తెలుగు సభల్లో ఎన్నారైలు: 'మొదటి కవిత మా జిల్లాలో పుట్టిందని తెలిసి ఆశ్చర్యపోయా...'

ఫొటో సోర్స్, wtc.telangana.gov.in
దాదాపు 20 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ దేశంలోని తెలుగువారి గురించి, తెలుగు భాష పరిరక్షణ గురించి, హైదరాబాద్‌లో తెలుగు మహాసభల నిర్వహణ ద్వారా వారు పొందిన అనుభవాల గురించి బీబీసీ న్యూస్ తెలుగుతో ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడారు.
వారు నివసిస్తున్న దేశాల్లో మాతృ భాష పరిరక్షణపై చేపడుతున్న చర్యలు, తమ తర్వాత తరాలవారికి భాషను అందించడానికి చేస్తున్న కృషిని వారు బీబీసీకి వివరించారు. వీరందరి కృషినీ తెలుగు వారందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఎక్కడెక్కడో ఉన్న వారందరికీ ఆహ్వానాలు పంపించి రప్పించామని సమన్వయ కర్త మహేశ్ తెలిపారు. దాదాపు 42 దేశాల నుంచి 420 మంది ప్రతినిధులు ఈ సభల్లో పాల్గొంటున్నారని వివరించారు.

ఇంతమంది కవులున్నారా?
"తెలంగాణలో ఇంత సాహిత్యముందా? తెలంగాణ కవులు అనగానే అందరికీ గుర్తొచ్చేది దాశరథి, కాళోజీ. కానీ ఇంకా ఎంతోమంది స్థానిక కవులున్నారనే విషయం తెలిసింది. మొట్టమొదటి కథ తెలంగాణలోనే పుట్టిందనే విషయం కథా సదస్సులో విన్నప్పుడు చాలా సంతోషం కలిగింది" అని లండన్ నుంచి వచ్చిన ఎన్నారైల బృందం వెల్లడించింది.
"మలేషియాలో సుమారు 4 లక్షల మంది తెలుగువారు ఉంటారు. తెలుగువారికి ఏ అవసరమొచ్చినా ఆదుకోవడానికి మేమంతా ఎప్పుడూ ముందుంటాం. తమిళులు ఎక్కడున్నా హడావిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే అందరికీ వారి గురించి తెలుస్తుంది. కానీ తెలుగువారు క్రియాశీలంగా ఉండకపోవడం వల్ల మనకు ప్రాధాన్యం దక్కడం లేదు. మా పిల్లలందరికీ తెలుగు నేర్పిస్తాం. సినిమాల్లో వాడే బూతులు కూడా మా పిల్లలకు అర్థమవుతాయి" అని మలేషియా నుంచి వచ్చినవారు తెలిపారు.
"న్యూజీలాండ్‌లో తెలుగువారిని చాలా బాగా ఆదరిస్తారు. పిల్లలకు ఇక్కడ లేదా కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడు ఎలా ఉండాలనే విషయాలను తెలుగువారి పిల్లలకు నేర్పిస్తాం" అని న్యూజీలాండ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి చెప్పారు.
ఈ సభల్లో పాల్గొనడానికి లండన్ నుంచి కూడా చాలామంది వచ్చారు.
"ఈ సభల ఏర్పాట్లు, నిర్వహణ చూస్తుంటే ఒలింపిక్స్ చూసినంత గొప్ప భావన కలిగింది. తర్వాత తరాలకు భరత నాట్యం నేర్పిస్తున్నాం. ఇక్కడ మేం నేర్చుకున్న విషయాల్ని కూడా పిల్లలకు నేర్పుతాం. తెలంగాణ భాష, యాసల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పగలిగాం. ఇంట్లో మనం తెలుగులోనే మాట్లాడుతూ, మన పిల్లలకూ భాషను నేర్పిస్తుంటే అవలీలగా మన భాషను తర్వాత తరానికి అందించగలుగుతాం. లేకపోతే మరో రెండు మూడు తరాల తర్వాత ఇంక భాష అనేది కనిపించదు. ఎన్నారైలంతా ఇంట్లో తెలుగే మాట్లాడుతూ పిల్లలకు భాషను నేర్పాలనేది మా ఆలోచన" అని నవీన్ రెడ్డి, సృజన్ రెడ్డిలతో కూడిన బృందం తెలిపింది.

సమస్య వస్తే ఎవరికి చెప్పాలో తెలిసేది కాదు!
"నేను రేడియో జాకీగా పనిచేస్తున్నా. కువైట్‌లో 3 లక్షల మంది తెలుగువాళ్లుంటారు. ఏవేవో ఊహలతో అక్కడికి వచ్చి ఇబ్బందులు పడేవాళ్లు చాలామందే ఉంటారు. మేం వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటాం" అని కువైట్ నుంచి వచ్చిన ఎన్నారై ప్రతినిధి తెలిపారు.
"నేను వెళ్లిన కొత్తలో ఏదైనా సమస్య వస్తే ఎవరిని అడగాలో అర్థమయ్యేది కాదు. అప్పుడే అసోసియేషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది" అని తెలుగువాళ్లతో తన అనుబంధాన్ని ఏ రకంగా పెంపొందించుకున్నదీ వివరించారు హాంకాంగ్ నుంచి వచ్చిన ఓ మహిళ.
"అమెరికాలో ఎక్కువమంది తెలుగువారు ఉన్నారు కాబట్టి తెలుగు పరిరక్షణకు మరింత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది. ఈ మహాసభల్లో పాల్గొన్న తర్వాత అమెరికాలోని తెలుగు పాఠ్యాంశాల్లో ఏం మార్పులు చేయాలనే దానిపై ఓ స్పష్టత వచ్చింది" అని అమెరికాలోని న్యూజెర్సీ నుంచి వచ్చిన శ్రీనివాస్ వెల్లడించారు.
"ఆస్ట్రేలియాలో ఇప్పటివరకూ తెలుగు భాషా పరిరక్షణకోసం ఎలాంటి చర్యలూ లేవు. ఈ సభల స్ఫూర్తితో ఈ చర్యలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ప్రారంభమవుతాయి" అని నాగేందర్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈయన ఆస్ట్రేలియా నుంచి వచ్చారు.

అవధానాల్లో ఇన్ని రకాలా?
"అవధానాల్లో ఇన్ని రకాలుంటాయని ఇప్పుడే తెలుసుకున్నా" అని స్కాట్లాండ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రమోద్ కుమార్ అన్నారు.
"ఎన్నారైలందరినీ ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున సభలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది" అని సునీత చెప్పారు. ఈమె సింగపూర్‌లో నివసిస్తున్నారు.
"ప్రతి సంవత్సరం తెలుగువారందరం ఒకచోట కలుస్తాం. ఈ సభల ద్వారా మన భాషను పరిరక్షించుకోవాలనే స్పృహ మాకు కలిగింది. దీన్ని ఎలా చేయాలనేదానిపై మేం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం" అని థాయ్‌లాండ్ నుంచి ఇక్కడకు వచ్చిన హర్షా రెడ్డి, రమేష్ పేర్కొన్నారు.

మొదటి కవిత ఎక్కడ పుట్టింది?
"మొదటి కవిత కరీంనగర్ జిల్లా నుంచే పుట్టిందని తెలిసి ఆ జిల్లావాసిగా ఆశ్చర్యపోయాను, ఆనందపడ్డాను" అని డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల బృంద సభ్యుడు శ్యాంబాబు ఆశ్యర్యం వ్యక్తం చేశారు.
బహ్రెయిన్ నుంచి వచ్చిన సతీశ్ కుమార్, వెంకటేశ్... "ప్రతి శుక్రవారం ఆంధ్రా గల్లీలో తెలుగువారంతా కలుస్తాం. చర్చించుకుంటాం. పండుగలా ఉంటుంది" అన్నారు.
"జాంబియాలో దాదాపు 10 వేల మంది తెలుగువాళ్లున్నారు. తెలుగు మహాసభలు ఇంత ఘనంగా జరుగుతాయని ఊహించలేదు" అని జాంబియా ఎన్నారై తెలుగు వ్యక్తి చెప్పారు.
"పాఠశాలల్లో కొరియన్ భాష ఉండటంతో తల్లిదండ్రులు మళ్లీ భారత్‌కు తిరిగి వచ్చేయాలని ఆలోచిస్తుంటారు" అని దక్షిణ కొరియాలో నివసిస్తున్న తరుణ్ తెలిపారు.
"ఫిజీలో తెలుగువాళ్లు తక్కువే ఉన్నారు. కానీ మేము తెలుగు గురించి పెద్దగా ఆలోచించడం లేదు. మా దగ్గర తెలుగు బోధించేవాళ్లెవరూ లేరు" అని ఫిజీ నుంచి వచ్చిన ఉమేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
"ఇవి తెలుగు మహాసభలేనా అని చూసి ఆశ్చర్యపోయేంత గొప్పగా నిర్వహించారు. చాలా ఆనందంగా ఉంది. ఖతార్‌లో తెలుగు భాషాభిమానులు చాలామంది ఉన్నారు. వారందరి సాయంతో మేము కూడా భాషా పరిరక్షణ గురించి పాటుపడుతున్నాం. పిల్లలకు ప్రతి శుక్ర, శనివారాల్లో తెలుగు నేర్పిస్తున్నాం" అని ఖతార్‌లో నివసిస్తున్న శ్రీధర్ తెలిపారు.
"మేం చిన్నప్పటి నుంచే తెలుగు నేర్చుకోవడానికి మా దగ్గర అవకాశాలున్నాయి. ప్రతి విద్యార్థికీ మాతృభాష నేర్చుకునే హక్కు ఉంటుంది. అందుకే ప్రభుత్వమే అవకాశాలు కల్పిస్తుంది" అని మారిషస్, స్వీడన్‌కు చెందిన మహిళల బృందం తెలిపింది.
"మనమెక్కడా వినని కవుల పేర్లతో ఇక్కడ తోరణాలు కట్టి వారందరినీ ఓసారి గుర్తుచేశారు" అని దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు.
బీబీసీ న్యూస్ తెలుగుతో వీరు మాట్లాడిన వీడియో చూడండి.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








