మిస్ యూనివర్స్‌గా మెక్సికో సుందరి ఫాతిమా బోష్.. అవమానపడ్డ చోటే అందాల రాణి కిరీటం సొంతం

ఫాతిమా బోష్, మిస్ యూనివర్స్, మెక్సికో, థాయిలాండ్, బ్యాంకాక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెక్సికో సుందరి ఫాతిమా బోష్ మిస్ యూనివర్స్ 2025 టైటిల్ గెల్చుకున్నారు.
    • రచయిత, జోయెల్ గింటో, పానిసా ఏమోచా
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ మిస్ యూనివర్స్ 2025గా ఎంపికయ్యారు. శుక్రవారం బ్యాంకాక్‌లో జరిగిన వేడుకలో ఆమె కిరీటాన్ని ధరించారు.

పాతికేళ్ల ఫాతిమాను ఈ సంవత్సరం నవంబర్‌లో ఇతర పోటీదారుల ముందు థాయిలాండ్ అధికారి ఒకరు మందలించారు. దీంతో కార్యక్రమం జరుగుతున్న ప్రాంతం నుంచి ఆమె వాకౌట్ చేశారు. ఆ సమయంలో, ఆమెకు మద్దతు తెలిపే వారిని కూడా పోటీ నుంచి తప్పిస్తామని బెదిరించారు.

అనంతరం వారం తర్వాత, ఇద్దరు న్యాయనిర్ణేతలు రాజీనామా చేశారు. ఈ పోటీలలో రిగ్గింగ్ జరిగిందని వారిలో ఒకరు ఆరోపించారు.

ఇక, మిస్ యూనివర్స్ ఫలితం మరిన్ని వివాదాలను సృష్టించింది. మిస్ మెక్సికో ఫాతిమా బోష్ గెలిచినందుకు ఆన్‌లైన్‌లో చాలామంది అభినందించారు, ముఖ్యంగా ఆమె వాకౌట్‌కు మద్దతు ఇచ్చినవారు. కానీ, మునుపటి వివాదాన్ని సరిదిద్దడానికి నిర్వాహకులు ఆమెకు అందాల కిరీటాన్ని అందించారా? అని కొందరు అనుమానిస్తున్నారు.

మిస్ థాయిలాండ్ ప్రవీణార్ సింగ్ మొదటి రన్నరప్‌గా, మిస్ వెనిజులా స్టెఫానీ అబాసాలి మూడో స్థానంలో, మిస్ ఫిలిప్పీన్స్ మా అహ్తిసా మనాలో, మిస్ కోట్ డి ఐవోయిర్ ఒలివియా యాస్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫాతిమా బోష్, మిస్ యూనివర్స్, మెక్సికో, థాయిలాండ్, బ్యాంకాక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్యాంకాక్‌లో వేదికపై మిస్ యూనివర్స్ 2025 టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్.

బ్యాంకాక్‌లో డ్రామా

ఈ నెల ప్రారంభంలో ప్రమోషనల్ కంటెంట్‌ను పోస్ట్ చేయనందుకు ఫాతిమాపై ఇతర పోటీదారుల ముందు మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ డైరెక్టర్ నవాత్ ఇట్సారగ్రాసిల్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది.

మిస్ మెక్సికో నిరసన వ్యక్తం చేసినప్పుడు, ఆమెతో పాటు, ఆమెకు మద్దతు ఇచ్చే వారిని అనర్హులుగా ప్రకటిస్తానని బెదిరిస్తూ, సెక్యురిటీని పిలిచారు నవాత్. అయినా కూడా, ఫాతిమా వాకౌట్ చేశారు. పలువురు పోటీదారులు ఆమెను అనుసరించారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా పతాకశీర్షికలుగా మారింది.

మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ నవాత్ ప్రవర్తనను తప్పుబట్టింది. ఫాతిమా తనకోసం తాను నిలబడినందుకు మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షీన్‌బామ్ కూడా ప్రశంసించారు. దూకుడును ఎదుర్కొనేటపుడు మహిళలు ఎలా మాట్లాడాలో ఉదాహరణగా నిలిచావని ఆమెను ప్రశంసించారు.

ఫైనల్ సమయంలో నవాత్ ప్రేక్షకులలో మాత్రమే కనిపించారు. ఫాతిమా బోష్ గెలిచిన తర్వాత, ఆన్‌లైన్‌లో "బిలియన్ వర్డ్స్, అవి చెప్పేవికావు" అని పోస్టు చేశారు.

"ఫలితం విషయానికొస్తే, దాన్ని ఇంట్లో కూర్చున్న వీక్షకులకు వదిలివేస్తున్నా. ప్రజలు సొంత అంచనా వేయవచ్చు" అని ఆయన మీడియాతో అన్నారు.

కొంతమంది అభిమానులు ఈ వివాదం ఫాతిమా గెలవడానికి సహాయపడిందని భావిస్తున్నారు.

"వచ్చే సంవత్సరం ఎవరు వాకౌట్ చేసినా గెలుస్తారు" అని ఆన్‌లైన్‌లో కామెంట్స్ చేస్తున్నారు. మరొకరు "మిస్ యూనివర్స్‌ను కాపాడటానికి, ముందు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి వారు ఆమెకు కిరీటం అప్పగించాల్సి వచ్చింది!" అని అభిప్రాయపడ్డారు.

దీనిపై, స్పందించాలని మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్‌ను బీబీసీ సంప్రదించింది.

ఆ సంస్థ సోషల్ మీడియా ఖాతాలలో ఫాతిమాను ప్రశంసిస్తూ, "ఆమె దయ, బలం, ప్రకాశవంతమైన స్ఫూర్తి ప్రపంచ హృదయాలను గెలిచాయి" అని తెలిపింది.

మిస్ మెక్సికో ఫాతిమా బోష్, మిస్ యూనివర్స్

ఫొటో సోర్స్, RUNGROJ YONGRIT/EPA/Shutterstock

ఫొటో క్యాప్షన్, ఈవెంట్‌లో నవాత్ తనతో అమర్యాదగా ప్రవర్తించారని మిస్ మెక్సికో ఫాతిమా బోష్ అన్నారు.

'రిగ్గింగ్' ఆరోపణలు

వాకౌట్ ఘటన జరిగిన వారం తర్వాత, ఇద్దరు మిస్ యూనివర్స్ న్యాయనిర్ణేతలు రాజీనామా చేశారు. వారిలో ఒకరైన లెబనీస్ ఫ్రెంచ్ మ్యుజీషియన్ ఒమర్ హర్ఫౌచ్ మాట్లాడుతూ, పోటీలలో రిగ్గింగ్ జరిగిందని, "ప్రత్యేక జ్యూరీ" ముందే ఫైనలిస్టులను ఎంపిక చేసిందని ఆరోపించారు.

మరో జడ్జి, మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్లాడ్ మకెలెలే కూడా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు చెప్పారాయన.

మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ రిగ్గింగ్ వాదనలను తిరస్కరిస్తూ, "ఫైనలిస్టులను ఎంపిక చేయడానికి ఏ బయటి గ్రూపునకు అధికారం లేదు" అని పేర్కొంది.

అయితే, ఫాతిమా బోష్ కిరీటం పొందిన వెంటనే హర్ఫౌచ్ ఆన్‌లైన్‌లో మరోసారి రిగ్గింగ్ ఆరోపణలు చేశారు.

బుధవారం సాయంత్రం 'గౌను రౌండ్' సమయంలో మరో సంఘటన జరిగింది: మిస్ జమైకా వేదికపై జారిపడ్డారు. ఆమెను స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లారు, ఆసుపత్రిలో చేర్చారు.

అన్నే జక్రాజుటాప్, మిస్ యూనివర్స్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అన్నే జక్రాజుటాప్‌కి చెందిన జేకేఎన్ కంపెనీ 2023లో దివాళా తీసింది. 2025లో ఆమె సీఈవో పదవికి రాజీనామా చేశారు.

మేనేజ్‌మెంట్‌లో మార్పులు

ఇటీవలి వివాదాలు, మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహిస్తున్న థాయ్, మెక్సికన్ యజమానుల మధ్య సాంస్కృతిక, వ్యూహాత్మక వ్యత్యాసాలను బయటపెట్టాయని విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతం అందాల పోటీ కార్యక్రమాలను థాయ్‌లాండ్‌కు చెందిన నవాత్ ఇట్సారగ్రాసిల్ నిర్వహిస్తున్నారు. ఆయన అభిమానులకు మిస్ గ్రాండ్ ఇంటర్‌నేషనల్ వ్యవస్థాపకుడు,యజమానిగా సుపరిచితుడు. ఈ మిస్ గ్రాండ్ ఇంటర్‌నేషనల్ అనేది థాయ్‌లాండ్‌లో జరిగే చిన్నపాటి అందాల పోటీ. ఈ పోటీ చిన్నదైనా సామాజిక మాధ్యమాలలో దీనికి మంచి గుర్తింపే ఉంది.

ఈ సంవత్సరం మిస్ యూనివర్స్ ఈవెంట్ నిర్వహించే హక్కు నవాత్ దగ్గర ఉండగా మిస్ యూనివర్స్ సంస్థను మాత్రం మెక్సికో వ్యాపారవేత్త రౌల్ రోచా నడిపిస్తున్నారు. ఈ నాయకత్వం కొత్తది కావడంతోపాటు పోటీ ప్రారంభానికి కొద్దిరోజుల ముందు మాత్రమే బాధ్యతలు స్వీకరించింది.

గతంలో , థాయ్ ట్రాన్స్‌జెండర్, మీడియా దిగ్గజం అన్నే జక్రాజుటాప్ ఈ పోటీకి యజమానిగా ఉన్నారు. అమెరికా ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ ఎండీవర్ నుంచి 2022లో ఆమె దీనిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత అన్నే పోటీల్లో చాలా మార్పులు చేశారు . ట్రాన్స్‌జెండర్ మహిళలు, వివాహిత మహిళలు, తల్లులు పోటీ పడటానికి అనుమతించారు. వయోపరిమితిని తొలగించారు. మరింత డబ్బు సంపాదించడానికి బ్రాండ్‌ను విస్తరించడానికి కూడా ప్రయత్నించారామె.

కాలక్రమేణా ప్రేక్షకాదరణ తగ్గిపోవడంతో, మిస్ యూనివర్స్ బ్రాండ్ మార్కెట్ చేయడానికి మంచినీళ్ల బాటిళ్లు, బ్యాగులు తదితరాలపై ఆ బ్రాండ్‌ను ముద్రించి అమ్మే మార్గాన్ని అనుసరించారు.

అయితే 2023లో ఆమె ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ జేకేఎన్ లిక్విడిటీ సమస్యల కారణంగా దివాళా కోసం దరఖాస్తు చేసింది. ఈ ఏడాది అందాల పోటీలు ప్రారంభం కావడానికి ముందు ఆమె జేకేఎన్ సీఈఓ పదవికి రాజీనామా చేశారు. ఆమె స్థానంలో గ్వాటెమాలా దౌత్యవేత్త మారియో బుకారో వచ్చారు. రాజీనామాకు ముందు, మెక్సికో నుంచి రౌల్ రోచాను వ్యాపార భాగస్వామిగా చేర్చుకున్నారామె. అనంతరం 2025 మిస్ యూనివర్స్ పోటీ నిర్వహణా బాధ్యతలను నవాత్ ఇట్సారగ్రాసిల్‌ను ఎంచుకున్నారు.

ఈ నాయకత్వ మార్పు గందరగోళంగా సాగిందని, అమెరికా అందాల రాణి, అందాల పోటీల శిక్షకురాలు డానీ వాకర్ బీబీసికి చెప్పారు. కీలకమైన నాయకత్వ బాధ్యతలు బ్యాంకాక్, మెక్సికో మధ్య విభజితమయ్యాయని ఆమె చెప్పారు.

ఎండీవర్, అంతకుముందు ట్రంప్ ఈ పోటీలను నిర్వహించినప్పుడు నాయకత్వ నిర్మాణం చాలా స్పష్టంగా ఉండేదని ఆమె అన్నారు.

‘‘అభిమానులకు గానీ, బయటివారికి గానీ పరిస్థితి పూర్తిగా గందరగోళంగా ఉంది. అసలు బాధ్యత ఎవరిదో, ప్రశ్నలు అడగాల్సింది ఎవరినో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇది బ్రాండ్‌కు తీవ్ర నష్టం కలిగిస్తోంది’’ అని పూర్వ యజమానుల పాలనలో మిస్ యూనివర్స్ అధ్యక్షురాలిగా ఉన్న పౌలా షుగార్ట్ బీబీసీకి చెప్పారు.

ఇక మహిళ అధ్యయనాలు, లాటిన్ అమెరికన్ స్టడీస్‌లో నిపుణుడైన తితిఫోంగ్ డుయాంగ్ ఖాంగ్ మాట్లాడుతూ ఈ అందాల పోటీలను నడిపిస్తున్నవారు తమ సాంస్కృతిక తేడాలను అర్థం చేసుకోవడం అవసరమని సూచించారు.

‘‘మనదేశంలో థాయిలాండ్ వ్యక్తితో మనం థాయ్ బాషలోనే మాట్లాడతాం. మన సామాజిక వ్యవస్థ, మన సమాజంలో ఉన్న అసమానతలు ఇవ్వన్నీ మనకు తెలిసినవే. వాటితో మనం మన భాషలోనే సంభాషిస్తూ, సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతాం’’ అని ఆయన చెప్పారు.

అన్నే జక్రాజుటాటిప్ ఒక ట్రాన్స్‌ఉమన్ కాబట్టి కొంతమంది లాటిన్ అమెరికన్ ఫ్యాన్స్ ఆమెను అంగీకరించకపోవచ్చునని, లాటిన్ అమెరికా ప్రాంతంలోని మాచో సాంస్కృతిక భావాలతో ఉన్న అభిమానులకు అంతగా నచ్చకపోయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘మహిళల వినోదం కోసం ఏర్పాటైన పోటీని మహిళకాని వారు అకస్మాత్తుగా కొనేశారు అనే చర్చ అక్కడ నడుస్తోంది. ఇంకేమవుతుంది’’ అని ఆయన ప్రశ్నించారు.

మిస్ యూనివర్స్, పోటీలు

ఫొటో సోర్స్, Getty Images

గ్లామర్ స్టార్స్

1952 నుంచి 74వ పోటీ అయిన తాజా మిస్ యూనివర్స్ ఏడాదికోసారి మాత్రమే జరిగే ఈ పోటీ టీవీల నుంచి టిక్ టాక్ లాంటి సోషల్ మీడియాకు విస్తరించేందుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చింది.

అభిమానులు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌లలో అందాల రాణులను అనుసరిస్తుండటంతో టీవీ వీక్షకుల సంఖ్య సంవత్సరాలుగా తగ్గుతోంది. చాలామంది మాజీ విజేతలు, రన్నరప్‌లకు కూడా లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు, ఇన్‌ఫ్లూయెన్సర్లుగా పనిచేస్తున్నారు.

తన 'మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ క్వీన్స్' మాదిరిగానే 'మిస్ యూనివర్స్' పోటీదారులు ప్రత్యక్ష ఆన్‌లైన్ షోలు చేయడం, ఉత్పత్తులను అమ్మడం వంటివి చేయాలని థాయ్ నిర్వాహకుడు నవాత్ కోరుకున్నారు. ఈ శైలిని మిస్ యూనివర్స్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నించారాయన.

కానీ లాటిన్ అమెరికాలో, అందాల రాణులను ఇప్పటికీ గ్లామరస్ టీవీ స్టార్లుగా చూస్తారు. ఆ ప్రేక్షకులను ఆకర్షించడానికి, ఒక ప్రత్యేక మిస్ యూనివర్స్ రియాలిటీ షో నడిపారు. దాని విజేత అయిన మిస్ యూనివర్స్ లాటినా - బ్యాంకాక్‌లో జరిగిన ప్రధాన పోటీలో పాల్గొన్నారు.

లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలో మిస్ యూనివర్స్ పోటీ ఇప్పటికీ చాలా ప్రజాదరణ పొందింది. ఇక్కడ కిరీటం గెలవడం వల్ల అమ్మాయిలు పేదరికం నుంచి బయటపడవచ్చు లేదా సెలబ్రిటీలుగా మారవచ్చు.

కానీ, ఈ పోటీ ఇప్పటికీ విమర్శలను ఎదుర్కొంటోంది. ఇది మహిళలను 'లైంగిక వస్తురూపం'లో చిత్రీకరిస్తుందనే విమర్శలున్నాయి.

నిర్వాహకులు కొన్ని మార్పులకు ప్రయత్నించారు. 2025 స్విమ్‌సూట్ రౌండ్‌లో, చాలామంది పోటీదారులు బికినీలు ధరించారు. కానీ, సాంప్రదాయిక దేశాల మహిళలు పూర్తిగా శరీరాన్ని కప్పే దుస్తులు ధరించడానికి అనుమతి కల్పించారు.

"అయితే, ఇది అందరికీ సాధ్యం కాదు. విభేదించే వారు ఎల్లప్పుడూ ఉంటారు. కానీ విలువలు చెక్కుచెదరకుండా ఉన్నంత వరకు, పోటీలు ఎల్లప్పుడూ సమాజంలో పాత్ర పోషిస్తాయని భావిస్తున్నాను" అని మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ మాజీ ప్రెసిడెంట్ పౌలా షుగార్ట్ అన్నారు. మహిళలకు సాధికారత కల్పించడం సంస్థ ప్రధాన లక్ష్యం కావాలని ఆమె అభిప్రాయపడ్డారు.

"పోటీ చేసే మహిళలకు మీరు సాధికారత కల్పించకపోతే మిస్ యూనివర్స్ పనికిరానిది" అన్నారు పౌలా షుగార్ట్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)