అవని లేఖరా: సవాళ్లపై రైఫిల్ ఎక్కుపెట్టి పతకాలు సాధించిన అవని

- రచయిత, దీప్తి పట్వర్ధన్
- హోదా, స్పోర్ట్స్ జర్నలిస్ట్
ఆటల వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు అవని లేఖరా వయసు 13 ఏళ్లు.
షూటర్ అభినవ్ బింద్రా స్వీయచరిత్ర నుంచి ఆమె స్ఫూర్తి పొందారు. ఆ సమయంలో భారత్ తరఫున వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ఏకైక అథ్లెట్ బింద్రానే.
అయితే, తాను కూడా ఒక రోజు మార్గదర్శకురాలిగా మారతానని ఆ రోజు అవనికి తెలియదు.


23 ఏళ్ల వయసులో అవని పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచి.. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా రికార్డు సాధించారు.
2020 టోక్యో గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్1 ఈవెంట్‌లో పతకం గెలిచారు. 2020లో జరగాల్సిన ఆ ఒలింపిక్స్ కరోనా కారణంగా 2021లో జరిగాయి.
ఫైనల్స్‌లో 249.6 స్కోర్‌తో ప్రపంచ రికార్డును సమం చేసి, పారాలింపిక్స్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పారు.
మూడేళ్ల తరువాత పారాలింపిక్స్-2024లో గోల్డ్ గెలుచుకుని, మొత్తంగా రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన తొలి భారత మహిళగా అవని లేఖరా నిలిచారు.
ఈ క్రమంలో టోక్యో పారాలింపిక్స్‌లోని తన రికార్డును తానే బద్దలు కొట్టారు.
పారిస్ గేమ్స్‌కు ముందు తాను శారీరకంగా అంతగా ఫిట్‌గా లేనని 2024 సెప్టెంబర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అవని తెలిపారు.
"నేను ఈ మధ్యనే పిత్తాశయ సర్జరీ చేయించుకున్నాను. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత మళ్లీ రంగంలో దిగాలంటే మానసికంగా చాలా బలం కావాలి. శారీరకంగా బలంగా మారేందుకు కఠినమైన శిక్షణ అవసరం. గతంతో పోల్చితే ఈ పారాలింపిక్ సన్నద్ధత కాస్త కష్టంగా ఉంది" అని అవని చెప్పారు.

సవాళ్లపై రైఫిల్ ఎక్కుపెట్టి..
2012లో అవని లేఖరా కుటుంబం కారు ప్రమాదానికి గురైంది.
ఆ ప్రమాదంలో అవని వెన్నెముకకు గాయం కావడంతో నడుము నుంచి కాలు కింద వరకు పక్షవాతానికి గురయ్యారు. ఆరు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.
అప్పుడు కఠినమైన యుద్ధమే చేశారు. ఆమె ప్రతిదీ కొత్తగా నేర్చుకోవాల్సి వచ్చింది. ఎలా కూర్చోవాలో కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి. భావోద్వేగపరంగా దాని నుంచి బయటపడటానికి ఆమెకు ఎక్కువ సమయమే పట్టింది.
రెండేళ్ల తరువాత లేఖరాను స్కూల్‌కు పంపాలని ఆమె తల్లిండ్రులు నిర్ణయించినప్పుడు, వికలాంగ విద్యార్థులను చేర్చుకునే స్కూల్‌ను వెతకడం వారికి కష్టంగా మారింది.
ఇంట్లోనే ఉండటం కంటే అలా బయటికి వెళ్లి ఆటలు ఆడమని 2015లో అవనిని ఆమె తండ్రి ప్రోత్సా హించారు.
అందులో భాగంగా అవని స్విమ్మింగ్ , అర్చరీ, అథ్లెటిక్స్ ప్రయత్నించారు. కానీ, రైఫిల్ షూటింగ్‌లో ఆమెకు తన భవిష్యత్ కనిపించింది .
"వేసవి సెలవుల్లో షూటింగ్ రేంజ్ వద్దకు మా నాన్న తీసుకెళ్లారు" అని టోక్యోలో గోల్డ్ మెడల్ గెలిచిన తరువాత అవని లేఖరా చెప్పారు.
"నాకు షూటింగ్‌తో ఏదో సంబంధం ఉందని ఫీలయ్యాను. నేను కొన్ని షాట్స్ కాల్చాను, అవి బాగానే వచ్చాయి. ఈ క్రీడలో దృష్టి నిలపడం, నిలకడ ముఖ్యం. అందుకే దీనిని ఎంచుకున్నాను" అని అవని చెప్పారు.
అవని తొలినాళ్లలో పాఠశాల స్థాయి టోర్నమెంట్స్‌లో సాధారణ పిల్లలతో పోటిపడేది. వీల్‌చైర్‌లో పోటీ పడటం వల్ల అవనికి అసౌకర్యంగా ఉన్నప్పటికీ, త్వరగానే పైకి ఎదిగారు.
అవని లేఖరా 2017లో తొలి అంతర్జాతీయ మెడల్ గెలుచుకున్నారు.
వరల్డ్ షూటింగ్ పారా స్పోర్ట్ వరల్డ్ కప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించారు.
ఆ సమయంలో పారాలింపిక్ చాంపియన్‌గా ఉన్న స్లోకెవియన్ వెరోనికా వడోవికోవా గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు.
ఆ ఈవెంట్ తరువాత తన దృష్టి పారాలింపిక్ గోల్డ్ మెడల్‌పై పడిందని 2022 నవంబర్‌లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అవని లేఖరా చెప్పారు.
"నేను గోల్డ్ గెలుస్తాననే నమ్మకం కలిగింది. నేను వీల్ చైర్‌పై నా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ ప్రపంచాన్ని చుట్టేస్తూ సిల్వర్ మెడల్ గెలుచుకున్నానంటే, నేను పారాలింపిక్స్‌లోనూ మెడల్ గెలవగలను. ఆ ఈవెంట్ నుంచి చాలా స్ఫూర్తి పొందాను"

అవరోధాలను దాటి..
పారాలింపిక్స్‌లో గోల్డ్ గెలవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరువాత ఒలింపిక్ షూటర్ సుమ షిరూర్ ఆధ్వర్యంలో అవని శిక్షణ తీసుకున్నారు. ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని మార్చేసింది.
అవనికి షూటింగ్ నైపుణ్యాలను ప్రాథమికస్థాయి నుంచి నేర్పారు.
ఆమెలోని సందేహాలను నివృత్తి చేసి, ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు కృషి చేశారు.
అవని లాంటి పారా అథ్లెట్స్ బహిరంగ ప్రదేశాల్లో వీల్‌చైర్‌పై తిరగడం ఎంతో కష్టమని పారిస్ ఒలింపిక్స్ తరువాత షిరూర్ అన్నారు.
గోల్డ్ మెడల్ కోసం అవని ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. 2018 పారా ఆసియా గేమ్స్‌లో మెడల్ గెలవలేకపోయారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇంట్లోనే ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది.
టోక్యో గేమ్స్‌కు వెళ్లే ముందు వెన్నునొప్పి తగ్గేందుకు రెండు నెలల పాటు ఆమె ప్రాక్టీస్‌కు దూరంగా ఉండి ఫిజియోథెరపీ తీసుకున్నారు. పారిస్ గేమ్స్‌కు ముందు ఆమెకు సర్జరీ జరిగింది.
అయితే, పారాలింపిక్స్‌లో అత్యంత విజయవంతమైన మహిళగా అవని నిలవడానికి ఇవేవి అడ్డంకిగా మారలేదు.
అవని 'ఎక్స్' అకౌంట్ కవర్ ఫొటోలో ఉన్న కోట్, ఎలాంటి సవాళ్లు ఎదురైనా లొంగని తన దృక్పథానికి అద్దం పడుతుంది.
"జీవితం అనేది మంచి కార్డులు పట్టుకోవడంలో లేదు, పట్టుకున్న కార్డులతో ఎంత బలంగా ఆడతామనేదానిలో ఉంది" అన్నది ఆ కోట్ సారాంశం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















