ప్రెస్ రివ్యూ: బయో మద్యం: భయం లేదు.. దీంతో వాసన రాదు!

మద్యం

ఫొటో సోర్స్, Getty Images

బయో మద్యం: భయం లేదు.. దీంతో వాసన రాదు!

'సాక్షి' హైదరాబాద్ ఎడిషన్‌లో ప్రచురించిన ఓ వార్తా కథనం ప్రకారం, గుంటూరుకు చెందిన సింధూరా హెర్బల్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు అమర్‌నాథ్‌ బయో మద్యాన్ని తయారు చేశారు.

దీనిని ఇక్కడి మార్కెట్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని శాస్త్రీయపరమైన సందేహాలను నివృత్తి చేయలేకపోవటంతో... బయో మద్యం ఇక్కడి మార్కెట్‌లోకి రాలేదు.

తరువాత ఈ బయో మద్యానికి విదేశీ హంగులు జోడించి అమెరికా, నేపాల్‌ మార్కెట్లలో ప్రవేశపెట్టారు.

తాజాగా రాష్ట్రంలో విదేశీ మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం, జీఈఎస్‌ సదస్సు నేపథ్యంలో ఇక్కడి మార్కెట్‌పై దృష్టి పెట్టారు.

ఇక్కడ మద్యం మార్కెట్‌ తీరు, వినియోగంపై ఒక సర్వే చేయించినట్లు తెలిసింది. వాసన లేని.. తలపట్టేయడం, వికారం వంటి సైడ్‌ ఎఫెక్టులు లేని మద్యానికి మంచి మార్కెట్‌ ఉన్నట్లు గుర్తించి.. తెలంగాణలో విక్రయాల కోసం కేఎస్‌ బయో నేచురల్స్‌ మార్కెటింగ్‌ సంస్థ పేరుతో దరఖాస్తు చేసుకున్నారు.

ఈ మద్యం తాగితే నిషా వస్తుందిగానీ.. తలపట్టడం వంటి సైడ్‌ ఎఫెక్టులు ఉండవని, వాసన రాదని ఆ సంస్థ ప్రభుత్వానికి నివేదించి అనుమతి పొందింది.

ప్రస్తుతం బయో బీరు, బయో విస్కీలకు అనుమతి వచ్చింది. త్వరలోనే బయో ఓడ్కా, బ్రాందీ, రమ్‌లను కూడా తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోంది.

ఆధార్ కార్డుతో మహిళ

అంగన్‌వాడీకీ ఆధార్‌.. యోచనలో కేంద్రం

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆహారం తినే పిల్లలకు కూడా ఆధార్‌ తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటున్నట్టు 'నవతెలంగాణ' వార్తా కథనం తెలిపింది.

అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే మహిళలను పర్యవేక్షించేందుకుగాను నూతన విధానం ప్రారంభించడానికి 12 అంకెల గుర్తింపు సంఖ్య అవసరమని భావిస్తోంది.

'నకిలీ పిల్లలను' తొలగించడానికి, వనరుల వృథాను తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మేనకాగాంధీ చెప్పారు.

అస్సాంలో ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో రిజిష్టరైన పేర్లలో మూడు లక్షలు నకిలీవని అధికారులు గుర్తించారనీ.. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆమె తెలిపారు.

ఆధార్‌ కార్డు ఉన్న పిల్లలకు ఏ అంగన్‌వాడీ కేంద్రంలోనూ సేవలు నిరాకరించబోమని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేశ్‌ శ్రీవాస్తవ అన్నారు.

ఆధార్‌కార్డు లేని పిల్లలకు వాటిని ఆయా కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్లు వాటిని ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం వారికి రూ. 500 ప్రోత్సాహాన్ని ఇస్తామన్నారు.

'పిల్లలు ఇప్పుడు అంగన్‌వాడీ కేంద్రాలలో ఆధార్‌ కార్డులను పొందవచ్చు. 6 నెలలలోపున్న పిల్లలకు కూడా తల్లి ఆధార్‌ కార్డుకు అనుసంధానం చేయడం ద్వారా ఆధార్‌ నెంబరును ఇస్తారు' అని ఆయన చెప్పారు.

మహిళ

ఫొటో సోర్స్, Getty Images

చందా ఇవ్వలేదని కులాన్నే బహిష్కరించారు

'ఆంధ్రజ్యోతి' ప్రచురించిన ఓ కథనం ప్రకారం ఓ ఆలయం నిర్మాణానికి విరాళాలు ఇవ్వనందుకు ఏకంగా ఒక కులాన్నే బహిష్కరిస్తూ జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్‌ మండలం కుస్తాపూర్‌ గ్రామాభివృద్ధి కమిటీ తీర్మానం చేసింది.

దాదాపు 3 నెలల కింద చేసిన ఈ తీర్మానంపై న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళనకు దిగడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది.

గ్రామంలో రామలింగేశ్వర ఆలయం నిర్మించాలని గ్రామాభివృద్ధి కమిటీ నిర్ణయించింది. అందుకు గ్రామంలోని ఇంటింటా రూ. 3వేలు చందా వసూలు చేశారు.

అయితే, చందాను తాము ఇవ్వలేమని చెప్పిన మాల కులస్థులను బహిష్కరిస్తున్నట్టు సెప్టెంబరు 3న వివిధ కులాల ప్రతినిధులంతా సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. వారిని వ్యవసాయ పనులకు పిలువొద్దని, వారి పనులకు ఎవరూ పోవద్దని నిర్ణయించారు.

నిబంధనలు అతిక్రమిస్తే రూ.50వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దీంతో ఆ గ్రామానికి చెందిన మాలలంతా శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు.

ఆసుపత్రిలో మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

వైద్యం ఖరీదైపోయింది..

వైద్యం ఖరీదైపోయిందంటూ 'ఈనాడు' పత్రిక ఓ కథనం వెలువరించింది. ఈ కథనం ప్రకారం..

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాతీయ ఆరోగ్య వ్యయ నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం ఆరోగ్య బీమా ఉన్నా సరే.. ప్రజల జేబులకు చిల్లు పడుతోందని పేర్కొంది. వైద్యం తలకు మించిన భారం అవుతోందని చెప్పింది.

ఆంధ్ర, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ వైద్యం పరిస్థితి ఇలానే ఉందని గణాంకాలతో సహా నివేదిక వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లో వైద్యానికి తలసరి రూ.2,901 తెలంగాణలో తలసరి రూ.2,834 అదనపు భారం పడుతోంది. జాతీయస్థాయిలో ఆరోగ్య వ్యయంపై అధ్యయనాన్ని నిర్వహించింది.

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు సహా మొత్తంగా ఆరోగ్య రంగానికి పెడుతున్న పెట్టుబడులు, ఖర్చులపై సమగ్ర నివేదికను రూపొందించింది.

ఇందుకోసం 2014-15 ఆర్థిక గణాంకాలను ప్రామాణికంగా తీసుకున్నారు. స్థూల జాతీయోత్పత్తిలో మొత్తంగా ఆరోగ్యం కోసం పెడుతున్న ఖర్చు కేవలం 3.89 శాతం మాత్రమే.

మొత్తం ఖర్చులో ప్రభుత్వాలు ఆరోగ్యం కోసం పెడుతున్నది 29 శాతం కాగా.. ఇందులోనూ కేంద్ర ప్రభుత్వ వాటా 37 శాతంగా, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 63 శాతంగా నివేదిక పేర్కొంది.

కొన్ని గణాంకాలు..

  • దేశంలో మొత్తం ఆరోగ్య వ్యయం.. రూ.4,83,259 కోట్లు
  • ప్రభుత్వం ఆరోగ్యంపై పెడుతున్న ఖర్చు.. రూ.1,39,940 కోట్లు
  • ప్రభుత్వం, ప్రైవేటు కలుపుకొని.. తలసరి ఆరోగ్య ఖర్చు రూ.3,826
  • ప్రజలు సొంతంగా ఖర్చుపెడుతున్నది రూ.3,02,425 కోట్లు(ఇది మొత్తం ఆరోగ్య వ్యయంలో 62.6శాతం)
  • తెలంగాణలో ఏటా వైద్యానికయ్యే మొత్తం ఖర్చు రూ.11,868 కోట్లు
  • ఇందులో ప్రభుత్వ వాటా 22.3 శాతం
  • రాష్ట్రంలో మొత్తం ఆరోగ్య వ్యయంలో తలసరి ఖర్చు రూ.4,565
  • ప్రభుత్వ ఆరోగ్య వ్యయంలో తలసరి ఖర్చు రూ.1,019
  • రాష్ట్రంలో ప్రజలు సొంతంగా వైద్యానికి అదనంగా ఖర్చుపెడుతున్న మొత్తం రూ.7,368 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇలా..

  • ఆంధ్రప్రదేశ్‌లో ఏటా వైద్యానికయ్యే మొత్తం ఖర్చు రూ.23,064 కోట్లు
  • ఇందులో ప్రభుత్వ వాటా 15.4 శాతం
  • మొత్తం ఆరోగ్య వ్యయంలో తలసరి ఖర్చు రూ.3,720
  • ప్రభుత్వ ఆరోగ్య వ్యయంలో తలసరి ఖర్చు రూ.573
  • ప్రజలు సొంతంగా వైద్యానికి అదనంగా ఖర్చు పెడుతున్న మొత్తం రూ.17,988 కోట్లు

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)