బల్లి తోక తెగిపోయినా, మళ్లీ ఎన్నిసార్లు పెరుగుతుందో తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కె శుభగుణం
- హోదా, బీబీసీ ప్రతినిధి
తోకలేని బల్లులను మనం ఎన్నోసార్లు చూసే ఉంటాం.
మనుషుల ఆవాసాల మధ్య మనుగడ సాగించగలిగిన శక్తివంతమైన జీవివైవిధ్యానికి చిహ్నాలు బల్లులు. ఎందుకంటే, ఇవి మనుషుల మధ్య జీవిస్తూ జనావాసాల్లో పురుగులు, కీటకాలను నియంత్రిస్తుంటాయి.
అయితే, బల్లులు కొన్నిసార్లు వాటి తోకను అవే కత్తిరించుకుంటాయని ఎంతమందికి తెలుసు? అవి తమ శరీరంలోని ఒక భాగాన్ని ఎందుకు కోల్పోతాయి? ఆ తోక మళ్లీ ఎలా పెరుగుతుంది?


ఫొటో సోర్స్, Getty Images
బల్లుల్లో రాతి బల్లులు, చెట్ల మీద ఉండే బల్లుల వంటి అనేక రకాలు ఉన్నాయి. మనకు ఇళ్లలో కనిపించే బల్లి కూడా వాటిలో ఒకటి.
మానవ ఆవాసాలకు అనుగుణంగా మారిన సరీసృపాల్లో ఇదొకటి.
చల్లని రక్తం ఉండే ఈ సరీసృపాలు.. వెచ్చగా ఉండే గోడలు, పైకప్పులు, మూలల్లో ఉండేందుకు ఇష్టపడతాయి. తరచుగా రాత్రిపూట బయటికొచ్చే బల్లులు.. దోమలు, ఈగలు, ఇతర పురుగులను వేటాడతాయి.
లైట్ల చుట్టూ చేరే పురుగులను తినడం మనం తరచూ చూస్తూ ఉంటాం.
గోడలకు అతుక్కుపోయే సామర్థ్యం, పొంచివుండడం, వేగంగా కదలడం వంటి సామర్థ్యాలతో ప్రమాదం ఎదురైనప్పుడు, అసాధ్యమైన పరిస్థితుల్లో అద్భుత వ్యూహాలతో తమను తాము రక్షించుకుంటాయి.
"శత్రవుల నుంచి ముప్పుపొంచి ఉన్నప్పుడు, లేదా ఇతర బల్లులతో తలపడే సమయంలో తమ తోకలను కత్తిరించేసుకుంటాయి" అని అగస్త్యమలై పీపుల్స్ నేచర్ కన్జర్వేషన్ సెంటర్‌లో బయాలజిస్ట్(జీవ శాస్త్రవేత్త) డాక్టర్ తనిగవేల్ అన్నారు.
బల్లుల హెర్పెటోలాజికల్ అధ్యయనాల్లో ఈ పద్ధతిని 'ఆటోటమి'గా పిలుస్తారు. దీనర్థం ఒక ప్రాణి తన శరీర భాగాన్ని తనే కట్ చేసుకోవడం.

ఫొటో సోర్స్, Getty Images
"ప్రమాద సమయాల్లో దృష్టి మరల్చేందుకు బల్లికి తోక ఉపయోగపడుతుంది. శరీరం నుంచి విడిపోయిన కొద్ది నిమిషాల వరకూ ఆ తోక కొట్టుకుంటూనే ఉంటుంది.
ఇది దానిపై దాడి చేయడానికి వచ్చే జంతువు దృష్టిని మరల్చుతుంది. ఆ వెంటనే, బల్లి అక్కడి నుంచి తప్పించుకుంటుంది" అని తనిగవేల్ అన్నారు.
"అంతేకాకుండా బల్లులు తమ తోకల్లో ప్రోటీన్‌ను, కొవ్వును నిల్వ చేసుకుంటాయి, ఆహారం దొరకనప్పుడు వాటి తోకను అవే తినేస్తాయి. లేదంటే మరో బల్లిపై దాడి చేసి దాని తోకను తినేస్తాయి" అని ఆయన వివరించారు
తోకలేని బల్లిని పరీక్షగా గమనిస్తే, ఆ ప్రదేశం తెగిపోయిన శరీర భాగంలా కనిపిస్తుంది. తోక మళ్లీ పెరుగుతుంది కాబట్టి ప్రమాద సమయాల్లో తమను తాము కాపాడుకోవడానికి బల్లులు ఈ వ్యూహాన్ని అమలు చేస్తాయి.
దీనికి అనుగుణంగా బల్లి శరీర నిర్మాణం ఉంటుందని డాక్టర్ తంగివేల్ వివరించారు.
"వాటి తోక మొదలు నుంచి చివరి వరకు గొలుసుల మాదిరిగా సులభంగా తెగిపోయేలా ఉంటాయి. అంటే, అవి శరీరం నుంచి విడిపోయినా కూడా ప్రాణాపాయం కలగదు."

ఫొటో సోర్స్, Getty Images
2016లో, 'బయాలజీ, మెడిసిన్ అండ్ నేచురల్ ప్రొడక్ట్ కెమిస్ట్రీ' అనే జర్నల్‌లో ఇంటి బల్లుల గురించి ప్రచురితమైన అధ్యయనం బల్లుల తోక తెగిపోయే ప్రక్రియ గురించి వివరిస్తుంది.
ఈ అధ్యయనం ప్రకారం.. ఇతర జంతువుల నుంచి ప్రమాదాలు, ఆకస్మిక ఇబ్బందులు ఎదురైనప్పుడు తోక కట్ చేసుకుంటాయి.
అయితే, వాటి పునరుత్పత్తి ప్రక్రియ పరిశోధకులను ఆకర్షించింది.
అధ్యయనం ప్రకారం.. తోక పునరుత్పత్తి ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. "మొదటి దశలో గాయం వేగంగా నయమవుతుంది. రెండో దశలో తెగిపోయిన స్థానంలో బ్లాస్టెమా అనే కణాల పెరుగుదల మొదలవుతుంది. చివరగా, ఆ కణాలు క్రమంగా పెరుగుతూ కొత్త తోకను ఏర్పరుస్తాయి."
అయితే, మళ్లీ పెరిగే ఈ తోక, ముందు తెగిపోయిన అసలు తోకలా ఉండదని అధ్యయనం పేర్కొంది.
మొదట వచ్చిన తోకలో "ఎముకలు, వెన్ను భాగం, కండరాల పొరలు, ఫ్యాటీ టిష్యూ, నరాలు అన్నీ ఉంటాయి. ఇవి తోకకు బలాన్ని, బ్యాలెన్స్ అందిస్తాయి."
అయితే, కొత్తగా ఏర్పడిన తోకలో ఎముకలకి బదులు కార్టిలేజ్ ఉంటుంది. ఇందులో వెన్నుపూస నాడీ కణాలకు బదులు సాధారణ నాడీ కణజాలం ఉంటుంది. కొత్తగా వచ్చిన తోక కండర నిర్మాణం కూడా అంత దృఢంగా ఉండదు.
అంతేకాకుండా వెన్నుముకలోని ఎపెండిమల్ లేయర్ అనే భాగం చెక్కుచెదరకుండా ఉంటేనే కొత్త తోక పెరుగుదల సాధ్యమవుతుందని పరిశోధనా పత్రం పేర్కొంది.
అయితే, ఈ తోక ఎన్నిసార్లు పెరుగుతుందనేందుకు నిర్దిష్టమైన పరిమితి ఏమీ లేదని తనిగవేల్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














