కలరా,ప్లేగ్ తర్వాత శబ్ద కాలుష్యం అంతటి మహమ్మారి కాబోతోందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనే అర్రేగి ఓట్క్సోటోరేనా
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘’ఏదో ఒకరోజు మనుషులు కలరా, ప్లేగు మాదిరే శబ్ద సమస్యతో పోరాడాల్సి ఉంటుంది.’’ ఈ మాటలను మైక్రోబయాలజిస్ట్, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ కోచ్ వందేళ్ల క్రితమే అన్నారు.
నేడు ఆ హెచ్చరిక చాలా సందర్భోచితంగా కనిపిస్తోంది. వాయు కాలుష్యం తర్వాత ధ్వని ఇప్పుడు మన ఆరోగ్యానికి రెండో అతిపెద్ద పర్యావరణ ప్రమాదంగా పరిగణిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం యూరోపియన్ యూనియన్‌లో 2.2 కోట్ల మంది ప్రజలు దీర్ఘకాలిక ధ్వని సమస్యతో బాధపడుతున్నారు. దీని వలన ప్రజలు తమ జీవితంలో పది లక్షలకు పైగా ఆరోగ్యకరమైన సంవత్సరాలను కోల్పోతున్నారు. ధ్వని ప్రభావంతో ప్రతీ ఏడాది 12వేలమంది (వారి సగటు జీవితకాలం కంటే) ముందస్తుగా మరణిస్తుండగా, 48 వేల గుండె జబ్బుల కేసులు నమోదవుతున్నాయి.
పరిసర శబ్దాలు అంటే ట్రాఫిక్, ఫ్యాక్టరీలు, కన్‌స్ట్రక్షన్ లేదా లౌడ్ మ్యూజిక్ వంటి మానవ కార్యకలాపాల వల్ల ఏర్పడే అవాంఛిత లేదా హానికరమైన ధ్వనులు. మరి ఈ ధ్వని మన ఆరోగ్యానికి ఎప్పుడు హానికరంగా మారుతుంది?
పగలు, సాయంత్రం లేదా రాత్రి సమయాలలో 55 డెసిబుల్స్ కంటే ఎక్కువ ధ్వని మన చెవులకు చేరితే అది ఆరోగ్యానికి హానికరమని యూరోపియన్ నాయిస్ డైరెక్టివ్ చెబుతోంది. స్పెయిన్‌లో దాదాపు కోటి మందికిపైగా ఈ స్థాయి కంటే ఎక్కువ రోడ్డు ట్రాఫిక్ శబ్దానికి గురవుతున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
అలవాటుతో సమస్యే
శబ్దం మనల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. అది ప్రజారోగ్య సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీ ప్రకారం, శబ్దం అనేది వినికిడి లోపంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలనూ కలిగిస్తుంది. వీటిలో నిద్ర సమస్యలు ఉన్నాయి. అంతేకాదు ఆలోచన, అభ్యాసంలో ఇబ్బందులు, గుండె సంబంధిత స్వల్ప, దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది.
ధ్వని వల్ల కలిగే అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో చిరాకు ఒకటి. శబ్దం ప్రధానంగా కలిగించే ప్రభావం ఏమిటని నిపుణులను అడిగితే ‘చిరాకు’ అని ఎక్కువమంది సమాధానమిస్తారు.
ఆరోగ్యాన్ని ధ్వని పరోక్షంగా ప్రభావితం చేస్తుందని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. మన మెదడు శబ్దాన్ని గ్రహించినప్పుడు ఇది జరుగుతుంది. ఇది భావోద్వేగ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. చికాకును కలిగిస్తుంది.
మనం శబ్దాన్ని గ్రహిస్తున్నప్పుడు, అది మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది. అయితే, అది ఎక్కువసేపు అలాగే కొనసాగితే ఒత్తిడి(స్ట్రెస్)కి కారణమవుతుంది.
శబ్దం వల్ల కలిగే ఒత్తిడి...ప్రతి వ్యక్తి ఎంత సున్నితంగా ఉంటారు? ఆ పరిస్థితులను ఎంత వరకు ఎదుర్కోగలరు? అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనం శబ్దంతో బాధపడకూడదంటే దాన్ని మన మనస్సు అలవాటుగా చేసుకుంటుందనే సిద్ధాంతం ఉంది.
ఇదొక ప్రక్రియ. మనస్సు శబ్దాన్ని పట్టించుకోవడం మానేస్తుంది. మెదడులోని ‘ప్రిఫ్రంటల్ కార్టెక్స్ (పీఎఫ్‌సీ)లో భావోద్వేగ ప్రతిచర్య తగ్గుతుంది. దీంతో మనం బాధపడటం మానేస్తాం.
అందుకే సందడిగా ఉండే ప్రదేశాల్లో నివసించే వారు శబ్దాలకు అలవాటు పడతారు. మరి వారి సమస్య పరిష్కారమైంది అనుకోవాలా? కాదు, ఎందుకంటే ఈ ‘మానసిక అనుసరణ’ను మన శరీరం పాటించకపోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
శారీరక ప్రతిచర్య అనివార్యం
మనం శబ్దానికి అలవాటు పడుతున్నట్లు మానసికంగా అనిపించినా, మన శరీరం మాత్రం దాని ప్రభావాలను లోనవుతూనే ఉంటుంది. హైపోథాలమిక్-పిట్యూటరీ-అడ్రినల్ (హెచ్‌పీఏ) యాక్సిస్, సహానుభూత నాడీ వ్యవస్థలను ధ్వని ప్రేరేపిస్తుంది.
హెచ్‌పీఏ యాక్సిస్ అనేది న్యూరోఎండోక్రిన్ యాక్సిస్. ఇది ఒత్తిడిని, రోగనిరోధక వ్యవస్థను సమన్వయ పరచడానికి సహాయపడుతుంది.
స్వయం చోదిత నాడీ వ్యవస్థలో సహానుభూత నాడీ వ్యవస్థ ఒక భాగం. ఒత్తిడితో కూడిన లేదా అత్యవసర పరిస్థితుల కోసం ఇది మనల్ని సిద్ధం చేస్తుంది.
ఈ రెండు వ్యవస్థలు ఒకే సమయంలో యాక్టివ్ అయితే శరీరం కార్టిసాల్, అడ్రినలిన్, నోరాడ్రినలిన్ వంటి స్ట్రెస్ హార్మోన్‌లను విడుదల చేస్తుంది.
ఈ స్ట్రెస్ హార్మోన్లు రక్తంలోకి ప్రవేశిస్తే, నిల్వగా ఉన్న శక్తి కండరాలకు చేరుతుంది. ఇది గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. రక్తపోటు, శ్వాస రేటును పెంచుతుంది. అదే సమయంలో జీర్ణక్రియ, పెరుగుదల, రోగనిరోధక ప్రతిస్పందన వంటి ప్రక్రియలు మందగిస్తాయి.
తక్షణ ఒత్తిడి నిర్వహణకు ఈ ప్రతిచర్యలు చాలా ముఖ్యమైనవి. స్వల్పకాల ఒత్తిడిలో శరీరం స్వయంగా సాధారణ హార్మోన్ స్థాయిలకు తిరిగి వస్తుంది. అయితే, దీర్ఘకాలిక ఒత్తిడి కలిగితే శరీరం అంత తేలికగా కోలుకోదు. ఈ పరిస్థితినే అలోస్టాటిక్ ఓవర్‌లోడ్ అంటారు.
దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం, రక్త నాళాల సమస్యలకు దారితీస్తుంది. ఇది గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, నరాల సంబంధిత సమస్యలకు సంబంధించిన అధిక ప్రమాదాలతో ముడిపడి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
శబ్దం కాలుష్యం తగ్గించడానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.
అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో కొన్ని:
- రహదారి ఉపరితలాలను మార్చాలి.
- నగరాల్లో వాహనాల వేగాన్ని మరింత తగ్గించడం
- శబ్దాలను కలిగించే వాటిపై తాత్కాలిక నిబంధనలు
- ప్రభావవంతమైన పట్టణ ప్రణాళిక.
పట్టణాల్లో శబ్దం తగ్గింపుకు ఒక మంచి ఉదాహరణ బార్సిలోనా సూపర్‌బ్లాక్స్ ప్రాజెక్ట్. ఇక్కడ ప్రత్యేకంగా తొమ్మిది సిటీ బ్లాకులను నిర్మించారు. వాహన కాలుష్యాన్ని తగ్గించడం, పాదచారులకు,సైక్లిస్టులకు మరింత ఉపయోగపడేలా రోడ్లను మెరుగుపరచడమే దీని లక్ష్యం.

ఫొటో సోర్స్, Getty Images
శబ్దాన్ని తగ్గించడంలో ఈ కొత్త నగర నమూనా సహాయపడుతుంది. ఇది గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. ట్రాఫిక్‌ను పరిమితం చేస్తుంది. దీనివల్ల గ్రీన్ స్పేసెస్ పెరుగుతాయి.
ఈ గ్రీన్ స్పెసెస్ అనేవి శబ్దం, కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలు, కృత్రిమ కాంతిని తగ్గించగలవు. అక్కడి అధికారులు ప్రజలలో శారీరక శ్రమ, సామాజిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తారు.
2050 నాటికి ప్రపంచ జనాభాలో 68శాతం మంది నగరాల్లో నివసిస్తారని అంచనా. ఇది ఐరోపాలో 75 శాతం. మరి మనం ఇప్పుడు ఎలాంటి నగరాల్లో బతకాలో అర్ధమైందా?
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














