డోనల్డ్ ట్రంప్: ‘‘అమెరికా చరిత్రను, విలువలను నాశనం చేయటానికి ‘కోపిష్టి మూక’ ప్రయత్నిస్తోంది’’

ఫొటో సోర్స్, Reuters
అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఇటీవల చోటు చేసుకున్న నిరసనల్లో భాగంగా కొంత మంది నిరసనకారులు ప్రముఖ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం పట్ల అమెరికా అధ్యక్షడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా చరిత్రని, విలువలను నాశనం చేయడానికి, నాయకుల ప్రతిష్ట దెబ్బ తీయడానికి, పిల్లల మెదళ్లను చెడకొట్టడానికి ‘‘కోపిష్టి మూక’’ ప్రముఖుల విగ్రహాలను లక్ష్యంగా చేసుకుందంటూ ఆయన ఖండించారు. ఇది చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవమైన ‘జూలై 4’ సందర్భంగా మౌంట్ రష్మోర్‌లో ప్రసంగించారు.
అయితే.. అమెరికాలో ఇప్పటివరకు 1,30,000 మంది ప్రాణాలను తీసిన కరోనావైరస్ గురించి ఆయన ప్రసంగంలో ప్రస్తావన తేలేదు. శుక్రవారం నాటికి అమెరికాలో 20.5 లక్షల మంది కరోనా వైరస్ బారినపడ్డారు.
వైద్య నిపుణులు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని హెచ్చరిస్తున్నప్పటికీ అవేమీ ఈ కార్యక్రమంలో పాటించినట్లు కనిపించలేదు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
లకోట సియోక్స్‌కి చెందిన ప్రాంతాన్ని 1800లో అమెరికా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న చోటే మౌంట్ రష్మోర్ ఉంది. జార్జి వాషింగ్టన్, థామస్ జెఫెర్సన్ తో సహా మరో ఇద్దరి అమెరికా అధ్యక్షుల ముఖాలను చెక్కిన విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి.
అమెరికాకి స్వాతంత్య్రం తెచ్చిన వీరుల స్మరణార్ధం సౌత్ డకోటా రాష్ట్రం లో ఉన్న మౌంట్ రష్మోర్ ఎప్పటికీ నిలిచిపోతుందని అన్నారు. "ఈ కట్టదాన్ని ఎప్పటికీ నాశనం చేయడం గాని, ఇక్కడ ఉన్న హీరోల చిత్రాలు లేకుండా చేయడం ఎప్పటికీ జరగదని” ఆయన అన్నారు.
జాతీయ సాంస్కృతిక సంపదని నాశనం చేయాలనుకునే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల విగ్రహాల సంరక్షణ కోసం ఆయన సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గురించి ప్రస్తావిస్తూ విగ్రహాలను నాశనం చేసిన వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని చెప్పారు.
ఈ వేడుకల్లో భాగంగా సంగీతానికి అనుగుణంగా బాణాసంచాని కాల్చిన కార్యక్రమాన్ని సుమారు 7,500 మంది ప్రేక్షకులు వీక్షించారు.
కట్టడం చుట్టూ ఉన్న ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగే భయంతో బాణాసంచా కాల్చడాన్ని నిషేధించిన తర్వాత, గత పదేళ్లలో ఇక్కడ బాణాసంచా కాల్చడం ఇదే మొదటిసారి.
సౌత్ డకోటా గవర్నర్ కూడా విగ్రహాల విషయంలో ట్రంప్‌కి మద్దతు పలికారు. నవంబర్‌లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ మద్దతుదారులను కూడగట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఈ కార్యక్రమం గురించి నేటివ్ అమెరికన్లు ఏమన్నారు?
కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ట్రంప్ ఈ కార్యక్రమాలు నిర్వహించి ముప్పుని పెంచారని నేటివ్ అమెరికన్లు విమర్శించారు. వారెంతో పవిత్రంగా భావించే స్థలంలో అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడాన్ని నిరసించారు.
గిరిజన ప్రాంతాలను, వారి సాంసృతిక స్వతంత్రాన్ని అమెరికా చేతుల్లో కోల్పోయినట్లుగా భావించే నేటివ్ అమెరికన్లు అమెరికా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడాన్ని ఇష్టపడరు.
1927 - 1941 మధ్య కాలంలో మౌంట్ రష్మోర్ కట్టడాన్ని చెక్కారు.
ఈ కార్యక్రమానికి ముందు కొంత మంది నేటివ్ అమెరికా నిరసనకారులు ట్రంప్ కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసన నిర్వహించి, మౌంట్ రష్మోర్ కట్టడానికి వెళ్లే రహదారిని కొంత సేపు దిగ్బంధించారు.
పోలీసులు స్మోక్ బాంబులు, పెప్పర్ స్ప్రే వాడి నిరసనకారులను తప్పించారు. పోలీసులు కొంత మంది నిరసన కారులను అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా అధ్యక్ష ఎన్నికలు: డోనల్డ్ ట్రంప్‌ను వైట్ హౌస్ నుంచి పంపించే శక్తి జో బిడెన్‌కు ఉందా?
- అమెరికా డాలర్ కనుమరుగవుతుందా? చైనా డిజిటల్ యువాన్ రాజ్యం చేస్తుందా?
- టాంజానైట్ రాళ్లు రెండు దొరికాయి.. రాత్రికి రాత్రే కుబేరుడయ్యాడు
- చైనా, బ్రిటన్ మధ్య ‘హాంకాంగ్’ చిచ్చు... ప్రపంచ క్రమం మారిపోతుందా?
- చైనాలో మరో కొత్త వైరస్, మహమ్మారిగా మారనుందా
- కరోనావైరస్ లాక్డౌన్: మనుషులు సహజంగా బద్ధకస్తులా?
- కరోనావైరస్: కోవిడ్-19 పరిణామాల అనంతరం భవిష్యత్తులో చదువులు ఎలా ఉంటాయి
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- 'పీపీఈ కిట్లోనే రక్త స్రావం అయిపోతోంది' కరోనా రోజుల్లో నర్సుల కష్టాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








