విశాఖపట్నం, కోల్‌కతా మినహా దేశమంతా విమాన సర్వీసులు... ప్రయాణంలో పాటించాల్సిన నిబంధనలేంటంటే?

    • రచయిత, శ్రీకాంత్ బక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్ని కరోనా భయం పట్టి పీడిస్తోంది. చాలా దేశాలు నెలల తరబడి విధించిన లాక్‌డౌన్‌ల‌కు సడలింపులిస్తున్నాయి.

కరోనా కారణంగా భారతదేశంలో కూడా మార్చి 25 నుంచి రోడ్డు, రైలు, విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. కానీ, ఈరోజు (మే 25) నుంచి దేశీయంగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఎంపిక చేసిన నగరాలకు రైలు సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి.

కాగా, ఆంధ్రప్రదేశ్ (విశాఖపట్నం), పశ్చిమ బెంగాల్ (కోల్‌కతా) మినహా మిగతా దేశమంతా విమాన సర్వీసులు అనుకున్నట్లుగా ప్రారంభం అవుతాయని ఆదివారం రాత్రి కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు మంగళవారం నుంచి, పశ్చిమ బెంగాల్‌కు గురువారం నుంచి విమాన సర్వీసులు మొదలవుతాయని ఆయన పేర్కొన్నారు.

అసలు, కరోనా ముప్పు పొంచి ఉన్న పరిస్థితుల్లో విమాన ప్రయాణం ఎంత వరకూ క్షేమం? విమాన ప్రయాణం చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? విమానయాన సంస్థలు తమ ప్రయాణికుల భద్రత కోసం ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాయి? విమానాశ్రయాల్లో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి?

విమానాల్లో చర్యలు ఇలా...

విమాన ప్రయాణం సురక్షితం అని చెప్పేందుకు విమాన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా తాము తీసుకునే చర్యలను ప్రయాణికులకు వివరిస్తున్నాయి. విమానాలను ప్రయాణానికి ముందు, తర్వాత పూర్తిగా శానిటైజ్ చేస్తారని పౌరవిమానయాన శాఖ చెబుతోంది.

విమానంలో కార్పెట్ నుంచి సీట్ హ్యాండిల్ వరకూ పూర్తిగా అన్ని ఉపరితలాలను, టాయిలెట్ నుంచి కాక్ పిట్ వరకూ ప్రతీ భాగాన్ని పూర్తిగా డిస్‌ఇన్ఫెక్టెంట్‌తో శుభ్రం చేసిన తర్వాతే ప్రయాణానికి అనుమతిస్తామని చెబుతోంది. తాము ప్రత్యేకమైన ఐసో ప్రొఫైల్ ఆల్కాహాల్‌తో విమానాలను డిస్‌ఇన్ఫెక్టెంట్ చేస్తున్నామని ఎయిరిండియా ఇంజనీరింగ్, సీఈవో, హెచ్ఆర్ జగన్నాథ్ తెలిపారు.

విమానాల్లో ఉండే ఎయిర్ కండిషనింగ్ వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న భయం చాలా మందిలో ఉంది. అయితే అలాంటి ప్రమాదం ఏమీ లేదంటున్నారు వైద్యులు. భారత్‌లో వాడుతున్న విమానాల్లో ఏసీ చాలా ప్రత్యేకంగా పనిచేస్తుందని, వాటిలో హెపా ఫిల్టర్లు ఉంటాయని ఎయిరిండియా చెబుతోంది.

హెపా ఫిల్టర్లు అంటే.. హై ఎఫిషియన్సీ పార్టిక్యులేట్ ఎయిర్ ఫిల్టర్ అని అర్థం. ఇవి గాలిని 99.9 శాతం శుద్ధి చేస్తాయి. అంటే గాలిలో ధూళితో పాటు, బ్యాక్టీరియా, వైరస్‌లను కూడా శుభ్రం చేయడంతో పాటు, విమానంలో కలుషిత గాలిని బయటకు పంపి, తాజా గాలి ఉండేలా చేయడానికి సహకరిస్తాయి. దీనివల్ల విమానం క్యాబిన్‌లో గాలి ప్రతి రెండు మూడు నిముషాలకు పూర్తిగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.

కోవిడ్ 19 వ్యాధి నేపథ్యంలో పౌర విమానయాన శాఖ విమాన ప్రయాణానికి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

విమాన ప్రయాణానికి ముందు...

విమాన ప్రయాణానికి ముందు సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించాలి. ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రయాణికులు నిర్ధారిత అంశాలతో సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే బోర్డింగ్ పాస్ జారీ చేయాలని విమానయాన సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. టికెట్లు డిజిటల్ పేమెంట్ ద్వారానే బుక్ చేయాలని సూచించింది.

ఇక వృద్ధులు, గర్భిణులు, వ్యాధులతో బాధపడేవారు విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటే మంచిదని సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో నివాసం ఉన్నవారు, కోవిడ్ 19 టెస్ట్ పాజిటివ్ వచ్చిన వారు విమాన ప్రయాణాలు చేయకూడదు.

టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత...

విమాన ప్రయాణానికి ముందే వెబ్‌చెకిన్ ప్రాసెస్ పూర్తి చేసి, బోర్డింగ్ పాస్ సిద్ధం చేసుకోవాలి. కరోనా నేపథ్యంలో లగేజీలో ఒక్క చెకిన్ బ్యాగ్, ఒక్క క్యాబిన్ బ్యాగ్‌కి మాత్రమే పరిమితం చేసింది.

ప్రయాణికులు బ్యాగేజ్ ట్యాగ్, బ్యాగేజ్ ఐడింటిఫికేషన్ నెంబర్‌లను డౌన్లోడ్ చేసుకుని, వాటిని ప్రింట్ తీసుకుని తమ బ్యాగేజ్ మీద అంటించాలి. ప్రింట్ తీసుకునే అవకాశం లేనివారు, తమ టికెట్ పీఎన్ఆర్ నెంబర్‌ను కాగితంపై రాసి, దాన్ని బ్యాగ్‌కు అతికించాలి లేదా ట్యాగ్ చేయాలి.

విమానాశ్రయానికి చేరుకోవాలంటే..

డిపార్చర్ టైంకి రెండు గంటల ముందుగానే ఎయిర్‌పోర్ట్‌ కి చేరుకోవాలి. విమానాశ్రయంలోకి ప్రవేశించేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. దీంతో పాటు, ఆరోగ్యసేతు యాప్‌లో కానీ, సెల్ఫ్ డిక్లరేషన్‌లో కానీ తమ ఆరోగ్యస్థితి గురించి సర్టిఫై చేసుకోవాలి.

మాస్టర్ ఆఫ్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ సూచించిన ఆథరైజ్డ్ క్యాబ్‌లు, లేదా వ్యక్తిగత క్యాబ్‌లలో మాత్రమే ప్రయాణించాలి.

విమానాశ్రయంలో నిబంధనలేంటి?

ఎయిర్‌‌పోర్ట్‌లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి, ప్రయాణం పూర్తయ్యే వరకూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఎంట్రీ గేట్ దగ్గర థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఆపై బోర్డింగ్ పాస్‌తో పాటు, ఆరోగ్యసేతు యాప్ కూడా తనిఖీ చేస్తారు. ఒకవేళ అందులో స్టేటస్ రెడ్‌గా ఉంటే లోనికి అనుమతించరు.

విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్, బ్యాగేజ్ చెకింగ్ అన్నీ మినిమల్ కాంటాక్ట్, కాంటాక్ట్ లెస్‌గా పూర్తయ్యేలా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఉంటాయి. వాటిని అనుసరిస్తూ తనిఖీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఈ టైంలో తోటి ప్రయాణికులతో సోషల్ డిస్టెన్సింగ్‌తో పాటుగా, శానిటైజేషన్ నిబంధనలు కూడా పాటించాలి.

విమానాశ్రయంలో నాట్ ఫర్ యూజ్ అని మార్క్ చేసి ఉన్న కుర్చీల్లో కూర్చోకూడదు. ఎయిర్‌పోర్ట్‌ లో ఉండే ఫుడ్ కోర్టులు, రిటైల్ ఔట్ లెట్లకు వెళ్లినప్పుడు కూడా భౌతిక దూరం, శానిటైజేషన్ నిబంధనలు పాటించాలి. ప్రయాణికులు తాము ఉపయోగించిన మాస్క్‌లు, గ్లౌజ్‌లు వంటి వాటిని పసుపు రంగు చెత్త బుట్టల్లోనే వేయాలి.

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది సురక్షితంగా ఉండేలా టెక్నాలజీ సాయంతో ఏర్పాట్లు చేస్తున్నామని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీఈఓ ఎస్‌జీకే కిషోర్ తెలిపారు.

‘‘ప్రయాణికులను సంపూర్ణ భద్రత, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు మేం సంసిద్ధంగా ఉన్నాం. మా విమానాశ్రయంలో ఈ-బోర్డింగ్ సదుపాయం ఉంది. అన్ని ప్యాసింజర్ టచ్ పాయింట్ల వద్ద ప్రయాణికులకు సురక్షితమైన బోర్డింగ్ జరిగేలా టెక్నాలజీ- ఆధారిత కాంటాక్ట్ లెస్ బోర్డింగ్‌ను అమలు చేస్తున్నాం. విమానాశ్రయంలోని అణువణువునూ 24 గంటల పాటూ శుభ్రం చేయిస్తున్నాం’’ అని చెప్పారు.

విమానం ఎక్కేముందు...

విమానం ఎక్కేముందు ప్రయాణించే బస్సుల్లో, క్యూలైన్లలో కూడా భౌతిక దూరం పాటించాలి. ఎయిర్‌లైన్స్ సిబ్బంది అందించే త్రీలేయర్డ్ మాస్క్‌ను, శానిటైజర్‌ను తీసుకోవాలి. విమానం ఎక్కే ముందు ఆ మాస్క్‌ను ధరించాలి.

విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు...

విమానంలో ప్రయాణిస్తున్నంత సేపూ ముఖానికి మాస్క్ ధరించాలి. పరిశుభ్రతా నిబంధనలు పాటించాలి. విమానంలో టాయిలెట్ దగ్గర క్యూలా ఉండకూడదు. ఎక్కువ సార్లు టాయిలెట్ వెళ్లడం, అవసరం లేకుండా విమానంలో తిరగడం చెయ్యకూడదు.

ప్రయాణ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలూ సర్వ్ చేయరు. అమ్మరు. మంచి నీటి సీసాలను ముందుగానే సీట్ల దగ్గర ఉంచుతారు.

ప్రయాణంలో న్యూస్ పేపర్లు, ఇతర మ్యాగజైన్లు అందించరు. ప్రయాణికులు తమతో తెచ్చుకున్న ఆహారాన్ని విమానంలో తినేందుకు అనుమతి లేదు. ఒకవేళ ఎవరికైనా అసౌకర్యంగా, అస్వస్థతగా అనిపిస్తే.. వెంటనే సిబ్బందికి తెలియచేయాలి.

విమానం దిగిన తర్వాత...

విమానం దిగేటప్పుడు కూడా ఎయిర్ లైన్స్ సిబ్బంది సూచించిన నియమాలను పాటించాలి.

విమానం ల్యాండైన దగ్గర్నుంచి... పూర్తిగా కిందికి దిగే వరకూ భౌతిక దూరం పాటించాలి. ట్రాన్సిట్ ప్రయాణికులు ట్రాన్సిట్ ఏరియా దాటి బయటకు వెళ్లకూడదు. విమానం అరైవల్ గేట్ దగ్గర, ఎరో బ్రిడ్జ్ దగ్గర, జెట్ ల్యాడర్లు, ర్యాంప్‌లు, ఎస్కలేటర్లు, బ్యాగేజ్ అరైవల్ బెల్ట్‌ల దగ్గర, ఇలా అన్ని చోట్లా భౌతిక దూరం పాటించాలి.

విమానం దిగిన తర్వాత అత్యవసరమైతేనే లగేజ్ ట్రాలీలను వాడాలి. విమానాశ్రయాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఆపై ప్రయాణికులు తమ గమ్యానికి చేరుకునేందుకు ఆథరైజ్డ్ ట్యాక్సీలనే వినియోగించాలి.

ఇలా విమాన ప్రయాణం అడుగడుగునా నిబంధనలు పాటించాల్సిందే.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)