You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్ సెకండ్ వేవ్: ఆసియా దేశాల నుంచి ప్రపంచ దేశాలు ఏం నేర్చుకోవాలి?
- రచయిత, ఇవా ఒంటివెరొస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్‌ను ఎప్పుడు, ఎలా అడ్డుకోగలమో తెలిస్తే రెండో విడత అది మళ్లీ తిరగదోడే ఇన్ఫెక్షన్స్ గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదని ప్రముఖ సెల్ బయాలజిస్ట్ డాక్టర్ జెన్నిఫర్ రోన్ అన్నారు. ఆసియా సహా ప్రపంచ వ్యాపంగా ఈ మహమ్మారి ఎలా విస్తరిస్తోందో ఆమె గత కొద్ది కాలంగా పరిశోధనలు చేస్తున్నారు.
మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కూడా కరోనావైరస్‌తో మనం కలిసి జీవించాల్సిందేనని తేల్చి చెప్పింది. దాన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చెయ్యాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది.
పరీక్షలు చెయ్యడం, కోవిడ్ వ్యాధిగ్రస్తులు ఎక్కడున్నది గుర్తించడం, లాక్ డౌన్ తదితర పదునైన వ్యూహాల ద్వారా వివిధ దేశాలు మహమ్మారిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆసియాలోని దక్షిణ కొరియా, జపాన్, అలాగే యూరోప్‌లోని జర్మనీ తదితర దేశాల్లో ఆంక్షల్ని సడలించిన వెంటనే కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం మొదలయ్యింది.
యూరోప్‌లో తిరిగి రెండో విడత వైరస్ ప్రబలకుండా కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యూరోపియన్ యూనియన్ కోవిడ్-19 రెస్పాన్స్ టీం సూచించింది. అయితే అది ఏ స్థాయిలో రానుందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న అని టీం డైరక్టర్ అండ్రియా అమ్మన్ వ్యాఖ్యానించినట్టు గార్డియన్ వార్తా పత్రిక తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు రెండో విడతలో విజృంభించబోయే వైరస్‌ను ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో వారి దృష్టంతా ఇప్పుడు తూర్పు ఆసియా దేశాలపై పడింది.
ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా రెండు విషయాలను గమనించాలి. ఒకటి కరోనావైరస్‌ను ఎదుర్కోవడంలో ఆయా దేశాలనుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు? ఇక రెండో విషయానికొస్తే మిగిలిన దేశాల కన్నా ముప్పు ఎదుర్కొనే విషయంలో ఆయా దేశాలు ముందున్నాయా?
రోగిని గుర్తించడం, ఐసోలేట్ చెయ్యడం
“రోగిని గుర్తించడం, వారిని ఐసోలేట్ చెయ్యడం, ప్రతి కేసు విషయంలో పరీక్షలు నిర్వహించడం , అన్ని జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే ఎక్కడెక్కడ వైరస్ సోకిన వ్యక్తులు ఉన్నారో గుర్తించి వారిని తక్షణం క్వారంటైన్‌కి పంపడం” తూర్పు ఆసియా దేశాల నుంచి మిగిలిన దేశాలు నేర్చుకోవాల్సిన ప్రధాన పాఠం ఇదేనని డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ స్పష్టం చేశారు.
యూనివర్శిటీ కాలేజ్, లండన్‌కు చెందిన వైరస్ నిపుణులు డాక్టర్ రోన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. “ఆసియా దేశాల నుంచి వస్తున్న గణాంకాలను పరిశీలించి వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించడం, వ్యాధి గ్రస్థుల్ని గుర్తించి తక్షణం వారిని క్వారంటైన్‌కి పంపడం ద్వారా మాత్రమే వైరస్ రెండో విడత విజృంభించకుండా మనల్ని మనం కాపాడుకోగలం” అని అన్నారు.
అందుకు దక్షిణ కొరియా తీసుకున్న చర్యలే నిదర్శనం. ఒకప్పుడు కోవిడ్-19కి హాట్ స్పాట్ దక్షిణ కొరియా. కానీ వెంటనే జాగ్రత్త పడ్డ ప్రభుత్వం పరీక్షల్ని ఉధృతంగా నిర్వహించింది. వివిధ రకాల మొబైల్ అప్లికేషన్లు, జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా కేసుల సంఖ్యను తగ్గించగల్గింది.
ఈ విషయంలో వాళ్ల సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో ఇటీవల మరోసారి ప్రపంచానికి వెల్లడయ్యింది. ముఖ్యంగా మే మొదటి వారంలో ఒక్కసారిగా కొత్త కేసుల సంఖ్య పెరిగిపోయింది. కానీ అక్కడ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా రెండు వారాల్లోనే వాటి సంఖ్య తిరిగి సున్నాకి చేరుకుంది. ఈ విషయంలో కొత్త కేసుల సంఖ్య పెరిగిన వెంటనే తక్షణం వ్యాధి బారిన పడిన వారిని గుర్తించి వాళ్లు ఇటీవల ఎక్కడెక్కడకి వెళ్లారో తెలుసుకున్నారు. ముఖ్యంగా వారి విచారణలో సోల్‌లోని ప్రముఖ నైట్ క్లబ్ ప్రస్తావన వచ్చింది. వెంటనే అక్కడకు వచ్చిన సుమారు 11 వేల మంది వివరాలను సేకరించారు.
గణాంకాల విశ్లేషణ
ఇక రెండో పాఠం విషయానికొస్తే చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాల్లోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన కేసుల వివరాలను సేకరించాలి. ఆపై ఆయా ప్రాంతాల్లో వైరస్ తీరు ఎలా ఉందన్న విషయాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు.
“ఇప్పుడు మనకు రికవరీ రేటు అంటే ఒక సారి వైరస్ సోకిన తర్వాత ఎన్ని రోజుల్లో రోగి కోలుకునే అవకాశం ఉందన్న విషయంలో ఎంతో కొంత అవగాహన ఉంది. కానీ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడంలో అంటే కాంటాక్ట్ రేటు ఎలా ఉంటోందన్న విషయంలో ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది” అని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ పాలసీకి చెందిన ఛైర్ ఆఫ్ హెల్త్ ఎకామిక్స్ ప్రొఫెసర్ అలిస్టర్ మెక్ గురే అన్నారు.
ఇది కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్. ఇటీవల కాలంలో ఆసియాలో సార్స్, ఆఫ్రికాలో పుట్టిన ఎబోలా వైరస్‌లతో పోల్చితే ఇది భిన్నంగా ప్రవర్తిస్తోంది. కనుక వీలైనంత సమాచారాన్ని సేకరించి అలాగే వచ్చిన సమాచారాన్ని పోల్చి చూసి మన సందేహాలను నివృత్తి చేసుకోవడం కూడా చాలా కీలకమైన విషయం.
ఇక ఒకసారి ఆంక్షల్ని సడలించిన తర్వాత వైరస్ ఎలా ప్రవర్తిస్తోందన్నది నేర్చుకోవాల్సిన మూడో పాఠం.
“అతి ఆశావహ దృక్పథంతో ఎట్టి పరిస్థితుల్లో ఉండవద్దు” అని ఆసియా దేశాల అనుభవాల దృష్టిలో పెట్టుకొని హెచ్చరించారు ప్రొఫెసర్ మెక్ గురె.
లాక్ డౌన్ విజయవంతమైనంత మాత్రాన ఆ ప్రాంతమంతా వైరస్ నుంచి విముక్తి పొందినట్టు కాదు. జపాన్‌లోని హొక్కైడో ప్రాంతంలో ఫిబ్రవరిలో చివరి వారంలో వైరస్ ఒక్కసారిగా విజృంభించింది. కానీ మార్చి నెల మధ్య నాటికి కొత్త కేసుల సంఖ్య ఏకంగా రోజుకు ఒకటి, రెండుకు మాత్రమే పరిమితమయ్యింది.
దాంతో తాము తీసుకున్న చర్యలు విజయవంతమయ్యాయని భావించిన ప్రభుత్వం ఎమర్జెన్సీని తొలగించింది. ఏప్రిల్ నాటికి పాఠశాలల్ని తిరిగి తెరచింది. కానీ ఒక్క నెల కూడా తిరగకుండానే వైరస్ రెండో విడత అక్కడ విజృంభించడంతో మళ్లీ అత్యవసర పరిస్థితిని విధించిక తప్పలేదు.
ఇప్పుడు ఇక్కడ కూడా జరిగినా ఆశ్చర్యం లేదన్నారు డాక్టర్ రోన్. “ చాలా దేశాల్లో వైరస్ అదుపులోనే ఉందని భావించి ఆంక్షల్ని సడలించేసరికి మళ్లీ ఒక్కసారిగా తిరగబెట్టింది. ప్రపంచమంతా ఇప్పుడు ఇదే జరిగే అవకాశం ఉంది”అని చెప్పుకొచ్చారు.
ఒక్కసారి కాదు రెండు సార్లు పరీక్షలు
వైద్య నిపుణులు పదే పదే సూచిస్తోంది ఒక్కటే. “ వీలైనన్ని ఎక్కువ పరీక్షలు నిర్వహించడం. ఆసియా దేశాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే” అన్నారు డాక్టర్ రోన్.
“వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో దక్షిణ కొరియా విజయవంతం కావడానికి కారణం ఒక్కటే... భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం, వ్యాధి లక్షణాలనున్న వారిని గుర్తించి క్వారంటైన్‌కి పంపడం” అని డాక్టర్ రోన్ స్పష్టం చేశారు.
మొదట్లో దక్షిణ కొరియాలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతూ వచ్చింది. కానీ వెంటనే మేల్కొన్న ప్రభుత్వం రోజుకు పదివేల చొప్పున్న ఉచితంగా పరీక్షలు నిర్వహించింది. “ప్రభుత్వం తీసుకున్న చొరవ, భారీ స్థాయిలో ప్రజలకు పరీక్షలు నిర్వహించడం అసాధారణమైన విషయం” అని సింగపూర్‌లోని నేషనల్ యూనివర్శిటీలో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఒయి ఇంగ్ యోంగ్ బీబీసీతో అన్నారు.
వారిని చూసి తెలుసుకున్న జర్మనీ అదే స్థాయిలో స్పందించి భారీ ఎత్తున పరీక్షలు నిర్వహించడం ద్వారా మరణాల సంఖ్యను తగ్గించగల్గింది. యూకే, స్పెయిన్ వంటి యూరోపియన్ దేశాలతో పోల్చితే అక్కడ మరణాల సంఖ్య తక్కువగా ఉండటానికి కారణం అదే.
అంతే కాదు...ఆసియా దేశాల గణాంకాలను పరిశీలిస్తే రెండు సార్లు పరీక్షలు నిర్వహించడం ఎంత ముఖ్యమో కూడా తెలుస్తుంది.
“స్వాబ్ టెస్ట్ ద్వారా ఎవరికి వైరస్ సోకిందన్న విషయం తెలుసుకోవడం మాత్రమే కాదు, లక్షణాలు లేని వారికి కూడా వైరస్ ఉందో లేదో తెలుసుకునే యాంటీబాడీ పరీక్ష చెయ్యడం కూడా ముఖ్యమే”అని ప్రొఫెసర్ మెక్ గురే అన్నారు.
ఈ విషయంలో సింగపూర్‌కి చెందిన “కరోనా డిటెక్టివ్స్” కాన్సెప్ట్ ప్రపంచ వ్యాప్తంగా హెడ్ లైన్స్‌లో నిలిచింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వేలాది మందిని గుర్తించి వారి పరీక్షల ఫలితాలు వచ్చేంత వరకు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండమని హెచ్చరించేవారు. అలా ఒంటరిగా ఐసోలేషన్‌లో ఉన్న వారిని రోజులో ఎప్పటికప్పుడు సిబ్బంది సంప్రదిస్తునే ఉంటారు. ఒక వేళ అనుమానం వస్తే ఐసోలేషన్లో ఉన్న వారు తమ ఫోటోగ్రాఫ్ రుజవును కూడా అధికారులకు పంపాల్సి వస్తుంది.
ఇక హాంకాంగ్ విషయానికొస్తే విదేశాల నుంచి వచ్చిన వారికి ఎలక్ట్రానిక్ బ్రాస్‌లెట్లను అమర్చడం ద్వారా అంతకు మించిన అనుచితమైన విధానాలను కూడా అమలు చేసింది.
మాస్ టెస్టింగ్, ట్రేసింగ్.. వైరస్‌ను నియంత్రించడంలో రెండు చాలా ముఖ్యమైనవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
“ఇది కచ్చితంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందన్న విషయం మనకు తెలుసు. మీరు దక్షిణ కొరియా విషయాన్నే తీసుకోండి. కట్టుదిట్టమైన విధానాలను అమలు పరచిన ఆ దేశం, వాటిని ఒక్కసారిగా సడలించేసరికి కేవలం ఒకే ఒక్క వ్యక్తి నుంచి వారంలో రోజుల్లోనే సుమారు వంద మందికి వైరస్ సంక్రమించింది” అని మెక్ గురే అన్నారు.
మే 18న సోల్‌లోని మరో ప్రధాన ఆస్పత్రిలో కొత్తగా 13 కేసుల్ని గుర్తించారు.
అందుకు ప్రధాన కారణంగా వాళ్లు నిరంతరం సమచారాన్ని సేకరిస్తూ రావడం. ఫలితంగా కొరియన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(KCDC) కొత్తగా గుర్తించిన కేసుల్లో 9 కేసులకు మూలం ఏంటన్నది తక్షణం గుర్తించగల్గిందని యోన్‌హప్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
అలాగే ప్రజా వైద్య సేవల విభాగం కూడా స్వీయ అనుభవాలనుంచి ఏం నేర్చుకోగలం? అని తెలుసుకోవడం కూడా ముఖ్యమని యూనిర్శిటి ది బార్శిలోనాలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న జుడిట్ వాల్ అన్నారు.
“ఇటువంటి పరిస్థితుల్లో వైద్య విభాగం తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకోవడమే కాదు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త కొత్త విధానాలను వెంటనే అనుసరించగల్గాలి” అని ఆయన అభిప్రాయపడ్డారు.
చైనా కేవలం 8 రోజుల్లోనే వూహాన్‌లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించింది. అంటే అత్యవసర పరిస్థితుల్లో వైద్య విభాగాలు వ్యవహరించాల్సిన తీరు అలా ఉండాలి.
“ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇతరుల నుంచే కాదు.. తమ నుంచి కూడా తాము కొత్త పాఠాలు నేర్చుకోవాలి. ఫలితంగా రెండో విడత మళ్లీ వ్యాధి విజృంభించినప్పుడు మరింత సమర్థవంతంగా ఆ పరిస్థితిని ఎదుర్కోవాలి” అని ప్రొఫెసర్ వాల్ అన్నారు.
దీర్ఘకాలం వైరస్‌తో పోరాడాల్సిన పరిస్థితులు ఉన్నఈ సమయంలో వైద్య సిబ్బంది మానసిక స్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం కూడా చాలా ముఖ్యం.
“ఇటువంటి అనుభవాల తర్వాత వైద్య సిబ్బంది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ ఎదుర్కోనే ప్రమాదం ఉంది. గతంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు తీసుకున్న గణాంకాలను ఓ సారి పరిశీలిస్తే, 2000 సంవత్సరం ప్రారంభంలో సార్స్ మహమ్మారి విజృంభించింది. ఆ సమయంలో చికిత్సనందించిన సిబ్బందిలో సుమారు పది శాతం మంది ఇప్పటికీ ఆ డిప్రెషన్‌లోనే ఉన్నారని తెలుస్తోంది” అని ప్రొఫెసర్ వాల్ తెలిపారు.
మొత్తంగా కరోనావైరస్ విడతల వారీగా వస్తునే ఉంటుందన్న విషయాన్ని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
“ఇది ఓ తరంగం మాదిరి ఉంది కనుక వీలైనంత వరకు దాన్ని ఎక్కడికక్కడ లాక్ చేస్తూ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం లేకుండా చెయ్యాలి. లేదంటే తీవ్రమైన వినాశనాన్ని మనం ఎదుర్కోక తప్పదు’’ అని డాక్టర్ రోన్ అన్నారు.
“ఇన్ఫెక్షన్ విషయంలో ఒకసారి మనం పట్టు విడిచామంటే మరో కొత్త వైరస్ వచ్చినప్పుడు ప్రజల్లో రోగ నిరోధక శక్తి అన్నదే లేకుండా పోతుంది” అని ఆమె చెప్పారు.
“కేవలం ఇతర దేశాల నుంచే కాదు గతానుభవాలనుంచి కూడా మనం నేర్చుకోవాలి’’ అంటారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లోని హెల్త్ పాలసీ విభాగంలో పని చేస్తున్న డాక్టర్ లయ మేనోవ్. ‘‘ముఖ్యంగా 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు ఎలా వ్యవహరించారో పరిశీలించాలి. ఎందుకంటే ప్రస్తుతానికి రికార్డుల్లో ఉన్న ఆ మహమ్మారితో మాత్రమే ఈ కోవిడ్ మహమ్మారి పోల్చగలం” అని మేనోవ్ వ్యాఖ్యానించారు.
“అప్పట్లో లాక్ డౌన్ ఎలా సడలించారన్న విషయంలో చాలా సమాచారాన్ని సేకరించారు. నాటి గణాంకాల ఆధారంగా కొత్తగా పరిశోధనలు చెయ్యాలి. ఫలితంగా వివిధ ప్రాంతాల్లో రెండో విడత వైరస్ ఎలా విజృంభించవచ్చన్న విషయంలో విలువైన సమాచారం లభించే అవకాశం ఉంది” అని డాక్టర్ మేనోవ్ అన్నారు.
“1918లో వివిధ దేశాలు ఏ మేరకు కట్టుదిట్టమైన చర్యలకు తీసుకున్నారన్న దాన్నిబట్టి ప్రపంచ వ్యాప్తంగా విడతల వారీగా వైరస్ ప్రబలుతూ వచ్చింది. సహజంగానే మనం ఆశావాదులం. కానీ ప్రస్తుతం ప్రభుత్వాలు ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేయాలి. ఆసియాలో ఏం జరిగిందో మనం చూశాం. చాలా వరకు జాగ్రత్తగా గమనించడం, వేచి చూసి ప్రతిస్పందించడం అన్నట్లు వాళ్లు వ్యవహరించారు. మొత్తంగా 2022వరకు మనం ఇదే పరిస్థితిలో ఉండవచ్చు” అని డాక్టర్ రోన్ స్పష్టం చేశారు.
ఇది వేచి చూసి ఆడాల్సిన ఆట
“కేవలం పరీక్షలు చెయ్యడం లేదా భౌతిక దూరం పాటించడం మాత్రమే సరిపోదు. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో ఉన్న చాలా దేశాలు సమగ్రమైన ప్రభుత్వ, సామాజిక విధానాల ద్వారా వాటన్నింటినీ చేశాయి. ఫలానా వ్యూహాలు అమలు పరచాలని కానీ లేదా ఫలానా విధానాల అవలంబించాలని కచ్చితంగా చెప్పడానికి లేదన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి’’ అని డబ్ల్యూహెచ్ఓలో పశ్చిమ పసిఫిక్ ప్రాంతానికి కోవిడ్-19 మేనేజర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ నొకోవ్ ఇషికవా అన్నారు.
అలాగే ఎప్పుడు ఈ వైరస్ అదృశ్యమవుతుందో తెలుసుకునేందుకు చేసే ప్రయత్నాలను వ్యతిరేకిస్తోంది డబ్ల్యూహెచ్ఓ.
వైరస్‌ను నియంత్రించే విధానాలు ఎంత ప్రమాదకరమైనవో తెలుసుకునే విషయంలో దక్షిణ కొరియా, జపాన్ అనుభవాలే మనకు హెచ్చరికలని చెప్పవచ్చు.
“ప్రస్తుతం ఈ ప్రాతంలో వైరస్ పెద్ద ఎత్తున సామాజిక వ్యాప్తి చెందుతున్నట్టు కనిపించడం లేదు. ప్రభావవంతమైన టీకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేంత వరకు మనం తీసుకుంటున్న రక్షణ చర్యల్ని సడలించకూడదు” అని డాక్టర్ ఇషికవా అభిప్రాయపడ్డారు.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి
- కరోనావైరస్: మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే రోగ నిరోధక వ్యవస్థ, మీ శరీరంపైనే దాడి చేస్తే..
- 1918లో 5 కోట్ల మందిని బలి తీసుకున్న స్పానిష్ ఫ్లూ కట్టడికి ఏం చేశారంటే...
- వీడియో, కరోనావైరస్: ఆర్ నాట్ అంటే ఏంటి.. ఇది ఎందుకంత కీలకం, 0,59
- WHO హెచ్చరిక: ‘కరోనావైరస్ ఎప్పటికీ పోకపోవచ్చు’
- వీడియో, కరోనావైరస్ పరీక్షలు ఎన్ని రకాలు.. ఈ పరీక్షలు ఎలా చేస్తారు, 2,09
- కరోనావైరస్ వ్యాక్సిన్: కోతులపై ప్రయోగంలో పురోగతి.. మానవులపైనా టీకా ప్రయోగాలు
- కరోనావైరస్: యూట్యూబ్‌లో తప్పుదోవ పట్టించే వీడియోలు చూస్తున్న కోట్ల మంది యూజర్లు
- కరోనావైరస్: పుకార్లు, తప్పుడు సమాచారాన్ని వైరల్ చేసే మనుషులు ఏడు రకాలు
- కరోనావైరస్: లాక్డౌన్ తర్వాత వైరస్ బారిన పడకుండా... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్: మాస్కులు ఎక్కువ సేపు ధరిస్తే ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందా? శాఖాహారం తింటే వైరస్‌ను అడ్డుకోవచ్చా?
- ఇండియా లాక్డౌన్: వైజాగ్, కోల్‌కతా మినహా దేశమంతా విమాన సర్వీసులు... ప్రయాణంలో పాటించాల్సిన నిబంధనలేంటంటే?
- ఆమె రాసిన ‘వుహాన్ డైరీ’లో ఏముంది? ఆమెను చైనాలో ‘దేశద్రోహి’ అని ఎందుకు అంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)