ఇండియా లాక్‌డౌన్: వలస కూలీల కోసం మోదీ ప్రభుత్వం ఏం చేస్తోందంటే... – అభిప్రాయం

    • రచయిత, అమితాభ్ సిన్హా
    • హోదా, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి

మొత్తం ప్రపంచాన్ని కుదిపివేసిన సంక్షోభం కరోనావైరస్. దీని వల్ల ఆర్థిక వ్యవస్థకు ఊహించనంత నష్టం వాటిల్లింది. లక్షల మంది ప్రాణాలు పోయాయి.

లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పిల్లలు అనాథలయ్యారు. ఈ పరిస్థితిని ఎవరూ ఊహించలేదు. ప్రపంచమంతా ఎక్కడికక్కడే ఆగిపోయింది.

ఇదివరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. ఏదైమైనా ఈ పరిస్థితిని మనం అంగీకరించకతప్పదు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ సవాళ్లను గట్టిగా ఎదుర్కొంది. ఎదుర్కొంటూనే ఉంది.

కేంద్రం చర్యల ఫలితం

ఆరంభం నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తి సామర్థ్యంతో పోరాడుతోంది. దాని ఫలితాన్ని మనం దేశం, ఈ ప్రపంచం కళ్లారా చూస్తోంది.

సమయానుగుణంగా ప్రధాని మోదీ తీసుకున్న చర్యలతో 130 కోట్ల మంది ఉన్న దేశంలో కరోనావైరస్ బారినపడ్డవారిలో కోలుకుంటున్నవారి సంఖ్య 30 శాతంగా ఉంది. ఈ విషయంలో ప్రపంచమే మన దేశాన్ని ప్రశంసిస్తోంది.

ఇప్పుడు ఈ వ్యాధి చాలా మందికి సోకిన విషయం వాస్తవమే. చాలా మంది ప్రాణాలు పోవడం మన దురదృష్టం.

కానీ, అభివృద్ధి చెందిన దేశాల్లో, అంత పటిష్ఠ వైద్య వ్యవస్థలు ఉన్నా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనం గమనించాలి. కానీ, భారత్ పరిమిత సాధనాలతోనే తన యుద్ధాన్ని కొనసాగిస్తోంది. విదేశాల్లోలాగా దారుణమైన పరిస్థితులైతే ఇక్కడ లేవు.

కూలీల కోసం ఏం చేస్తోందంటే...

వలస కూలీల మరణాలు, వారి బాధలకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. సాంకేతకంగా చూస్తే, ఇది పూర్తిగా తప్పు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం దాని స్థాయిలో అది చేయాల్సిందంతా చేస్తోంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆశించిన స్థాయిలో కేంద్రానికి సహకారం అందడం లేదు.

ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ఐదు సార్లు ప్రసంగించారు. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని ప్రజలను అభ్యర్థించారు.

కొంత సమయం తర్వాత కూలీల సంక్షేమంపై దృష్టి సారించాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.

అది జరిగిన మరుసటి రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు.

ఆ తర్వాత వలస కూలీలందరికీ ఐదు కిలోల రేషన్, ఒక కిలో పప్పు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం రూ.6195 కోట్లను వివిధ రాష్ట్రాలకు పీడీఎస్ వ్యవస్థలో ఇచ్చింది.

వలస కూలీలు రోడ్లపై కాలినడకనే వెళ్లే పరిస్థితి లేకుండా, రాష్ట్రాలు కోరితే ఏ రైల్వే స్టేషన్‌ నుంచైనా మూడు గంటల్లోగా రైలు ఏర్పాటు చేస్తామని కేంద్రం అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది.

రైల్వే మంత్రిత్వశాఖ ఈ విషయమై స్పష్టమైన సూచనలు చేసింది. ఈ రైళ్లలో వెళ్లేవారికి అన్నపానీయాల ఏర్పాట్లు కూడా రైల్వేనే చూసుకుంది.

తక్షణ సాయంతో పాటు దీర్ఘకాలిక ఇబ్బందులను దూరం చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.

ఆర్థిక చేయూత

ఇళ్లకు చేరిన వలస కూలీలకు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అవకాశాలు కల్పించేందుకు కేంద్రం ప్రణాళికలు వేసింది.

ఉపాధి హామీ పథకంలో వలస కూలీలకు ఇదివరకు పని కల్పించేవారు కాదు.

కానీ, ఇప్పుడు నగరాల నుంచి తిరిగి వస్తున్న కూలీలకు పని దొరకాలని ఇలా చేసింది. ఇందుకోసం అవసరమైన నిధులను కూడా కేంద్రం కేటాయించింది.

అదే సమయంలో చిరు వ్యాపారుల భవిష్యత్తు విషయంలోనూ కేంద్రం అప్రమత్తంగా ఉంది.

మన దేశంలో తక్కువలో తక్కువ 50 లక్షల మంది తోపుడు బళ్లపై వ్యాపారం సాగిస్తూ జీవిస్తుంటారు. ఈ వర్గం కోసం కేంద్రం రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించింది.

కేంద్రం చాలా వేగంగా పనిచేస్తోంది. ఏదైనా ప్రకటన వెలువడటమే ఆలస్యం, నిధుల కేటాయింపులు జరుగుతున్నాయి.

గత రెండు, మూడు రోజుల్లో ప్రకటించిన అంశాల్లో చాలా వాటికి నిధుల కేటాయింపులు జరిగాయి. రాష్ట్రాలకు డబ్బులు వెళ్లాయి. ఈ డబ్బులతో కూలీలకు మూడు నెలలపాటు ఉచితంగా రాష్ట్రాలు రేషన్ అందించాలి.

వలస కూలీల అన్నపానీయాలకు సంబంధించిన ఇబ్బందులను దూరం చేసేందుకు కేంద్రం ‘వన్ నేషన్.. వన్ రేషన్’ పథకాన్ని మొదలుపెట్టింది. దీన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు మూడు నెలల గడువు పెట్టింది. అదే సమయంలో ఈ మూడు నెలలకూ ఉచితంగా రేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేస్తోంది. ఇదివరకు ఇలా ఎప్పుడూ చేయలేదు.

ప్రకృతి విపత్తుల సమయంలో స్పందించేంత వేగంగా, వలస కూలీల విషయమై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని చాలా మంది అడుగుతున్నారు.

ఈ ప్రశ్నకు సమాధానం ఒకటే. ఈ ఆపదను ఎదుర్కొనే ఏ ఆయుధాన్నీ ప్రభుత్వమేమీ దాచిపెట్టలేదు. ఇంత పెద్ద జనాభాను కాపాడేందుకు రేయింబవళ్లూ కష్టపడుతోంది.

(బీబీసీ ప్రతినిధి అనంత్ ప్రకాశ్‌తో అమితాభ్ సిన్హా జరిపిన సంభాషణ ఈ వ్యాసానికి ఆధారం)

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)