కరోనావైరస్ వేరియంట్లకు గ్రీకు అక్షరాలతో నామకరణం చేసిన డబ్ల్యూహెచ్ఓ

ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వేరియంట్లకు గ్రీకు అక్షరాలతో నామకరణం చేసింది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వేరియంట్లకు గ్రీకు అక్షరాలతో నామకరణం చేసింది

కోవిడ్-19 వేరియంట్లు మొదట ఏయే దేశాల్లో కనిపించాయో ఆ దేశాల పేర్లతోనే ఇన్నాళ్లూ చలామణీ అవుతూ వచ్చాయి.

అయితే, ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వాటన్నిటికీ గ్రీకు అక్షరాలతో కొత్త పేర్లు పెట్టింది.

బ్రిటన్, దక్షిణాఫ్రికా, భారత్ లాంటి దేశాల్లో కనిపించిన కరోనావైరస్ వేరియంట్లను ఇక నుంచి ఈ గ్రీకు అక్షరాలతోనే సంభోదించాలని డబ్ల్యూహెచ్ఓ నిర్ణయించింది.

ఉదాహరణకు బ్రిటన్ వేరియంట్‌కు ఆల్ఫా అని, దక్షిణాఫ్రికా వేరియంట్‌కు బీటా అని, ఇండియా వేరియంట్‌కు డెల్టా అని పేర్లు ఇచ్చారు.

ఇలా పేర్లు పెట్టడం వల్ల, వాటి గురించి చర్చించడానికి సులువుగా ఉంటుందని, ముఖ్యంగా దేశాల పేర్లతో పిలవడం వల్ల ఆయా దేశాలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించినట్లు అవుతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

ఈ నెల ప్రారంభంలో B.1.617.2 వేరియంట్‌ను 'ఇండియన్ వేరియంట్' అని పిలవడంపై భారత ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

అయితే, డబ్ల్యూహెచ్ఓ ఆ వేరియంట్‌ను అధికారికంగా 'ఇండియన్ వేరియంట్' అని చెప్పకపోయినా, అది గత అక్టోబర్‌లో భారతదేశంలో తొలిసారిగా కనిపించింది కాబట్టి అందరూ దాన్ని భారత వేరియంట్‌గా పిలవడం ప్రారంభించారు.

"కొత్త కోవిడ్ వేరియంట్‌ను గుర్తించి, ప్రపంచానికి తెలియజేసిన ఏ దేశమూ నిందలు పడకూడదు" అని డబ్ల్యూహెచ్ఓ కోవిడ్ 19 టెక్నికల్ లీడ్ మారియా వాన్ కెర్ఖోవే అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అలాగే, కొత్త వేరియంట్లపై నిశితంగా నిఘా ఉంచి, వాటికి సంబంధించిన డేటాను పంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. వీటి వ్యాప్తిని అరికట్టేందుకు అది సహాయపడుతుందని అన్నారు.

అన్ని కరోనా వేరియంట్లకు పెట్టిన కొత్త పేర్ల జాబితాను డబ్ల్యూహెచ్ఓ తన వెబ్‌సైట్‌లో ఉంచింది.

అయితే, ఈ వేరియంట్లకు ఉన్న శాస్త్రీయ నామాల్లో ఎలాంటి మార్పులూ ఉండవు.

"గ్రీకు అక్షరాలు 24 మాత్రమే ఉన్నాయి. ఒకవేళ 24 కన్నా ఎక్కువ వేరియంట్లను అధికారికంగా గుర్తిస్తే, అప్పుడు కొత్తగా మరో నామకరణ కార్యక్రమాన్ని చేపడతారు" అని స్టాట్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వాన్ కెర్ఖోవే చెప్పారు.

"ఒక వేరియంట్‌కు ఉన్న B.1.1.7 అనే శాస్త్రీయ నామాన్ని మార్చమని చెప్పడం లేదు. కానీ, సామాన్యులకు కూడా సులువుగా తెలిసేలా ఈ కొత్త పేర్లు పెట్టాం. బహిరంగ చర్చల్లో ఈ వేరియంట్ల గురించి మాట్లాడుకోవడానికి ఈ కొత్త పేర్లు అనువుగా ఉంటాయి" అని ఆమె ఒక అమెరికన్ వెబ్‌సైట్‌తో అన్నారు.

బ్రిటన్‌లో కరోనావైరస్ థర్డ్ వేవ్ ప్రారంభమైందని, దీనికి కొంతవరకు 'డెల్టా' (ఇండియన్ వేరియంట్) కారణమని బ్రిటన్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఒక శాస్త్రవేత్త సోమవారం తెలిపారు.

గత శీతాకాలంలో విజృంభించిన ఆల్ఫా (బ్రిటన్, కెంట్ వేరియంట్) కంటే ఇది వేగంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

ఆల్ఫా, డెల్టా వేరియంట్ల కలయికతో ఏర్పడిన ఒక కొత్త వేరియంట్‌ను ఇటీవలే వియత్నాంలో గుర్తించారు.

"ఇది చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది. సులువుగా, వేగంగా వ్యాప్తించే అవకాశాలు ఉన్నాయి" అని ఆ దేశ ఆరోగ్యమంత్రి శనివారం వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)