డ్యాన్సర్ కావాలనుకున్న ఆ అమ్మాయిని ఆత్మహత్య వైపు నెట్టిందెవరు?

- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పరీక్షలో ఫెయిల్ అయ్యామనో, లేదా తక్కువ మార్కులొచ్చాయన్న బాధతోనో పిల్లలు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు దేశమంతటా వినవస్తున్నాయి.
ఇటీవల దిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో ఓ ప్రైవేటు స్కూలులో చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలికకు ఈ సంవత్సరం సోషల్ స్టడీస్, సైన్స్ సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చాయట.
స్కూలు టీచర్ తమ కూతురు పట్ల దురుసుగా ప్రవర్తించాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మార్కులు తక్కువ వచ్చినందుకు ఆమెను ఎద్దేవా చేయడమే కాకుండా, రీ-టెస్ట్‌లో కూడా ఫెయిల్ చేస్తానని టీచర్ బెదిరించినట్టు వారి ఆరోపణ.
దీంతో విసుగు చెంది తన ప్రాణాలు తానే తీసుకోవాలనే తీవ్ర నిర్ణయానికి ఆమె వచ్చినట్టు కుటుంబం చెబుతోంది. అయితే ఈ ఆరోపణలను స్కూల్ అడ్మినిస్ట్రేషన్ తోసిపుచ్చింది.
పోలీసులు ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్‌లో స్కూల్ ప్రిన్సిపల్‌తో పాటు మరో ఇద్దరు టీచర్ల పేర్లు నమోదు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు పిల్లలు తమ సమస్యలేమిటో తల్లిదండ్రులకు చెప్పుకుంటారా?
అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే - పరీక్షలో మార్కులు తక్కువ రావడమనేది ఒక విద్యార్థిని తన ప్రాణాలు తానే తీసుకునేంత తీవ్ర సమస్యా?
తల్లిదండ్రులు ఆమె ఆత్మహత్యకు పాల్పడకుండా అడ్డుకోగలిగేవారా? ప్రముఖ విద్యావేత్త పూర్ణిమా ఝాను నేనీ ప్రశ్న అడిగాను. పూర్ణిమ పిల్లల కోసం యాపీస్టోర్ అనే వెబ్‌సైట్ నడుపుతారు.
పిల్లలెవరూ ఎకాయెకిన ఇంత పెద్ద చర్యకు పూనుకోలేరని ఆమె అభిప్రాయపడ్డారు. దాని వెనుక ఓ చరిత్ర ఉంటుంది. తల్లిదండ్రులకు ఆ చరిత్రేమిటో కొంతైనా తెలిసి ఉండాలి. తెలియలేదంటే తల్లిదండ్రులుగా వారు మరింత చింతించాల్సిన విషయం అవుతుంది.
కొద్ది నెలల క్రితం తాను సోషల్ మీడియాలో 'మమ్మీకి చెప్పావా'? అనే ప్రాజెక్టుతో ఒక చిన్న ప్రయోగం చేసినట్టు ఆమె చెప్పారు. ఇందులో భాగంగా, పిల్లలు తమకు సంబంధించిన ప్రతి విషయాన్నీ తమ తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటున్నారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు.

'డిజిటల్ ఏజ్ కిడ్స్'
తమ పిల్లలు కేవలం సంతోషాన్ని మాత్రమే తమతో పంచుకుంటారనీ, వారి బాధల్ని చెప్పుకోరనే విషయం 5000 మంది తల్లులకు ఈ ప్రయోగం ద్వారా తెలిసిందని పూర్ణమా ఝా అన్నారు.
ఈ ప్రయోగంలోనే అసలు విషయం ఇమిడి ఉందని ఆమె అంటారు.
నేటి తరం పిల్లలు 'డిజిటల్ ఏజ్ కిడ్స్' అని పూర్ణిమ అభిప్రాయం. వారు తమ సుఖదుఃఖాలను తల్లిదండ్రులతో పంచుకోకున్నా, సోషల్ మీడియాలో మాత్రం తప్పక షేర్ చేస్తారు. తల్లిదండ్రులకు పిల్లల గురించి వారి ప్రొఫైల్‌ను పరిశీలించడం ద్వారా చాలా విషయాలు తెలుసుకునే, అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది.
ఆత్మహత్యకు పాల్పడ్డ బాలిక కూడా నెల రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో 'జీవితం, డాన్స్' విషయంలో ఒక పోస్ట్ చేసింది.
ఆ ఒక్క పోస్ట్‌తో ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఏంటో స్పష్టంగా తెలుస్తుందని పూర్ణిమ అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
'చదువే సర్వస్వం'
ఈ మొత్తం వ్యవహారంలో స్కూలు టీచర్లు ఎంత దోషులో, ఆ విద్యార్థిని తల్లిదండ్రులు కూడా అంతే దోషులని ముంబయికి చెందిన పిల్లల సైకాలజిస్ట్ రేణు నరగుండే అభిప్రాయపడ్డారు.
"ఇంట్లోనైనా, స్కూలులోనైనా చదువు విషయంలో వాతావరణం ఎలా తయారై ఉందంటే మార్కులు సంపాదించడమే సర్వస్వం అన్నట్టుగా మారిపోయింది. పిల్లలకు తక్కువ మార్కులొచ్చినా లేదా ఫెయిల్ అయినా, స్కూలులోని వారు లేదా ఇరుగుపొరుగు వారు వారిని తక్కువ చేసి చూడడంలో క్షణం ఆలస్యం చేయరు. దాంతో పిల్లల్లో ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోతుంది" అని రేణు అన్నారు.
దిల్లీలో ఆత్మహత్యకు పాల్పడ్డ బాలిక విషయంలోనూ ఇదే జరిగి ఉండడానికి ఎక్కువ అవకాశం ఉందని ఆమె అన్నారు.
'చదువే సర్వస్వం' అనే ఆలోచనను మొట్టమొదట తల్లిదండ్రులు వదిలించుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
మరి తల్లిదండ్రులు ఏం చెయ్యాలి?
అంటే అసలు తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుకొమ్మని అనడం కూడా మానెయ్యాలా?
"అలా ఎంత మాత్రం కాదు. తాము తమ పిల్లల చదువు విషయంలో ఎప్పుడు, ఏ మేరకు జోక్యం చేసుకోవాలన్నదే తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సి ఉంది" అని రేణు అంటారు.
దీన్ని అర్థం చేసుకునేందుకు రేణు ఒక సులువైన పద్ధతి చెబుతారు.
"పిల్లలకు సైకిల్ నడపడం నేర్పించేటప్పుడు మనం మధ్యమధ్యలో సైకిల్‌ను పట్టుకుంటాం. మళ్లీ వదిలేస్తుంటాం. కొంత సమయం తర్వాత వారికి ఏమీ చెప్పకుండా వారంతట వారే సైకిల్ నడిపించేలా వారికే వదిలేస్తాం. తద్వారా పిల్లలు బ్యాలెన్స్ చేయడం ఎలాగో నేర్చుకుంటారు. పిల్లల చదువు విషయంలో కూడా మనం సరిగ్గా అలాగే చేయాలి" అని ఆమె చెప్పారు.
"తక్కువ మార్కులు వచ్చినందుకు పిల్లలు ఒత్తడికి లోనవుతున్నట్టు అనిపిస్తే తల్లిదండ్రులు వారి కోసం ఎక్కువ సమయం కేటాయించాలి. పిల్లలు ఏ విషయంలో చాలా మెరుగ్గా ఉన్నారో వారికి చెప్పాలి."

అతి పెద్ద పొరపాటు
ప్రతి పిల్లవాడూ చదువులో టాప్‌లో ఉండలేడన్న విషయాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలన్నది రేణు అభిప్రాయం. కొందరు పిల్లలు స్పోర్ట్స్‌లో రాణించవచ్చు. మరి కొందరికి పాటలు లేదా డ్యాన్స్ అంటే ఇష్టం కావచ్చు. మరి కొందరికి ఫొటోగ్రఫీలో ఆసక్తి ఉండొచ్చు.
"తల్లిదండ్రులూ, బడిలో ఉపాధ్యాయులు కలిసి పిల్లలలో ఉన్న సామర్థ్యం ఏమిటో సరైన సమయంలో గుర్తించగలగాలి."
దిల్లీలో ఆత్మహత్య చేసుకున్న బాలిక డ్యాన్స్ బాగా చేసేది. ఆమె తల్లిదండ్రులు కూడా అదే అన్నారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత తల్లిదండ్రుల వైపు నుంచి అతి పెద్ద పొరపాటు ఇక్కడే జరిగింది.
తమ కూతురు ఇంట్లో మాటిమాటికీ తన రిపోర్ట్ కార్డ్‌ను తీసి చూస్తున్నప్పుడు ఆమె పరిస్థితి సరిగా లేదన్న విషయం తల్లి అర్థం చేసుకోవాల్సింది.
'సేఫ్ కెరీర్'ను ఎంచుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేసినప్పుడే పిల్లలు తరచుగా ఇలాంటి చర్యలకు పూనుకుంటారని ఉషా అల్బుకర్క్ అన్నారు. ఆమె దిల్లీలో పిల్లలకు కెరీర్ గురించి సలహాలిస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
'సేఫ్ కేరీర్' ఒక్కటే కాదు..
ఈ రోజుల్లో ఇంజినీరింగ్, మెడికల్, ఎంబీఏ, సివిల్ సర్వీస్, లా - ఈ ఐదింటినే తల్లిదండ్రులు 'సేఫ్ కెరీర్'గా పరిగణిస్తున్నారు. మనలో ఈ ఆలోచనా సరళి మారాలి. ఎందుకంటే ఈ కారణంగానే పిల్లల్లో ఒత్తిడి బాగా పెరుగుతోంది.
ఇకపోతే స్కూల్స్ నిర్ణయించుకునే టార్గెట్లు మరో పెద్ద సమస్యని ఉష అంటారు.
విద్యార్థులకే కాకుండా పాఠశాలలకు కూడా రిపోర్ట్ కార్డ్ ఉంటుంది. ఈ రోజుల్లో ఏ స్కూలూ తమ బోర్డు పరీక్షల ఫలితాల్లో 60 లేదా 70 శాతం మార్కులు సాధించే విద్యార్థులను చూపించాలని అనుకోవడం లేదు. అలా తక్కువ మార్కులు సాధించే వాళ్లను 9 లేదా 11వ తరగతుల్లోనే ఆపేస్తుంటారు.
దీని నుంచి ఎలా బయటపడాలో కూడా ఉష చెబుతారు.
ఇలాంటి పరిస్థితిలో ఎంత త్వరగా కౌన్సెలర్ వద్దకు వెళ్తే ఫలితం అంత మెరుగ్గా ఉంటుందని ఆమె అంటారు. తక్కువ మార్కులు సాధించే పిల్లల కోసం కూడా ఎన్నో ప్రత్యామ్నాయ కెరీర్లు ఉన్నాయి. వారు వాటిలో రాణించడమే కాదు, జీవితంలో సక్సెస్ కూడా అవుతారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








