కరోనావైరస్: రుణాల చెల్లింపులపై ఆర్‌బీఐ మారటోరియం - ఈఎంఐ కట్ అవుతుందా? వాయిదా వేయటం ఎలా? - ప్రెస్ రివ్యూ

నగదు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నగదు

కరోనావైరస్‌ నేపథ్యంలో దేశంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి కారణంగా నెలవారీ రుణ వాయిదా (ఈఎంఐ) చెల్లింపుల మీద రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మూడు నెలల మారటోరియం విధించిన నేపథ్యంలో.. సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌లో మూడు నెలల మారిటోరియంను లాక్‌ చేశామని, దీంతో ఆటోమేటిక్‌గా ఈఎంఐ నిలిచిపోతుందని ఎస్‌బీఐకి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలియజేసినట్లు ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.

ఒకవేళ ఈఎంఐ కట్‌ అయితే ఆందోళన చెందవద్దని.. సంబంధిత మొబైల్‌ సందేశాన్ని బ్యాంక్‌ శాఖకు మెయిల్‌ ద్వారా తెలియజేస్తే.. తిరిగి ఖాతాలో సొమ్ము జమ అవుతుందని చెప్పినట్లు వివరించింది.

ఆ కథనం ప్రకారం.. ‘ఈఎంఐ వాయిదా చెల్లించటానికి గడువు లోగా మీ బ్యాంక్‌ ఖాతాలో సరిపడా నగదు నిల్వ ఉంచుకోవాలి’ అంటూ కొందరు రుణగ్రహీతలకు వారి బ్యాంకుల నుంచి మెసేజ్‌లు వచ్చాయి. ఆర్‌బీఐ మూడు నెలల మారటోరియం ప్రకటించినపుడు.. మళ్లీ ఈ మెసేజ్‌ ఏంటని క్రెడిట్‌ కార్డ్స్‌ సహా పర్సనల్‌ లోన్, వెహికల్‌ లోన్, హౌసింగ్‌ లోన్‌.. ఇలా అన్ని రకాల రుణ ఖాతాదారులకూ సందేహాలు వస్తున్నాయి.

మన దేశంలో చాలా వరకు ఈఎంఐలు ప్రతి నెలా మొదటి వారంలో ఆటోమేటిక్‌గా కస్టమర్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి కట్‌ అవుతుంటాయి. ఈఎంఐను దృష్టిలో పెట్టుకొని ఖాతాలో నగదు నిల్వ ఉంచుకుంటారు.

ఈఎంఐ వాయిదా వద్దనుకుంటే..: ఒకవేళ ఎవరైనా రుణ ఖాతాదారులు మూడు నెలల మారటోరియాన్ని వద్దనుకుంటే మాత్రం ఖాతాదారులే స్వయంగా లేదా మెయిల్‌ ద్వారా సంబంధిత బ్యాంక్‌ శాఖను సంప్రదించాల్సి ఉంటుంది. ఏ బ్యాంక్‌ నుంచైతే ఈఎంఐ కట్‌ అవుతుందో ఆ బ్యాంక్‌ శాఖకు సమాచారం అందించాలి.

ఉదాహరణకు బ్యాంక్‌ అకౌంట్‌ ఎస్‌బీఐలో ఉండి, వాహన రుణం హెచ్‌డీఎఫ్‌సీలో ఉందనుకుందాం. అలాంటప్పుడు ఈఎంఐ కట్‌ అవుతుంది ఎస్‌బీఐలోనే కనక.. రుణ వాయిదాను నిలుపుదల చేయాల్సిన అవసరం లేదని సంబంధిత ఎస్‌బీఐ శాఖకు మెయిల్‌ చేయాల్సి ఉంటుంది.

ఈ పద్ధతిలో ఎవరైనా కస్టమర్లు మూడు నెలల పాటు కాకుండా ఒకటి లేదా రెండు నెలలు మాత్రమే మారటోరియం కావాలన్నా కూడా ఎంపిక చేసుకునే వీలుంటుందని బ్యాంక్‌ అధికారులు తెలియజేశారు.

మారటోరియం ఆప్షన్ కావాలనుకుంటే..: ఎలక్ట్రానిక్‌ క్లియరింగ్‌ సర్వీసెస్‌ (ఈసీఎస్‌), డిమాండ్‌ డ్రాఫ్ట్, (డీడీ), ఓవర్‌ డ్రాఫ్ట్‌ (ఓడీ) ద్వారా ఈఎంఐ ఉపసంహరణ ఉన్న ఖాతాదారులు మారటోరియం ఆప్షన్‌ను ఎంచుకుని.. ఈఎంఐలు వాయిదా వేయాలని కోరుకుంటే మాత్రం వ్యక్తిగతంగా గానీ మెయిల్‌ లేదా ఇతర డిజిటల్‌ మాధ్యమాల ద్వారా గానీ సంబంధిత బ్యాంక్‌ శాఖను సంప్రదించాలి.

అంతే తప్ప భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందువల్ల బ్యాంకే స్వయంగా ఈసీఎస్‌ను నిలుపుచేసే నిర్ణయాన్ని తీసుకోబోదని ఎస్‌బీఐకి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలియజేశారు.

క్రెడిట్‌ కార్డ్‌ బాకీలు, ఈఎంఐలకు కూడా ఈ మారటోరియం వర్తిస్తుంది. మూడు నెలల తర్వాత కట్టవచ్చు. కాకపోతే ఈ మూడు నెలల సమయానికి అసలుపై వడ్డీ భారం పడుతూనే ఉంటుంది.

క్రెడిట్‌ కార్డ్‌ చెల్లింపులతో సహా కార్పొరేట్, ఎంఎస్‌ఎంఈ, రిటైల్, వ్యవసాయ, వాహన, విద్య, గృహ, వ్యక్తిగత అన్ని రకాల రుణాలకు ప్రిన్సిపల్‌ అమౌంట్, వడ్డీ రెండింటికీ కూడా మూడు నెలల మారటోరియం వర్తిస్తుంది. ఈ మారటోరియం సమయాన్ని డిఫాల్ట్‌గా, మొండిబకాయిలుగా పరిగణించరు. మారటోరియం వినియోగించిన కస్టమర్ల సిబిల్‌ స్కోర్‌ మీద ఎలాంటి ప్రభావం లేకుండా బ్యాంక్‌లు సంబంధిత వివరాలను క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీలకు (సీఐసీ) అందించాలని ఆర్‌బీఐ ఆదేశించింది.

అన్ని కమర్షియల్‌ బ్యాంకులు, ప్రాంతీయ, గ్రామీణ, స్మాల్‌ ఫైనాన్స్, లోకల్‌ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఆల్‌ ఇండియా ఫైనాన్షియల్‌ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలలో మార్చి నుంచి మే మధ్య అన్ని రుణ చెల్లింపులకు ఈ మారటోరియం వర్తిస్తుంది.

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Naveen

ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్

ఏపీ, తెలంగాణల్లో ప్రభుత్వ ఉద్యోగులకు వాయిదాల్లో వేతనాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ సర్కారు తరహాలో ఉద్యోగుల వేతనాలను వాయిదా పద్ధతుల్లో చెల్లించాలని నిర్ణయించిందని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. కరోనావైరస్ నేపథ్యంలో ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, వనరులు కూడా సన్నగిల్లాయని తెలిపింది. కరోనాపై పోరుకోసం వైద్య రంగంపై భారీ స్థాయిలో ఖర్చు పెట్టాల్సి వస్తోందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో జీతాలు, పెన్షన్లలో కోత పెడుతున్నట్లు మంగళవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జీఓ జారీ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు వాయిదా పద్ధతి అనుసరించనున్నారు. సీఎం నుంచి స్థానిక సంస్థల వరకు అన్ని స్థాయుల ప్రజా ప్రతినిధులకు ఈ నెల జీతం చెల్లించరు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ తదితర అఖిల భారత సర్వీసు (ఏఐఎస్‌) అధికారుల జీతంలో 60 శాతం కోత పెట్టారు. మిగిలిన ఉద్యోగులకు 50 శాతం మాత్రమే చెల్లిస్తారు.

నాలుగో తరగతి ఉద్యోగులు, ఔట్‌ సోర్సింగ్‌, గ్రామ-వార్డు సచివాలయ సిబ్బందికి పది శాతం తగ్గించి ఇస్తారు. ఇప్పుడు వేతనంలో తగ్గించిన మొత్తాన్ని ఆయా ఉద్యోగులు, అధికారులకు తర్వాత చెల్లిస్తారు. ఉద్యోగుల వేతనాల బిల్లులను తాజా జీఓ ప్రకారం మళ్లీ పంపించాలని ఆదేశించారు.

ఏపీ ప్రభుత్వం వేతనాలు, పెన్షన్లు కలిపి నెలకు రూ. 6,200 కోట్లు చెల్లింపులు చేస్తోంది. ప్రతి నెలా ఒకటో తేదీన రూ. 2,500 కోట్లు వేతనాల రూపంలో ఉద్యోగుల ఖాతాల్లో పడతాయి. మిగిలిన వేతనాలు, పెన్షన్లను వీలును, నిధుల లభ్యతను బట్టి 10వ తేదీలోగా ఆర్థిక శాఖ చెల్లిస్తోంది.

ఇప్పుడు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం ద్వారా నెలకు ప్రభుత్వానికి రూ. 2,500 కోట్ల వరకు మిగిలే అవకాశం ఉంది. అలా మిగిలిన నిధులతో అత్యవసర బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఒకటో తేదీన ప్రతి ఇంటికీ రూ. 1,000 చొప్పున చెల్లించాలని ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. దీనికోసం రూ. 1,300 కోట్లు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వేతనాల ‘వాయిదా చెల్లింపు’ తప్పలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలావుంటే.. ప్రైవేటు పరిశ్రమలు తమ ఉద్యోగులు, కార్మికులకు జీతాలను ఆపి వేయడానికి వీల్లేదని, ఎప్పట్లాగానే నిర్దిష్ట సమయానికి చెల్లించాలని పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంటర్నెట్
ఫొటో క్యాప్షన్, ఇంటర్నెట్

నెట్‌ స్పీడ్‌కు కరోనా బ్రేక్‌

కరోనావైరస్‌ను కట్టడి చేసేందుకు దేశమంతటా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలంతా ఇండ్లకే పరిమితమై.. మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర మాధ్యమాలను అధికంగా వాడుతున్నారని.. వినియోగదారులు భారీగా పెరగటంతో ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గుతున్నదని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. ఇంటర్నెట్‌ వేగంపై ఓక్లా స్పీడ్‌ టెస్ట్‌ గ్లోబల్‌ ఇండెక్స్‌ ఓ సర్వే నిర్వహించింది. దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి బ్రాడ్‌బ్యాండ్‌ కంటే మొబైల్‌ డేటానే అధికంగా వినియోగిస్తున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. మన దేశంలో మొబైల్స్‌ వినియోగించినంతగా అమెరికాలో వినియోగించడం లేదని, అక్కడ బ్రాడ్‌బ్యాండ్‌ అధికంగా వినియోగిస్తున్నట్టు తేలింది.

వర్క్‌ ఫ్రమ్‌ హోమే కీలకం: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఐటీ కంపెనీలు, ప్రైవేట్‌ సంస్థలు తమ ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోంకు అనుమతినిచ్చాయి. పలు కంపెనీలు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమావేశాలు నిర్వహిస్తుండటం కూడా ఇంటర్నెట్‌పై ప్రభావం చూపుతున్నది. ఇంటర్నెట్‌ వినియోగం అధికమవుతుండటం వల్ల వేగం తగ్గుతున్నది. ఈ నేపథ్యంలో అధిక డేటా ప్లాన్‌లకు మారుతున్నారు.

చైనాతో పోలిస్తే వేగం తక్కువే: దేశంలో సుమారు 630 మిలియన్ల మొబైల్‌, 19 మిలియన్ల బ్రాడ్‌ బ్యాండ్‌ వినియోగదారులున్నారు. స్మార్ట్‌ మొబైల్‌ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరూ కనీస ఇంటర్నెట్‌ సౌకర్యం కలిగి ఉన్నారు. కాగా, గత వారం చైనా, జపాన్‌ దేశాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్ల డౌన్‌లోడ్‌ వేగం పెరిగిందని, మలేషియాలో తగ్గిందని ఓక్లా సర్వేలో తేలింది. మొబైల్‌ డౌన్‌లోడ్‌ వేగం జపాన్‌లో సాపేక్షంగా ఉందని, భారత్‌లో ఇది కాస్త పడిపోయిందని తెలిపింది. గత వారంతో పోలిస్తే దేశంలో ఇంటర్నెట్‌ స్పీడ్‌ 4.9 శాతం తగ్గిందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)