‘ఒక తల నరికితే మరిన్ని కొత్త తలలు పుట్టుకొస్తాయి’.. ఇరాన్ పాలకులు అధికారాన్ని కాపాడుకోవడానికి వ్యవస్థను ఎలా రూపొందించారు?

ఇరాన్

ఫొటో సోర్స్, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

    • రచయిత, లూయిస్ బరూచో
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
  • చదివే సమయం: 6 నిమిషాలు

1979 విప్లవం ఇరాన్ పాలకులను అధికారంలోకి తెచ్చిన నాలుగు దశాబ్దాల తర్వాత, వారు ఇప్పుడు అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా చేసిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ, ఇతర ఉన్నత సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌కు చెందిన కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.

ఇరాన్‌లో పాలన మారాలని కోరుకుంటున్నట్లు అమెరికా, ఇజ్రాయెల్‌లు సంకేతాలిచ్చాయి.

అయితే, ఇరాన్ పాలకులు అంత తేలికగా కూలగొట్టడానికి సాధ్యం కాని అధికార వ్యవస్థను నిర్మించారని నిపుణులు చెబుతున్నారు.

ఆ వ్యవస్థ పట్టుకు గల కారణమేంటి? మధ్య ప్రాచ్యంలో ఇతర దేశాలతో పోలిస్తే ఇరాన్ పాలన వ్యవస్థ ఎలా భిన్నమైంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇరాన్ రాచరిక వ్యవస్థను కూల్చేసినప్పటి నుంచి, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడేలా రాజకీయ వ్యవస్థను ఇస్లామిక్ రిపబ్లిక్ నిరంతరం అభివృద్ధి చేస్తూ వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కఠినంగా నియంత్రించే వ్యవస్థలు, సైద్ధాంతిక బోధనలు, ఉన్నత వర్గాల మధ్య ఐక్యత, విపక్షాలలో చీలికలు వంటి అనేక అంశాలపై నిర్మితమైంది.

ఇరాన్ అధికార వ్యవస్థ

‘ఈ వ్యవస్థలో ఒక తలను నరికేస్తే, మరో కొత్త తల పుట్టుకొస్తుంది’ అని బెల్జియంలోని యూరోపియన్ జియోపాలిటికల్ ఇనిస్టిట్యూట్ మిడిల్ ఈస్ట్ రీసెర్చర్ సెబాస్టియన్ బౌసోయిస్ చెప్పారు.

ఆదివారం సుప్రీం నేతగా అలీ ఖమేనీ కొడుకు మోజ్తాబా ఖమేనీని నియమించారు. తన తండ్రి చనిపోయిన రెండు వారాల కంటే తక్కువ వ్యవధిలోనే ఈ నియామకం జరిగింది.

తన తండ్రి తరహాలోనే కఠినమైన పాలనను మోజ్తాబా ఖమేనీ కొనసాగిస్తారని చాలామంది భావిస్తున్నారు.

మోజ్తాబా ఖమేనీ

ఫొటో సోర్స్, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

‘బహుళ నియంతృత్వ పాలన’

ప్రభుత్వాలు కుప్పకూలిన ట్యునీషియా, ఈజిప్ట్, సిరియా వంటి దేశాల్లో పరిస్థితి మాదిరిగా కాకుండా.. సైద్ధాంతికంగా నడిచే భద్రతా యంత్రాంగం ద్వారా ఇరాన్.. బాహ్య శక్తుల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కోగలిగిందని నిపుణులు చెబుతున్నారు.

ఒకే వ్యక్తి చేతిలోనే కేంద్రీకృతమైన నియంతృత్వం మాదిరి కాకుండా.. ఇరాన్‌లో ''బహుళ నియంతృత్వ పాలన'' ఉంది అని విశ్లేషిస్తున్నారు.

అంటే, ‘పొలిటికల్ ఇస్లాం’కు చెందిన మద్దతుదారులు, ఇరాన్ జాతీయవాదాన్ని ఆచరించేవారి మధ్య పొత్తుతో దేశంలో పాలన కొనసాగుతుందని ఇరాన్‌లోని తెహ్రాన్‌కు చెందిన ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్‌ మాజీ డైరెక్టర్ బెర్నార్డ్ హోర్కేడ్ చెప్పారు.

ఇరాన్‌లో మత సంస్థలు, సాయుధ దళాలు, ఆర్థిక వ్యవస్థలోని ఉన్నత వర్గాల మధ్య అధికార విభజన జరిగింది.

ఒకే నేత నియంతృత్వం కింద కాకుండా.. అంత తేలిగ్గా కదపలేని పునాదులతో ఈ వ్యవస్థ నిర్మితమైంది.

గార్డియన్ కౌన్సిల్‌ వంటి అధికారంలో ఉన్న ఇతర సంస్థలు పార్లమెంట్ రూపొందించిన చట్టాలు ఇస్లామిక్ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించి వాటిని వీటో చేయడం, ఎన్నికలకు పోటీపడే అభ్యర్థులను పరిశీలించడం వంటివి చేస్తుంటాయి.

అధికారం ఇన్ని కోణాల్లో విభజించడం వల్ల ఏ వర్గం కూడా ప్రభుత్వానికి సవాలుగా మారే అవకాశాలను తగ్గిస్తుంది.

ఇరాన్‌ నిరంకుశ రాజ్యంగా చెబుతుంటారు. అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవడం వంటి కొన్ని ఎన్నికల్లో మాత్రమే ఓటు వేసే అవకాశం మాత్రమే ఇరాన్ ప్రజలకు ఉంటుంది.

ఈ ప్రక్రియను కూడా చాలా కట్టుదిట్టంగా నిర్వహిస్తారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌కు నిబద్ధత వంటి ప్రమాణాల ఆధారంగా అభ్యర్థులను గార్డియన్ కౌన్సిల్ ఎంపిక చేస్తుంది.

ఇరాన్

ఫొటో సోర్స్, Majid Asgaripour/WANA (West Asia News Agency) via REUTERS

రివల్యూషనరీ గార్డుల పాత్ర

‘ఇలాంటి సంస్థలు ఇరాన్ ప్రభుత్వ పాలనకు అస్థిపంజరమైతే, భద్రతా బలగాలను కండరాలుగా పేర్కొంటారు.

సాధారణ సైన్యంతో పాటు కార్యకలాపాలు సాగించే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్‌ను (ఐఆర్‌జీసీ) తరచూ ఈ పాలనకు వెన్నెముకగా భావిస్తారు’ అని హోర్కేడ్ తెలిపారు.

విస్తృతమైన వ్యాపార ప్రయోజనాలు, స్వచ్ఛంద పారామిలటరీ సంస్థ అయిన బసిజ్ మిలీషియా ప్రభావంతో సైనిక పాత్రకు మించి ఇదొక రాజకీయ, ఆర్థిక శక్తిగా అవతరించింది.

అత్యంత కీలకమైనదేంటంటే.. పదేపదే నిరసనలు జరుగుతున్నప్పటికీ, భద్రతా బలగాలు ఐక్యంగా ఉంటున్నాయి.

ఈ విధేయతకు సైద్ధాంతిక భావాజాలమే కారణమని చెబుతున్నారు బౌసోయిస్.

''షియాలు, హమాస్, హెజ్బొల్లా వంటి గ్రూప్‌‌లలో కనిపించే బలిదానాల సంస్కృతిని వారి విధుల్లో ఒకభాగంగా పరిగణిస్తారు'' అని బౌసోయిస్ తెలిపారు.

అమెరికా నేతృత్వంలోని సైనిక కూటమి దాడితో ఇరాక్ బలగాలు 2003లో కుప్పకూలడం నుంచి నేర్చుకున్న పాఠాలతోనే ఇరాన్‌లో అధికార వికేంద్రీకరణ వ్యవస్థ ఏర్పాటైందని ‘యునైటెడ్ అగైన్స్ట్ న్యూక్లియర్ ప్లాన్‌’లో గార్డ్స్‌పై పరిశోధనలకు నేతృత్వం వహించిన కస్రా అరబీ చెప్పారు.

ఒకవేళ ప్రస్తుత పాలన తన మనుగడ సాగిస్తే.. ''గార్డ్స్ మరింత ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి'' అని కస్రా అరబీ అన్నారు.

సైనిక శక్తి

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఉన్నత వర్గాలకు రక్షణ కవచంలా నెట్‌వర్క్‌లు

ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చాలా వరకు బోన్యాడ్స్ వంటి ప్రభుత్వ అనుసంధ సంస్థల నియంత్రణలోనే ఉంది. బోన్యాడ్స్ అంటే.. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల్లో వేలాది కంపెనీలను కలిగి ఉన్న చారిటబుల్ ట్రస్టులు.

ఈ నెట్‌వర్క్‌లు ప్రభుత్వ పాలనకు విధేయతగా ఉండే నియోజకవర్గాలకు కాంట్రాక్టులను, ఉద్యోగాలను ఇప్పిస్తాయి.

ఖాతమ్ అల్-అన్బియా వంటి వ్యాపార సమూహం సహా ఐఆర్‌జీసీ వ్యాపారం సామ్రాజ్యం ఈ అండదండల వ్యాపార వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.

ఇరాన్ విస్తృతమైన ఆర్థిక వ్యవస్థను పశ్చిమ దేశాలు ఆంక్షలు దెబ్బకొట్టినప్పటికీ, ఈ నెట్‌వర్క్‌లు కీలకమైన ఉన్నత వర్గాలకు రక్షణలా ఉంటూ, వ్యవస్థ మనుగుడలో వారి ప్రయోజనాలను కాపాడేందుకు సాయపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

''ఈ వ్యవస్థ బలమైనది. అందుకే, ఈ వ్యవస్థను విడిచిపెట్టి బయటికి వచ్చిన వారిని మనం చూడటం లేదు'' అని తెలిపారు.

ఇరానియన్లు

ఫొటో సోర్స్, KHOSHIRAN/Middle East Images/AFP via Getty Images

భావజాలం, విప్లవ వారసత్వం

అధికారాన్ని కాపాడటంలో మతం ఇక్కడ కీలక పాత్ర పోషిస్తోంది.

మతం, రాజకీయం, విద్యా వ్యవస్థలకు చెందిన శాశ్వత నెట్‌వర్క్‌ను విప్లవం ఏర్పాటు చేసింది. ఈ నెట్‌వర్క్‌ ఇప్పటికీ, ప్రభుత్వానికి చెందిన ప్రపంచ దృక్పథాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

''సైద్ధాంతికంగా, పాలనపరంగా, బ్యూరోక్రటిక్ పరంగం చూసుకున్నా.. ఇది చాలా పాతది, చాలా శక్తిమంతమైన నిర్మాణం. ఇదే వ్యవస్థను బలంగా మారుస్తుంది'' అని బౌసోయిస్ తెలిపారు.

ఇరాన్ సైద్ధాంతిక భావాజాలమే ఐక్యతకు, ఉపాధికి, వృత్తిపరమైన నిబద్ధతలకు ఒక నిజమైన ఆధారంలాగా పనిచేస్తుందని చెప్పారు.

విపక్షాల్లో ఐక్యత లేమి

ఇరాన్‌లో ప్రతిపక్షం ఎప్పుడూ ఒకటిగా లేదు. ఈ ప్రతిపక్షంలో సంస్కరణవాదులు, రాజకీయ మద్దతుదారులు, వామపక్ష గ్రూప్‌లు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్ వంటి విదేశాల్లోని ప్రవాసుల ఉద్యమాలు, పలు జాతిపరమైన సంస్థలు ఉన్నాయి.

ఈ చీలిక నేటిది కాదు, ఎంతో కాలంగా ఉందని యూకే థింక్ ట్యాంక్ యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ సీనియర్ పాలసీ ఫెలో ఎల్లీ గెరాన్మాయే తెలిపారు.

విప్లవం తర్వాత రాజకీయ పార్టీల ఏర్పాటు గురించి జరిగిన చర్చ పక్కకు వెళ్లిపోయిందని తెలిపారు. ఎందుకంటే, 1980లో ఇరాక్‌తో ఇరాన్ యుద్ధం చేయడం మొదలుపెట్టింది. ఈ యుద్ధం దాదాపు ఎనిమిదేళ్లు కొనసాగిందని పేర్కొన్నారు.

కాలం గడుస్తున్నా కొద్దీ ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి. దానిలో ఒకటి 2009 గ్రీన్ మూవ్‌మెంట్. ఆ తర్వాత, 2022లో మహసా అమినీ మరణం తర్వాత కూడా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.

కానీ, ఈ నిరసనల్లో కేంద్ర నాయకత్వం లోపించింది. ఈ నిరసనలను ప్రభుత్వం అణచివేసింది.

అయితే, ఈ ఏడాది, గతేడాది నెలకొన్న నిరసనలు.. దివంగత షా బహిష్కృత కొడుకు ''గ్లోబల్ డే ఆఫ్ యాక్షన్'' కోసం పిలుపునివ్వడంతో మొదలయ్యాయి.

ఇరాన్ ఈ ప్రాంతంలో అత్యంత అధునాతనమైన నిఘా వ్యవస్థల్లో ఒకదాన్ని కలిగి ఉంది. అక్కడ తరచూ ఇంటర్నెట్ షట్‌డౌన్ అవుతుంటుంది. ఏఐ ఎనేబుల్డ్ మానిటరింగ్, సైబర్ యూనిట్లు విదేశాల్లో ఉన్న కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటుంటాయి.

దాడులు

ఫొటో సోర్స్, EPA

ప్రజల అప్రమత్తత

అమెరికా జోక్యం తర్వాత అఫ్గానిస్తాన్, ఇరాక్‌లో పర్యవసనాలను చూసిన తర్వాత చాలామంది ఇరానియన్లు కొన్నేళ్లుగా పాలన మార్పు విషయంలో వెనుకాడారని ఎల్లీ గెరాన్మాయే చెప్పారు. అరబ్ తిరుగుబాట్ల తర్వాత ఈ అప్రమత్తత మరింత పెరిగిందని తెలిపారు.

కానీ, ఇప్పుడు ఈ కథంతా మారిందని ఆమె అన్నారు. చాలామంది ఇరానియన్లు ప్రస్తుతం ప్రభుత్వం తమకు ఉద్యోగాల నుంచి శుభ్రమైన మంచినీరు వరకు కూడా తీర్చలేకపోతుందని భావిస్తున్నారు.

ఇదే సమయంలో ప్రజల్లో పెరుగుతోన్న అసమ్మతిని అణచివేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.

తాజాగా చెలరేగిన నిరసనలకు వ్యతిరేకంగా జనవరిలో ప్రభుత్వం తీసుకున్న దారుణమైన చర్యలు, దేశం మునుపెన్నడూ చూడని అతిపెద్ద నిరసనల్లో వేలాది మంది చనిపోవడం ఈ మార్పును వేగవంతం చేశాయని ఆమె చెప్పారు.

ఇరానియన్లలో, ప్రభుత్వం విషయంలో వారి వైఖరి మధ్య ''తరాల అంతరం'' ఉందని హోర్కేడ్ అన్నారు.

'' యువ ఇరానియన్లలో చాలామంది ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రపంచంతో అనుసంధానమయ్యారు. సోషల్ మీడియా ద్వారా ప్రభావితమయ్యారు. ప్రస్తుత పాలనను వారు తిరస్కరిస్తున్నారు. దీనొక ''అవినీతి, అణచివేత, ఆకాంక్షలకు అసంబద్ధమైనది''గా చూస్తున్నారు'' అని హోర్కేడ్ చెప్పారు.

పెద్ద ఎత్తున నిరసనలు, పాలకుల్లో విభేదాలు, సెక్యూరిటీ బలగాలు తమ కర్తవ్యాలను విడిచిపెట్టేయడం వంటి మూడుకారణాలతో నియంతృత్వ పాలనలు కుప్పకూలుతాయని నిపుణులు చెబుతున్నారు.

గతంలో ఇరాన్ దీనిలో ఒక్కదాన్నే ఎదుర్కొందని, మిగిలిన రెండింటిని ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు.

ఇస్లామిక్ రిపబ్లిక్ ముగియడం అనివార్యమని, కానీ, అది తక్షణమే జరగదని హోర్కేడ్ అంటున్నారు.

‘‘ప్రతి పాలన ఎప్పటికైనా ముగియాల్సిందే. అయితే, ఎప్పుడన్నదే అసలైన ప్రశ్న’’

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)