లండన్‌ బ్రిడ్జి మీద కత్తిపోట్లకు పాల్పడిన వ్యక్తి గతంలో తీవ్రవాద ఖైదీ... దాడిలో ఇద్దరు మృతి

ఉస్మాన్ ఖాన్

ఫొటో సోర్స్, West Midlands Police

ఫొటో క్యాప్షన్, 2012లో తీవ్రవాద నేరం కింద జైలుకు వెళ్ళిన 28 ఏళ్ళ ఉస్మాన్ ఖాన్

లండన్ బ్రిడ్జి మీద శుక్రవారంనాడు కత్తిపోట్లతో దాడి చేసిన వ్యక్తి గతంలో తీవ్రవాద నేరాలకు పాల్పడినందుకు జైలు శిక్ష అనుభవించాడని అధికారులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దాడికి పాల్పడిన వ్యక్తి పేరు ఉస్మాన్ కాన్. వయసు 28 ఏళ్ళు. అతడు జైలు శిక్ష నుంచి లైసెన్స్ మీద విడుదలయ్యాడు. లండన్ బ్రిడ్జి మీద ఈ వ్యక్తి చేసిన దాడిలో ఒక మహిళ, ఒక పురుషుడు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

దాడికి పాల్పడన ఉస్మాన్‌ పోలీసు అధికారుల కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయాడు.

పోలీసులు దీనిని తీవ్రవాద దాడిగా అభివర్ణించారు.

ఉస్మాన్ ఖాన్‌కు 2012లో తీవ్రవాద నేరం కింద జైలుశిక్ష పడిందని మెట్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ నీల్ బసు తెలిపారు.

"అతడు 2018 డిసెంబర్‌లో జైలు నుంచి లైసెన్స్ మీద విడుదలయ్యాడు. అతడు ఇప్పుడు ఈ దాడులకు ఎందుకు పాల్పడ్డానేది నిర్థరించడంలో అదొక కీలక విషయం అవుతుంది" అని బసు అన్నారు.

ఒక ఎలక్ట్రానిక్ ట్యాగ్‌ను ధరించడానికి అంగీకరించిన మీదటే ఖాన్‌ను గత ఏడాది విడుదల చేశారని, ఆ ట్యాగ్ వల్ల అతడి కదలికలను పర్యవేక్షించడం సాధ్యమవుతుందని 'ది టైమ్స్' రిపోర్ట్ చేసింది.

పోలీసులు ప్రస్తుతం ఖాన్ నివాసం ఉంటున్న స్టాఫోర్డ్‌,ైర్ ఇంటిలో సోదాలు నిర్వహిస్తున్నారు.

లండన్ పోలీసులు

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

అసలేం జరిగింది

ఘటనా స్థలంలో చనిపోయిన దుండగుడు ప్రమాదకరమైన పేలుడు పరికరం ధరించి ఉన్నట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు.

దుండగులు దాడికి పాల్పడిన వెంటనే పోలీసులు వంతెనను చుట్టుముట్టారని, అక్కడి నుంచి తుపాకి కాల్పుల శబ్దాలు వినిపించాయని బీబీసీ జర్నలిస్టు తెలిపారు.

వంతెన మీద కొందరు వ్యక్తులు ఘర్షణ పడుతుండటాన్ని చూశానని బీబీసీ ప్రతినిధి జాన్ మెక్‌మానస్ చెప్పారు. ఆ వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఓ వ్యక్తి మీద కాల్పుులు జరిపారని జాన్ తెలిపారు.

స్థానిక కాలమానం ప్రకారం, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది.

లండన్ వంతెన దగ్గర పరుగులు పెడుతున్న మహిళలు

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, లండన్ వంతెన దగ్గర పరుగులు పెడుతున్న మహిళలు

ఘటనా స్థాలానికి సమీపంలో ఉన్న ప్రజలు అధికారుల సూచనలను అనుసరించాలని పోలీసులు సూచించారు.

దుండగుల కత్తి దాడికి సంబంధించిన ఒక సోషల్ మీడియాలో కనిపించింది. ఒక వ్యక్తిని పలువురు అదిమిపట్టుకోగా, మరో వ్యక్తి అక్కడి నుంచి పరారవుతున్నట్టుగా ఆ వీడియోలో కనిపించింది.

లండన్ వంతెన

ఫొటో సోర్స్, @GEORGEBARDEN_

"లండన్ వంతెన మీద దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపునకు వెళ్తున్నాను. అవతలివైపున వంతెన మీద ఒక వ్యక్తి మీద కొందరు దాడి చేస్తున్నట్లు కనిపించింది" అని జాన్ మెక్‌మానస్ బీబీసీ న్యూస్ ఛానెల్‌కు చెప్పారు.

వంతెన మీది నుంచి అందరినీ పోలీసులు బయటకు పంపించేశారు. అందరూ వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. కానీ, ఉత్తరం వైపున వంతెన మీద కాల్పులు జరిగాయి" అని జాన్ తెలిపారు.

"అక్కడి నుంచి దూరం వచ్చేశాం కాబట్టి అక్కడేం జరుగుతోందో చూడలేకయాను. కానీ, అక్కడి నుంచి కాల్పుల చప్పుళ్లు వినిపించాయి" అని ఆయన చెప్పారు.

లండన్‌ మ్యాప్

లండన్ బ్రిడ్జి మీద ఉన్న ఒక రెస్టారెంట్‌లో చిక్కుకుపోయిన నోవా బోడ్నర్ బీబీసీతో మాట్లాడుతూ... "చాలామంది ఒక్కసారిగా రెస్టారెంట్‌లోకి వచ్చారు. కిటికీల దగ్గర ఎవరూ ఉండొద్దని మాకు సిబ్బంది సూచించారు. బయటి నుంచి వచ్చిన వాళ్లు వంతెన మీద కాల్పులు జరిగాయని అన్నారు" అని చెప్పారు.

ఈ ఘటన నేపథ్యంలో లండన్ బ్రిడ్జ్ స్టేషన్‌ను మూసివేసినట్లు బ్రిటిష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీసులు చెప్పారు.

తక్షణమే స్పందించిన పోలీసులకు, అత్యవసరే సేవా దళానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)