కశ్మీర్: నాడు జవాన్ల దాడిలో చూపు కోల్పోయిన అమ్మాయి.. నేడు టెన్త్ పాసయ్యింది

ఫొటో సోర్స్, Abid Bhat
- రచయిత, అబిద్ భట్
- హోదా, బీబీసీ కోసం
ఇన్షా ముస్తాక్.. మెడిసిన్ చదివి డాక్టర్ అవ్వాలని ఒకప్పుడు కలలు కనేది. కానీ భారత సైన్యం జరిపిన పెల్లెట్ల దాడిలో ఆమె చూపు పోయింది. కలలూ కరిగిపోయాయి.
2016లో నిరసనకారులపై భారత సైన్యం పెల్లెట్లు ప్రయోగించింది. ఆ దాడిలో గాయపడిన ఇన్షా, దురదృష్టవశాత్తూ తన చూపును కోల్పోవాల్సి వచ్చింది. దాంతో డాక్టర్ కావాలనుకున్న తన లక్ష్యాన్ని పక్కనబెట్టి ఆమె సంగీతంలో రాణించాలని నిశ్చయించుకున్నారు.
ఇటీవలే ఇన్షా తన పదో తరగతి పరీక్షలు పాసయ్యారు. ఈ సందర్భంగా.. చూపు కోల్పోయిన తరవాత ఈ 18నెలల్లో ఆమె జీవితం ఎలా గడిచిందో తెలుసుకోవడానికి బీబీసీ ఆమెతో మాట్లాడింది.
‘చాలా రోజుల తరవాత నేను సంతోషంగా ఉన్న క్షణం ఇదే’ అని ఇన్షా అన్నారు.
‘ఇది నిజంగా ఓ అద్భుతంలా అనిపిస్తోంది. తను మా అందర్నీ గర్వపడేలా చేసింది. ఇన్షా అనుభవించిన క్షోభను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇది చాలా గొప్ప విషయం’ అని ఇన్షా తండ్రి ముస్తాక్ అహ్మద్ తెలిపారు.
మరోపక్క గతంలో ఆయన మాట్లాడుతూ, ‘తను చనిపోయినా కొన్నాళ్లకు ఆ బాధను అధిగమించేవాళ్లమేమో, కానీ జీవితాంతం తనను ఇలా చూడటం చాలా కష్టం’ అని ఆయన పేర్కొన్నారు.

2016 జులై 11న షోపియన్ జిల్లాలోని తన ఇంటి బయట పెద్ద పెద్ద శబ్దాలు వినిపించడంతో ఇన్షా కంగారుగా కిటికీ తలుపులు తెరిచారు. వెంటనే భారత జవాన్లు ప్రయోగించిన పెల్లెట్లు తగిలి ఆమె చూపును కోల్పోయారు.
చికిత్స కోసం మూడు నెలల పాటు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం దక్కలేదు.
ఇన్షాకు చదువంటే చాలా ఇష్టం. జీవితంలో ఎన్నో లక్ష్యాలు పెట్టుకున్న ఆమె, గతంలో బీబీసీతో మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు పుస్తకాలను చదివేదాన్ని, కానీ ఇప్పుడు కేవలం పేజీలను తాకగలుగుతున్నానంతే’ అని కన్నీరు పెట్టుకున్నారు. 2017 నవంబర్‌లో ఓ జూనియర్ విద్యార్థి సాయంతో ఇన్షా పదో తరగతి పరీక్షలు రాశారు.
‘నాకు మెడిసిన్ చదవాలని ఉన్నా, ఇప్పుడది సాధ్యపడదు. అందుకే ప్రత్యామ్నాయ కోర్సుల కోసం చూస్తున్నా’ అంటారామె.
ఇన్షా కథ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. పౌరుల నిరసనల పట్ల భారత్ అసమానత్వంతో వ్యవహరిస్తోందన్న విమర్శలు ఎదురయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
దాడి జరిగిన రోజున భద్రతా దళాలు నిరసనకారులపై ‘పెల్లెట్ గన్’లను ఉపయోగించాయి. ఆ పెల్లెట్లు ప్రాణాంతకమైనవి కాదని భారత ఆర్మీ పేర్కొంది. కానీ అవే పెల్లెట్లు ఇన్షాను అంధురాలిగా మార్చాయి.
ఆ పెల్లెట్ల కారణంగానే పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. పదిహేను వందల మందికి పైగా గాయపడ్డారు. వాళ్లలో చాలామందికి కంటి సమస్యలు ఎదురయ్యాయి. అలాంటి వాళ్లలో ఇన్షా ఒకరు.
కశ్మీర్‌లో హింసకు పాకిస్తాన్ కారణమని భారత ప్రభుత్వం అంటోంది. కానీ పాక్ ప్రభుత్వం దాన్ని ఖండిస్తోంది.
ఇన్షాకు తిరిగి చూపు తెప్పించడానికి అనేక సార్లు సర్జరీ చేశారు. కానీ అవేవీ విజయవంతం కాలేదు. దాంతో ఆమె చికిత్స కోసం ప్రయత్నం ఆపేసి భవిష్యత్తుపైన దృష్టిపెట్టారు.
చదువులో భాగంగా మ్యాథ్స్ లేదా సంగీతాన్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఇన్షా సంగీతాన్నే ఎంచుకున్నారు. మ్యాథ్స్ తనకు ఇష్టమైనా, ఓ అంధురాలిగా అందులో రాణించడం కష్టమని ఆమె భావించారు.

ఫొటో సోర్స్, Abid Bhat
‘చూపు కోల్పోయిన తరవాత చదువుకోవడం చాలా కష్టమైంది. నాటి గాయాలు నా జ్ఞాపకశక్తిపైనా ప్రభావం చూపాయి.
నా టీచర్ ప్రతి విషయాన్నీ నాలుగైదుసార్లు చెప్పేవారు. అయినా ఒక్కోసారి వాటిని మరచిపోయేదాన్ని’ అంటారు ఇన్షా.
‘ఒక్కోసారి తనలో అసహనం పెరిగిపోయేది. తనకు చదువుకోవాలని లేదని గట్టిగా చెప్పేది. అప్పుడు నేను పాఠాలు చెప్పడం ఆపేసి ఆమె రిలాక్స్ అవడానికి సమయం ఇచ్చేవాణ్ణి.
తనతో నేను ఎక్కువ సహనంతో ఉండాల్సి వచ్చేది. చివరికి మా ఇద్దరి ప్రయత్నాలూ ఫలించాయి. ఇన్షా పదో తరగతి పాసైంది’ అంటారు ఆమెకు పాఠాలు చెప్పిన ముజఫర్ భట్.
అదనపు రిపోర్టింగ్ : మాజిద్ జహంగీర్
ఇవి కూడా చదవండి
- సుప్రీంకోర్టు ‘సంక్షోభం’: న్యాయమూర్తుల లేఖలో ఏముందంటే..
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ‘తిరుగుబాటు’ చేసిన ఆ నలుగురు..
- కోడిపందేలు: కోడి ఎప్పుడు, ఎక్కడ పుట్టింది?
- కాలు లేకపోయినా క్రికెట్లో సూపర్‌స్టార్
- కశ్మీర్ విలీనానికి 70 ఏళ్లు
- చిన్నారి పెళ్లికూతురు.. ఇప్పుడు రెజ్లింగ్ స్టార్!
- శిథిల నగరం కింద శవాల కోసం వెదుకులాట
- #కోడిపందేలు: కోడి నెమలి ఎలా అయ్యింది?
- చెల్లెలి కోసం సోదరుడు 'విటుడి'గా మారి..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








