గుండ్రని గుడ్డు: ‘నాకు దొరికిన ఇలాంటి గుడ్డు కోటి గుడ్లలో ఒకటే ఉంటుంది’ అంటున్న మహిళ

అలిసన్ గ్రీన్
    • రచయిత, ఇలియట్ బాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బ్రిటన్‌లోని డెవాన్‌ ప్రాంతానికి చెందిన ఒక మహిళ దగ్గర గుండ్రటి ఆకారంలో ఉన్న ఒక కోడి గుడ్డు ఉంది. ‘ఇలాంటిది కోటి గుడ్లలో ఒకటే ఉంటుంది’ అని ఆమె అన్నారు.

అలిసన్ గ్రీన్ అనే మహిళ సోమర్‌సెట్‌ సరిహద్దుకు దగ్గర్లో ఫెంటన్ ఫామ్‌లో పని చేస్తున్నారు. అక్కడ ఆమె గుడ్లను సేకరించడం, భద్రపరచడంలాంటివి చేస్తుంటారు.

క్రిస్‌మస్‌కు ముందు ఆమెకు ఈ అరుదైన గుడ్డు దొరికింది. ఇప్పుడామె దానిని వేలం వేయాలనుకుంటున్నారు.

అంతకుముందు కూడా ఇలాంటిదే ఒక గుండ్రని గుడ్డు మరొక ఫామ్‌లో వేరే వ్యక్తికి దొరికింది. అది బెర్క్‌షైర్‌లో 200 పౌండ్ స్టెర్లింగ్‌‌ల ( సుమారు రూ. 21,069)కు వేలంలో అమ్ముడైంది. అలా వచ్చిన డబ్బును ఆ గుడ్డును సేకరించిన వ్యక్తి, ఒక మెంటల్ హెల్త్ చారిటీ సంస్థకు ఇచ్చారు.

మార్చిలో దీన్ని వేలం వేసి అదే స్థాయిలో తాను కూడా డబ్బు సంపాదించాలని అలిసన్ గ్రీన్ భావిస్తున్నారు. దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని 'డెవాన్ రేప్ క్రైసిస్ చారిటీ'కి అందిస్తానని గ్రీన్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

57 ఏళ్ల అలిసన్ గ్రీన్ మూడేళ్లుగా డెవాన్‌‌లోని ఫామ్‌లో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ ఫామ్‌లో 4.2 కోట్లకు పైగా గుడ్లను తాను సేకరించానని, గతంలో ఎప్పుడూ ఇలాంటి గుండ్రని గుడ్డును చూడలేదని తెలిపారు.

తనకు దొరికిన గుండ్రటి గుడ్డు గురించి చెబుతూ..''ఇది నిజంగా ఆశ్చర్యం. ఎందుకంటే, గుడ్లు ఒక నిర్దిష్ట మార్గంలో దొర్లుతాయి. కానీ, ఇది భిన్నంగా ఉంది. అందుకే ఇది స్పెషల్.’’ అని గ్రీన్ తెలిపారు.

గుండ్రటి గుడ్డు
ఫొటో క్యాప్షన్, మూడేళ్లలో 4.2 కోట్ల గుడ్లను సేకరించానని, అంతకుముందు ఎన్నడూ ఇలాంటి గుడ్డును చూడలేదని గ్రీన్ చెప్పారు.

‘ఎలన్ మస్క్ దగ్గర కూడా ఇలాంటి గుండ్రటి గుడ్డు లేదు కదా?’

''ఇది చాలా అరుదైన వస్తువు. ఎలన్ మస్క్ దగ్గర కూడా గుండ్రటి గుడ్డు లేదు కదా?'' అని అన్నారామె.

దీన్ని అమ్మడం ద్వారా పెద్ద మొత్తంలో సంపాదించాలనుకుంటున్నట్లు గ్రీన్ అంటున్నారు.

''గుండ్రటి కోడిగుడ్లు చాలా అరుదు. వాటి కోసం ప్రజలు పెద్ద మొత్తంలో అంటే 100 పౌండ్ల (రూ.10 వేల) నుంచి కొన్నిసార్లు 200 పౌండ్ల (రూ.20 వేల) వరకు చెల్లిస్తుంటారు.'' అని బియర్నెస్ హాంప్టన్ లిటిల్‌వుడ్ ఆక్షనీర్స్‌కు చెందిన వేలంపాట వేసే వ్యక్తి బ్రియాన్ గుడిసన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)