కరోనావైరస్: మాస్కులు ఎక్కువ సేపు ధరిస్తే ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందా? శాకాహారం తింటే వైరస్‌ను అడ్డుకోవచ్చా? - REALITY CHECK

    • రచయిత, రియాలిటీ చెక్ టీం
    • హోదా, బీబీసీ న్యూస్

కరోనావైరస్‌తోపాటు దాని గురించి అనేక అపోహలు, తప్పుడు సమాచారం ప్రపంచమంతటా వ్యాపిస్తూనే ఉన్నాయి.

తాజాగా ప్రచారంలోకి వచ్చిన అలాంటి కొన్ని కథనాలను మేం గుర్తించాం. వాటి నిగ్గు తేల్చే ప్రయత్నం చేశాం.

శాకాహారమే తినాలని లేదు

తప్పుదోవ పట్టించే, కొన్ని సార్లు హాని కలిగించే విషయాలను కూడా మంచి విషయాలతో కలిపి కొందరు ప్రచారంలో పెడుతుంటారు.

ఎన్‌క్రిప్టెడ్ సోషల్ మీడియా వేదికల్లో ప్రచారమవుతున్న కారణంగా, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించడం కష్టం.

భారత వైద్య సంస్థలు, ఓ ప్రముఖ డాక్టర్ ఇటీవల వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రచారమవుతున్న ఓ సందేశాన్ని ఖండించారు.

ఆ సందేశంలో కరోనావైరస్ బారిన పడకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు ఉన్నాయి. భౌతిక దూరం పాటించడం, జనం ఎక్కువగా ఉండే చోట్లకు వెళ్లకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి వాటి ప్రాధాన్యతను తెలియజేస్తూ కొన్ని మంచి విషయాలు కూడా వాటిలో ఉన్నాయి.

కానీ, ఇదే సందేశంలో శాకాహారాన్ని ఎంచుకోమన్న సలహా ఉంది. బెల్టులు, ఉంగరాలు, చేతి గడియారాలు ధరించవద్దని ఉంది. ఈ చర్యల వల్ల కరోనావైరస్ రాకుండా ఉంటుందని ఎక్కడా నిరూపితం కాలేదు. ప్రపంచ, ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పోషకాల సమతుల్యత కోసం ప్రొటీన్ (మాంసంలో ఎక్కువగా ఉంటుంది), పండ్లు, కూరగాయలు లాంటివన్నీ తీసుకోవాలని కోవిడ్-19 నేపథ్యంలో సూచన చేసింది.

ఫ్లూ వ్యాక్సిన్ వల్ల కోవిడ్-19 ముప్పు పెరగదు

ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కోవిడ్-19 ముప్పు గణనీయంగా పెరుగుతుందని పేర్కొంటున్న ఓ పోస్టు ఫేస్‌బుక్‌లో చాలా ప్రచారమైంది.

అమెరికా సైన్యం ప్రచురించిన ఓ అధ్యయనం లింక్‌ను కూడా అందుకు ఆధారంగా చూపిస్తూ ఈ పోస్ట్‌లో పెట్టారు.

వాస్తవంగా జరిగిన ఓ అధ్యయనం గురించి ప్రస్తావిస్తూ ఈ వదంతి ప్రచారమవుతోంది. కానీ, ఆ అధ్యయనంలో తేలిన విషయాలను వక్రీకరించి ఇందులో చెప్పారు.

ఆ అధ్యయనం ప్రచురితమైంది 2019 అక్టోబర్‌లో. అంటే, కరోనావైరస్ కేసులు రాకముందు. 2017-18 ఫ్లూ సీజన్ సమాచారం ఆధారంగా ఆ అధ్యయనం జరిగింది.

ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కోవిడ్-19 ముప్పు పెరుగుతుందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు.

‘‘ఫ్లూ వ్యాక్సిన్ వల్ల మిగతా శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్ల సోకే ముప్పేమీ పెరగదు’’ అని అమెరికా సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ స్పష్టంగా చెప్పింది.

మాస్కులు ఎక్కువ సేపు ధరిస్తే సమస్యేమీ లేదు

మాస్క్‌లు ఎక్కువ సేపు ధరిస్తే ఆరోగ్యానికి ప్రమాదం ఉందంటూ ఓ తప్పుడు కథనం సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

స్పానిష్ వెబ్‌సైట్లలో మొదటగా ఈ కథనం కనిపించింది. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా దేశాల్లో చాలా ప్రచారమైంది.

దీన్ని అనువదించి ఇంగ్లీష్ వెబ్‌సైట్లు కూడా కథనాలు రాశాయి. ఓ నైజీరియన్ వెబ్‌సైట్‌లో వచ్చిన ఇదే కథనాన్ని ఫేస్‌బుక్‌లో 55వేలకు పైగా మంది షేర్ చేశారు.

ఎక్కువ సేపు మాస్క్ ధరించడం వల్ల కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువ పీల్చుకోవాల్సి వస్తుందని, శరీరానికి ఆక్సిజన్ కొరత ఏర్పడి తల తిరగడం మొదలవుతుందని ఆ కథనం పేర్కొంది. ప్రతి పది నిమిషాలకోసారి మాస్క్‌ను తొలగించి, మళ్లీ వేసుకోవాలని సూచించింది.

ఈ వాదనలో వాస్తవం లేదని, ఇలా చేయడం ప్రమాదకరమని డబ్ల్యూహెచ్ఓకు చెందిన డాక్టర్ రిచర్డ్ మిహిగో బీబీసీతో చెప్పారు.

‘‘వైద్యపరమైన, ఇతర మాస్క్‌లు శ్వాస బాగా అందేలా ఉన్న వస్త్రంతోనే తయారవుతాయి. గాలిని రానిస్తూనే, కొన్ని కణాలను ఆపేసేలా మాస్క్‌లు ఉంటాయి. మాస్క్‌లను తరచూ తీసేస్తూ ఉంటే, ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది’’ అని ఆయన అన్నారు.

ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందని చిన్నారులు, శ్వాసకోశ సమస్యలతో ఊపిరి తీసుకోవడం ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు మాత్రం మాస్క్‌లు ధరించకుండా ఉండాలని చెప్పారు.

పొగ తాగితే వైరస్ పోదు

పొగ తాగేవారికి కోవిడ్-19 ముప్పు తక్కువగా ఉంటుందని బోలెడు కథనాలు వచ్చాయి. యూకే మెయిల్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ ప్రచురించిన ఇలాంటి కథనానికి ఫేస్‌బుక్‌లో వేల సంఖ్యలో షేర్లు వచ్చాయి. పొగ తాగే అలవాటు ఉన్నవాళ్లు ఇది నిజమైతే బాగుండని కోరుకుంటూ ఉండవచ్చు. కానీ, ఇది నిజమని చెప్పేందుకు ఆధారాలు లేవు.

చాలా దేశాల్లో పొగ తాగే అలవాటున్నవారిలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ల రేటు తక్కువగా ఉందని, నిపుణులు కూడా దీనికి వివరణ ఇవ్వలేకపోతున్నారని యూకే మెయిల్ ఆన్‌లైన్ కథనం పేర్కొంది.

కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌ వ్యాప్తిని నికోటిన్ ఆపుతుండవచ్చని ఫ్రాన్స్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రి అధ్యయనం సూచించింది.

నికోటిన్ ప్యాచ్‌లు, నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీలు కరోనావైరస్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేదానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.

కరోనావైరస్ వ్యాప్తి నివారణతో పొగాకు, నికోటిన్‌లకు సంబంధం ఉందని చెప్పేందుకు తగినంత సమాచారం ఇప్పటికైతే లేదని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

పొగ తాగేవారికి మిగతా ఆరోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశాలున్న కారణంగా, వారికి కరోనావైరస్ నుంచి ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉందని తెలిపింది.

కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్న కారణంగా పొగ తాగేవారు ఇప్పుడు ఆ అలవాటుకు దూరంగా ఉండటం మేలని అనేక వైద్యపరమైన సలహాలు సూచించాయి.

పరిశోధన: శృతి మేనన్ (దిల్లీ), పీటర్ మ్వాయ్ (నైరోబి)

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్‌స్క్రైబ్ చేయండి.)