#GujaratVerdict: సమస్యల కంటే గుర్తింపు అంశానికే విలువిచ్చిన ఓటర్లు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రొఫెసర్ సంజయ్ కుమార్
- హోదా, బీబీసీ కోసం
ఒక దశలో గుజరాత్ ఎన్నికల ఫలితాలు నువ్వా-నేనా అన్నట్టు సాగినా, చివరికి భారతీయ జనతా పార్టీ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ మంచి పోటీనే ఇచ్చింది. ఓట్ల శాతాన్ని కూడా పాక్షికంగా పెంచుకోగలిగింది. కానీ ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల స్వస్థలమైన గుజరాత్‌లో మాత్రం విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది.
హిమాచల్ ప్రదేశ్‌లో అందుకున్న విజయంతో కాంగ్రెస్ నుంచి భాజపా చేజిక్కించుకున్న రాష్ట్రాల సంఖ్య కూడా పెరిగింది. హిమాచల్ ప్రదేశ్‌లో గెలుపొందడం ద్వారా 'కాంగ్రెస్ రహిత దేశం' అనే తన మిషన్‌కి భాజపా మరో అడుగు చేరువైంది.
రెండు రాష్ట్రాల్లోనూ భాజపా గెలిచినా, పార్టీ కంటే అది ప్రధాని మోదీ సాధించిన విజయమనే చెప్పాలి. భాజపాకి కాంగ్రెస్ గట్టి సవాలునే విసురుతున్నట్లు కనిపించినా, మోదీ ఒంటి చేత్తో తమ పార్టీకి మరో విజయాన్ని అందించినట్లు స్పష్టమవుతోంది.
మణిశంకర్ అయ్యర్ లాంటి కొందరు నేతలు మోదీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కూడా పరోక్షంగా భాజపా విజయానికి దోహదపడ్డాయి.

ఫొటో సోర్స్, Getty Images
హిమాచల్‌లో భాజపా విజయంపైన ముందు నుంచీ ఎవరికీ పెద్దగా అనుమానాల్లేవు. ప్రతి ఐదేళ్లకూ కొత్త పార్టీని ఎన్నుకునే చరిత్ర ఆ రాష్ట్రానిది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈసారి అవకాశం భాజపాకే దక్కుతుందని అందరూ భావించారు. చివరికి అదే జరిగింది.
గుజరాత్‌లో భాజపా విజయం మాత్రం చాలామందికి ఆశ్చర్యం కలిగించేదే. హర్దిక్ పటేల్ నడిపిస్తున్న పటేల్ ఉద్యమం, జిగ్నేశ్ మేవానీ నేతృత్వంలోని దళిత్ ఆందోళన్, ఓబీసీల్లో.. ముఖ్యంగా ఠాకూర్ల వర్గంలో నెలకొన్న అసంతృప్తి నేపథ్యంలో అల్పేష్ ఠాకూర్ మొదలుపెట్టిన ఉద్యమం.. ఇలాంటి అనేక ప్రతికూలతల మధ్య బరిలో దిగిన భాజపా విజయాన్ని చాలామంది ఊహించలేదు.
పార్టీకి ఆయువుపట్టులాంటి మోదీ కూడా రాష్ట్రంలో లేకపోవడం భాజపాకి మరో ప్రతికూలతగా అందరూ భావించారు. కానీ వీటన్నంటినీ దాటుకొని భాజపా విజయం సాధించగలిగింది.
2012 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన సీట్లతో(115) పోలిస్తే ప్రస్తుతం భాజపా గెలుచుకున్న సీట్ల సంఖ్య (99) తగ్గినా, ఆ పార్టీకి దక్కిన ఓట్ల శాతం మాత్రం 47.8 శాతం నుంచి 49.1శాతానికి పెరిగింది. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా 44 సీట్లు, 48.8శాతం ఓట్లతో మంచి విజయాన్నే సొంతం చేసుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
పోలింగ్‌కు ముందు రెండు వారాలపాటు ప్రధాని మోదీ నేతృత్వంలో సాగించిన ఎన్నికల ప్రచారం భాజపాకి బాగా కలిసొచ్చింది. పోలింగ్ ముగిశాక 'సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్' నిర్వహించిన సర్వే ఫలితాలను గమనిస్తే మోదీ ప్రచారం ఓటర్లని భాజపా వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించిందని స్పష్టమవుతుంది.
ఓటేద్దామని ముందు నిర్ణయించుకున్న వాళ్లలో ఎక్కువమంది కాంగ్రెస్‌కు ఓటేసినట్లు, చివరి నిమిషంలో పోలింగ్‌లో పాల్గొన్నవాళ్లు భాజపాకి ఓటేసినట్లూ తెలుస్తోంది. మోదీ ప్రచారం మొదలుపెట్టాక భాజపా వైపు మొగ్గుచూపిన జనాల సంఖ్య కూడా బాగా పెరిగింది. దాదాపు 35శాతం మంది ఓటర్లు పోలింగ్‌కు ఒకట్రెండు రోజుల ముందే ఓటేయ్యాలని నిర్ణయించుకున్న విషయాన్ని మరచిపోకూడదు.
మొదట కొన్ని వారాలపాటు ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తూ భాజపాని వెనక్కు నెట్టింది. కానీ మోదీ ప్రచారాన్ని మొదలుపెట్టాక కాంగ్రెస్ వెనుకంజ వేయక తప్పలేదు. మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలనే భాజపా తన ప్రచారాస్త్రంగా మలచుకొని ముందుకు సాగింది.
వివిధ సామాజిక వర్గాలకు చెందిన హార్దిక్ పటేల్, జిగ్నేష్ మెవానీ, అల్పేష్ ఠాకూర్, చోటూ వాసవా లాంటి నేతలతో చేతులు కలపడం ద్వారా కాంగ్రెస్ ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓట్లను పెద్ద సంఖ్యలో దక్కించుకోగలిగినా, విజయానికి అవి సరిపోలేదు.

ఫొటో సోర్స్, Getty Images
పాటీదార్ల ఓట్లు ఎక్కువగా తమకే పడతాయని కాంగ్రెస్ భావించింది. కానీ అనేక ప్రతికూలతల మధ్య కూడా దాదాపు 60శాతం పాటీదార్ల ఓట్లు భాజపాకే పడ్డాయని, కేవలం 40శాతం మంది మాత్రమే కాంగ్రెస్‌కు ఓటేశారని పోలింగ్ ముగిశాక జరిపిన సర్వేలు చెబుతున్నాయి.
జిగ్నేష్ మెవానీతో చేయి కలపడం కూడా కాంగ్రెస్‌కు ఆశించినంతగా కలిసిరాలేదు. 47శాతం దళిత ఓట్లు కాంగ్రెస్‌కు పడితే, 45శాతం ఓట్లు భాజపా గూటికి చేరాయి. ఓబీసీ ఓట్లు కూడా ఇదే విధంగా చీలాయి. పాటీదార్ల ఓట్లను భాజపా కోల్పోయినా, ఆదివాసీల ఓట్ల ద్వారా ఆ నష్టాన్ని పూడ్చుకోగలిగింది.
52శాతం మంది ఆదివాసీలు భాజపాకు, 40శాతం మంది కాంగ్రెస్‌కు ఓట్లేశారు. గత ఎన్నికల్లో ఎక్కువ శాతం ఆదివాసీలు కాంగ్రెస్‌కు ఓటేసినా ఈసారి అది పునరావృతం కాలేదు.

ఫొటో సోర్స్, AFP
చోటూ వాసవతో చేయి కలపకపోయుంటే కాంగ్రెస్‌కు ఈమాత్రం ఆదివాసీల ఓట్లు కూడా దక్కుండేవి కావు.
గుజరాత్‌లో, హిమాచల్‌లో విజయం సాధించడం భాజపాకు సంతోషం కలిగించే విషయమే అయినా, దాని ఆధారంగా గుజరాత్‌లో భాజపా పటిష్ఠమైన స్థితిలో ఉందని చెప్పలేం.
మొత్తంగా గుజరాత్ అభివృద్ధి విషయంలో ప్రభుత్వ రికార్డు సంతృప్తికరంగానే ఉన్నా, ఇప్పటికీ కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఛాయలు కనిపిస్తున్నాయి. గుజరాత్, హిమాచల్.. రెండు రాష్ట్రాల్లోనూ చాలామంది ప్రజలు నోట్ల రద్దు, జీఎస్టీల విషయంలో అసంతృప్తితోనే ఉన్నారు.
భాజపా ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదనీ, సమస్యలు తీర్చట్లేదనీ చాలామంది రైతులు అంటున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే యువత కూడా నరేంద్ర మోదీ పట్ల అంత ఆసక్తిగా లేరనీ, ఆయన పనితీరుపై అసంతృప్తితో ఉన్నారనీ తెలుస్తోంది.

ఫొటో సోర్స్, KALPIT BHACHECH
యువతకు ఉన్న ఆ అసంతృప్తిని భాజపాపై కోపంగా మలచడంలో కాంగ్రెస్ విఫలమైంది. దాంతో యువత అసంతృప్తిని కాంగ్రెస్ సొమ్ము చేసుకోలేకపోయింది.
హార్దిక్ పటేల్ ర్యాలీలకు వస్తున్న జనాల ఆధారంగా తమపై యువత కాస్త అసంతృప్తితో ఉన్నారని భాజపా కూడా గ్రహించింది. కానీ 'గుజరాతీ గౌరవం' అనే అంశాన్ని తరచూ ప్రస్తావిస్తూ హార్దిక్‌కు కౌంటర్ వేయడంలో మోదీ సఫలమయ్యారు.
గుజరాతీల గుర్తింపు అంశాన్ని తన ప్రచారంలో లేవనెత్తడం ద్వారా ఓటర్లకు తమపైన ఉన్న అసంతృప్తిని మోదీ తగ్గించగలిగారు.
గుజరాత్‌లో 49శాతం ఓట్లను దక్కించుకొని భాజపా గెలిస్తే, 42శాతం ఓట్లను దక్కించుకొని కాంగ్రెస్ ఓడిపోయింది.
హిమాచల్ ప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ 42శాతం ఓట్లను దక్కించుకోగలిగింది. ఓటర్లను పార్టీ వైపు తిప్పడంలో మోదీ సఫలమైనా, భాజపాను కలవరపెట్టే అంశాలు మాత్రం అనేకం.
2014 లోక్‌సభ ఎన్నికల తరవాత గుజరాత్‌లో పెరిగిన నిరుద్యోగం, యువతను భాజపాకు దూరం చేసింది. భాజపాకు మద్దతుదార్లుగా కనిపించే వ్యాపార వర్గాల్లో కూడా అసంతృప్తి ఛాయలు కనిపించాయి. తమకు బాగా అనుకూలంగా ఉండే వర్గాల్లోనే అసంతృప్తి మొదలవడం అనేది దీర్ఘకాలంలో భాజపాను కలవరపెట్టే విషయమే.
(రచయిత ప్రొఫెసర్ సంజయ్ కుమార్ ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్’లో డైరెక్టర్‌గా ఉన్నారు)
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








