దీపావళి: తెలంగాణలో 2 గంటల పాటు టపాసులు కాల్చేందుకు సుప్రీం అనుమతి - NewsReel

ఫొటో సోర్స్, Getty Images
హైకోర్టు దివాళీ పండుగ కు కాకర్స్ పేల్చవద్దు, అమ్మకాలు జరపవద్దని ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ, పాక్షిక అనుమతులిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం దీపావళి రోజున రెండు గంటల పాటు గ్రీన్ క్రాకర్స్ విక్రయాలు, పేల్చడానికి అనుమతులిచ్చింది.
వాయు నాణ్యత సూచీల ఆధారంగా టపాసుల వినియోగంపై ఆంక్షలు వర్తిస్తాయని.. నవంబరు 9న నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు ఆదేశాలను సవరిస్తున్నట్లు సుప్రీం కోర్టు చెప్పింది.
దీంతో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన తెలంగాణ ఫైర్ వర్క్స్ డీలర్స్ అసోసియేషన్‌కు కొంత ఊరట లభించినట్లయింది.
కాగా గాలి నాణ్యత సాధారణ స్థాయిలో ఉంటే రాత్రి 8నుంచి 10 గంటల మధ్య టపాసులు కాల్చేందుకు గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు సవరించిన ఆదేశాల ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఇవే వేళలు, వాయు నాణ్యత ప్రాతిపదికన అమలవుతాయి.

ఫొటో సోర్స్, Twitter/Rahul Gandhi
రాహుల్ గాంధీ గురించి బరాక్ ఒబామా తన పుస్తకంలో ఏం రాశారు?
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకం 'ఎ ప్రామిస్‌డ్ ల్యాండ్'లో రాహల్ గాంధీ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
రాహుల్ గాంధీ 'నెర్వస్‌గా ఉంటారు. తనదైన ప్రత్యేక లక్షణాన్ని రూపొందించుకోలేదు. పాఠాలన్నీ చదివి, నోట్సు సిద్ధం చేసుకుని టీచర్‌ను మెప్పించేందుకు ఉబలాటపడే విద్యార్థిలాగా కనిపిస్తారు. కానీ, ఆయన అంతరాంతరాల్లో ఒక విషయాన్ని లోతుగా అవగాహన చేసుకోవాలనే జిజ్ఞాస కానీ, తపన కానీ కనిపించవు' అని ఒబామా వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడిగా తన పదవీకాలపు అనుభవాలను, జ్ఞాపకాలను క్రోడీకరిస్తూ ఒబామా రాసిన ఈ పుస్తకంలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురించి కూడా ప్రస్తావించారు.
వచ్చే వారం విడుదల కానున్న ఈ పుస్తకం గురించి న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక సమీక్ష ప్రచురించింది.
ఈ పుస్తకంలో ఒబామా, మన్మోహన్ సింగ్ గురించి ప్రస్తావిస్తూ "ఆయనలో ఇతరులను ఆకట్టుకోగలిగే నిజాయితీ ఉంది" అని వ్యాఖ్యానించారు. 768 పేజీల ఈ పుస్తకంలో ఒబామా తన రాజకీయ ప్రస్థానం గురించి వివరంగా రాశారు.
ఒబామా గతంలో 'డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్', 'ది ఆడాసిటీ ఆఫ్ హోప్', 'ఛేంజ్ వి కెన్ బిలీవ్ ఇన్' అనే పుస్తకాలను రచించారు.

ఫొటో సోర్స్, Getty Images
మయన్మార్ ఎన్నికలు: ఆంగ్ సాన్ సూచీ పార్టీకే మెజారిటీ స్థానాలు
మయన్మార్ లో ఆదివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పాలక పక్షమైన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్‌డీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగినంత మెజారిటీని సాధించినట్లు తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 322 స్థానాల అవసరం ఉండగా ఇప్పటి వరకు ఎన్ఎల్ డి 346 స్థానాలలో విజయం సాధించింది.
ఫలితాలు వెలువడడం మొదలైన వెంటనే ఎన్ఎల్‌డీ అధినేత్రి ఆంగ్ సాన్ సూచీ తమ పార్టీ విజయం సాధించిందని ప్రకటించుకున్నారు.
అయితే, ఎన్నికలను తిరిగి నిర్వహించాలని మిలిటరీ మద్దతు ఉన్న ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది.
ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతూ ఉండటంతో ఎన్నికల కమిషన్ తుది ఫలితాలను ఇంకా ప్రకటించలేదు. మొత్తం 416 పార్లమెంట్ స్థానాలకు గాను 64 స్థానాల తుది ఫలితాలు ఇంకా వెలువడలేదు. రోహింజ్యా సంక్షోభం తరువాత చోటు చేసుకున్న ఈ ఎన్నికల ఫలితాలు ఎన్ ఎల్ డి పార్టీకి, సూచీకి వ్యక్తమయిన మద్దతుగా కనిపిస్తున్నాయి. ఎన్ ఎల్ డి పార్టీ ఆ దేశంలో ప్రముఖమైన పార్టీ అయినప్పటికీ, రోహింజ్యా సంక్షోభం పట్ల సూచీ వ్యవహరించిన తీరు ప్రపంచవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంది.
2017లో మయన్మార్లో చోటు చేసుకున్న సైనిక చర్య తరువాత కొన్నివేల మంది రోహింజ్యాలు ఆ దేశం వదిలి పెట్టి వెళ్లిపోయారు. ఇదొక రకమైన 'జాతి ప్రక్షాళన' చేయడం లాంటిదని ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యానించింది.
తీవ్రవాదుల నిర్మూలనను లక్ష్యంగా చేసుకుందని చెప్పిన మయన్మార్ సైన్యం వాదనను సూచీ సమర్ధించారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: డెన్మార్క్‌లో ‘మింక్’లను ఎందుకు చంపేస్తున్నారు
- ధన్తేరస్: ఈ పండగకు బంగారం ఎలా కొనాలి?
- డోనల్డ్ ట్రంప్ ఎందుకు ఓడిపోయారు?
- జో బైడెన్: అమెరికా 'అత్యుత్తమ ఉపాధ్యక్షుడు' అధ్యక్ష పదవి వరకూ ఎలా చేరుకున్నారు?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- దిల్లీలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. మరోసారి లాక్డౌన్ తప్పదా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








