‘డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులు పరీక్షలు లేకుండానే పైతరగతులకు.. తెలంగాణ విద్యాశాఖ యోచన’ - ప్రెస్ రివ్యూ

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో డిగ్రీ, ఇంజనీరింగ్‌లో కింది స్థాయి తరగతుల విద్యార్థులను నేరుగా పై తరగతులకు ప్రమోట్‌ చేయాలనే యోచనలో తెలంగాణ విద్యాశాఖ ఉందని ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

ఇప్పటికే 1-9 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేసిన తెలంగాణ ప్రభుత్వం డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థుల విషయంలోనూ ఇదే తరహా నిర్ణయం దిశగా వెళుతున్నట్లు సమాచారం.

డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు విద్యాశాఖ ప్రమోట్‌ చేయాలనుకుంటోంది. ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.

ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. విద్యార్థులు ఓ విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకుంది. వీరికి పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది.

డిగ్రీ, ఇంజనీరింగ్‌లో సుమారు 3లక్షల మంది ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు ఉంటారు. గతంలో మాదిరిగా అన్ని గ్రూపుల విద్యార్థులకు ఒకేసారి కాకుండా ఒక్కో గ్రూపు వారికి ఒక్కో రోజు పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉంది.

లాక్ డౌన్

ఫొటో సోర్స్, Getty Images

‘లాక్‌డౌన్‌ ఎత్తివేతకు దక్షిణాఫ్రికా మోడల్‌’

లాక్‌డౌన్ సడలించే ప్రణాళికల కోసం వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని, వాటిలో దక్షిణాఫ్రికా మోడల్ కూడా ఒకటని ‘సాక్షి’ దినపత్రిక ఓ వార్త రాసింది.

ఆంక్షల్ని సడలించడానికి దక్షిణాఫ్రికా వ్యూహం అత్యుత్తమంగా ఉందని కేంద్ర అధికార యంత్రాంగం భావిస్తున్నట్టుగా పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు కె.శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు.

లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేయడానికి ఆరోగ్యం, ఆర్థికం మధ్య సమతుల్యత సాధించడానికి ఆ దేశం రచించిన వ్యూహం అందరికీ ఆదర్శంగా నిలిచిందని ఆయన చెప్పారు.

కోవిడ్‌ను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయడానికి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఏర్పాటు చేసిన నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌లో శ్రీకాంత్ సభ్యుడు.

దక్షిణాఫ్రికా అనుసరించిన వ్యూహం ఇదే...

కరోనావైరస్‌ వ్యాప్తి, ఆయా ప్రాంతాల్లో దానిని ఎదుర్కోవడానికి ఆరోగ్య రంగంలో ఉన్న సన్నద్ధత ఆధారంగా దేశాన్ని 5 జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్‌లో ఒక్కో విధమైన ఆంక్షలు ఉంటాయి. అయితే సినిమా థియేటర్లు, హోటళ్లు, పర్యటకం, క్రీడల నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలపై పూర్తిస్థాయి నిషేధం కొనసాగుతుంది.

బయటకు వచ్చినప్పుడు మాస్కులు తప్పనిసరి. భౌతిక దూరం కచ్చితంగా పాటించాలి. 60 ఏళ్ల పైబడిన వారు, శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారికి ఇంటి నుంచి పని చేసుకోవడానికి అనుమతినిస్తారు.

ఐదు జోన్లలో ప్రణాళికలు ఇలా...

మొదటి జోన్: వైరస్‌ తక్కువ వ్యాప్తి, పూర్తిస్థాయి సన్నద్ధత

అన్ని రంగాలు పూర్తి స్థాయిలో పనులు ప్రారంభిస్తాయి. పూర్తి స్థాయిలో శానిటైజ్‌ చేస్తూ అన్ని రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రాల మధ్య రవాణాకు అనుమతిస్తారు. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతాయి.

రెండో జోన్: మధ్యస్థంగా వైరస్‌ వ్యాప్తి, పూర్తి స్థాయి సన్నద్ధత

నిర్మాణం, తయారీ, మైనింగ్, రిటైల్, పారిశుద్ధ్యం, ఐటీ, ప్రభుత్వ రంగాలన్నింటికీ అనుమతిస్తారు. విమాన ప్రయాణాలు, కారు ప్రయాణాలు పునరుద్ధరిస్తారు. 1, 2 జోన్లలో రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు అనుమతిస్తారు.

మూడో జోన్: వైరస్‌ వ్యాప్తి మధ్యస్థం, సన్నద్ధత కూడా మధ్యస్థం

నిత్యావసరాలు, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, విద్యారంగం, రిటైల్‌తో పాటు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ, టేక్‌ అవే రెస్టారెంట్లు, ఇ–కామర్స్‌ కార్యకలాపాలకు మాత్రమే అనుమతిస్తారు. పరిమితమైన ప్రయాణికులతో రవాణా సేవలు కొనసాగుతాయి. రాష్ట్రాల మధ్య ప్రయాణాలపై నిషేధం ఉంటుంది.

నాలుగో జోన్: మధ్యస్థం నుంచి వైరస్‌ తీవ్రత ఎక్కువ, ఓ మోస్తరు సన్నద్ధత

నిత్యావసరాలు, వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు, కాగితం, మైనింగ్‌ రంగాలకు, టెలికం, ఐటీ రంగాలకు అనుమతిస్తారు. భౌతిక దూరం పాటించేలా అతి తక్కువ మందితో ప్రయాణాలకు అనుమతిస్తారు. రాష్ట్రాల మధ్య ప్రయాణాలపై నిషేధం ఉంటుంది.

ఐదో జోన్: వైరస్‌ వ్యాప్తి అధికం, తక్కువ స్థాయి సన్నద్దత

నిత్యావసరాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. బస్సులు, ట్యాక్సీలు పరిమిత వేళల్లో తక్కువ మందితో తిరగడానికి అనుమతిస్తారు. రాష్ట్రాల మధ్య ప్రయాణాలు ఉండవు.

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

కోటలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు ఊరట

రాజస్థాన్‌లోని కోటలో చిక్కుకుపోయిన వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు స్వస్థలాలకు వచ్చేందుకు మార్గం సుగమమైనట్లు ‘ఈనాడు’ దినపత్రిక ఓ వార్త రాసింది.

విద్యార్థులను పంపించేందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్‌ అనుమతి ఇచ్చారు. వారిని స్వస్థలాలకు అనుమతించేందుకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వారిని పంపే ముందు తప్పనిసరిగా స్క్రీనింగ్‌ చేయాలని రాజస్థాన్‌ సీఎం ఆదేశించారు.

తమ ఊళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బిహార్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన దాదాపు 10 వేల మంది విద్యార్థులు లాక్‌డౌన్‌ కారణంగా అక్కడ చిక్కుకు పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కోటలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు ఎలా ఉన్నారని తొలుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరా తీశారు. స్థానిక ఎంపీ, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాతో ఆయన ఆదివారం పలు దఫాలు ఫోన్‌లో మాట్లాడారు. విద్యార్థులకు సదుపాయాలు కల్పించడంపై చర్చించారు. వారికి భోజన, వైద్య సంబంధిత ఏర్పాట్లు చేస్తామని, వ్యక్తిగత చొరవ చూపుతానని ఓం బిర్లా హామీ ఇచ్చారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, FACEBOOK/KCR

ఫొటో క్యాప్షన్, కేసీఆర్

ఇంకొన్ని రోజులు సహకరించండి: కేసీఆర్

తెలంగాణలో లాక్‌డౌన్‌ అమలుతో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని సీఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేసినట్లు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

మరికొద్ది రోజులు ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని సీఎం కేసీఆర్ కోరారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే పరిస్థితి మరింత మెరుగవుతుందని అన్నారు.

సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో దేశ పరిస్థితి కూడా తెలుస్తుందని కేసీఆర్‌ వివరించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు, సహాయ కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

‘‘రాష్ట్రంలో మరణాలు రేటు జాతీయ సగటు కన్నా తక్కువ ఉండటం ఊరటనిచ్చే అంశం. లాక్‌డౌన్‌ను మరింత కాలం ఇదే పద్ధతిలో కొనసాగిస్తూ.. ప్రజలు ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ వ్యాప్తి తగ్గిపోయే అవకాశం ఉంది.

ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో పరిస్థితి వివరిస్తారు. దేశవ్యాప్తంగా పరిస్థితిపై ఓ అంచనా వస్తుంది. తదుపరి చర్యలు ఎలా ఉండాలనే విషయంలో కూడా రేపటి కాన్ఫరెన్స్‌లో అభిప్రాయాలు వస్తాయి. తద్వారా భవిష్యత్‌ కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది’’ అని కేసీఆర్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)