్’ స్కోరుతో మీకు తెలియని ఉపయోగాలు
- #గమ్యం: వైద్య అనుబంధ రంగాలు - అవకాశాలు ఎక్కువ, అభ్యర్థులు తక్కువ
- #గమ్యం: విదేశాల్లో మెడిసిన్ చదవాలన్నా నీట్ తప్పనిసరి
- #గమ్యం: ఎప్పటికీ వన్నె తరగని హోటల్ మేనేజ్మెంట్
- #గమ్యం: లా చదివితే లాయరే కానక్కర్లేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









